నాట్యతోరణం దేశ సంస్కృతికి దర్పణం - .

Natya Toranam

అమ్రిత కల్చరల్ ట్రస్టు ప్రప్రథమంగా హైదరాబాద్ శాస్త్రీయ నృత్య మహోత్సవం పేరిట నిర్వహించిన నాట్యతోరణంలో ప్రదర్శితమైన నృత్య ప్రదర్శనలు దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచాయి. భారతీయకళా సంస్కృతిని చాటేందుకు తద్వారా దేశ ఆధ్యాత్మికతను వెల్లడించేందుకు ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా శనివారం సాయంత్రం మాదాపూర్ లోని సెంటర్ ఆఫ్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ వారి ఆంఫీ థియేటర్ లో కూచిపూడి, కథక్, ఒడిస్సి, భరతనాట్య ప్రదర్శనలు ప్రాంగణాన్ని మువ్వల సవ్వడితో నింపింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల పర్యవేక్షణలో ట్రస్ట్ సభ్యుల బృందం సమర్థవంతంగా నిర్వహించారు.

మురమళ్ళ సురేంద్రనాథ్ (హైదరాబాద్) కూచిపూడి నృత్యప్రదర్శన ప్రతిభాన్వితంగా సాగింది. ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న వారసత్వపు కళాసంపదను పరిరక్షించుకుంటూ నాట్యాచార్యునిగా దేశవిదేశాలలో నాట్య రూపకాలు, ప్రదర్శనలిస్తూ ఉన్నతశ్రేణి కళాకారునిగా గుర్తింపు పొంది అందరి అభిమానానికి పాత్రులైన సురేంద్రనాథ్ ప్రతి అంశాన్ని రమణీయంగా ప్రదర్శించారు.

ద్వితీయ ప్రదర్శనగా నిదగ కరునాద్(బెంగళూరు)కథక్ నృత్యం మనోహరంగా సాగింది.
తృతీయ ప్రదర్శనగా అభయాకారం కృష్ణన్ (పాండిచ్చేరి) భరతనాట్య ప్రదర్శన ఆహూతుల కరతాళధ్వనులందుకుంటూ సాగింది.

నాల్గవ ప్రదర్శనగా బిజిన (కేరళ)మోహినియట్టం ఆద్యంతం ప్రశంసాయుతంగా సాగింది.

ఐదవ ప్రదర్శనగా భార్గవి పగడాల(హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది.

ఆరవ ప్రదర్శనగా శ్వేతా కృష్ణ (బెంగుళూరు) ఒడిస్సీ నాట్యం ఆసాంతం ప్రేక్షకులకు కనువిందు చేస్తూ సాగింది.

నర్తకులు,నర్తకిమణులు అభినయిస్తూ నర్తించిన తీరు ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ప్రతి అంశం వారి వారి కృషిని,శ్రద్ధను,క్రమశిక్షణను,దీక్షాదక్షతలను, నిబద్ధతను ప్రకటితంచేస్తూ ప్రేక్షకుల హర్షధ్వానాలందుకుంటూ సాగింది.

గౌరవ అతిథులుగా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్,విదేశీ కామన్వెల్త్ ఆఫీస్ డాక్టర్ ఆండ్రు ఫ్లేమింగ్, డాక్టర్ ఎస్ చెల్లప్ప(విశ్రాంత ఐఎఎస్ అధికారి), తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతుల శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు స్వీకర్త, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు స్వీకర్త కూచిపూడి, భరతనాట్య విశారదులు పసుమర్తి రామలింగశాస్త్రి, ప్రసిద్ధ ఒడిస్సి నాట్య విదూషిణి నయనతార నంద కుమార్, సి సి ఆర్ టి ప్రత్యేక అధికారి తాడేపల్లి తదితరులు విచ్చేసి ప్రసంగిస్తూ కళలు మానసిక వికాసాన్ని కలిగిస్తాయని, నాట్యం మానసిక వికాసం శారీరక దారుఢ్యం కలిగిస్తుందని అన్నారు. జాతి ఔన్నత్యాన్ని తెలిపేవి కళలేనని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన మన భారతదేశంలోని పలు రాష్ట్రాలలోని నృత్యాలను ఒకే వేదికపై ప్రదర్శింపచేసి సమైక్యతకు,కళల పునర్వైభవానికి ప్రారంభ కార్యక్రమంతో శ్రీకారం చుట్టిన ట్రస్ట్ ఉన్నత, ఉత్తమ ఆశయం ప్రశంసించదగినదని అన్నారు. ప్రదర్శనలిచ్చిన యువ కళాకారుల నాట్య వైదుష్యాన్ని కొనియాడుతూ ప్రసంగించారు.

అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల గౌరవ పూర్వకంగా సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందని, దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాజేష్ పగడాల వేదికపై తెలిపారు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు