అంకితం - మద్దూరి నరసింహమూర్తి

Ankitam

కొన్నాళ్లుగా, 'అంకితం' అన్న పదం - కొన్ని కొన్ని కార్యక్రమాలలో వాడే తీరు సునిశితంగా గమనిస్తే –

-- అది, ఎంత అర్ధరహితంగా వాడబడుతున్నదో తెలుసుకోగలరు.

 

గతంలో -

నిజ దార సుత పోషణార్ధం ధన కనకాది బహుమతులను ఆశించి, రాజులకి జమీందారులకి వారి రచనలని అంకితమిచ్చి జీవనం సాగించే సాహితీవేత్తలైన కవులు, రచయితలు కొందరుంటే –

భాగవతోత్తములైన వారు కొంతమంది, నిష్ఫలాపేక్షతో భక్తి భావంతో రచించిన రచనలని, దేవదేవుడైన సర్వేశ్వరుడికే అంకితమిచ్చి వారి జన్మలని సార్ధకం చేసుకొనేవారు.

 

ఎవరు ఏవిధంగా ఎవరికి వారి రచనలని అంకితమిచ్చినా --

అంకితమిచ్చిన మరుక్షణం నించీ, ఆ రచనలమీద వారు సర్వహక్కులూ కోల్పేయేవారు అన్నది జగద్విదితం, నిర్వివాదాంశం.

 

అయితే –

కొన్నాళ్లుగా సినీ పరిశ్రమ (ఏ భాష వారిదైనా) కి సంబంధించి జరిగే బహుమతిప్రదాన కార్యక్రమాలలో మనం వినేదీ, చూసేదీ --

బహుమతి అందుకొనే వ్యక్తులు -- సభా వేదికమీదనే -- వారంతట వారో, లేక వ్యాఖ్యాతల ప్రోద్బలంతోనో, అందుకునే బహుమతులు ఎత్తి ఆహూతులకు చూపించి --

'ఈ బహుమతిని ...................... అంకితమిస్తున్నాను' అని –

ఒక పెద్ద చిట్టా వినిపించడం సర్వ సామాన్యమైపోయింది.

అలా అని, ఆ చిట్టాలో చెప్పినవారెవరికైనా ఆ బహుమతిని సర్వ హక్కులతో ఇచ్చేస్తున్నారా అంటే -- లేనే లేదు.

-2-

 

ఆఖరికి పరిస్థితి ఎలా దిగజారింది అంటే –

అలా అంకితమిస్తున్నాము అని చెప్పక పొతే, బహుమతి గ్రహీతని ఒక అనాగరిక వ్యక్తిగా పరిగణిస్తారేమో అన్న అపోహతో –

బహుమతి అందుకున్న ప్రతీ వ్యక్తి వారి బహుమతిని ఎవరికో ఒకరికైనా కనీసం

అంకితమిస్తున్నామని ప్రకటించడం పరిపాటైపోయింది.

 

అంతేకాదు, కొంతమంది సాహితీవేత్తలు కూడా వారి నవలలు కధలు విషయాలలో ఇదే పద్ధతిని కొనసాగిస్తూ -

రచన ప్రారంభంలోనో లేక చివరనో ఆ రచన ‘........ వారికి’ అంకితమిస్తున్నటు ప్రకటిస్తున్నారు.

కానీ, ఆ రచన మీద వచ్చే ఆదాయం మాత్రం రచయితగారి స్వంతానికే పరిమితం.

 

ఈ మధ్యన మరో విషయం కూడా ఈ పరిధిలో తొంగి చూసింది.

ప్రసార మాధ్యమాలలో నృత్య/పాటల పోటీల కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. వాటిలో పాల్గొనే కొందరు అభ్యర్థులు లేదా పోటీ నిర్వహించే నృత్య/సంగీత దర్శకులు కూడా ఇదే పంథాలో నడవడం గమనించవచ్చు.

 

అభ్యర్థి కానీ సంగీత/నృత్య దర్శకుడు కానీ -- ఆ పాట/ప్రదర్శన అయిపోయిన తరువాత –

పోటీ జరిగిన వేదిక మీదనే -- ఆ పాట/ప్రదర్శన ని '.........కి' అంకితమిస్తున్నట్టు ప్రకటిస్తున్నారు.

 

రాబోయే రోజులలో ఈ అర్థరహిత చర్య ఇంకా ఎన్ని క్రొత్త పుంతలు తొక్కుతుందో !!

ఏమీ చేయలేని మనం -- నిశ్శబ్ద వీక్షకులం మాత్రమే.

 

ఈ వ్యాసం ప్రచురించిన పత్రిక వారు నాకేమీ పారితోషికం ఇవ్వరు కాబట్టి –

ఈ వ్యాసాన్ని పత్రిక చదువరులందరికీ నేను సగర్వంగా అంకితమిస్తున్నాను.

*********

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి