కరోనా తో ‘కలిమి’ - మద్దూరి నరసింహమూర్తి

Karonatho kalimi

‘మంచి అన్నది ఎంచి చూపరా’ అన్నారొక మహాకవి.

మన చుట్టుపక్కల ఉండే మంచిని ఎంచి చూపితే, అంతవరకూ ఆ మంచి కంటికి కనిపిస్తున్నా పట్టించుకోనివారు -- ఇదేమిటీ మన చుట్టూ ఇంత మంచి ఉంటే మనకు ఎలా కనిపించలేదు అని విచారించి -- ఆ మంచిని గ్రహించే ప్రయత్నం తప్పక చేస్తారు.

అందుకే, నా ఈ చిన్ని ప్రయత్నం.

అంతేకాదు, మరో మహానుభావుడు -- "జరిగేది, జరుగుతున్నది మరియు జరగబోయేది --- అన్నీ మన మంచికే" అన్నాడు.

ఈ మధ్యన ఏదో వార్తా పత్రికలో చూసేను - కరోనా దేవతామూర్తితో ఒక మందిరం వెలిసింది, అక్కడ, పూజలు కూడా జరుపుతున్నారు, అని.

ఎందుకో -- మంచి పని చేసేరనిపించింది.

 

కరోనా ఆరంభం ముందు మన జీవన విధానానికి –

కరోనా ఆరంభం తరువాత మన జీవన విధానానికి –

బేరీజు వేసుకొని నిశితంగా పరిశీలిస్తే :

ముందు :

ఉద్యోగానికి కానీ మరేదేనా పని మీద కానీ, కుటుంబంలో ఏ సభ్యులైనా - వారు పిల్లలైనా, పెద్దలైనా, వయసు ఉడిగినవారైనా -- గుమ్మం దాటి వీధిలోకి వెళ్తే, వారు క్షేమంగా ఇంటికి చేరినవరకూ -- ఇంట్లో ఉన్నవారికి బయటకు చెప్పుకోలేని ఏదో దిగులు మరియు చింత.సాధారణంగా వారు తిరిగిరావలసిన సమయం దాటి, కాలం ముందుకు గడిచే కొద్దీ, ఏమిటేనా జరగరానిది జరగలేదుకదా అని, ఆ దిగులు మరియు చింత ఎక్కువై గుండెలు బరువెక్కిపోవడమే.

ఆ తట్టుకోనేని ఆలోచనలతో బి.పి. ఉన్నవాళ్ళకి పెరగడం. లేనివాళ్ళకి రావడం.

తరువాత:

ఆ దిగులు, చింతలకి తావేలేదు. ఎందుకంటే - పిల్లల చదువు కానీ ఆటలు కానీ ఇంట్లోనే. ఆఫీస్ పనులు ఇంట్లోనే. కావలసిన సరుకులకా గుమ్మం దిగక్కరలేకుండా ఇంటి ముందరకే వస్తున్నాయి. ఇంట్లో సభ్యులందరు ఒకరి కళ్ళ ముందర మరొకరు ఉంటె, మనసుకి ఎంతో ప్రశాంతత.

బి.పి.ఉన్నవాళ్ళకి కూడా చింతలేదు. లేనివాళ్ళకి వస్తుందన్న బాధ, భయం లేవు.

 

ముందు :

కాసింత వెసులుబాటుదొరికినా, సెలవు రోజు కానీ అయితే, పిల్లలు ఇల్లొదిలి ఆటలు అంటూ బయట తిరుగుళ్ళూ, వేళా పాళా లేని తిళ్ళు.

వాళ్ళకోసం ఇంట్లో ఉన్నవాళ్ళ ఎదురు చూపులు, తీరా వచ్చిన తరువాత తిట్లు, దెబ్బలాటలు, కొండొకచో కొట్లాటలు.

తరువాత:

పిల్లలు అసలు ఇంటి గుమ్మమే దాటడం లేదు. దాంతో వేళకి తిండి, నిద్ర.

పెద్దవాళ్ళకి చీకూ చింత లేని ప్రశాంతత. అల్లరి చేసేది ఈ పిల్లలేనా అని ఆశ్చర్యపోయేటట్టుగా, పెద్దల మాట వింటూ ఇల్లు కదలడమేలేదు.

 

ముందు :

తొమ్మిది గంటలకి ప్రారంభం అయే బడికి వెళ్ళడానికి, పిల్లలు ఆరో గంటకేనా కనీసం లేవాలి. సమయం ప్రకారం తెమాలాలి. తినాలి. బడిలో తినడానికి పట్టుకెళ్ళాలి. బరువు మోతలతో, వంగిన నడుములతో, ఏదో ఒక వాహన సదుపాయంతో ఎనిమిదో గంటకే ఇంటి నుంచి పరిగెట్టాలి. ఏ నాలుగు గంటలకో, ఐదు గంటలకో, వాడి, వడలిపోయి వచ్చే పిల్లలని చూస్తే, పెద్దలు రోజూ నిస్సహాయతతో కళ్ళ నీళ్లు పెట్టుకావడాలు.

తరువాత:

తొమ్మిదికో పదికో ప్రారంభం అయే ఆన్ లైన్ తరగతి చదువుకి, పిల్లలు మహా అయితే, ఎనిమిదో గంటకిలేస్తే సరి. ఏ బరువులూ మొయ్యక్కరలేదు. నడుములు వంగిపోయే అవసరమేలేదు. ఏం తిన్నా ఇంట్లోనే కాబట్టి ఆ బరువుమోతలుకూడా లేవు. ఆన్ లైన్ తరగతులు ఎంతలేదన్నా ఒంటి గంట సరికి అయిపోవడంతో పిల్లలకి వేళ పట్టున తిండి, నిద్ర. హాయిగా నీడ పట్టున ఉండి నిగారింపుతో ఉంటున్నారు.

 

ముందు :

‘ఎప్పుడో ఐదైతే, ఇప్పుడా ఇంటికి రావడం’ అని ఆఫీస్ నించి ఈదురోమని వచ్చిన భర్తతో భార్య సాధింపులు. ‘ఇంట్లో ఖాళీగా కూర్చొనే నీకేం తెలుస్తుంది నా పాట్లు’ అని భర్త కేకలు. దాంతో, అపార్ధాలు, అనుమానాలు, అలకలు. ఇల్లు నరకం లాగ మారడం. కొండొకొచో, ఆ గొడవలు చిలికి చిలికి, విడాకుల వరకు దారి తీయడాలు.

తరువాత:

ఆఫీస్ లో చేసే పని భర్త ఇంట్లోనే చేస్తుంటే, పనిమనిషి కూడా లేకుండా ఇంటెడు పని భార్య చేస్తుంటే – ‘ఒకరిని మరొకరు ఇన్నాళ్లూ ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నామో’ అన్న తెలిసివచ్చిన ఆలోచనతో ఒకరికొకరు వీలైనంతగా సహాయం చేసుకుంటూ మధ్యలో 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సోలుపేమున్నదీ' అని పాడుకుంటూ భార్య భర్త ఒకరికొకరు, నీకు నేనున్నాను అన్నట్లుగా, కలిసి మెలిసి ఉంటున్నారు.

 

ముందు :

ఎవరికి ఏ సమయంలో అయితే ఆ సమయంలో వచ్చి, ఎదో ఇంత ఆదరా బాదరాగా తినేసి, ఉరుకులు పరుగులు మీద బడికి ఆఫీస్ కి వెళ్లిపోవడాలు. పగలుకి పగలు రాత్రికి రాత్రి అంతే.ఈ సమయం కాని సమయం తినడం, మరియు ఎవరు ఎప్పుడు ఎంత తింటారో తెలియక, రోజూ ఎంతో కొంత మిగిలిపోవడం. దాన్ని వృధాగా పారవేసుకోవడం. అలా అంతో ఇంతో దుబారా ఖర్చు. అసమయంలో తినడం, అలా తిన్న తిండి ఒంటబట్టక, ఇంట్లో అనారోగ్యం తిష్ట వేయడం మామూలైపోయింది. అలా ఇంట్లో అనారోగ్యం తాండివిస్తూ వైద్యులకు మందులకి బోలెడంత ఖర్చులు.

తరువాత:

బడికి ఆఫీస్ కి వెళ్లే పని లేదు కాబట్టి ఫలానా సమయంలో అందరు ఒకే సారి కూర్చొని టిఫిన్లు, అలాగే భోజనాలు చేస్తే, పనిమనిషి సహాయం లేకుండా పనిచేసుకుంటున్న ఇంట్లో వాళ్లకి, కొంత పని, సమయం కలిసొస్తుందని తెలుసుకొన్నవాళ్ళై అలా చేస్తున్నారు. అలా అందరూ ఒకేసారి కూర్చుంటే ఏవో సరదాగా కబుర్లాడుకుంటూ హాయిగా సంతోషంగా తినడం, అందువల్ల కుటుంబంలో ఎంతో హాయి సంతోషం, పైగా అలా తిన్న తిండి ఒంటబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. అందరూ ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంటే, వైద్యులెందుకు మందులెందుకు, ఆ ఖర్చులెందుకు. అందరూ ఒకేసారి తినడానికి కూర్చోవడంతో రెండు మూడు రోజుల్లోనే వండేవాళ్ళకి ఎవరెంత తినగలుస్తున్నారో తెలియడం, వండినదేదో అందరూ పంచుకొని తినేయడంతో, వృధా ప్రశ్న లేనే లేదు.

 

ముందు :

ఏ ప్రత్యేకమైన రోజూ కాకపోయినా మాటిమాటికి, ఇంట్లో వంట మానేసి, హోటల్ మీద పడిపోవడం.ఏ పనున్నా లేకపోయినా వారాంతపు సెలవలు అని, అక్కడకి ఇక్కడకి తిరిగి రావడం, హోటల్ లోనో రిసార్ట్ లోనో ఉండడం -- వీటన్నిటికీ గొప్పగా బోలెడంత ఖర్చు పెట్టడం.

తరువాత:

సర్కారు వారి నియమం ప్రకారం, అందరూ ఇంట్లోనే ఉండవలసి రావడంతో,ఆ వెళ్లి రావడంపై అయే బండికి పెట్రోల్ తదితర ఖర్చులు, హోటల్ లో ఉండే, తినే ఖర్చులు ఏమీ లేకపోవడంతో, మిగిలిన డబ్బులు కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.అంతే కాక, శరీరంకిశ్రమ తగ్గిప్రశాంతంగా ఉంటున్నారు.

 

ముందు :

అప్పుడప్పుడు ఇంటికి ఎవరో రావడం. వాళ్ళు ఉన్నన్నాళ్ళు గొప్పకి పోయి ఎక్కువగా వంటకాలు చేయడం. లేదా వాళ్ళని కూడా తీసుకొని తిండికి ఏదో హోటల్ మీద పడిపోవడం. తడిపి మోపు ఖర్చులు. వాళ్ళని కూడా తీసుకొని విహార యాత్ర. అందుకు బోలెడంత ఖర్చు. వాళ్ళు వెళ్ళినప్పుడు పెట్టిపోతలు. వాళ్ళని తీసుకొని దింపి రావడానికి రైల్ స్టేషన్ కో ఎయిర్ పోర్ట్ కో వెళ్లడం లాంటి దానంతోపాటు దక్షిణ ఖర్చులు.అలాగే మనం కూడా అప్పుడప్పుడు పైఊళ్ళో ఉన్న చుట్టాలు బంధువుల ఇళ్ళకి వెళ్లడం. మనం వెళ్లి రావడం కోసం ఖర్చే కాక, వాళ్లకి ఇవ్వడానికి ఏదో తీసుకొని వెళ్ళాలికదా అని అదో ఖర్చు.

తరువాత:

మనం ఏ ఊరికి ఎవరింటికో వెళ్ళేది లేదు. మన ఇంటికి ఎవరూ వచ్చేది లేదు. దాంతో ఆ ఖర్చులు లేవు.

 

ముందు :

స్కూళ్ళకి వెళ్లే పిల్లల రోజూ మార్చుకొనే బట్టలుఆఫీస్ కి వెళ్లే వాళ్ళ బట్టలు ఏరోజుకారోజు ఉతకడం. అందుకోసం, కరంట్, నీళ్లు, వాషింగ్ పౌడర్ ఇవన్నీ తడిపి మోపెడు తప్పని ఖర్చులు. ఆ బట్టలు ఇంట్లో ఇస్త్రీ చేసుకోవడం అవకపోతే, ఐరన్ కోసం అదో ఖర్చు.

తరువాత:

పిల్లల క్లాసులు, ఆఫీస్ పనులు అన్నీ ఆన్ లైన్ లోనే కాబట్టి, అందరు ఇంట్లో వేసుకొనే బట్టలతోనే అన్నీ కానిచ్చేస్తున్నారు. మగవాళ్ళు ఓ లుంగీ లేదా ఓ షార్ట్ పైకి ఓ బనీను లేదా టీ షర్ట్ వేసుకొని రోజులు గడిపేస్తూంటే, ఆడవాళ్లు ఓ మ్యాక్సీ లేదా ఓ పాత సల్వార్ కమీజు లేదా ఓ పాత చీరతో రోజులు గడిపేస్తున్నారు. దాంతో,బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే విషయంలో ఖర్చు చాలా మట్టుకు తగ్గింది.

 

ముందు :

వయసు పైబడిన మగవాళ్ళు వారి వారి స్నేహబృందంతో వాకింగ్ అని పార్క్ అని పిచ్చాపాటీ కబుర్లతో అప్పుడప్పుడు కొందరు భజనలుతో ఇంటి బయట సమయం గడిపేవారు.అలాగే, వయసు పైబడిన ఆడవారు వారి వారి స్నేహబృందంతో నోములు, వ్రతాలు, పేరంటాలు, భజనలుతో ఇంటి బయట సమయం గడిపేవారు.

తరువాత:

ఆడ లేదు మగ అందరూ ఇంట్లో ఉండవలసి రావడంతో - కొంచెం ఆధ్యాత్మికత అలవర్చుకుంటున్నారు. ఎక్కువగా భగవత్ సంబంధ పుస్తకాలు చదవడం, ప్రవచనాలు, కీర్తనలు వినడంతో సమయం గడుపుతున్నారు.

 

ముందు :

ఆఫీస్ దూరాభారాలతో రోజూ గంటలు గంటలు ట్రాఫిక్ లోనే గడిపి ఇంటి కొచ్చే ఆఫీస్ పని రాయుళ్లు - మగ అయినా ఆడ అయినా - బాగా అలసిపోయి, ఏదో ఇంత కతికి, నిద్రకి విశ్రాంతికి వాచిపోయినట్టుగా -ఎడ మొహంపెడ మొహంతో - సంసార సుఖానికి దూరమయి యాంత్రికంగా జీవనం గడిపేసేవారు.

తరువాత:

శరీరానికి మనసుకి ఆ అలసట లేకపోవడంతో, రోజంతా దగ్గర దగ్గరగా ఉండి ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరిపై ఒకరికి ఆకర్షణ పెరిగి, ఎంత వేగిరం పిల్లలు నిద్రపోతే, అంత వేగిరంగా ఒక్కటవుదామని చిలిపి చూపులు చూసుకుంటున్నారు.

 

ముందు :

నూతన దంపతులకి -- పగలు ఆఫీస్ ఇంటి పనులు. పోనీ రాత్రేనా ఒక్కటవుదామనుకుంటే, రోజంతా చేసిన పని, ట్రాఫిక్ బడలికలతోసంసారం నిస్సారంగా మొక్కుబడిగానే సాగడం. పోనీ, వారాంతంలో హాయిగా గడుపుతామంటే, ఎవరు ఏ సమయానికి దిగిపోతారో తెలీదు. అన్ని ఆలోచనలు ఏర్పాట్లు ముందుగాచేసుకొని వారాంతపు ప్రారంభం కోసం వేచి చూస్తుంటే, అంతకు ఓ రోజు ముందరే ఏ చుట్టమో బంధువో స్నేహితులో 'మీరెలా ఉన్నారో చూసి వెళదామని వచ్చేమర్రా' అని అంతంత నవ్వు మొహాలతో దిగిపోతారు వీళ్ళ ప్రాణం మీదకి.

తరువాత:

సర్కారు వారి నియమం ప్రకారం అందరూ ఇంట్లోనే ఉండవలసి రావడంతో, ఎవరూ ఇంటికి చెప్పాపెట్టకుండా వచ్చేస్తారని బెంగే లేదు. పైగా ఇల్లు దాటి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక ఏకాంతమే ఏకాంతం. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే హనీమూన్, విహారయాత్ర. ఏదో ఇంత తినడం. చేసుకోవలసిన ఇంటి పని ఆఫీస్ పని జల్దీగా ముగించి, పడకగదికి పరిమితమైపోవడమే. తడవ తడవకీ శరీరానికి పట్టే చెమటతో స్నానం చేయడం కూడా వాయిదా వేసుకుంటున్నారు. లేదా సరిగంగ స్నానాలు కానిచ్చేస్తున్నారు.

 

ముందు :

వ్యాయామం, నడక, పరుగు, ఆటలు, ఆసనాలు, యోగా, ప్రాణాయామం మరియుధ్యానం - వీటికి ప్రాధాన్యత ఇచ్చేవారు చాలా తక్కువ.అధవా ఇచ్చినా క్రమం తప్పకుండా చేసేవారు కరువే. అందువల్ల కుటుంబంలో ఎప్పుడూ ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యే.

తరువాత:

అందరికి - చిన్న, పెద్ద, ఆడ, మగ - ఆరోగ్యం మీద అవగాహన పెరిగి అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలమీద, గురి, సుముఖత ఏర్పడడమేకాదు, క్రమేణా పెరిగింది. మితాహారం తీసుకోవడం, తప్పనిసరిగా రోజూ ఏదోరకమైన వ్యాయామం చేయడం, ఆసనాలు వేయడం, యోగా చేయడం చేస్తున్నారు.దాంతో ఇంట్లో అందరూ కనీస ఆరోగ్యంతో కళకళలాడుతున్నారు. కొన్ని ఇళ్లే చిన్న సైజు వ్యాయామశాలలాగా తయారయ్యాయి.

 

ముందు :

ఒకే వీధిలో ఉన్నా లేక ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నా - పక్కవాడెవడో తెలీదు. వాళ్ళింట్లో ఎంతమంది,ఎవరెవరు ఉంటున్నారు - అటువంటి సమాచారం లేకుండానే, అక్కరలేకుండానే ఎవరికీ వారు జీవనం సాగనిస్తున్నారు.

తరువాత:

పక్కవాడు ఆరోగ్యంగా ఉంటేనే, మనం కూడా ఆరోగ్యంగా ఉంటామన్న ఆలోచన ఏర్పడి, క్రమేణా పెరిగి, ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉండి, వారి వివరాలు సమాచారం వీరు, వీరి సమాచారం వివరాలు వారు, తెలుసుకుని --నేనున్నాను నీకు , మేమున్నాము మీకు, అన్న భరోసా ఇతరులకి కలగచేస్తున్నారు. దాంతో సామజిక అవగాహన, అందరం ఒక్కటే అన్న భావన అభివృద్ధి చెందుతోంది. ఇది ఎంతో ముదావహం, మెచ్చుకోదగ్గ పరివర్తన.

 

ముందు :

సర్కారు దవాఖానాకా ఒద్దు బాబూ. నేను రాను. అక్కడ డాక్టర్ ఉండడు. మందులు ఉండవు. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళడానికి డబ్బు సమస్య. ఎలా బ్రతకడం. ఏం చేసి బాగుపడడం.

తరువాత:

సర్కారు దవాఖానాలో కూడా డాక్టర్లు, నర్సులు సుమారుగా ఎప్పుడూ ఉంటున్నారు. చికిత్స సదుపాయాలుపుష్కలంగా ఉంటున్నాయి.ఎందుకంటే, ఒకరురోగి అయితే వారి నుంచి మరో పది మంది రోగులు తయారవుతారు అన్న భయంతో అందరూ అప్రమత్తతో జాగరూకతతో మెలుగుతున్నారు. కొన్ని చోట్ల డాక్టర్లు నర్సులు రోజుల తరబడి వాళ్ళ వాళ్ళ ఇంటికే వెళ్లక రోగులకు సేవలు చేస్తున్నారు.

 

ముందు :

దేశంలో ఏదేనాకొత్తరకం రోగానికి కొత్తగా మందు, వైద్యం కావాలంటే -- విదేశాలమీద ఆధారపడి, గాలిలో దీపం పెట్టినట్టు, ఎప్పుడు దొరుకుతుందా అన్న ఎదురుచూపులు. అధవా దొరికినా, బోలెడంత ఖరీదు.

తరువాత:

చాలా తక్కువ కాలంలోనే, మన దేశంలోనే, కొత్తరకం మందులు తయారుచేసే కొత్తరకం వైద్యం కనుక్కొనే సామర్ధ్యం ఉన్న విద్యావేత్తలు, వైద్యులు, వైజ్ఞానికులు ఉంటున్నారు. పైగా, మన దేశంలోనే తయారై దిగుమతి ప్రసక్తే లేకపోవడంతో త్వరగా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తూ అందరికి లభ్యం అవుతున్నాయి.

 

ఈ ఆరోగ్యకరమైన పరిణామం చూస్తూంటే 'కరోనా' తో మనకి -- 'కలిమి' రాలేదా ?

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాలలో చెప్పినట్టు – ‘కలిమి’ అంటే ‘ధనం’ ఒక్కటే కాదు.

---పొదుపుగా ఉంటూ, ఇంట్లో ఉన్న అందరూ ఆరోగ్యంగా హాయిగా ఒకే చోట నవ్వుతూ, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మెలగడం కంటే వేరే కలిమేముంది.

---- మీరేమంటారు ? నాతో ఏకీభవిస్తారా ?

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు