వృత్తి .. ప్రవృతి - తోట సాంబశివరావు

Vrutthi- pravrutthi


తనను , తన కుటుంబాన్ని
పోషించుకునేందుకు , చేసే పని/ఉద్యోగం ...అది వృత్తి .
చేసే పనికి /ఉద్యోగానికి ఉద్వాసన పలికి , లేదా ఆ పనిని /ఉద్యోగాన్ని చేస్తూనే , తన అభిరుచుకి తగ్గట్లు , వేరే వ్యాపకంలో మునిగి తేలుతూ , విశేషమైన ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించడం ... అది ప్రవృత్తి .
విచిత్రమేమిటంటే , చాలా సందర్భాలలో , వృత్తికి , ప్రవృత్తికి , ఏమాత్రం పొంతన ఉండదు. ఒక్కసారి మీరు నిశితంగా గమనిస్తే , మీ చుట్టూ ఉన్నవారిలోనే , అలాంటి వ్యక్తులు కొంతమందైనా , మీకు తారసపడతారు .
ఇక నా విషయానికొస్తే , నాకు తెలిసిన వాళ్లలో , బంధువుల్లో , స్నేహితుల్లో , అలాంటి విశిష్ట వ్యక్తులు లేకపోలేదు . వారి గురించి , ఇప్పుడు ముచ్చటించుకుందాం .
పాఠశాలల్లో , కళాశాలల్లో , విశ్వవిద్యాలయాల్లో , విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ , వారిని భావిభారత పౌరులుగా తీర్చి దిద్దే టీచర్లు , లెక్చరర్లు , ప్రొఫసర్లు , ఎంతోమంది , వారి వారి ఉద్యోగాలను వదిలేసి , రాజకీయాల్లో చేరి రాణిస్తూ , ప్రజాసేవలో తరిస్తున్నారు .
ఐ ఏ యస్ , ఐ పీ యస్ , లాంటి పెద్దచదువులు చదివి , సమాజంలో ఎంతో గౌరవ ప్రధమైన పదవుల్లో ఉండికూడా , ప్రజాసేవ చేయాలనే తపనతో , ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలిపెట్టి , రాజకీయాల్లో చేరి , అత్యున్నత పదవులను అధిష్టించిన వారు వున్నారు .
అలాగే , అనేకమంది డాక్టర్లు , ఇంజినీర్లు , లాయర్లు , కూడా , తమ తమ వృత్తులను విడనాడి , రాజకీయాల్లో చేరి , ప్రజాసేవ చేస్తున్నారు .
నా మిత్రుడొకరు , నిజానికి , ప్రఖ్యాత దంతవైద్య నిపుణులు . కానీ, సమాంతరంగా, రచనారంగంలో , తనదంటూ ఒక ముద్రవేసుకుని , పేరు ప్రఖ్యాతులు సంపాదించి , అనేక అవార్డులను , రివార్డులను , తన సొంతం చేసుకున్నారు . ప్రస్తుతం , తను ఒక వైద్యుడుగా కంటే , రచయితగానే అందరికీ సుపరిచితులు .
ఆ అమ్మాయి , చిన్నతనంనుండి భరతనాట్యంపై మోజు పెంచుకుని , నేర్చుకుని , ఆ నాట్యకళలో ఆరితేరింది . విదేశంలో ఉన్నత విద్యాభ్యాసాన్ని ముగించుకుని , తిరిగి స్వదేశానికి వచ్చిన తరువాత , ఏదోఒక ఉద్యోగంలో చేరకుండా , సినిమాల్లో నటించేందుకు , తనకు వచ్చిన , ప్రతి అవకాశాన్ని , అందిపుచ్చుకుని , ప్రస్తుతం , వెండితెరపై నాయకి పాత్రలలో నటిస్తూ , వెలుగులు విరజిమ్ముతూ , విరాజిల్లుతుంది .
మా ఊర్లో , ఒక రైతన్న , వ్యవసాయం చేసుకుంటూ , తీరికదొరికినప్పుడల్లా , తనకెంతో ఇష్టమైన తబలా , వాయించడం నేర్చుకున్నాడు . ఇప్పుడారైతన్న ఊరిలోగాని , చుట్టుప్రక్కల ఊళ్ళల్లో గాని , ఏ నాటకమైనా , అది సాంఘికమైనా , పౌరాణికమైనా , ఆ రైతన్న తబలా వాయించకుండా ప్రదర్శించబడదంటే , అతిశయోక్తి కాదు .
అతను హైకోర్టులో ఒక అడ్వకేట్ . కోర్టు కేసుల్లో , తన వాదనాపటిమతో , తన క్లైంటులను గెలిపిస్తూ , ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు . కానీ, తనకు చిన్నతనంనుండి శుచిగా , రుచిగా , వంటచేయడం ఇష్టం . ఆ ఇష్టంతోనే , ఇప్పటికీ , అప్పుడప్పుడు , వంట మాష్టారు అవతారం ఎత్తి , తన వంటకాలతో , భోజనప్రియులను , మిక్కిలిగా తృప్తిపరుస్తుంటారు . తదనంతరం , పురజనుల కోరికపై , ఒక రెస్టారెంటుని ప్రారంభించారు , ఆ అడ్వొకేట్ . ఇప్పుడా రెస్టారెంటు , నగరంలోనే , నంబర్ వన్ రెస్టారెంట్ .
ఇప్పుడు , నా మరో మిత్రుడి గురించి మీకు తప్పక చెప్పాలి . తను , లండన్ లో , ఉన్నత వైద్య విద్యనభ్యసించి , నగరంలో వైద్యసేవలందిస్తూ , ప్రఖ్యాత హృద్రోగనిపుణులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించాడు
. అతనికి చిన్నప్పట్నుంచి , కార్లు .. అంటే చాలా ఇష్టం . అన్నప్రాసన సమయంలో , అనేక వస్తువులు , అక్కడ పెట్టినా , ముందుగా పుస్తకం , తరవాత పెన్ను , ఆ తరవాత కారు బొమ్మను , పెట్టుకున్నాడని , వాళ్ళ పెద్దలు చెప్పగా విన్నాను .
కార్లపై , ఆ డాక్టర్ కున్న ఇష్టం , ఎంతవరకు వెళ్లిందంటే , కార్డియాలజిస్ట్ గా , గుండె ఆపరేషన్లను ఎంత సహజంగా చేస్తాడో , అంతే సహజంగా , కారు రిపేర్లను కూడా చేయగలడు . ఒక కారుని , ఏ పార్ట్ కి ఆ పార్టుని ఊడదీసి , ఒకచోట పేర్చి , ఆ పార్టులు అన్నింటిని తిరిగి , దేని స్థానంలో దాన్ని అమర్చి , కారును యధావిధిగా నడిచే స్థితికి తీసుకురాగలడు , ఆ డాక్టర్ . నగరానికి నడిబొడ్డులో వున్న పెద్దదైన సొంత ఖాళీ స్థలంలో కార్ల సర్వీసింగ్ మరియు రిపేరింగ్ సెంటర్ ని ప్రారంభించి , అనతి కాలంలోనే , బహుళ ప్రాచుర్యాన్ని పొందాడు . కార్లపై ఆ డాక్టర్ కున్న ఇష్టం , వాటి రిపేర్లలో , ఆ డాక్టర్ కున్న ప్రావీణ్యత , ఆనోటా ఈనోటా ప్రాకుతూ , ఒక పెద్ద కార్ల కంపెనీ వద్దకు చేరింది . ఆ కార్ల కంపెనీ వాళ్ళు , ఆ డాక్టర్ ని సంప్రదించి , తమ రాష్ట్రస్థాయి డిస్ట్రిబ్యూటర్షిప్ ని , ఆ డాక్టర్ కి బహుకరించారు .
నగరంలో , ఈ మధ్యనే జరిగిన , వివిధ బ్యాంకుల అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో , నేను కూడా పాల్గొనడం జరిగింది . ఆనాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో , కొంతమంది బ్యాంకు అధికారులు , వివిధ కళల్లో , తమకున్న. అనుభవంతో , ఆహూతులను , ఆద్యంతం , అలరించారు .
ఒకరు కర్ణాటక సంగీత కచేరి నిర్వహిస్తే , ఇంకొకరు ధ్వన్యనుకరణ చేశారు . మరొకరు ఇంద్రజాలం ప్రదర్శించారు . కొంతమంది వీనుల విందుగా , పాటలు పాడారు . ఆ పాటల బాణీలకు , సంగీతానికి , అనుగుణంగా , లయబద్దంగా అడుగులు వేస్తూ , నాట్యం చేశారు , మరికొందరు . విశేషమేమిటంటే , ఆ అధికారులలో , మనందరికీ సుపరిచితులైన , రచయితలున్నారు , నటులున్నారు , దర్శకులున్నారు . వందల సంఖ్యలో ప్రదర్శనలిచ్చి , ఎన్నో అవార్డులు , రివార్డులు , బిరుదులు పొందిన , కళాకారులున్నారు.
చేసింది ,చేసేది ,బ్యాంకుఉద్యోగమే ....అయినా ...వైవిధ్యభరితమైన , కళల్లో , తమకున్న అనుభవాన్ని , పరిణితిని , రంగరించి , ప్రదర్శించిన తీరు , సభికులందర్నీ , ఆనంద డోలికల్లో , ఉర్రూతలూగించింది .

ఇలా చెప్పుకుంటూపోతే , ఎన్నో ఉదంతాలు , మరెన్నో చిత్ర విచిత్రాలు.
భిన్న ధృవాల్లాంటి , వృత్తి మరియు ప్రవృత్తి , కొందరి జీవితాల్లో ఎంతగా పెనుమార్పులను సృష్టిస్తాయో ....! చూశారుగా ....!!

:::::::::::::::::::::::::

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు