పేరులోనే పెన్నిధి - తోట సాంబశివరావు

Peru lone pennidhi

నా చిన్నతనంలో ఒకసారి బడికి శలవులు ఇచ్చినప్పుడు మా అమ్మమ్మవాళ్ల ఊరికెళ్ళాను . ఆమరుసటిరోజు ఉదయాన్నే నా ఈడు పిల్లలలతో ఆడుకుందామని బయటికెళ్ళాను .అక్కడ ఇద్దరు అబ్బాయిలు గోళీకాయలాట ఆడుకుంటుంటే "నేనూ మీతో ఆడతాను " అని అడిగితే "సరే " అని వాళ్ళు ఒప్పుకున్నారు .ఆట మొదలైంది .అంతలో వాళ్ళిద్దరిలో ఒకడు "నీపేరేంటీ?"అని అడిగాడు ."సాంబశివరావు "అని చెప్పాను .వెంటనే రెండో వాడు "అదేంటి ? సాంబయ్య అని వుండాలికాని సాంబశివరావు ఏంటి ?"అని అడిగాడు ఆశ్చర్యంగా .అప్పుడు మొదటివాడు "నాపేరు లింగయ్య ..కాదు కాదు లింగేశ్వరరావు ."అని చెప్పాడు .వెంటనే రెండోవాడు "అయితే నాపేరు కోటయ్య ..కాదు కాదు కోటేశ్వరరావు ."అని చెప్పాడు.బహుశా వాళ్లు ..లింగయ్య ,కోటయ్య అనే పేర్లు మోటుగా ఉన్నాయని ,లింగేశ్వరరావు ,కోటేశ్వరరావు అనే పేర్లు ఆధునికంగా వుంటాయని భావించి ఉండొచ్చు .
ఆమాటకొస్తే ,పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు బాగాలేవని తదుపరికాలంలో తమ పేర్లను తమకిష్టమైన విధంగా మార్చుకున్నవారు చాలామంది మనకు తారసపడుతుంటారు .
సాధారణంగా ,పెద్దవారు తమ బిడ్డలకు తమ పూర్వీకుల పేర్లు పెడుతుంటారు .కొంతమంది తమ ఇష్ట దైవాల పేర్లు పెడతారు .ఊర్లపేర్లు ,నదులపేర్లు ,పుణ్యక్షేత్రాలపేర్లు , నచ్చిన నాయకులపేర్లను కూడా పెడుతుంటారు .
కొంతమంది ప్రాసతో కూడిన పేర్లు కూడా పెడుతుంటారు .ఆ కోవలో ,మా ఇంటిదగ్గరే ఉండేవారికి ఐదుగురు ఆడపిల్లలు .వాళ్ళ పేర్లు ,వరసగా ,కావ్య ,దివ్య .రమ్య ,సౌమ్య ,శౌర్య .
అక్కడక్కడా విచిత్రమైన పేర్లు కూడా వినపడుతుంటాయి .
ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకతన్ని "స్వతంత్రం "అని పిలుస్తున్నారు .బహుశా మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టివుంటాడు .
ఒక బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకతన్ని "సునామి "అని పిలుస్తున్నారు .బహుశా సునామి వచ్చిన సమయంలో పుట్టివుంటాడు .
ఏది ఏమైనప్పటికి ,పెద్దలు చెప్పినట్లు "ఒన్స్ ఓన్ నేమ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ "..అది అక్షరాలా సత్యం .
అంటే "ఎవరికైనా అన్నిటికంటే వారిపేరే అత్యంత తీయనైనది "..
అవునుకదా !!
ఎవరైనా మనల్ని పేరుపెట్టి పిలిస్తే చాలా సంతోషిస్తాము .వారు మనకు దగ్గరివారిగా భావిస్తాము.అందుకే నాయకుడిగా ఎదగాలనుకునేవారు తమ అనుచరుల పేర్లను బాగా గుర్తుపెట్టుకుంటారు .సాధ్యమైనంతవరకు పేర్లతినే పిలవడానికి ప్రయత్నిస్తుంటారు ..

ఒక రోజు నేను నా కార్యాలయంలో పనిలో నిమఘ్నమై వున్నప్పుడు ఒకతను తలుపుతెరుచుకొని హడావిడిగా లోపలికి వచ్చి "హల్లో సాంబశివరావుగారు ..!"అంటూ నాయెదురుగావున్న కుర్చీలో కూర్చున్నాడు .మనిషి హుందాగా వున్నాడు.కానీ తనని నేనెప్పుడూ చూడలేదు .అందుకే ఆశ్చర్యంగా అడిగాను. "మిమ్మల్ని నేను ఇంతకుముందెప్పుడూ చూడలేదు .నా పేరు మీకెలాతెలుసు ?"
"బయట మీ నేమ్ బోర్డు చూశానులెండి .."
"ఇంతకీ నేను మీకేవిధంగా సహాయపడగలను "
"ఏంలేదు సాంబశివరావు గారు .నా పేరు ఆనందరావు ..నేను ..ఆరోగ్యం ..అనే మాసపత్రికకు సేల్స్ మేనేజర్ని సాంబశివరావుగారు.ఈ పత్రికలో సాంబశివరావుగారు ..పిల్లలకు పెద్దలకు స్త్రీలకు పురుషులకు ,ఆమాటకొస్తే సాంబశివరావుగారు ,ఇంట్లోవుండే వాళ్లందరికీ ఉపయోగపడే సలహాలు ఈ పత్రికలో ఉంటాయి సాంబశివరావుగారు .నిజానికి సాంబశివరావుగారు .."
"చాలండి ఆనందరావు గారు..! ఒక సంవత్సర చందా రాసుకోండి .."
దరఖాస్తు పూర్తిచేసి చందా డబ్బు చెల్లించాను
"ధన్యవాదాలు సాంబశివరావు గారు ! ఇంకోవిషయం సాంబశివరావుగారు ..మీరు అనుమతిస్తే ,సాంబశివరావుగారు ,మీ సిబ్బందినికూడా కలిసి మా పత్రికకు చందాదారులుగా చేర్చుకుంటాను సాంబశివరావుగారు ..మరి ..."
"ఆ ఆ ..వెళ్లి కలవండి ..అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం కదా ..."
సంతోషంగా బయటికెళ్ళారు ఆనందరావుగారు .అప్పుడు నాకనిపించింది ..పేరును పలుమార్లు ఉచ్చరిస్తూ అనుకున్నదాన్ని ఆనందరావు గారు అవలీలగా సాధించగలరని ..
సాధారణంగా తల్లిదండ్రులకోరికపై , పుట్టిన తేది ,సమయం ,ఘడియలు ,వారం ,తిధీ ,నక్షత్రం చూసి పేర్లు పెడుతుంటారు మన పురోహితులు .ఈ మధ్యకాలంలో వాటితోపాటు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి కూడా పేర్లు పెడుతున్నారు .అందుకోసం మనకు సంఖ్యా శాస్త్రజ్ఞులు కూడా అందుబాటులో ఉన్నారు .కాలంకలిసిరాక అనుకున్నపనులు అవకపోతుంటే మన పేర్లలో ఉన్న అక్షరాల స్పెల్లింగుల్లో ,కొంచం మార్పు చేర్పులు చేస్తున్నారు ఆ శాస్త్రజ్ఞులు .
అలా మార్చిన పేరునే వాడుకలోకి తెస్తే అడ్డంకులన్నీ తొలగిపోయి అనుకున్నపనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయని చెప్తుంటారు.అలా చాలామంది పేర్లలో మార్పులు చేయించుకొని సత్ఫలితాలను పొందారని చెప్తుంటారు.
ఈ మధ్యకాలంలో వ్యాపారవేత్తలుకూడా తమ కంపెనీ పేర్లను ,ఆ కంపెనీ తయారు చేయబోయే ఉత్పత్తుల పేర్లను నిర్ణయించడానికి కూడా సంఖ్యాశాస్త్రజ్ఞులను సంప్రదిస్తున్నారు .
సంఖ్యాశాస్త్రం ప్రకారం పేర్లు పెడితే తమ కంపెనీ విజయవంతంగా నడుస్తుందని , తమ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని ,తద్వారా కంపెనీ ఎప్పుడూ లాభాలబాటలో పరుగుపెడుతుందని వారి ప్రగాఢవిశ్వాసం ..
మొత్తానికి ఒక పేరులో ..ఇంతుందా ..
అందుకేనేమో మన పెద్దలు ఊరకనే చెప్పలేదు ..."పేరులోనే పెన్నిధి "..అని .

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి