కాల్చేయ్ - మద్దూరి నరసింహమూర్తి

Call chey

“ఒరే రేపు ఒకసారి కాల్చేయ్ రా.”

“ఏ సమయంలో కాల్చేయ్ మంటావు.”

“రేపు రోజంతా నేను అందుబాటులో ఉంటాను. నీకెప్పుడు వీలయితే అప్పుడు కాల్చేయ్.”

“సరేరా. నువ్వింతగా చెపుతూంటే, నేను కాల్చేయ్ కుండా ఎలా ఉంటాను. తప్పకుండా కాల్చేస్తాను.”

 

“అమ్మాయి, పెళ్ళికొడుకు పది నిమిషాల ముందర కాల్చేసేడు. మరో పది నిమిషాలు పోతే మళ్ళా కాల్చేస్తానన్నాడు.”

“అలాగే అమ్మా.”

“ఏమిటో, ఈ రోజుల్లో పెళ్ళికి ముందర ఒకరికొకరు ఈ కాల్చేసుకోవడాలేమిటో. మా కాలంలో ఇలా లేదు సుమీ.”

“అదంతే అత్తగారు. ఈ రోజుల్లో ఆలా కాల్చేసుకోకుండా ఉండలేరు. మనం కాలంతో మారాలి.”

 

“నీకు ఇన్నిసార్లు కాల్చేస్తుంటే ‘ఊ’ అనవు ‘ఆ’ అనవు. నా మీద నీకు బొత్తిగా ప్రేమ లేదు” - అలిగింది ప్రియురాలు.

“అది కాదు ప్రియా. ప్రక్కన మా బాస్ ఉన్నారు. అతను వెళ్లిపోయిన తరువాత, నేను ఎన్నిసార్లు కాల్చేసినా అవలేదు. ఏమో మరి.”

“నీకు ఈ రోజుల్లో కూడా ఎలా కాల్చేయాలో నేర్పాలా, అవడం లేదట. అబద్ధాలు నువ్వూను. నీకు అసలు కాల్చేయాలని లేదు.” -- మళ్ళా అలిగింది, ప్రియా.

 

“ఎక్కడున్నారండీ మీరు. మీకు ఎన్నిసార్లు కాల్చేసేనో. ఏం చేస్తున్నారేమిటి.” - నిలదీసింది భార్య.

“మా ఆఫీస్ కు ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చేరు. అందుకే, నువ్వు కాల్చేసేవని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను.”

 

“నాన్నా, రేపు నిన్ను టీచర్ మా స్కూల్ కి రమ్మన్నారు. రేపు నువ్వు పదకొండు గంటలకి కాల్చేస్తే ఎన్ని గంటలకి రావాలో చెప్తారు. నువ్వొస్తే, నీతో మాట్లాడాలట.”--కొడుకు బడినించి వచ్చి, వర్తమానం అందించేడు.

 

-2-

 

"నా ప్రియమైన ఓటరులారా - నన్ను గెలిపిస్తే, మీకు నేనెప్పుడూ అందుబాటులో ఉంటాను అని ప్రమాణం చేస్తున్నాను. ఒక్కసారి కాల్చేస్తే చాలు మీ గుమ్మం ముందట వాలిపోతాను అని మరీ మరీ ప్రమాణం చేస్తున్నాను.” - కాబోయే MLA గారి ఎన్నికల ప్రచారంలో హామీ.

 

పైన ఉదహరించిన కొన్ని మచ్చు తునకలు చదివిన విజ్ఞులైన చదువరులు –

ఈ సరికి గ్రహించే ఉంటారు -- వివిధ రంగాలలో ఉన్న జనం మొబైల్ మాధ్యమంలో

ఎలా ఒకరినొకరు కాల్చేసుకుంటున్నారో.

 

ఇక్కడ మనం గ్రహించవలసిన సూక్ష్మం ఏమంటే - ఈ సదుపాయం ఒక్క మన తెలుగు వారికే.

మిగతా భాషల వాళ్ళకి (నేను పరిశీలించినంతమట్టుకు) మొబైల్ మాధ్యమంలో ఇలా ఒకరినొకరు కాల్చేసుకొనే సదుపాయం లేదు.

 

మిశ్రమ భాషా ఉపయోగం (ఆంగ్లం + తెలుగు) (కాల్ + చేసి) తో –

మనం ఎంతో సదుపాయంగా ఇలా ఒకరికొకరు నవ్వుతూ ఇష్టంగా మరీ మరీ కాల్చేకుంటున్నాము.

 

కొంచెం అలోచించి - "నీ మొబైల్ / ఫోన్ లో నాకొకసారి పిలు" అనో, "నేను నీకు తరువాత ఫోన్ చేస్తాను" అనో "పిలుస్తాను" అనో "మాట్లాడతాను అనో" అంటే -- ఎంతందంగా ఉంటుంది --

కాదు, మాకు కాల్చుకోవడమే ఇష్టం అంటే – --- ---

సరే అలాగే కాల్చుకోండి అని ఒక ఏడుపు ఏడ్చి, నోరు ..... మూసుకొని - నిశ్శబ్దంగా రోదించడం కంటే ఏమి చేయగలం.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు