నిజానికి ,మన నోటినుండి వెలువడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది .అర్ధం ఉంటుంది .అందుకే మాట్లాడేముందు జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి .మాట జారితే వెనక్కు తీసుకోలేము కదా !
ఆ మాటకొస్తే ఒక వ్యక్తియొక్క సంస్కారాన్ని అతను మాట్లాడే మాటలనుబట్టి అర్థంచేసుకోవచ్చు .
మనం మాట్లాడే మాటలు వినసొంపుగా ఉండాలి .మృధు మధురంగా ఉండాలి.వినే వ్యక్తికి మనం మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించాలి .ఎంత కోపంగా వున్న వ్యక్తి అయినా మన మాటలతో చల్లబడాలి. మనతో సుహృద్భావంతో మెలగాలి .అంతటి శక్తి మన మాటల్లో ఉండాలి .
అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హత్యానంతరం రాజీవగాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడు ఒక బడా పారిశ్రామికవేత్త రాజీవగాంధీగారిని కలిసేందుకు సమయం కోసం విపరీతంగా ప్రయత్నిస్తే కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే కేటాయించబడింది. ఆ రెండు నిమిషాల్లో ఆ పారిశ్రామికవేత్త రెండు వాక్యాలే మాట్లాడారట ! పర్యవసానంగా రాజీవగాంధీ గారు పదినిమిషాలసేపు మాట్లాడారట ! పర్యవసానంగా ఉభయ తారకంగా ఇద్దరికీ ఏదో ఒక విధంగా మంచే జరిగిందట !
ఆ రెండు వాక్యాలు ఏమై ఉండవచ్చు ? అవి మనకు అప్రస్తుతం . కానీ, లభించిన అతితక్కువ సమయాన్ని తన మాటల చాకచక్యంతో సద్వినియోగం చేసుకోవడాన్ని విశేషంగా చెప్పుకోవాలి.
ఒకసారి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో విమానంలో ప్రయాణిస్తుండగా ప్రక్కనే కూర్చున్న ఒక టాలీవుడ్ హీరోయిన్ అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే విసుగుచెందిన ఆ హీరో, తాను చాలా అలసట చెందివున్నానని విశ్రాంతి తీసుకోవాలని చెప్తూ ముఖాన్ని ప్రక్కకు తిప్పుకున్నారట !
ఒకసారి ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు విమానంలో ప్రయాణిస్తుంటే ప్రక్క సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి , "సార్ ! మీరు ఆ టెస్ట్ మ్యాచ్ లో అలా డక్ ఔట్ అయ్యారేంటి సార్ ! మీరు అలా ఆడి వుండాల్సింది కాదు !" అన్నాడట ! చూశారా ,ఈ వ్యక్తికి టెండూల్కర్ లాంటి మహోన్నత వ్యక్తితో మాట్లాడేందుకు వేరే మాటలు దొరకకపోవడం విచారకరం. భారతదేశం గర్వించదగ్గ బ్యాట్స్ మెన్ టెండూల్కర్ .క్రికెట్ చరిత్రలో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచస్థాయి లో చాటిచెప్పిన మన క్రికెటర్లలో టెండూల్కర్ ఒకరు . అలాంటి టెండూల్కర్ గారితో మాట్లాడాలనుకుంటే ఎన్ని గొప్ప విజయాలు లేవు! కాని ఆ వ్యక్తి ఒక తప్పిదం గురించి మాట్లాడి టెండూల్కర్ గారి మనసును బాధపెట్టడం అత్యంత బాధాకరం .
దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక అపూర్వ సంఘటనను ఇప్పుడు మీకు తెలియజేస్తాను .
ఆ రోజు సచిన్ టెండూల్కర్ గారు విమానంలో ప్రయాణిస్తుండగా ఆనాటి నెల్లూరు జిల్లా సబ్ కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్న, పేరు గుర్తుకు రావడం లేదు .. బహుశా శ్రీమతి రేఖారాణి..ఐ.ఎ.ఎస్ ... అనుకుంటా.. వారు కూడా ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. తనకు తానుగా పరిచయం చేసుకుని టెండూల్కర్ గారికి సమాజసేవ గురించి ఒక మంచి సలహా ఇచ్చారు. నెల్లూరు సమీపంలో ఆర్ధికంగా, సామాజికంగా, సాంసృతికంగా ఎంతో వెనుకబడివున్న ఒక గ్రామాన్ని ఎంపికచేసుకుని ఆ గ్రామ సమగ్రాభివృద్ధి కొరకు ఒక ప్రళాళికను కూడా తయారుచేశానని, అందుకు అవసరమైన యాభై కోట్ల రూపాయలను సహాయంగా అందిస్తే ఆ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, తద్వారా ఆ గ్రామ ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పి, తాను తయారు చేసిన గ్రామాభివృద్ధి ప్రళాళికను టెండూల్కర్ గారి చేతికి అందించారు.
ఆ ప్రళాళికను ఎంతో ఆసక్తిగా చదివిన టెండూల్కర్ గారు, ఆ ప్రళాళిక తనకెంతో నచ్చిందని, వచ్చే నెల రెండో వారంలో తాను ఆ గ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు. చెప్పినట్లే సబ్ కలెక్టర్ రేఖారాణి గారితో కలిసి టెండూల్కర్ గారు ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామప్రజలతో సుదీర్ఘంగా చర్చల అనంతరం, యాభై కోట్ల రూపాయల చెక్కుని అందరిముందే రేఖారాణి గారికి అందచేశారు. ఒక సంవత్సరం తరువాత మరలా ఆ గ్రామానికి వస్తానని, అప్పుడు ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తానని చెప్పి వెనుదిరిగారు .
ఆ తరువాత సంవత్సర కాలంలో సబ్ కలెక్టర్ రేఖా రాణి గారి ఆధ్వర్యంలో ఆ గ్రామాభివృద్ధి పనులు చకచకా జరిగిపోవడం, అనుకున్నట్లే ఒక ఆదర్శవంత గ్రామంగా అవతరించడం, టెండూల్కర్ గారు రావడం, ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి సంతృప్తి చెందడం, రేఖారాణి గారిని మెచ్చుకోవడం, గ్రామ ప్రజలంతా టెండూల్కర్ గారిని, రేఖారాణి గారిని కృతజ్ఞతా పూర్వకంగా సన్మానించడం ...
అన్నీ జరిగాయి ..
ఇక చివరిగా అసలు విషయానికొస్తే ,మనం ఆలోచించాల్సింది ... సబ్ కలెక్టర్ రేఖారాణిగారు ఆ రోజు విమానప్రయాణంలో టెండూల్కర్ గారితో ఎంతో గొప్పగా మాట్లాడి వుంటారు. అందుకే టెండూల్కర్ గారు తన ప్రస్తావనను వెంటనే ఆమోదించారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. స్వప్రయోజనం కోసం కాకుండా సమాజహితం కోసం ఆ అవకాశాన్ని ఉపయోగించారు.
నిజంగా రేఖారాణి గారు అభినందనీయులు ...
మన మాటలకు అంత శక్తి ఉందని మనమంతా అర్ధం చేసుకోవాలి .ఆచరించాలి ...