ఉన్నన్నాళ్ళూ పట్టించుకోరు.. - భమిడిపాటి ఫణిబాబు

Unnannallu Pattinchukoru

ప్రపంచంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా ఫరవాలేదు కానీ, నీళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. చివరకి తినడానికి తిండిలేకపోయినా, ఓ దోశడు నీళ్ళు త్రాగైనా కడుపునింపుకునే వాళ్ళ గురించి, కథల్లో చదివాము. స్నానం మాట దేవుడెరుగు, తిన్నదేదో గొంతుకులోకి దిగడానికైనా నీళ్లు అతి ముఖ్యమైనవి. పంచమహాభూతాల్లో మిగిలిన నాలుగింటి అవసరమూ అంతగా లేదని కాదూ, అయినాసరే నీళ్ళు నీళ్ళే. అందుకే కాబోలు నీళ్ళకోసం అంతగా దెబ్బలాడుకుంటున్నారు వివిధ రాష్ట్రాలవాళ్ళూనూ. అదేదో ఆనకట్ట ఎత్తు పెంచేస్తే, మన రాష్ట్రానికి నీళ్ళురావనీ, అలాగే ఫలానా ప్రాజెక్టు నిర్మిస్తే ఫలానా ఫలానా రాష్ట్రాలలోని గ్రామాలు ముంపుకి గురవుతాయనీ ఇలా నీళ్ళ ధర్మమా అని రాష్ట్రాల మధ్య ఎన్నెన్నో వివాదాలు కూడా కొన్ని సంవత్సరాలనుండీ చూస్తున్నాము. గట్టిగా వర్షాలు పడితే, నచ్చినా నచ్చకపోయినా, పంతంపట్టి ఎత్తులు పెంచేసిన ఆనకట్టలలోంచి నీళ్ళు వదలాల్సిందే, అప్పుడు ఏమౌతాయిట ఈ పంతాలూ పట్టింపులూనూ.

మరి మన జీవితాలలో నీళ్ళకి అంత ప్రాముఖ్యత ఉందే, ఆ భగవంతుడు ఇచ్చిన ఆ నీళ్ళని ఎంతలా సద్వినియోగం చేసికుంటున్నామో, ఆ నీళ్ళే లేకపోతే మన బ్రతుకులు ఏమయిపోతాయో అనే విషయం మీద మాత్రం ఎవరూ దృష్టి పెట్టరు. అదే మన దురదృష్టం. ఏదైనా ఉన్నంతకాలమూ దాని విలువ తెలియదు. తీరా తెలిసికునేసరికి చేతులు దాటిపోతుంది. ఇదివరకటి రోజుల్లోఏ కొద్దిప్రాంతాల్లో తప్ప. నీళ్ళకి మాత్రం కరువనేది ఉండేదికాదు.  ప్రస్థుత పరిస్థితి దీనికి పూర్తిగా వ్యతిరేకం. పూర్వపు రోజుల్లో నీళ్ళ ట్యాంకర్లు కొన్ని మహానగరాల్లో మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడో మారుమూల గ్రామాల్లో కూడా ఈ ట్యాంకర్లద్వారా నీళ్ళు సరఫరాచేయాల్సిన దుస్థితి కలుగుతోంది. ఈ దౌర్భాగ్యానికి మనందరి బాధ్యతా కూడా ఉంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు.

ఉదాహరణకి ఇదివరకటి రోజుల్లో ప్రొద్దుటే లేచి, ఓ చెంబులో నీళ్ళు తీసికుని ఏ  పొలంలోకో, కాలవ గట్టుకో వెళ్తే పనైపోయేది. కాలవ గట్టువైపుకి వెళ్తే ఆ చెంబెడు నీళ్ళూ కూడా అవసరమయేవి కావు. కానీ, ఈ ఎపార్టుమెంట్లు వచ్చిన తరువాతో, రెండేసి, మూడేసి బెడ్రూమ్ములూ, వాటికి జతచేసి రెండు మూడు బాత్రూమ్మ్ కం టాయిలెట్లు. వాటిల్లో అవేవో కమోడ్లూ, మళ్ళీ వాటిల్లో ఇండియన్, వెస్ట్రన్ అని రకాలూ. ఉండాలి కాదనడంలేదు, కానీ ఒక్కోసారీ ఉపయోగించినప్పుడు, ఒకసారి ఫ్లష్ కొడితే ఓ రెండు బకెట్లనీళ్ళు వాడబడతాయి. అలా ప్రొద్దుటనుండీ, రాత్రి నిద్రపోయేవరకూ, మనం ఉపయోగించే నీళ్ళు ఎన్ని బకెట్లు వాడతామో ఊహిస్తేనే చాలు, గుండె గుభేల్ మంటుంది. అలాగని నీళ్ళే ఉపయోగించొద్దూ అని కాదు. ఆరోజుకి నీళ్ళు రావడంలేదని ఏ కార్పొరేషన్ వాళ్ళో ప్రకటించారనుకోండి, ఏం చేస్తారూ, చచ్చినట్టు బకెట్లలో నీళ్ళు పట్టుకుని, మితంగానే వాడుకుంటాము కదా, లేకపోతే ఆ నీళ్ళుకూడా సరిపోవనీ. ఏదో వస్తున్నాయి కదా అని ఊరికే వాడేస్తూంటే ఎలాగ మరి?

ఇదివరకటి రోజుల్లో ఇళ్ళల్లో ఉండే మగవారు ప్రొద్దుటే ఏ గెడ్డమో గీసుకోవాలనుకున్నప్పుడు, ఓ బుల్లి గ్లాసులోనో, లేదా ఓ పాత ఫ్లాస్కు మూతలోనో కొద్దిగా నీళ్ళు తీసికుని, ఓ అద్దం తీసికుని ఆ గెడ్డమో ఏదో గీసికుని పని కానిచ్చేసుకునేవారు. కానీ ఇప్పుడో, ఓ వాష్ బేసినూ, దానిపైన ఓ అద్దం, దానికి మళ్ళీ ఓ స్టాండూ, వాటిమీద మన షేవింగు సామాన్లూ.గెడ్డం గీసుకున్నంతసేపూ, ఆ వాష్ బేసిన్ కి ఉన్న టాప్ లోంచి, నీళ్ళు ధారాపాతంగా కారుతూండడమే. ఎవడు బాగుపడ్డట్టూ? అలాగే అంటగిన్నెలు శుభ్రం చేసేటప్పుడు, పనిమనిషి కానీ, ఇంట్లో వారుకానీ అలాగే ప్రవర్తిస్తారు.

ఇంక  కాలకృత్యాల విషయంలో పూర్వపురోజుల్లో ఓ పందుంపుల్లతో పనైపోయేది. కానీ ఈ రోజుల్లో, రకరకాల పేస్టులూ, నోరు శుభ్రపరుచుకోడానికి ఒక్కో మనిషికీ ఒక్కో బకెట్టు నీళ్ళూ. స్నానాల విషయానికొస్తే అడక్కండి, నిద్రలేచీలేవగానే గీజరు ఆన్ చేసేయడం, ఓ బకెట్టు టాప్పు కిందపెట్టెసి ఇంకో పనేదో చూసుకోవడం, తీరా స్నానానికి వెళ్ళేసరికి ఆ బకెట్లో మరుగుతూన్న నీళ్ళు. పోనీ వాటికే చన్నీళ్ళు తగిలించి, ఇంకో రెండు బకెట్లనీళ్ళు, మిగిలినవారికి ఉంచొచ్చేమో అనే ఆలోచన రాదు.ఆ బకెట్లోనే చన్నీళ్ళు పోసిపోసి ఆ బకెట్టులోంచి overflow అవనైనా చేస్తాము. ఏదో పురిటి స్నానం లాగ ఓ అరగంట చేయడం. ఇవన్నీ hygiene పేరుతో. ఆరోగ్యమే మహా భాగ్యం కాదనరు ఎవరూ. కానీ పూర్వపురోజుల్లో హాయిగా మగవారు నూతి దగ్గరో, ఏ నదికో, చెరువుకో వెళ్ళి కావాల్సినంతసేపు స్నానాలు చేసేవారు. ఇప్పుడు ఆ చెరువులూ లేవూ, నూతులూ లేవూ. ఇంక నదులంటారా ఏ నది చూడండి, దిగితే ఏం రోగాలొస్తాయో అన్నంతగా తగలడ్డాయి.

అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే ఆరోజుకి నీళ్ళుండవని ఏ పేపర్లోనో చదివేసి, ఆరోజు నీళ్ళొచ్చినప్పుడు, ఇంట్లో ఉండే అన్ని రకాల పాత్రల్లోనూ, చివరకి ఉధ్ధరిణిల్లో కూడా నీళ్ళు పట్టేసి ఉంచుకోడం. అన్నీ వాడేమా ఏమిటీ, ఎందుకైనా ఉపయోగిస్తాయేమో అని ఓ అతి జాగ్రత్త. తీరా మర్నాడు మామూలుగా నీళ్ళొచ్చేసరికి, ఆ పట్టిన నీళ్ళన్నీ పారపోయడం, అదో పైశాచికానందం కొందరికి. ఎవడు బాగుపడ్డట్టూ? ఏమైనా అంటే నిలవనీళ్ళండీ అని వివరణోటీ. నాలుగు రోజులు వరుసగా రాకపోతే అప్పుడు తెలుస్తుంది, నిలవనీళ్ళో, మంచినీళ్ళో. నోరుమూసుకుని వంటక్కూడా అవే నీళ్ళు. దీన్నే జరుగుబాటు అంటారు.

ఇదివరకటి రోజుల్లో  సకాలంలో వర్షాలూ వచ్చేవి, ఆ వర్షం నీరు మట్టిలోకి ఇంకిపోయి, భూగర్భ జలాలకి కూడా ఏమీ లోటుండేది కాదు. కానీ, ఈ కాంక్రీటైజెషన్ ధర్మమా అని, నీళ్ళు ఇంకడానికి మట్టీ లేదూ, ఇంక బోరుబావుల్లో నీళ్ళు రమ్మంటే ఎక్కడ వస్తాయీ? కొత్తగా  ఏ అపార్టుమంటైనా కొందామని వెళ్తే ముందుగా బోరు బావి ఉందా అని చూస్తాము. ఆ బిల్డరు కూడా, "అర్రే నీళ్లకేమీ ధోకా లేదు సార్.. త్రాగడానికి కార్పొరేషను నీళ్ళూ, వాడకానికి బోరు నీళ్ళూ, ట్యాంకరనేది తెప్పించకుండా మొత్తం ఈ పది బిల్డింగులూ, ఒక్కో బిల్డింగులో నలభైయ్యేసి వెరసి నాలుగువందల ఫ్లాట్లూ ఆ బోరుబావినీళ్ళతోనే కట్టించాము సార్.." అనేస్తాడు. గొప్పగా మన స్నేహితులతో కూడా గొప్పలు చెప్పేసికుంటాము, " ఇక్కడ నేను ఫ్లాట్ తీసికున్న చోట ఇరవైనాలుగ్గంటలూ నీళ్ళే నీళ్ళంటే నమ్ము గురూ..", అనడమే కాకుండా మొదటి ఆరునెలలూ పరామర్శిస్తూంటాడు కూడానూ, " ఏమోయ్ మీ సొసైటీ ఎలా ఉందీ, రోజుకి ఎన్ని ట్యాంకర్లూ.." అంటూ వేళాకోళం చేయడం.ఆరు నెలలని ఎందుకన్నానంటే, మెల్లిమెల్లిగా నాలుగువందల ఫ్లాట్లూ నిండేటప్పటికి మన బ్రతుకూ, రోజుకి నాలుగైదు ట్యాంకర్లలోకి దిగుతుంది. అప్పుడు తెలిసొస్తుంది నీళ్ళ విలువ ఏమిటో. ధారాళంగా దొరుకుతున్నంత కాలమూ ఎవడూ పట్టించుకోడు, తీరా ఆ గుక్కెడు నీళ్ళకీ కరువు వచ్చినప్పుడు మాత్రం, అందరూ నీతులు చెప్పేవారే.

నదులని చూస్తూంటే గుండె తరుక్కుపోతుంది. ఏ నది చూసినా కాలుష్యమే. పొల్యూషన్ కంట్రోల్ అన్నది నామ మాత్రమే. ప్రక్కనే ఉండే కర్మాగారాలవాళ్ళు వారి ఫాక్టరీల్లోని వ్యర్ధ పదార్దాలు నదిలోకే వదిలేయడం. పోనీ అదేదో ట్రీట్మెంటు ఏదో చేసి వదలొచ్చుకదా, అబ్బే మళ్ళీ డబ్బు ఖర్చూ. ప్రభుత్వాలూ ఏమీ పట్టించుకోవు.

రాబోయే రోజుల్లో పరిస్థితులని ఊహించుకోడానికే భయంగా ఉంది. ఎప్పుడు బాగుపడతామో ఆ భగవంతుడికే తెలియాలి....

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి