ఇరుకు జీవితాలు - భమిడిపాటి ఫణిబాబు

iruku jeevithalu

ఒకానొకప్పుడు అంటే ఏదో ఎన్నో యుగాలక్రితం అని కాదు, ఇరవయ్యో శతాబ్దపు చివరి రోజులదాకా, మన జీవితాలూ, వేషభాషలూ ఎంతో విశాలంగా ఉండేవి. కాని కాలక్రమేణా అన్నీ "ఇరుకు" అయిపోయాయి. అలాగని ఎప్పుడూ సాంప్రదాయసిధ్ధంగానే ఉండాలనీ కాదు. కొద్దిగా Moving space, breathing space లాటివాటిక్కూడా మొహం వాచిపోయి ఉన్నాము. ప్రతీ విషయంలోనూ ఇరుకే.

ఇదివరకటి రోజుల్లో  పెళ్ళిళ్ళల్లో వంట చేయడానికి, "గాడిపొయ్య" లని తవ్వేవారు. వంటమనుషులు వచ్చి, పెద్ద పెద్ద గంగాళాల్లో హాయిగా వంటలు వండేసేవారు. మరి ఇప్పుడో, వంటలు చేయడానికి ఓ స్టవ్వూ, దానికి ఓ రెండు మూడు సిలిండర్లూ. అలాగే ఇళ్ళల్లోకి కూడా గ్యాసు పొయ్యిలూ, ఆ గ్యాసు కూడా వచ్చేదెక్కడినుంచీ, ఓ "ఇరుకు" రబ్బరు గొట్టం లోంచి. నగరాల్లో కొన్ని కొన్ని సొసైటీల్లో అయితే అదేదో Piped gas అని ఒకటి మొదలెట్టారు.

ఇంక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అక్కడుండే పరిస్థితి ఏమిటీ? అగ్గిపెట్టెల్లాగ, ఓ క్యాబినూ, దాంట్లో ఓ రెండో మూడో కంప్యూటర్లూ, ఓ ఆడా మగా మెళ్ళో ఓ తాడేసికుని, దానిమీదో పేరూ, రోజంతా ఆ కంప్యూటరులోకి చూస్తూ, బోరుకొట్టినప్పుడో, ఇంకోప్పుడో పక్కనుండే వాళ్ళ మొహం చూడ్డమూ. సాయంత్రం అదృష్టం బాగుండి, ఆ మానేజరో, టీం లీడరో ఎవరో మళ్ళీ ఏదో గుర్తొచ్చి పిలవకుండా ఉంటే, కంపెనీ బస్సులోనో స్వంత బైక్కో, కారులోనో ఆపసొపాలు పడుతూ, 'ఇరుకు' గా ఉండే రోడ్లమీద ప్రయాణం చేసి, 'ఇరుకు' గా ఉండే కొంపకి చేరడం. మరి ఇలాటి పరిస్థితుల్లో, ఏదో అమ్మా నాన్నలు పెట్టిన పేరులో తప్ప జీవితంలో విశాలం' ఎక్కడుంటుందీ?

ఇదివరకటి రోజుల్లో, స్కూళ్ళల్లో ఎలా ఉండేది? క్లాసు రూమ్ములు విశాలంగా, ఆడుకునే గ్రౌండులు విశాలంగా, కానీ ఈరోజుల్లో పుట్టగొడుగుల్లా సందుకో స్కూలూ, ఇంక ఆడుకోడానికి గ్రౌండ్లూ అవీ ఎక్కడా? ఒక్కో క్లాసుకీ ఓ నలభైమంది పిల్లలూ. స్కూళ్ళమాట దేవుడెరుగు, కాలేజీలు మాత్రం ఏం ఉధ్ధరించాయిట? ఎక్కడ పడితే అక్కడ ఓ ఇంజనీరింగు కాలేజీ, ఓ మెడికల్ కాలేజీనూ. ప్రస్థుతం "విద్య" అనేది ఓ లాభసాటి వ్యాపారం. అందులో పెట్టుబడి పెట్టకలిగితే చాలు, అయిదారు తరాలదాకా వెళ్ళిపోతుంది. అందుకే దేశంలోని రాజకీయనాయకులందరికీ ఇదే యావ. ఓ ఇంజనీరింగు కాలేజీ పెట్టాలంటే రాజకీయ పలుకుబడి ఉంటే చాలు. ఆఖరికి ఏ ట్యూషన్ కో వెళ్ళవలసి వచ్చినా( ఊరికే చెప్పేవారు!)అక్కడ మాస్టారింట్లో, అరుగు మీదే చెప్పేవారు. ఇప్పుడు ఊరికే చెప్పేమాస్టర్లూ లేరూ, అరుగులూ లేవూ. ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసేసికుని, దాంట్లోనే  కోచింగు క్లాసులూ, అక్కడే ఓ వరండాలో ఓ లాబొరేటరీ.

ఇంక ఇళ్ళ సంగతి అడక్కండి, ఎక్కడ చూసినా apartment culture, అదికూడా, సింగిల్ బెడ్ రూమ్మో,డబల్ బెడ్ రూమ్మో, మహా అయితే ఇంకో రూమ్ము. అన్నీ దాంట్లోనే. అంతదాకా ఎందుకూ ఉతికి ఆరేసిన బట్టలు ఎండబెట్టుకోవాలంటే స్థలం కనిపించదు. గాలీ, వెల్తురూ లేకుండా మగ్గిపోవడమే. చెయ్యిచాపితే ఏ గోడకో కొట్టుకునేటట్లు బాత్ రూమ్మూ, గాలీ, వెలుతురూ తగలని టాయిలెట్లూ, మనం త్రాగే, వాడకానికి ఉపయోగించే నీళ్ళు కూడా ఓ 'ఇరుకు' అయిన పైప్పులలోంచే వస్తాయి! కార్పొరేషను/మ్యునిసిపాలిటీ వాడు నీళ్ళొదలలేదంటే, ఆరోజుకి స్నానం పానం బంధ్. పైగా వీటికి 'రక్షిత మంచినీటి పథకం' అని పేరోటీ.

ఈ రోజుల్లో ఇల్లనండి, వేసికునే వేషం అనండి, తినే తిండి అనండి, పెట్టుకునే బొట్టనండి, ఏది తీసికున్నా సరే, ఎంత చిన్నదిగా (ఇరుగ్గా) ఉంటే అంత గొప్ప! ఈ రోజుల్లో ఎక్కడచూసినా " మినీ" లూ, "మిడీ" లే. ఎంత తక్కువుంటే అంత బాగుంటుందిట! సినిమాల్లో హీరోయిన్లని చూడండి, ఎంత తక్కువ వేషం వేసికుంటే అంతగా పాప్యులర్ అయిపోతారు. పైగా చూసే ప్రతీవాడూ కూడా, 'అబ్బ ఎంత 'cute' గా ఉందో అనే పొగడ్తోటీ! దానితో మన ప్రవర్తనా, వ్యక్తిత్వమూ, అన్నీకూడా 'ఇరుకు' అయిపోయాయి.

ఇదివరకటి రోజుల్లో కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగా ఉండేదనేవారు. ఇప్పుడో, భార్యా, ఐతే గియితే  ఒకళ్ళో ఇద్దరో పిల్లలూ, వీళ్ళని పెంచి పెద్దచేసేటప్పటికే తల ప్రాణం తోక్కి వస్తోంది. ఇంక, పిల్లలు కూడా తమ కుటుంబం అంటే, మమ్మీ డాడీ యే అనుకుంటారు. తాతలూ, అమ్మమ్మలూ, నానమ్మలూ 'also ran' కోవలోకే వస్తారుకానీ, 'integral part of the family' లోకి రారు. అప్పుడెప్పుడో ఓ కథ చదివాను, మీ ఫామిలీ ఫొటో తీసికుని రమ్మంటే, ఆ పిల్ల తనూ, అమ్మా నాన్నా, ఉంటే గింటే తమ్ముడూ ఉన్న ఫొటో తెస్తుంది. అదేమిటీ, మీ grandparents లేరేమిటీ అంటే, వాళ్ళు ఫామిలీ కాదుకదా అంటుంది. అదండి సంగతి, ఇదివరకటి రోజులకీ, ప్రస్తుతపు రోజులకీ, స్పష్టంగా కనిపించేదేమిటంటే - moving space - ఎక్కడ చూసినా ఇరుకే. ఇదివరకటి రోజుల్లో మనం ఉండే ఇళ్ళు ఎలాగుండేవి? అది ఓ భవనమైనా సరే, ఓ పూరిపాకైనా సరే. మండువా ఇళ్ళూ, ప్రతీ కార్యక్రమానికీ, అంటే భోజనానికీ, వంటకీ, పురుళ్ళకీ, చివరాఖరికి ఇంట్లో ఆడవారు 'బైట' ఉన్నప్పుడు, వారు విడిగా, ఎవరినీ తగలకుండా ఉండేటట్టుగా ఉండడానికి సైతం, ఓ గది విడిగా ఉండేది. ఇంటి పెద్ద ఏ వకీలో అయితే, పార్టీలతో మాట్లాడడానికి ఓ 'కచేరీ సావిడి' అనేదొకటుండేది. అంతదాకా ఎందుకూ, ఓ మరుగు దొడ్డి ఉండేదా, అదికూడా ఓపెన్ గానే ఉండేది (ఓ తలుపూ, గడియా ఉండేవనుకోండి), ఊరగాయలకి ఓ గదీ, మామిడికాయలు పండబెట్టుకోడానికో గదీ, ధాన్యం ఉంచడానికి ఓ గాదె. కొబ్బరికాయలుంచుకోడానికి, పాత ఇత్తడి సామాన్లుంచుకోడానికీ ఓ అటకా. అలా ఆర్ధిక పరిస్థితి బాగా ఉండేవాళ్ళిళ్ళు విశాలంగా, ఓ మండువా సహితంగా ఉండేవి. ఆఖరికి మనం త్రాగే  నీళ్ళకి కూడా ఓ బావి(నుయ్యి) ఉండేది. అందువలనేమో ఆ ఇంటివాళ్ళ హృదయాలుకూడా అంత విశాలంగానూ ఉండేవి. దానితో, ఊళ్ళో ఉండే ప్రతీవారూ ప్రేమాభిమానాలతో ఉండేవారనుకుంటాను. వసుధైక కుటుంబం అనే మాట, ఆరోజుల్లో వినబడేది, పుస్తకాల్లో చదవబడేది. ఇప్పుడో 'వసుధా' లేదూ, 'కుటుంబం' లేదూ !! వసుధంతా SEZ ల పాలయింది, కుటుంబం 'Nuclear' అయిపోయింది.

పోనీ ఏ శలవురోజో బయటకు వెళ్దామా అంటే, రోడ్డులు ఇరుకు, ఫుట్ పాత్లు ఇరుకు, హొటళ్ళు ఇరుకు, చివరాఖరికి ఇలాటి వాతావరణం లో పెరిగి, మన గుండె నుండి రక్తాన్ని మిగిలిన భాగాలకి తీసికెళ్ళే 'Artieries' కూడా ఇరుకైపోయి, ఏవేవో రోగాలూ రొచ్చులూ వచ్చేసి, ఎప్పుడు టపా కట్టేస్తామో తెలియని పరిస్థితి!;

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు