నేను ఉన్నప్పుడు నీవు రావు
నీవు వచ్చినప్పుడు నేను ఉండను!
శ్వాస నిశ్వాసలలో
ఒకటి నువ్వు మరొకటి నేను!
ఒకే ఇంటిలో చెరొక గదిలో ఉండి కూడా
ఎందుకీ దోబూచులాట?
అసలు నీలో నేనున్నానా? లేక నాలో నీవున్నావా?
కలసిమెలసి జీవిస్తే కనపడవెందుకు?
ఇక్కడినుండి నన్ను ఎక్కడికి తీసుకొని పోతావు?
ఆ తర్వాత నన్ను ఏం చేస్తావు?
భూమి పుట్టి ఇంతకాలమైనా ఈ రహస్యం ఎవరికీ చెప్పవెందుకని?
నాకు చెప్పకపోయినా ఫరవాలేదు
నిరంతరం నీకోసం అన్వేషిస్తున్న నీ ముద్దు బిడ్డలైన తత్వవేత్తలకు కూడా చెప్పవా?
నీ గురించి అహర్నిశలు అన్వేషించిన అందరూ
విసుగు చెంది అలసి సొలసి నీలోనే కలసి పోయారు
పోనీ, నీ గురించి మాకేమైనా అవగాహన కల్పించావా?
అదీ లేదు!
అసలు మళ్ళీ మాకు మరో రూపం కల్పిస్తావా? లేదా?
పంచ భూతాలలో లీనమైన ప్రాణుల
తదుపరి ప్రస్థానం ఎక్కడికి?
వేటికీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నావు?
మేమంటే నీకు కోపమా లేక ప్రేమా?
అదీ చెప్పవు!
అయినా....
ఇప్పుడిప్పుడే నాకు కొంత తెలుస్తుంది
జననమే మరణమని !