ఒక మనిషికి మరో మనిషి 'సాయం' అవసరం. ఏదో ఒక విషయంలో ఒక వ్యక్తి సాటి వ్యక్తికి సాయం చేస్తుంటాడు. అది చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు. సాయం అంటే డబ్బు సాయం మాత్రమే కాదు. "నా సెల్ బ్యాటరీ అయిపోయింది. ఒక కాల్ చేసుకోవచ్చా?" అది అడగాల్సిన అవసరం రావచ్చు. లేక "మీ ఆఫీస్ లో MBA వాళ్ళు కావాలంటే చెప్పండి సార్... మా బామ్మర్ది వున్నాడు" లాంటివి కావచ్చు.
ఇచ్చి పుచ్చుకోవడం లేకపోతే లైఫే లేదు. ఒక మనిషి మరణిస్తే... తీసుకెళ్ళడానికి నలుగురు కావాలి. 'ఆ నలుగురు' సినిమాలో అదే చెప్పడం జరిగింది.
చాలామంది సాయం చేసి ఫలితం ఆశిస్తారు. ఫలితం ఇవ్వటానికి భగవంతుడున్నాడు. నేను ఫలానా వాడికి సాయం చేశానని ఊరందరికీ చెప్పుకుంటారు కొందరు. 'గొప్ప' తెచ్చుకోవడానికి సాయం చేశాడన్న మాట!
10 సంవత్సరాల క్రితం, మా ఆర్ధిక పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో మా దగ్గర బంధువొకాయన నన్ను హైదరాబాద్ లో కలిసి... "మొన్న రాజమండ్రి వెళ్ళానురా... అమ్మకి 5 వేలు ఇచ్చొచ్చాను" అన్నాడు. "థాంక్స్ అన్నయ్య" అన్నాను. కొన్ని రోజులు తర్వాత వేరే కజిన్ నన్ను కలిసి... "ఏరా... రాజమండ్రి వెళ్ళట్లేదా? అన్నట్టు ఫలానా అన్నయ్య మీ మమ్మీకి పదివేలిచ్చాడట కదా - నాకు చెప్పాడు." అన్నాడు. నాకు అర్ధం కాక, మా అమ్మకి ఫోన్ చేసి అడిగాను. 'ఫలానా అన్నయ్య ఎంతిచ్చాడమ్మా' అని! "పాపం 5 వేలిచ్చాడమ్మా" అంది. చూశారా? నాకు చాలా బాధనిపించింది. అందరికీ చెప్పటం తప్పు ఐతే... పెంచి చెప్పటం ఇంకా తప్పు! నా దృష్టిలో 'సాయం' చేసినవాడు ఆ విషయాన్ని మర్చిపోవాలి - సాయం పొందినవాడు గుర్తించుకోవాలి. అదే మంచి 'సాయం'!