ద్వితీయం అనే రెండవ స్థానం - కందుల నాగేశ్వరరావు

Dwiteeyam ane rendava staanam

లెక్కలలోఒకటికిఒకటి కలిపితే రెండు అవుతుంది. అంటే రెండు అనేది ఒకటి కంటె రెండు రెట్లు విలువ ఉంటుంది. కాని నిజ జీవితంలో ఒకటో స్థానంలో ఉన్న వ్యక్తి రెండో స్థానంలో ఉన్న వ్యక్తికంటే గౌరవ మర్యాదలలోగాని, అధికారంలోగాని ఎంతో ఎత్తులో ఉంటాడు. ఇది క్రీడలు, కళలు, చదువులు, ఉద్యోగాలు, పరిపాలన మొదలైన అన్ని రంగాలకు వర్తిస్తుంది.

 

క్రీడల్లో ఎన్నో జట్టులపై విజయం సాధించి నాలుగు జట్టులు సెమీ పైనల్స్ కుచేరుతాయి. రెండు సెమీపైనల్స్ లోను గెలిచిన జట్లు పైనల్స్ ఆడతాయి. పైనల్ లో గెలిచిన జట్టు స్వర్ణపతకం మరియు ట్రోఫీ సంపాదిస్తుంది. ఓడిన జట్టుకు రజితపతకం ఇస్తారు. రెండు సెమీపైనల్స్ లోనూ ఓడినవారు మూడవ స్థానంకోసం మరల పోటీ పడతారు. అందులో గెలిచినవారికి కాంస్య పతకం లభిస్తుంది.ఈ విషయాలన్నీ మన అందరికీ తెలిసినవే.

 

కాని ఇక్కడే ఒక చిన్నగమ్మత్తు ఉంది. స్వర్ణ పతకం, కాంస్య పతకం సంపాదించిన వారి ఆట గెలుపుతో పూర్తవుతుంది. ఇందుకు భిన్నంగా ద్వితీయ స్థానంలో ఉండి వెండి పతకం సంపాదించుకున్నవ్యక్తి లేక జట్టు ఆట ఓటమితో పూర్తవుతుంది. ఆ టీము పైనలు వరకు అన్ని ఆటలు గెలిచి, పైనల్ లో ఓడి, రెండవ స్థానం సంపాదించి ఆ వెండి పతకం గెలుచుకుంటుంది. అందుకే ద్వితీయానిది ఎప్పుడూ ఓటమితో కలిసిన గెలుపు. లోపల ఎంత ఏడ్చుకున్నా బయటకు నవ్వుతూ ఉండవలసిన పరిస్థితి.

 

ఇక చదువు విషయానికి వస్తే గోల్డ మెడల్ వచ్చిన వాడికి, ఒకటి లేక రెండు మార్కులు తక్కువ వచ్చిన వాడికి విషయజ్ఞానంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. అదే పరీక్ష ఇంకొక రోజు జరిపితే ఆ స్థానాలు తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు జీవితాంతం ఆ గొప్పతనాన్ని చెప్పుకొని ఆనందిస్తాడు.

 

రెండో స్థానంలో ఉన్నవాడు ఆ విషయం వచ్చిన ప్రతీసారి, నాకు ఒక్క మార్కులో గోల్డ్ మెడల్ పోయిందని చెప్పి విచారిస్తూ ఉంటాడు. వాడి కంటే ఏ రేంకు లేకపోయినా మంచి మార్కులు తెచ్చుకున్నవాడు ఆనందంగా ఉంటాడు. ఇదీ చదువుల్లో ద్వితీయం పరిస్థితి.

 

పెద్దచదువులు చదివి, ప్రభుత్వ ఆఫీసుల్లో, సచివాలయాలలో, పేరుపొందిన సంస్థలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. చదువు తరువాత పోటీ పరీక్షలలో ఎంతో మంది అభ్యర్థులతో పోటీపడి, విజయం సాధించి, ఆ సంస్థలలో ఉద్యోగంలో చేరతారు. వారి శక్తి యుక్తులను చూపించి అంచెలంచలుగా ఎదుగుతూ అందులో చాలా కొద్ది మంది ఉన్నత lస్థాయికి చేరతారు.

 

ఇప్పటి వరకూ వీరు ఎదుగుదలలోఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కొనిఉండరు. ఏ సంస్థకైనా, కార్యాలయానికైనా, విభాగానికైనా‘హెడ్’ ఒక్కడే ఉంటాడు. ప్రస్తుతం హెడ్పదవిలో ఉన్న వ్యక్తి పదవీ విరమణ చేసినప్పుడు ఆ స్థానానికి, తరువాత స్థానంలో ఉన్న ముగ్గురు నలుగురిలో ఎవరో ఒకరిని కొత్తగా ‘అధిపతిగా’ నియమించడం జరుగుతుంది.ఆయనతోబాటే ఉద్యోగంలో చేరిసమాన హోదాలో పనిచేసిన మిగతా వారు ప్రథమస్థానం చేరలేక రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వస్తుంది.మూడు దశాబ్దాల పై ఉద్యోగ జీవితంలో వారికి ఇది మొట్టమొదటిఅపజయం. వీరు రెండవ స్థానంలో మిగిలిపోతారు.ఈ విషయాన్నిఅంత సులభంగా జీర్ణించుకోలేక తమలో తామే రగిలిపోతారు.

 

ఇలా రెండో స్థానంలో మిగిలిపోయినవారి మనస్తత్వం వారి వ్యక్తిత్త్వాన్ని బట్టి మూడు వర్గాలుగావిభజించవచ్చ. మొదటి వర్గంవారు పరిస్థితులతో రాజీపడి మొదటి స్థానం పొందిన వ్యక్తికి పూర్తిగా సహకరించి ఆ సంస్థను సక్రమంగా నడిపించడంలో తోడ్పడతారు.

 

రెండవ వర్గం వారుబయటకు సహరిస్తున్నట్లు కనిపిస్తారు,కాని అంతరంగంలో కుట్రలు పన్నుతూ, తప్పుడు సలహాలు ఇస్తూ, అధిపతికి చిక్కులు కలిగిస్తూఉంటారు. తమ గొప్పతనం చూపించుకొనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి తాము పనిచేసే సంస్థ కంటే వారి ఎదుగుదలే ముఖ్యం.

 

మూడవ వర్గంవారుతమ అయిష్టాన్ని బయటకువ్యక్తపరిచి అధిపతికి ఏ పనిలోనుసహకరించరు. క్రింది స్థాయి ఉద్యోగుల్లో కొంతమందితో కలిసి సంస్థ అధిపతికి తలనొప్పి తెప్పిస్తూ ఉంటారు.అటువంటి వారు వ్యక్తిగతంగా నష్టపోతారు మరియు వారు పనిచేసే సంస్థకు నష్టం కలుగ చేస్తారు.

 

సంస్థకు అధిపతిగా నియుక్తులైన వారిలో కొద్ది మందికి అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉంటుంది. వారు రెండవ స్థానంలో మిగిలిపోయిన ఉద్యోగులకు సముచితమైన గౌరవం ఇచ్చి, వారితో సఖ్యతను పెంచుకుంటారు. ముఖ్య విషయాలలో వారితో చర్చించి వారి సలహాలను స్వీకరిస్తారు. సంస్థనుస్నేహపూరిత వాతావరణంలో నడిపిస్తారు. క్రింది వారిఅనుభవాలను కూడా సంస్థ పెరుగుదలకు ఉపయోగిస్తారు.

 

ఇంకొంతమంది తనతో పోటీచేసి రెండవ స్థానంలో మిగిలినవారిని దూరంగా ఉంచుతారు. వారికి సరియైన భాద్యతలు అప్పచెప్పరు. వారితో ముఖ్యమైన విషయాలు చర్చించకుండా చిన్న చూపు చూస్తారు. ఇది రెండవ స్థానంలో మిగిలిన వారిలో అసంతృప్తిని పెంచుతుంది. వారు సరియైన సమయంలో సంస్థ అధిపతికి సమస్యలు తెచ్చిపెడతారు.

 

ప్రజాపరిపాలన విషయంలో ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం.మన భారతదేశంలో ఇతిహాసకాలంలో అందరూ ఆనాటి ఆచారాలను తప్పక పాటించేవారు. సోదరులందరూ జ్యేష్టుని భగవంతుడిలా భావించి పూర్తి అంకితభావంతో సేవలు చేస్తూ రాజాజ్ఞను అమలు పరిచేవారు.

 

త్రేతాయుగంలో భరతుడు ధర్మసూత్రముల ప్రకారము తన అగ్రజునికి చెందవలసిన సింహాసనాన్ని తను అధిరోహించడానికి ఇష్టపడక శ్రీరామచంద్రుని పాదుకలకు పట్టాభిషేకం చేసి అన్నగారి పేరు మీదనే రాజ్యపరిపాలన చేసి తన భక్తిని చాటుతున్నాడు. ఇంకొక తమ్ముడైన లక్ష్మణుడు రాజాజ్ఞ లేకపోయినా తన తల్లిని, భార్యను, అన్ని రకాల సుఖాలను త్యజించి అన్న గారి వెంట వనవాసానికి వెళ్ళి ప్రతీ క్షణం ఆయనను కంటికి రెప్పలా చూసుకొని, అగ్రజుని పట్ల తన భక్తిని, అభిమానాన్ని చాటుతున్నాడు.

 

ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణునిగాను, ఆదిశేషువు అగ్రజుడైన బలరామునిగాను అవతారం ఎత్తారు. శ్రీకృష్ణుడు తాను స్వయంగా భగవంతుడు అయినా, మానవ ధర్మాన్ని అనుసరించి అగ్రజుడైన బలరాముడిని రాజుగా స్వీకరించి, అన్ని రకముల గౌరవమర్యాదలు ఇచ్చి ఆయన అనుజ్ఞతోనే అవతార విశేషాలు నెరవేర్చాడు. ధర్మరాజు తమ్ముళ్ళు నలుగురూ ఎంత బలవంతులైనా ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా, అన్నగారి మాట జవదాట లేదు. చివరకు దుర్మార్గులైన కౌరవులు కూడా ఈ నీతిని అతిక్రమించలేదు. కౌరవసోదరులు అందరూ అన్నగారైన దుర్యోధనుడిని జీవితాంతం అనుసరించారు.

 

తరువాత చారిత్రక కాలంలో కూడా ఎంతోమంది రాజులు ఈ ధర్మాన్ని పాటించారు. రాజుగారు మరణించినా లేక ఆయన వానప్రస్థాన్ని స్వీకరించి పదవీ విరమణ చేసినా, మంత్రిమండలి జ్యేష్టుడైన యువరాజుని మహారాజుగా నిర్ణయించి రాజ్యాభిషేకం చేసేది. మిగిలిన రాజకుమారులు అన్నగారి ఆజ్ఞలను పాటిస్తూ రాజ్యసభలో రాజోద్యోగులతోబాటు ఆసీనులవడంగాని, రాజ ప్రతినిధిగా వేరే ప్రాంతంలో అధికారం చలాయించడంగాని చేసేవారు. వారికి రాజుగారి ఆజ్ఞలను అమలు చేయడం తప్ప స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండేది కాదు.

 

ఆధునికకాలంలో మనదేశంలో రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. రాజకీయ రణరంగం ప్రజల మధ్యకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో కేంద్రంలో ప్రధానమంత్రి లేక రాష్ట్రాలలో ముఖ్య మంత్ర్రులకు; వారి మంత్రిమండలిలోని మిగతా మంత్రులకు ఒకరిపై ఇంకొకరికి నమ్మకం, తోటి వారిపై గౌరవం ఉండేవి. ప్రజలకు కూడా అందరు నాయకులపైన గౌరవాభిమానాలు ఉండేది. అందువలన నాయకులు వారి వారి శాఖలలో పనిని మిగతావారి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా, నిర్భయంగా నెరవేర్చేవారు.

 

ప్రస్తుతకాలంలో రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉన్నా ఏ ఒక్కరికి ఇంకొకరిపై నమ్మకం ఉండడం లేదు. ఎవరు ఎప్పుడు తమ పార్టీని వదలి వేరే పార్టీలో చేరతారో తెలియదు. ఎవరు వెనుక నుండి గోతులు తవ్వి తమని పదవి నుంచి దించేస్తారో అనే భయం ప్రతీవారిలోనూ పెరిగిపోయింది. ఈ కారణంతో ముఖ్యమంత్రులు తమ బలం పెంచుకోవడానికి వారు నియమించిన ఉపముఖ్యమంత్రులను, మంత్రి వర్గంలో ఉన్నమిగతా మంత్రులను, తమ పార్టీ లెజిస్లేటర్లను ఎవ్వరినీ నమ్మకుండా అధికారాన్ని పూర్తిగా వారి చేతిలో ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు చట్ట ప్రకారం జరిగినా, ఆ తరువాత చాల చోట్ల నిరంకుశత్వం రాజ్యం చేస్తుంది.అందువలన ‘నంబరు రెండు’ అనేది పేరుకు తప్ప నిజానికి కనపడదు.ఒకటి తరువాత మిగతా అంతా సున్నాలే.

*****************************

 

 

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు