యూట్యూబ్ గురించి తెలియని వారు ఎవరూ లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
సాంకేతికంగా ఏమాత్రం జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తి అయినా - తనకు తెలిసినది, తాను విన్నదీ ముందుగా యూట్యూబ్ లో పెట్టి, నలుగురికీ ముందుగా తెలియచేయాలని తాపత్రయం పడేవారే.
అలా యూట్యూబ్ లో పెట్టినదగ్గరనుంచీ, ఆ అంశాన్ని ఎంతమంది నచ్చుకున్నారో అన్న లెక్కలు చూసుకుంటూ ఆతృత తాపత్రయం పడుతూ ఉంటారు.
అలా పెట్టిన తమ అంశం నచ్చుకున్న లెక్కల ద్వారా కొంతమంది పేరు ప్రఖ్యాతలతో బాటూ, కాస్తా కూస్తా ఆదాయం సమకూర్చుకుంటున్నారు అని కూడా వింటున్నాము.
అంతవరకూ బాగానే ఉంది.
కానీ, ఈ మధ్యన యూట్యూబ్ లో వచ్చే ప్రవచనాలలో, శాస్త్రీయ/లలిత/సినీ సంగీత కార్యక్రమాలలో అర్ధం పర్ధం లేని చోట ఆ కార్యక్రమాలు ఆపి, ప్రకటనలు వస్తున్నాయి.
ఆ ప్రకటనలు రావడంలో వెనుక యూట్యూబ్ వారికి ఉన్న ఆర్ధిక వనరుల గురించి ఎవరికీ తెలియనిది కాదు, అలా వారు ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంలో ఎటువంటి అభ్యంతరం ఎవరికి లేదు, ఉండదు.
కానీ, ఆ కార్యక్రమాలు ఎక్కడ ఆపితే, అలా ప్రకటనలు వచ్చినా, చూసేవారు వినేవారూ విసుక్కోరు, అభ్యంతరం పెట్టరు అన్న ఇంగిత జ్ఞానం - యూట్యూబ్ నిర్వాహకులకు కానీ, ఆ కార్యక్రమం యూట్యూబ్ లో పెట్టేవారికి కానీ, ప్రకటనలు ఇచ్చేవారికి కానీ ఉండడం లేదు.
మంచి కుతూహలంగా సాగుతున్న ప్రవచనాలలో ఒక సన్నివేశం మధ్యలో - ఇంకా ఒక వాక్యం మధ్యలో; అదే విధంగా రసవత్తరంగా సాగుతున్న సంగీతకార్యక్రమం మధ్యలో -- అలా ప్రకటనలు వస్తే ఏమేనా బాగుంటుందా అన్నది ఎవరూ ఆలోచించడం లేదు.
రసవత్తరంగా సాగే ప్రవచనాలలో సంగీత - ముఖ్యంగా శాస్త్రీయ సంగీత - కార్యక్రమంలో అర్ధం పర్ధం లేని చోట హఠాత్తుగా ప్రకటనలు చొప్పించి ప్రసారం చేయడం వలన – చూసేవాళ్ళ, విన్నవాళ్ల సంగతి ఎలా ఉన్నా - ప్రవచనం చేస్తున్న పెద్దాయనని, అలాగే సంగీత కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులని ఎంతగా అవమానపరుస్తున్నామో గ్రహించాలి.
ప్రవచనమేనా సంగీత కార్యక్రమమేనా ఎక్కడో ఒకటి రెండు చోట్ల కాస్తంతేనా అంతరం వస్తుంది.
ప్రవచనకర్తలు సంగీత కళాకారులు అలా అంతరం వచ్చేటట్టుగా విధిగా చూసుకుంటారు - ఎందుకంటే, ఊపిరి తీసుకొని, కాసింత సర్దుకొని, గొంతుక సవరించుకొని కార్యక్రమం పునః ప్రారంభించడం అవసరం అని వారికి తెలుసు.
అలా అంతరం, వెసులుబాటు దొరకదేమో అని తెలియనదల్లా యూట్యూబ్ నిర్వాహకులకే.
అందుకే కాబోలు, వారు అలా అసభ్యంగా అసహ్యంగా వ్యవహరిస్తున్నారు, వ్యవహరిస్తుంటారు.
నా ఈ ఆవేదన వారికి చేరి మంచి మార్పు వస్తుందని ఆశించడం తప్ప - ప్రస్తుతానికి చేయగలిగేది ఏమీ లేదు.
*****