పొదుపు -అనే పదం వినగానే ,ముఖం చిట్లిస్తారు కొందరు . పొదుపు చేసేవా- డు ,వట్టి పిసినారివాడని కొందరి అభిప్రాయం . అవసరం వచ్చేవరకూ పొదుపు విలువ తెలియక ఆతర్వాత ఇబ్బందిపడేవారు ,బాధపడేవారూ చాలా మంది . జీవితంలో కొన్ని అనుభవాలు స్వయంగా చూస్తేతప్ప మన జీవితంలోపొదుపు గురించి సీరియస్ గా ఆలోచించే పరిస్థితి ఎదురుకాక పోవచ్చు . ఒకరి జీవితం ద్వారా మన జీవితం ఆనందమయం చేసుకోవడానికి పొదుపు ఒక చక్కని అవసరం . తినడం మాని డబ్బు దాచుకోవడం పొదుపు అనిపించుకోదు . మనం కనీస జీవితం గడుపుతూ దానికి సరిపడా సొమ్ము ఉపయోగించుకుని మిగిలిన ఎంత తక్కువ సొమ్మునైనా ఆదా చేయగలగడం పొదుపు అవుతుంది దీనికి భిన్నంగా ఏమి జరిగినా అది పిసినారి తనం అవుతుంది . ఒక ఉద్యోగి ,లేదా ఒక వ్యాపారి ,తన సంపాదనలో ,కుటుంబం కనీస జీవనాని కి ,అయ్యే కనీస ఖర్చులు పోగా ప్రతినెలా కొంత సొమ్మైనా రాబోయే భవిష్యత్ జీవితానికి ఆదా చేసుకోవాలి . అలా ముందు చూపు లేకుండా ,వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటే ,భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద పెద్ద అవసరాలు వచ్చినప్పుడు పరిస్థితి ప్రశ్నార్ధకం అవుతుంది . అలాంటప్పుడు దిక్కుతోచని పరిస్థితి . అప్పులు చేయడానికి అది రహదారి ఏర్పరుస్తుంది . అప్పు అనేది మనిషిని ఎంత అదః పాతాళానికి లాక్కుపోతుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది . పొదుపు అనేది సాధారణ గృహిణి నుండి కూడా నేర్చుకోవచ్చు . తాను ఖర్చు పెట్టగా మిగిలిన సొమ్ము అది ఎంత చిన్న మొత్తం అయినా పోపుల డబ్బా లోనో మరెక్కడో దాచి పెడుతుంది . అత్యవసరానికి అది ఎంతో ఉపయోగపడు తుంది . అలా కాకుండా ,బ్యాంకు లోనో ,పోస్ట్ ఆఫీసులోనో రీకరింగ్ డిపాజిట్ అకౌంట్ ప్రారంభించి ,ఎంత తక్కువ సొమ్ము అయినా ,నెలకు కొంత డిపాజిట్ చేయడం వల్ల ,సంవత్సరానికి కొద్దీ పెద్ద మొత్తం మనకు లభిస్తుంది . ఇలాంటివి వారి వారి స్థాయిని బట్టి నెలకు ఎంత మొత్తం పొదుపు చేయాలన్న అంశం నిర్ణయించుకోవాలి . వారి వారి సామర్ధ్యాన్ని బట్టి ఆ .. నిర్ణయం అమలు కావాలి . వచ్చింది వచ్చినట్టు తినేయడం ,తర్వాత పిల్లలు పుట్టి డబ్బు అవసరాలు పెరిగినప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడడం అది మన అసమర్ధతకు తార్కాణం . ఒక ప్రధాన ప్రభుత్వ కార్యాలయంలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరి పదవీ విరమణ నాటికి రెండు ప్రమోషన్లు పొందిన ఒక కుటుంబరావు ,ఒక మామూలు ఇంట్లో అద్దెకు ఉండేవాడు . కూతురికి పెళ్లి చేయవలసి వచ్చి కాస్త పెద్ద అద్దె ఇల్లు కోసం గాలించడం మొదలుపెట్టాడు . ఆశ్రమంలో నాకు అతను ఎదురైనప్పుడు విషయం తెలుసుకుని – ‘’ రిటైర్ అయ్యావు కదా !చిన్న ఇల్లు కూడా కట్టుకోలేదా ?’’ అన్నాను ఆశ్చర్యంగా . ‘’ లేదు ,సార్ ,నేను ఎప్పుడూ లంచాలు తీసుకోలేదు ,అందుకే ఇల్లు కట్టలేక పోయాను ‘’ అన్నాడు . అతని సమాధానం నన్ను అబ్బుర పరిచింది . అంటే ఇల్లు కట్టుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లంచాలతోనే ఇల్లు కట్టుకున్నట్టా ?ఈ రోజున గృహ నిర్మాణం కోసం ,ఉద్యోగులకు ,బ్యాంకులు ,ఇన్సూరెన్స్ కంపెనీలూ ,జీతం పూచీకత్తుగా అప్పులు ఇస్తున్నాయి . పదవీ విరమణ చేసే లోపు అప్పు తీర్చేయగల వెసులుబాటు కలిగిస్తున్నారు . అలాంటప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగి తనకోసం కనీస వసతి ఏర్పరచుకోలేకపోవడం తప్పు కాదా ?ఇలాంటి సందర్భాలలో ‘ పొదుపు ‘ అనే పదం ,తప్పక గుర్తుకు వచ్చి తీరాలి . నా జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వెలుగు చూడబోయాయి . కానీ ముందుగానే నాకు ఇలాంటి విషయాల్లో అవగాహన ఉండడం మూలాన నేను ముందస్తు జాగ్రత్తల కు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చేది . నా బంధువులలో ఒక కుటుంబంలో భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగులైనప్పటికీ ,పదవ తేదీకల్లా అప్పుల కోసం తిరగడం నేను కళ్లారా చూసాను . అప్పటికి నా చదువు పూర్తికాలేదు ,పెళ్ళికాలేదు . అయినా ‘’ అలంటి అప్పుల జీవితం నాకు – నాకు రాకూడదు ‘’ అని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను . అది నేను ఉద్యోగస్తుడినైన తర్వాత తూ . చ ,తప్పకుండా చేయడానికి ప్రయత్నంచేశాను ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఇంటావిడ సహకారం చాలా అవసరం . ఆ సహకారం నాకు నూటికి నూరుపాళ్లు నా శ్రీమతి నుండి లభించడం మూలాన నేను కొన్ని చేయగలిగాను . అటువంటి పొదుపు పథకాలలో నేనుఎన్నుకు– న్నవి –పి . పి . ఎఫ్,అకౌంట్ (పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ -పోస్టల్ ) ఈ అకౌం ట్ ,బ్యాంకు ముఖ్యబ్రాంచిలలోకూడా తెరవవచ్చు . నెలకు 50/-తో ప్రారంభిం చవచ్చు . సంవత్సరానికి ,లక్షా యాభై వేలు వరకూ డిపాజిట్ చేయవచ్చు . దీని మీద వచ్చే సంవత్సరాంతర వడ్డీ మొత్తం ఆదాయపు పన్నునుండి మినహాయింపు దొరుకుతుంది . సంవత్సరానికి కట్టిన మొత్తం సొమ్ము 80-సి సెక్షన్ కింద మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది . అందువల్ల ఉద్యోగులకు ఈ పొదుపు పథకం ఉపయోగానికి వస్తుంది . లేదంటే దీని లాక్ పిరియడ్ 15 సంవత్సరాలు . ఈ పథకాన్ని నేను సర్వీసులో ఉన్నంత కాలం వినియోగించు కున్నాను . తర్వాత పోస్టల్ జీవిత భీమా పథకం ,రికారెన్సు డిపోసిట్ -బ్యాంకు /పోస్టల్ ఇందిరా వికాస పత్ర ,ఫిక్సడ్ డిపోసిట్ పథకాలు ఎన్నుకుని నేను అధికంగా ప్రయోజనం పొందాను . నా సాధారణ దినసరి జీవితానికి సరిపడ సొమ్ము వినియోగించగా మిగిలిన సొమ్ము ఇలా పొదుపు చేసుకునేవాడిని . డెంటల్ - చైర్ ,టి . వి ,రెఫ్రిజిరేటర్ ,వంటివి బ్యాంకు లోన్ ద్వారా కొనుక్కున్నవే !మొత్తం జీతం నుండి చెల్లించేవాడిని . ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి . నా తోడల్లుడు ‘ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లో వివిధ హోదాలలో పనిచేశాడు . ఆయన ఎప్పుడూ పొదుపు గురించి,తద్వా రా డబ్బు సంపాదించడం గురించి ,ముఖ్యంగా మ్యుట్యుయల్ ఫండ్స్ గురించి చెబుతుండేవారు . కానీ నేను అసలు శ్రద్ధ పెట్టేవాడిని కాదు . అయినా ఆయన వాటి గురించి చెప్పడం మానలేదు,నేను శ్రద్దగా విన్నదీ లేదు . కానీ నా శ్రీమతి బ్యాంకు ఉద్యోగిని కావడం మూలాన ,ఎవరి ద్వారానో తెలుసుకుని నాకు తెలియకుండా మ్యుట్యుయల్ ఫండ్స్ లో డబ్బు పెట్టడం ప్రారంభించి మంచి ఫలితాలు రాబట్టింది . అది తెలుసుకునేవరకూ నేను వాటిమీద శ్రద్ధ పెట్ట లేదు . సామాన్యుడికి వుండే అనుమానాలూ /భయాలూ నాకూ ఉండేవి . అందుచేత వాటికి దూరంగా వున్నాను . తర్వాత జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునన్న జ్ఞానోదయం కలిగింది . అందుచేత నేను కూడా ఒక ఏజెంట్ సహః కారంతో చిన్న చిన్న మొత్తాలు ఫండ్స్ లో పెట్టి అధిక వడ్డీ రేట్లు పొందగలిగాను . ఇప్పుడు మా ఇద్దరితో పాటు నా పిల్లలు కూడా మ్యుట్యుయల్ ఫండ్స్ మార్గం ఎంచుకున్నారు . మంచి ఫలితాలు సాధిస్తున్నారు . ఇదంతా నా గొప్ప చెప్పుకోవడానికి కాదు . జీవితంలో అడుగుపెట్టబోతున్న యువతీ యువకులను అప్రమత్తం చేయడానికీ ,వారి భవిష్యత్ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఈ నా కొద్దీ అనుభవాలూ కొందరికైనా కొంత వరకూ ఉపయోగ పడతాయన్నది నా ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం . మన బ్రతుకు ,మన ఆనందం ,మన ఉత్సాహం /ఉల్లాసం ,అంతా మన చేతిలోనే వుంది . చిన్నమొత్తాలలో అధిక రాబడులు సాధించే అవకాశలకోసం ఎదురు చూడాలిగానీ ,లంచాలు సంపాదించగల ఉద్యోగాల కోసం కాదు . అందుచేత సుఖసంతోషాలతో జీవితం గడపడానికి ,పిల్లల బంగారుబావిష్యత్తు కు బాటవేయడానికి ,’పొదుపు ‘ తప్పని సరి . అలా జీవితాంతం గుర్తుంచుకోవ ల్సిన పదం పొదుపు . ***