మన ‘తెగులు’ - మద్దూరి నరసింహమూర్తి

Mana tegulu

శ్రీఅరగంటై ఆగకుండా ఆంగ్లంలో మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరూ -- ఆవగింజంతైనా అనుమానం అఖ్ఖరలేని -- ‘ఆంధ్రులే’.

వారి సంభాషణల్లో పొరపాటున కూడా ‘తెలుగు’ మాటలు దొర్లకుండా, చాలా జాగ్రత్తపడుతున్నారు.

వారేమీ విదేశాల్లో ఉండి వచ్చినవారు కారు. విదేశాలకి వెళ్ళవలసిన వారూ కారు.

 

ఇందుకే అన్నారేమో – ‘చదువుకున్నవాడు కంటే చాకలివాడు మేలు’ -- అని.

చదువుకున్నవాడు పొరపాటున కూడా తెలుగులో మాట్లాడడు.

చాకలివాడైతే చచ్చినట్టు తెలుగులోనే మాట్లాడతాడు.

 

మన రాష్ట్రాలలో -- పిల్లలు తల్లి తండ్రులతో కానీ, తల్లి తండ్రులు పిల్లలతో కానీ ఆంగ్లంలోనే మాట్లాడుతూ -- అసలు తెలుగు మాట్లాడకుండా -- బహు జాగ్రత్తగా కాలం గడుపుతున్నారు.

 

తెలుగు మాట్లాడేవాడితో స్నేహం చేయరు. ఆంగ్లం మాట్లాడితే చాలు అక్కున చేర్చుకొని అందలం కూడా ఎక్కనిస్తారు.

 

ఇది మన తెలుగు భాషకి వచ్చిన ‘తెగులు’.

 

శ్రీకృష్ణదేవరాయలు బహుశా, మధిర సేవించిన మత్తులో పొరపాటున అని ఉంటాడు – “దేశభాషలందు తెలుగు లెస్స” అని.

లేదా, ‘లెస్’ అని ఆంగ్లంలో అంటే, విన్నవారు పొరపాటున ‘లెస్స’ అని ప్రచారం చేసి ఉంటారేమో.

 

చంద్రబోస్ ‘తెలుగు భాష గొప్పతనం’ గురించి ఏదో సినిమా కోసం పాట వ్రాస్తే -- అతనికి పారితోషికం వచ్చింది కానీ -- ‘ఏ మార్పు కోరి వ్రాస్తున్నాను’ అని అనుకొని ఉంటాడో, అది మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

 

కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్డట్టు -- తెలుగు భాషని పెంచి పోషించవలసిన ప్రభుత్వాలే పిల్లలకి బడిలో బోధన ఆంగ్లంలోనే -- అదీ, పిల్లలు బడిలో చదువు ఆరంభించిన పిన్న వయసు దగ్గరనించే – జరగాలని నియమాలు జారీ చేస్తుంటే, వాటిని పట్టుపట్టి అమలు చేస్తూంటే -- తెలుగు భాషని ఇంకెవరు ఆదరిస్తారు.

 

రాబోయే రోజుల్లో బహుశా, బడిలో తెలుగు మాట్లాడితే కఠిన శిక్షలు కూడా అమలు చేస్తారేమో.

 

అలా పెరిగిన పిల్లలు ఆకలి వేస్తె - ‘రైస్’ కావాలనే కదా అడుగుతారు. అప్పుడు, వాళ్ళకి ‘పచ్చి బియ్యం’ ఇవ్వాలో ‘ఉడికిన బియ్యం (అన్నం)’ ఇవ్వాలో తెలియక, పాపం తల్లులు సందిగ్ధంలో ఉంటే, ఆశ్చర్యమేముంది ?

 

అదే పిల్లలు అధవా ఉమ్మడి కుటుంబంలో పెరుగుతూ ఉంటే (అది కూడా సందేహమేలెండి) --- 'అంకుల్' అని పిలిస్తే, 'పెద్దనాన్న' పలకాలో 'చిన్నాన్న' పలకాలో తెలీదు. అంతే కాదు, ఇంటికి వచ్చిన మేనమామ పలకాలో కూడా తెలిసి చావదు. (మెల్లకన్ను వాడు ఎటు చూస్తున్నాడో తెలీనట్లు) ; 'అంటీ' అని పిలిస్తే -- 'పిన్ని' పలకాలో, 'అత్త' పలకాలో తెలీదు.

 

ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే, ఆ పిన్న వయసు పిల్లలకి ఇటు ‘తెలుగు’ అటు ‘ఆంగ్లం’ ఏదీ సరిగ్గా రాక – వెనుకటికెవడో ‘అశ్వం’ అనడం రాక, ‘గుర్రం’ ఆంటే తప్పేమో తెలీక, ‘గుశ్వం’ అన్న చందాన --- తయారవుతారేమో అని భయం వేస్తోంది.

 

ఎలాంటివారైనా శరీరానికి చిన్న దెబ్బ తగలగానే, ‘అమ్మా’ అంటారు. కానీ, అలా ఆంటే తప్పేమో అన్న భయంతో పిల్లలు బిగుసుకుపోతే -- దానికి బాధ్యులెవరు ?

 

ఆఖరికి నోరారా ఏడవడానికి కూడా నోచుకోని జీవితాలైపోతాయి ఆ చిన్నారులకి.

 

అలా సందిగ్దావస్థలో పెరిగిన పిల్లలు - వారినేమి ఉద్ధరించుకుంటారు, దేశాన్నేమి ఉద్ధరిస్తారు.

 

ఈ సమస్యకి పరిష్కారముందా ? నాకైతే, కనుచూపుమేరలో కనబడుటలేదు.

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు