స్వధర్మాచరణ వైశిష్ట్యం - సి. ప్రతాప్

Swadharmacharana vaisistyam

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో (కర్మ యోగం, 35 వ శ్లోకం) ఈ విధం గా ప్రవచించారు:

 

శ్రేయాన్ స్వధర్మ విగుణ : పరధర్మాత్స్వ నుష్టితాత్

స్వధర్మ నిధనం శ్రేయ: పరధర్మో భయావహ:

 

“ ఓ అర్జునా ! ఎంతో నైపుణ్యం తో ఆచరించే పరధర్మం కన్నా , గుణరహితం గా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహాణార్ధం సమసిపోయినా మంచిదే కాని, అమరణాంత భయావహమైన పరధర్మానుష్టానం మాత్రం తగదు."

 

ఈ ప్రపం చం లో మానవులకు వారి వారి కుల, మత,ప్రాంతీయ దేశ కాలమాన పరిస్థితుల ధృష్ట్యా విధించబడిన కర్మలను చేయుట, ధర్మమును ఆచరించుట వారికే కాక యావత్ సమాజానికే ఎంతో శ్రేయస్కరం. జన్మత: ప్రాప్తించిన కర్తవ్యాలను నిర్వహించడమే స్వధర్మాచరణ.

 

మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా అర్జునుడు మాయామోహం లో పడి మనస్థాపం చెంది విల్లును క్రింద పడవైచి యుద్ధం చేయలేనని అశక్తత వెల్లడించినప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు స్వధర్మాచరణ గూర్చి అత్యద్భుతం గా బోధ చేసారు. : దేశ ప్రజల రక్షణ కోసం, అధర్మాన్ని శిక్షించేందుకు , ధర్మ పరిరక్షణ గావించేందుకు యుద్ధం చేయుట క్షత్రియ ధర్మం. ఈ ధర్మచరణ లో అసువులు బాసినప్పటికీ వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. అట్లు కాక వెన్ను చూపి పలాయనం చిత్తగిస్తే స్వధర్మాచరణ గావించని కారణం గా రౌద్రవాది నరకములు ప్రాప్తిస్తాయి. కావున నీ క్షత్రియ ధర్మమును నెరవేర్చు” అని అర్జునుడికి హితబోధ చేసి కర్తవ్యన్ముఖుడిని గావించారు. పై ఉదంతాన్ని బట్టి స్వధర్మాచరణకు తమకు విధించిన కర్తవ్య నిర్వహణకు శ్రీ కృష్ణ భగవానుడు విశిష్ట స్థానం కల్పించారు.

 

స్వధర్మమనగా మనకు విధింపబడిన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ప్రతీ ఒక్కరు సక్రమంగా నిర్వహించడం వలన వ్యక్తిగతం గానే కాక సమాజ పరం గా కూడా శ్రేయస్సు ఒనగూరుతుంది.

 

పాలకులు నిష్పక్షపాతం గా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బంధుప్రీతికి, అవినీతికి తావ్వివక నిరంతరం తావివ్వక నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే దేశం అత్యున్నతం గా పురోగమిస్తుంది. ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో , నిస్వార్ధం గా పాఠ్య బోధన గావిస్తూ విధ్యార్ధులలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు కృషి చేయాలి. మత ప్రచారకులు , గురువులు సంకుచిత బుద్ధిని విడనాడి ధర్మాధర్మముల మధ్య వ్యత్యాసాన్ని , ధర్మాచరణ యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలకు తెలియజేసే కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలి. రైతులు వ్యవసాయాన్ని,వ్యాపారులు ఎక్కువ లాభాలకు ఆశ పడక ప్రజలకు ధర్మ బద్ధంగా తక్కువ ధరలకే వస్తువులను విక్రయించడం, కార్మీకులు క్రమశిక్షణతో నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి కృషి చేయడం,పోలీసులు అవినీతికి తావ్వివక అక్రమార్కులను శిక్షించడం, శాంతి భద్రతలను కాపాడేందుకు చిత్త శుద్ధితో కృషి చేయడం –ఇలా ప్రతీ ఒక్కరు తమకు నిర్దేశింపబడిన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తిస్తే మన సమాజం లో అన్ని అసమానతలు తొలిగి పురోగమిస్తుంది.గాంధీ మహాత్ముడు కలలు గన్న రామరాజ్య స్థాపన సాధ్యం.

 

గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం

 

సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు