‘అహింసా ప్రధమం పుష్పం పుష్ప...’ - ఆదూరి హైమవతి

Ahimsaa Pradhamam Pushpam
చతుర్మాస దీక్షంటే నే పూజలూ ..ఉపవాసాలూ, పుణ్య సంపాదనే అంతానూ. ఈపూజకై  పూల కోసం పూర్వం గ్రామాల్లో ఉదయాన్నే పూల సంచీ పట్టుకుని తోటలవైపు వెళ్ళేవారు , సంచీనిండా పూలుతెచ్చి మాలలుకట్టి, మధ్యాహ్నం, వంటై , మహా నివేదన ముందు పూజ వేళకు దైవ మందిరం లోని పటాలన్నింటికీ, పూజా విగ్రహాలకూ, అలంకరించి, హారతి, నివేదన అయ్యాక భోజన కార్యక్రమం మొదలయ్యేది.  ఈ ఆధునిక నవనాగరిక యుగంలో , బెంగుళూరు , హైదరాబారు , ముంబై వంటి మహా నగరా ల్లో , పేరుకు అందరి ఇళ్ళలోనూ పూల కుంపట్లు [ అదే తొట్లు] ఉంటాయికానీ ఆపూలు కోసి దేవునికి అలంకరించనూ కాదు, తల లో తురుముకోనూకాదు, అలంకారానికే! కోయ కుండా మొక్కలకే ఉంచి ఇంటికి వచ్చినవారు, " ఆహా! మీ పూల మొక్కలెంత అందగా ఉన్నాయ్! ఎన్నిపూలూ పూస్తున్నాయ్! ఏ ఎరువేస్తారు? ఎన్ని నీళ్ళుపోస్తారు ? " అంటూ అడుగుతుంటే ఎంతగర్వంగా ఉంటుందో! అలా మురిసిపోనే  ఇంటి పూలకుండీలు ! మరి పూజకు పూలెలా  ! అంటారా ! అక్కడికే వస్తున్నా... [అసలు పూజచేసే తీరి కెవరికి ? విశ్రాంత ఉద్యోగులూ, అరవై పదుల తర్వాత వారూ తప్ప , పరుగుల ఉరుకుల జీవితాలాయె ]

ప్రతిరోజూ ఉదయాన్నే నడక్కు నడకా పాలు లీటరుకు రెండురూపాయలు తక్కువకూ వస్తాయని పాలసంచీ తగిలించు కుని బయట నడుస్తూ వెళ్ళి రావటం అలవాటు. ఈబెంగుళూర్లో వాతావరణం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం,  అందుకే మఫ్లర్ పెట్టుకునే బయల్దేరాను. మలుపు తిరగ్గానే ఒక పెద్దమేడ నాలుగంతస్తులు లిఫ్ట్ లేకుండా ! దానిముందు హైపవర్ కరెంట్ వైర్లు పోతుండటాన వదిలేసిన స్తలంలో ఆ ఇంటివారు ఫెన్సింగ్ వేసుకుని పూలమొక్కలు పెంచుతున్నారు . చూడగానే  కళ్ళు జిగేలు మనిపించే రంగుల పూలు దారెంట పోతున్నవారినంతా ఆకట్టు కుంటుంటాయి . ప్రతిరోజూ ఒక పోలితీన్ కవర్ పట్టుకుని దాన్లో ఇళ్ళ ముందు వేసుకున్న పూలమొక్కలనుండీ ఒకావిడ పూలు తస్కరించి దేవుని సత్కరిస్తుంటుంది  పాపం!

ఆరోజూ ఆ ఇంటి ముందు ఫెన్సింగ్లో  వేసుకున్న పూలమొక్కల నుండీ బయటి కొచ్చిన కొమ్మల కున్న మందారపూలు తుంచు తుండగా , పొగమంచులో ఆమె ఎవ్వరికీ కనిపించ ననుకుంది పాపం, ఆ ఇంటావిడ " ఎవరక్కడ! పూలుకోస్తుంటిరి! రోజూ కాపలా కాస్తుండాల, కొనుక్కుని పూజ చేసుకోరాదూ, మీకు కాపలా కాయేంకే నాకు సరిపోతున్నది..." అంటూతిట్ల పురాణం విప్పింది.  [తప్పక ఆమె బంధువు లెవరో ఎం ఎల్ ఏ లో, ఎంపీలో కనీసం పంచాయితీ మెంబర్లో ఐఉంటారని పిస్తుంది, ఆతిట్ల పురాణం వింటుంటే, రాజకీయ గంధం లేని మరొకరికి  అంత ఆతిట్ల పురాణం అంత శ్రావ్యంగా పాడటం రాదుగాక రాదు ] .

పాపం గబగబా పూల సంచీ పమిటకొంగులో దాచి పెట్టుకుని " ఇక్కడున్న గరిక కొసుకుంటున్నా వినాయకునికి " అంటూ గరిక పట్టుకుని రోడ్డుమీదకు వచ్చింది . రోజూ చూసేదే ఐనా నాక్కాస్త బాధని పించింది.పూజకు పూలు కొనుక్కోవాలి, లేదా ఇంటి కుండీ ల్లోపెంచుకుని వాటిని అలంకారానికి కాక కోసుకోవాలి, ఇలా దొంగతనంగా , తిట్టించు కుంటూ కోసి పూజచేస్తే దేవుడు సంతోషిస్తాడా!

పూజ అనేక విధాలు, తిట్ల పూజ, పూల పూజ, శాపనాద్థాల పూజ, భక్తిపూజ, మానసిక పూజ, బడాయిపూజ, అంతః కరణపూజ, [ బడిత పూజా ఉందికానీ అదిమనుషులకే పరిమితం.!.] ధార్మికపూజ , బంగారు పూలపూజ, వెండిపూలపూజ,  అష్టపుష్ప పూజ, అహింసాప్రధమంపుష్పం పుష్ప మింద్రియ నిగ్రహం…. అంటూ అష్ట పుష్పాలపూజ శ్లాఘనీయం, ఈ దొంగపూలపూజ ఎవరికోసం! నవ్వురాదూమరి!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు