నాకు నచ్చిన పద్యం--అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలోనిది - టీవీయస్.శాస్త్రి

Naaku Nachhina Padyam

శబ్దం ద్వారానే అర్ధాన్ని స్ఫురింపచేసే మనోహరమైన అల్లసాని పెద్దన గారి పద్యం:

అట జని కాంచె భూమిసురు డంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్,
గటక చర త్కరేణు కర కంపిత సాలము శీత శైలమున్

(బ్రాహ్మణుడైన ప్రవరుడు హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న శిఖరాల నుండి జారుతున్నసెలయేళ్ళ సమూహంలోమాటిమాటికి దొర్లుతున్న అలల మృదంగ ధ్వనులకు లయబద్ధంగా పురులు విప్పి నాట్యమాడుతున్న ఆడ నెమళ్ళు, ఏనుగుల తొండాల చేత కదిలించబడిన మహావృక్షాలు గల హిమవత్పర్వతాన్ని చూశాడు.)ఆకాశాన్ని చుంబిస్తున్న ఆ మంచు పర్వత శిఖరాల నుండి సెలయేళ్ళు జలజల మని పారుతున్నాయి. ఆ పడిలేచే కెరటాల ధ్వని మృదంగ శబ్దాలలాగా ఉన్నాయి. ఆ మృదంగ శబ్దాలకు పరవశించిన నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ఆ పర్వత శ్రేణుల మీద వున్న పెనువృక్షాలను ఏనుగులు సమూలంగా పెకలించేస్తున్నాయి. అంత మనోహరమైన శీతల పర్వతశ్రేణిని ప్రవరుడు తనివితీరా,తన్మయత్వంతో చూశాడు.లలితలలితంగా చెప్పగలిగిన విషయాన్ని,ఎందుకింత గంభీరంగా,పటాటోపంగా,అలంకారాల మయంగా వర్ణించాడు పెద్దన మహాశయుడు? హిమాలయ పర్వతం అసమాన్యమైనది,మహోన్నత మైనది. భారతీయ ఔన్నత్యాన్ని,ఆధ్యాత్మికతను చాటి చెప్పేది.అంత మహిమాన్వితం, మనోహరమైన, మహాద్భుత దృశ్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించటానికి అంత సంస్కృత భాషా ప్రయోగం అవసరమైవుండవచ్చు. పద్యంలో మొదటి మూడు మాటలు తప్ప (అట, చని, కాంచె) తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.కేవలం శబ్దం ద్వారానే అర్ధాన్ని తెలియచేయటమే ఈ పద్యంలో ఉన్నగొప్పతనం.

"అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల" మన్నప్పుడు ఆకాశాన్ని అంటివున్నట్లుగా కనపడే పర్వత శ్రేణుల నుండి జాలువారే సెలయేళ్ళ నిరంతర ప్రవాహం మనకు స్పష్టంగా కనబడుతుంది.ఆ సెలయేళ్ళు వంపు సొంపులతో నాట్యమాడుతూ, మృదంగ ధ్వనులు చేస్తూ ప్రవహించే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పిన పెద్దన గారి కవితా వైభవం గురించి ఎంతైనా చెప్పవచ్చును,వారి వారి పాండిత్యాన్ని బట్టి. స్వల్పబుద్ధిగల నాకే ఇంత  మాధుర్యం తెలిస్తే,ఇక పండితుల ఆనందం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదనుకుంటాను.మృదంగ శబ్దాలకు, మేఘాల ఉరుములకు నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి నాట్యమాడుతాయని లోకప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు రాళ్ళకు కొట్టుకొని మృదంగ శబ్దాలు చేస్తున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మృదంగ ధ్వనులను స్ఫురింపచేశాడు పెద్దన మహాశయుడు.

"స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యమాడు తున్నట్లుగా భావన కలుగ చేశాడు కవివరేణ్యుడు.అక్షరాల చేత నాట్యమాడిస్తూ ఆ అర్థాలను పదధ్వనుల ద్వారానే తెలియచేసిన గొప్ప పద్యమిది."అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి,సాలము శీతశైలము" - ఇక్కడ అనేక  శబ్దాలంకారాలున్నాయి. అలల  ధ్వనుల్ని మృదంగ శబ్దాలుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం అనేది భ్రాంతిమదలంకారం అని పండితుల అభిప్రాయం."అల్లసాని వాని అల్లిక జిగిబిగి" అని పేరుగాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే.జిగి అంటే తళుకు.బిగి అంటే బిగువు.అతిమధురమైన పదప్రయోగాలు,అనవసరమైన పదాలు ఏవీ లేవు ఈ పద్యంలో.అన్నీసందర్భానికి తగిన పదాలే!మహాకవులు పదాలను అంత పొదుపుగా ప్రయోగిస్తారు.దీనినే economy of words అని అంటారు.అల్లిక జిగిబిగి అంటే ఇదే !కలాపి జాలమున్= ఆడనెమళ్ళ సమూహం గల దానిని-ఇక్కడే ఎవరికైనా చిన్నసందేహం వచ్చే ఆవకాశం వుంది.ఆడ నెమళ్లు నాట్యమాడవు.నాట్యమాడేవి  మగనెమళ్లు! 'ఆడ' నెమళ్లు అంటే,'ఆడే' నెమళ్ళని అర్ధం చెప్పుకుంటే సరిపోతుంది. లేకపోతే, పెద్దన గారి పద్యాల్లో తప్పులుంటాయా? ఆంగ్ల భాషలో కూడా ఇటువంటి శబ్దాలంకారాలు వున్నాయి.వానిని'Onomatopoeia' అని అంటారు. ఉదాహరణకు, Cuckoo Bird(కూకూ అంటుంది కాబట్టి), అలానే--frog croaking (బెకబెక మనటం) quack (duck)(బాతు'క్వాక్' అని అనటం).

అవి మన సాహిత్యానికి ఏమాత్రం సరి తూగవు. పైపద్యాన్ని జాగ్రత్తగా చదవండి. పద్యం నడకే మనకు అర్ధం చెబుతుంది. ఆకాశగంగ ఎలా వంపు సొంపులతో,వయ్యారంగా తిరుగుతూ పరవళ్ళు తొక్కుతూ పరుగులిడుతుందో, పద్యంలోని శబ్ద ప్రయోగాలే తెలుపుతాయి. అల్లసాని వారి అల్లిక జిగిబిగే కాదు,జిలేబీ కూడా!నేటి కొందరి కవుల కవిత్వం(?) లాగా గజిబిజి మాత్రం కాదు! మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము,అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము.ఇక పెద్దన గారిని గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

వీరి ఇంటి పేరు 'అల్లసాని'అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వీరిది వసిష్ఠ గోత్రం. ఆశ్వలాయన సూత్రం, ఋగ్వేదం. వీరు నందవరీకస్మార్తనియోగి బ్రాహ్మణుడు. తండ్రి పేరు చొక్కనామాత్యుడు. ఇతని స్వస్థలం బళ్ళారి మండలమని కొందరు,కడప మండలంలోని కమలాపురం తాలూకాలోని కోకటం అనబడే గ్రామం అని మరికొందరి భావన.పెద్దనగారు రాయలవారికి బాల్యంలో గురువుగా ఉన్నారని, ఆయన మంత్రివర్గంలో ప్రధానుడని కొందరి పరిశోధకుల అభిప్రాయం.రాయలవారి బాల్యం చంద్రగిరిలో గడవటం వల్ల , పెద్దన గారి స్వస్థలం కోకటం గ్రామమనటానికే ఎక్కువగా ఆధారాలు ఉన్నాయి.కోకటం గ్రామ సమీపంలోనే గల'పెద్దనపాడు'అనబడే ఊరిలో పెద్దన గారి పేరు మీద ప్రధమ తాంబూలం ఇచ్చే ఆచారం నేటికీ ఉందట!శ్రీకృష్ణదేవరాయల వారి కాలం క్రీ.శ.1487 నుండి 1530గా నిర్ణయించబడింది.రాయలవారికి గురువైన పెద్దన గారు రాయలవారి మరణానంతరం కూడా జీవించారని చెప్పటానికి, పెద్దన గారి ఈ పద్యమే ఆధారం-"కృష్ణరాయలతో దివికేగలేక జీవఛ్ఛవంబనగుచు." కనుక పెద్దన గారు 15,16 శతాబ్దముల  మధ్యకాలానికి చెందిన వాడిగా భావించవచ్చు.ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని,అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారి అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము.తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు.ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన ఇది. శృంగారానుభవ రుచి,శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును". తెలుగు సాహిత్య ప్రపంచంలో మొట్ట మొదటి స్వతంత్ర రచన అల్లసానివారి 'మనుచరిత్ర' అని నిస్సందేహంగా చెప్పవచ్చును.భారత,భాగవతం లాంటివి అనువాదాలే!ప్రబంధ కవిత్వానికి ఈ కావ్యమే శ్రీకారం చుట్టింది.నన్నయ్య, 'ఆదికవి' అయితే,అల్లసాని పెద్దన 'ఆంద్ర కవితా పితామహుడు'.తెలుగు పంచకావ్యాల్లో మొదటిది 'మనుచరిత్ర'.ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెనో తెలిపే ఒక ఉత్పలమాల పద్యం చెప్పి రాయలవారి చేత గండపెండేరం తొడిగించుకున్నాడు. 'భువన విజయం' నందు ఒకనాడు శ్రీ కృష్ణ దేవరాయలు ఒక బంగారు పళ్ళెరమున  గండపెండేరం ఒకటి తెప్పించి సంస్కృత, ఆంధ్రములందు సమముగా కవిత్వం చెప్పగలవారిని ఆ  గండపెండేరాన్ని అందుకొమ్మన్నాడు. సభ్యులందరూ మౌనంగా విని ఊరుకున్నారట.ఆ మౌనానికి కృష్ణ రాయలు అచ్చెరువొంది,ఈ విధముగా అన్నారట-

ఉ-ముద్దుగా గండపెండెరమున్ గొనుడంచు బహుకరింపగా నొద్దిక "నాకొసంగు"మని యొక్కరు గోరలేరు లేరొకో?
అని సగం పద్యము చెప్పగా పెద్దన గారు లేచి
పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని  నీ వెరుంగవే?
పెద్దన కీదలచినను,బెరిమి నాకీడు కృష్ణరాణ్రుపా!

అని మిగిలిన సగమును జవాబుగా పూరించినాడు.కృష్ణరాయలు పెద్దనకీయ తలంపు మనసు నందుంచుకొనినాడో ఏమో ప్రాసస్థానములో పెద్దన వచ్చునట్లే ముద్దుగాయని ద్విత్వ "ద"కారముతో ప్రారంభించాడు.సభాసదుల కరతాళధ్వనుల మద్య కృష్ణరాయలచేత గండపెండేరం కాలికి తొడిగించుకున్న ఘనుడు పెద్దన.  ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రధమ ప్రబంధముగా ప్రసిద్దికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చేవాడు. అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.ఇది తొలి తెలుగు ప్రబంధము,దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము,తరువాతి ప్రబంధాలు దీని నుండి స్పూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు వున్నాయి. ఈ ప్రబంధాన్ని తెలుగు పంచకావ్యాలులో మొదటిదిగా చెపుతారు.పెద్దన గారి వర్ణనలు అమోఘం,అద్వితీయం.వారి వర్ణనా వైచిత్రిని తెలిపే ఈ పద్యాన్నిచూడండి.

కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి  
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నె వెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు
నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు

చంద్రుని మీద ఇంతకంటే గొప్ప వర్ణనతో కూడిన పద్యం ఇంకొకటి లేదేమోమరి రాదేమో!ఈ పద్యం  అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ ప్రసస్తిని గురించి చెప్పిన పద్యం.మనుచరిత్ర కృతిభర్త శ్రీ కృష్ణ దేవరాయులు.ఆయన వంశ (తుళు)పురుషుడు చంద్రుడు కనుక ఈవిదంగా వర్ణించడం జరిగింది. పాల సముద్రం తండ్రి అయితే ఆ సముద్రాన్ని మధించినప్పుడు ఏర్పడిన అలల నుండి పుట్టినవాడు చంద్రుడు.అందుకనే ఇక్కడ  అలని తల్లిగాను, సముద్రుడిని తండ్రి గాను చెప్పారు. శివునిజడ అనే పూలతోటలో పూసే అనావర్తవంపు పువ్వు (అంటే అన్ని ఋతువులలోనూ పూసే పువ్వు అని) చంద్రుడట!.సకల దేవతల ఆకలినీ తీర్చే పంట చంద్రుడు. దేవతలకోసం అమృతాన్ని కురిపించేది చంద్రుడేగా! అటువంటి ఆయన ఎవ్వరూ నాటకుండానే దానంతట అది వచ్చి నిరంతరం పండే పంట. కారు చీకటిని తిని, కన్నె కలువని, నవ్విస్తాడట, కవ్విస్తాడుట. మనుచరిత్ర వ్రాయటానికి ముందరే  పెద్దన గారు 'హరికథాసారం' అనే పద్య కావ్యాన్ని రచించి తన గురువువైన 'శఠగోపయతి'కి అంకితం ఇచ్చినట్లుగా చెబుతారు.కానీ,ఆ కావ్యానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం లభించటం లేదు.

ఆంద్ర కవితా పితామహుడు అల్లసాని వారికి అక్షర నీరాజనం!!

ఆస్వాదించటం తెలిస్తే,కవిత్వము కన్నా మధురమైనదేముంది?

టీవీయస్.శాస్త్రి 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు