తెలుగువారి త్యాగయ్య - నాగయ్య - టీవీయస్. శాస్త్రి

Teluguvaari Tyagayya - Nagayya

చిత్తూరు .వి.నాగయ్య (వుప్పలదడియం నాగయ్య) తెలుగు సినీ కళామతల్లి తొలి తరం ముద్దు బిడ్డలలో అతి ముఖ్యుడు. వీరు నటుడిగా కాక--రచయిత, నిర్మాత, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు గా కూడా సుప్రసిద్ధులు. ఫిలిం ఇండియా సంపాదకులైన, శ్రీ బాబూరావు పటేల్ గారు నాగయ్య  గారిని, ‘The Paul Muni of India’ అని అభివర్ణించేవారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలలో షుమారుగా 400 పైగా సినిమాలలో, విభిన్న పాత్రలలో నటించారు. దక్షిణ భారతపు సినీపరిశ్రమ నుండి మొదటిసారిగా 'పద్మశ్రీ' సత్కారం పొందిన ఘనుడీయన. వీరు 28-03-1904న గుంటూరు జిల్లా లోని రేపల్లెలో పుట్టారు. తల్లి తండ్రులు-రామలింగ శర్మ, వెంకట లక్షమాంబ. నాగేశ్వరస్వామి వర ప్రసాదం అని భావించి, తల్లి తండ్రులు ఇతనికి నాగయ్య అనే పేరు పెట్టారు..తదుపరి వారి మేనమామ గారు ఇతనిని చిత్తూరు తీసుకొని వెళ్ళారు. చిత్తూరులోనే B.A. పట్టా పుచ్చుకున్నారు. అటు తర్వాత కొంత కాలానికి, కుప్పం, మరల అచటినుండి తిరుపతికి వీరి కుటుంబం మకాం మార్చింది. వీరి విద్యాభ్యాసానికి తిరుపతి దేవస్థానం వారు ఆర్ధిక సహాయం అందచేసారు. మొదట్లో కొంత కాలం ప్రభుత్వపు ఉద్యోగం చేసారు. తదుపరి, విలేఖరిగా 'ఆంద్ర పత్రిక' లో పనిచేశారు.1930 లో దండి సత్యాగ్రహంలో మహాత్మా గాంధి, నెహ్రూల పిలుపు మేరకు పాల్గొని, కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయనకు మొదటినుండి కళలపై మక్కువ ఎక్కువ. మొదట్లో Gramophone కంపనీలలో పనిచేశారు. ఆనాటి మేటి కర్నాటక సంగీత విద్వాంసులైన శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ జి .యెన్.బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి యం.ఎస్.సుబ్బులక్ష్మి గార్లు వీరికి సహచరులు కావటం చేత వీరిని కర్ణాటక సంగీతంలో చాలావరకు ప్రోత్సహించారు.

కాంగ్రెస్ సభలలో వీరి సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణ. శ్రీమతి కమలా నెహ్రూకి వీరి సంగీతమంటే విపరీతమైన అభిమానం. మొదటి నుండి రంగస్థల నాటకాలలో విశేష ప్రతిభ కనబరిచే వారు. సారంగధర, బృహన్నల, రామదాసు, విశ్వామిత్ర, భక్త పోతన, యోగి వేమన, త్యాగయ్య లాంటి పాత్రలను పోషించి పలువురి మన్ననలను పొందారు. సారంగధరలో స్త్రీ వేషమైన 'చిత్రాంగి' పాత్రను పోషించి బంగారు పతకాన్ని పొందారు. ఆ రోజుల్లోనే వారికి విజయలక్ష్మి అనబడే కన్యామణితో వివాహం జరిగింది. దురదృష్ట వశాత్తు, ఆమె మొదటి కాన్పులో ఒక ఆడశిశువుకు జన్మనిచ్చి మరణించింది. ఆ పసిపిల్ల సంక్షేమం కోసం మళ్ళీ గిరిజ అనే యువతిని వివాహమాడారు. అయితే, ఆవిడ కూడా ఎనిమిదవ నెల గర్భవతిగా ఉన్నప్పుడు అనారోగ్యం చేత మరణించింది. ఆ తర్వాత--- కూతురు కూడా ఒక వింత జబ్బు చేసి మరణించింది. ఈ దురదృష్ట సంఘటనలన్నీ నాగయ్య గారిని కృంగ తీయటమే కాకుండా, వైరాగ్యం వైపు మళ్ళించాయి. ఎక్కువ కాలం రమణ మహర్షి ఆశ్రమంలో కాలం గడిపేవారు. అప్పటినుండీ విరివిగా దానధర్మాలు, మానవసేవ చేయటానికి ఎక్కువ ప్రాముఖ్యం యిచ్చారు. చెన్నపురి ఆంద్రమహాసభలో జీవిత సభ్యుడిగా కొనసాగారు. ఆయనకు ముఖ్యమైన స్నేహితులు కే.వి.రెడ్డి గారు, యచ్.యం.రెడ్డి గారు మరియు బి.యన్.రెడ్డి గారు.1938 లో నాగయ్య గారిని కథానాయకుడిగా 'గృహలక్ష్మి' అనే సినిమాను బి.యన్.రెడ్డి గారు నిర్మించారు. ఆ సినిమా లో శ్రీమతి కన్నాంబ గారు ఆయన సోదరిగా నటించింది. అటుపైన, వందేమాతరం, సుమంగళి, దేవత, భక్తపోతన, స్వర్గసీమ, త్యాగయ్య ,యోగి వేమన లాంటి అనేక సినిమాలలో నటించటమే కాకుండా కొన్నిటికి దర్శకత్వ, సంగీతం లాంటి భాద్యతలు నిర్వహించటమే కాకుండా, తన పాత్రలకు తానే పాడుకునే వారు. పైన తెలిపిన సినిమాలన్నీ నిర్మాతలకు కనక వర్షాలు కురిపించాయి. ఆ రోజుల్లో ఆయనే అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర నటుడు. తమిళంలో కూడా మంచి పాత్రలు వచ్చాయి ఆయనకు. ఆ రోజుల్లోనే.బీదల పాట్లు సినిమాలో ఆయన తీసుకున్న పారితోషికం, భారత దేశ సిని చరిత్ర లోనే ఒక రికార్డు. భక్త పోతన సినిమా చూసే, ముమ్మిడివరం బాలయోగి యోగ దీక్ష పూనారని అందరూ అనుకునే వారు.1946 లో ఆయనే నిర్మాత, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా, దక్షిణ భారత దేశపు తొలి క్లాసిక్ సినిమా అయిన'త్యాగయ్య'ను నిర్మించారు. అది అద్భుతమైన విజయం సాధించటమే కాకుండా, ఎక్కువ లాభాలను కూడా తెచ్చి పెట్టింది. తమిళంలో కూడా అది పెద్ద హిట్. అప్పటినుండి నాగయ్య గారు తెలుగువారి త్యాగయ్య అయ్యారు. తిరువారూర్ లో త్యాగరాజు గారి పేరుమీద ఒక సత్రం కట్టించారు. అటు తర్వాత నిర్మించిన నా ఇల్లు, భక్త రామదాసు చిత్రాలు ఘోర పరాజయం పాలు కావటం చేత ఆయన ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు.

ఇల్లు చక్కదిద్దే ఇల్లాలు లేదు, పిల్లలు లేరు, ఒక విధం గా చెప్పాలంటే ఆయన జీవితమంతా ఒంటరి బ్రతుకే గడిపారు. అంతా దాన ధర్మాలకే ఖర్చు చేసేవారు. ఇంట్లో ఎప్పుడూ సంగీత సభలు, పండిత గోష్టులు, జరుగుతుండేవి. పీఠాదిపతులు తమ శిష్య బృందం తోటి అక్కడనే బస చేసే వారు. ఆయన మంచితనాన్ని ఆసరాగా చేసుకొని దొరికిన వారు దొరికినంత దోచుకున్నారు. ఆయనకు సొంత పిల్లలు లేనప్పటికీ, సినిమా రంగంలో అందరూ వారిని 'నాన్నగారు ' అని ప్రేమగా పిలిచే వారు. మృదు స్వభావి, ఎటువంటి దురలవాట్లు లేవు--అయినా ధనమంతా భార్యా పిల్లలవలె ఆయనను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది. ఆఖరి రోజుల్లో, సినిమా చాన్సుల కోసం కూడా నిర్మాతలను ప్రాధేయ పడ్డారట! పారితోషికం ఎంత ఇచ్చినా పరవాలేదు అనే వారట! ముందుగానే అడ్వాన్సు కూడా తీసుకునే వారట! ఈ మధ్య శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక చోట నాగయ్య గారిని గురించి మాట్లాడుతూ, నాగయ్య గారు కంట నీరు పెట్టుకొని ఇలాగా బాధ పడ్డారుట 'నాగేశ్వర రావు! నీకు నేను 30 వేల రూపాయలు ఇవ్వాలి, ఈ జన్మలో ఇచ్చుకోలేనేమో! నీతో నా'ఋణానుబంధం' కొనసాగాలని ఆ భగవంతుని నిర్ణయమేమో !'అని చెప్పారట. అనారోగ్యం పాలై హాస్పిటల్ లో బెడ్ మీద వున్నప్పుడు కూడా, చూడటానికి నిర్మాతలు ఎవరైనా వస్తే, 'మీ సినిమాలో నా కొక వేషం ఇవ్వండి, ముందు అడ్వాన్సు ఇవ్వండి చాలు' అని వారిని ప్రాధేయ పడేవారట! అలాంటి దుర్భర దారిద్ర్యంలో, 30 -12 -1973 న ఆ మహనీయుడు'స్వర్గసీమ' కేగారు. ఈ మధ్యనే మరణించిన మరో ప్రతిభావంతురాలు శ్రీమతి టీ.జీ.కమలాదేవి వీరికి స్వయానా మరదలు.

దానధర్మాలుచేయటం,భక్తి,కీర్తికాంక్ష --- ఇలాంటివే కాకుండా మరే ఇతర అలవాట్లు అయినా సరే,ఒక స్థాయికి మించితే అవి వ్యసనాలుగా మారుతాయి.ఇదే నాగయ్యగారి జీవితం మనకు నేర్పిన పాఠం.
 

ఏది ఏమైనా నాగయ్య గారు ఒక మహానటుడుగా,త్యాగయ్యగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగావున్నారు,ఉంటారు!


ఆయనకు ఘనమైన నివాళి సమర్పించుకుంటూ..........

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు