భగవాన్ శ్రీ రమణ మహర్షి (మూడవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో భగవతే శ్రీ రమణాయ.

(రెండవ సంచిక తరువాయి)

గణపతిముని, భగవాన్ కలయిక
గణపతిముని గారు ప్రఖ్యాత సంస్కృత కవి, కావ్యకంఠ బిరుదాంకితులు. గొప్ప శివభక్తులు. 1903లో శివుని గురించి తపస్సు చేయటానికి "తిరువణ్ణామలై" వెళ్ళారు. గణపతిమునిగారే తమకు గురువులు "శ్రీ రమణులే" అని వారిని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానం పొందారు. గురుదక్షిణ సూచికంగా గురువుకే పేరునిచ్చారు. "సద్గురువు తెలియబడేది సచ్చిష్యుని చేతనే". భగవాన్, గణపతి ముని విషయంలో ఇది నిజమైంది. అప్పటి వరకు శ్రీ భగవాన్ ని వారి కుల ప్రాతిపదిక మీద "బ్రాహ్మణస్వామి" అని పిలిచేవారు. గణపతిముని, భగవాన్ ని అలా పిలవ వద్దని, అన్ని కులాలను ఏర్పరచి కులాతీతుడైన భగవంతుడే గురువని, సత్యదృష్ట కావుటచే  "మహర్షి" అని, శ్రీ అనగా శక్తి పూర్ణులని, ఈ కారణములచేత వారి పేరు ఇకనుంచి "శ్రీ రమణ మహర్షి" అని నిర్దేశించారు. గణపతిముని, శ్రీ భగవాన్ కి ఆదిశంకరుల జ్ఞానము, రామానుజుల హృదయము, శ్రీ మధ్వాచార్యుల తార్కిక జ్ఞానము కలవని తెలిపారు. ఇలా గణపతి, రమణుల కలయికతో ప్రపంచమతా ఆధ్యాత్మిక తత్వమును వ్యాపింపచేసారు.

భగవాన్ విరూపక్ష గుహలో ఉండగా, గణపతిమునిగారు "తపస్సంటే ఏమిటి?"  అని అడిగారు.

భగవాన్ సమాధానంగా "మంత్రం జపించేప్పుడు ఆ మంత్రం ఎక్కడినుండి వస్తుందో గమనిస్తుంటే, ఆ మూలస్థానములో  మనస్సు లీనమైపోతుంది. అదే తపస్సంటే." అని చెప్పారు.

గణపతిముని 1908 సంవత్సరంలో మద్రాసుకు సమీపంలోని విఘ్నేశ్వరాలయంలో 18రోజులు తీవ్రమైన తపస్సు చేశారు. 18వ రోజున ఆయన మేల్కొని  ఉండగానే, మహర్షి మూర్తి వచ్చి తన పక్కన కూర్చున్నట్టు చూశారు.(భగవాన్ తిరువణ్ణామలై వచ్చినప్పటినుంచీ ఎక్కడికీ వెళ్ళనే లేదు.)

చాలా రోజుల తర్వత గణపతిముని, భగవాన్ కి ఈ సంఘటన గురించి చెప్పగా, భగవాన్ ఇలా అన్నారు."ఎన్నో సంవత్సరాలా క్రితం ఒకరోజు నేను పడుకొని ఉండగా ఉన్నట్టుండి నా దేహం పైపైకి లేచిపోతున్నట్టనిపించింది. నా చుట్టూ ఉన్నవన్నీ మాయమైపోయాయి. నా చుట్టూ కేవలం వెలుగు తప్ప ఇంకేమీ లేదు. మళ్ళీ క్రమేపీ దేహం క్రిందకి దిగింది. అన్నీ కనపడ్డాయి. "సిద్ధులు ఈ విధంగానే ప్రత్యక్షమౌతూంటారు కాబోలు" అనుకున్నాను. ఒకరోజు రోడ్డుమీద వెళ్తూండగా కొంతదూరంలో ఒక గణేశాలయం కనబడింది. లోపలికెళ్ళాను. ఏదో మాట్లాడాను. కాని ఏం మాట్లాడానో, ఇంకా ఏం చేశానో మాత్రం గుర్తు లేవు. ఆ స్థితిలో మెలకువ వచ్చింది. విరూపక్ష గుహలో ఉన్నానని గ్రహించాను. పళని స్వామికి ఈ సంఘటన గురించి చెప్పాను."

గణపతిమునికి కుండలినీశక్తి లేచినప్పుడు, భరించలేని తాపాన్ని అనుభవించేవాడు. శ్రీ భగవాన్ తనని తాకితే ఆ బాధ తీరుతుందని అనుకున్నారు. గణపతిముని, భగవాన్ ప్రక్కన కూర్చుని, వారి చేయిని తన తలపై పెట్టుకొని అశీర్వదించమని కోరారు. భగవాన్ కొంతసేపు మౌనంగా, తర్వాత "త్వరలోనే బాగైపోతారు." అని వెళ్ళిపోయారు. గణపతిమునికి వెంటనే ఉపశమనం కలిగింది. శ్రీ భగవాన్ స్కందాశ్రమానికి తిరిగి వెళ్తూ "ఆయనైతే నాకు చెప్పుకున్నారు. నేనెవరికి చెప్పుకోగలను?" అన్నారు. మీకు కూడా అటువంటి అనుభవమే అయిందా అని ఒక భక్తుడు అడిగితే, శ్రీ భగవాన్ మందహాసంతో "హు!హు!" అనేసి ఊరుకొన్నారు.

ఉమా సహస్రంలో 700 శ్లోకాలు పూర్తి చేసిన తర్వాత, మిగిలిన వాటిని కూడా పూర్తి చేసి గ్రంధాన్ని అమ్మవారికి, అరుణాచలేశ్వరాలయంలో సమర్పిస్తామని గణపతిముని ప్రకటించారు.ఇంకా 300శ్లోకాలు పూర్తి చేయాల్సి ఉంది. కృతి సమర్పణ వాయిదా వేసుకుంటార అని భగవాన్ అడిగితే, పని ఆరోజే పూర్తవుతుందని గణపతిముని చెప్పారు. మహర్షి మౌనంగా ధ్యానంలో కూర్చుని ఉన్నారు. గణపతిముని గళము నుండి శ్లోకాలు ఒక ప్రవాహంలా వస్తున్నాయి. శిష్యులు వ్రాసుకుంటున్నారు. పని పూర్తయింది. అప్పుడు శ్రీ భగవాన్ చెప్పినదంతా వ్రాసుకున్నారా" అనడిగారట. గణపతిముని కృతజ్ఞతతో "నన్ను శ్రీ భగవాన్ ప్రేరేపించి చెప్పినదంతా వ్రాసుకోవటమయింది." అన్నారు. ఈ గ్రంధంలో మొదటి 700 శ్లోకాలను గణపతి ముని గారు  6 సార్లు మార్చినా , ఆఖరి 300 శ్లోకాలను ,ఎప్పుడు ,ఏవిధంగాను మార్చ లేదు.

డా. కె.ఎస్. గారి(హైదరబాదులోని శ్రీరమణ కేంద్ర స్థాపకులు) నాన్నగారు భగవాన్ ని ఇలా అడిగారు. "ఇంతమంది సాధువులున్నారు కదా వారిలో అసలైన సాధువు ఎవరో ఎలా తెలుసుకోవాలి?" సమధానంగా శ్రీ భగవాన్ "నీ ప్రయత్నమంటూ ఏమీ లేకుండా ఎవరి వద్ద నీకు వర్ణించలేని ప్రశాంతత లభిస్తుందో, వారే అసలైన సాధువు" అని చెప్పారు.

ఒకరోజు అనుకోకుండా ఆశ్రమానికి భక్తులు ఎక్కువగా వచ్చారు. వంటతను భగవాన్ దగ్గరికి వెళ్ళి, "సరిపోయినంత ఆహారం లేదని మాకందరికీ ఆందోళనగా వుంది" అని చెప్పారుట. ఏమీ ఆందోళన చెందకండి, అందరికీ సరిపోతుంది"అని శ్రీ భగవాన్ చెప్పి, భోజనం ప్రారంభించే ముందు శ్రీ భగవాన్ ప్రతి ఒక్కరి వంకా చూశారు  భోజనం ప్రారంభించక ముందే చాలా మందికి ఆకలి తీరిపోయింది. కడుపు నిండిపోయింది. అలా వండిన వంట ఎక్కువ కూడా అయ్యింది.

(తరువాయి భాగం వచ్చే సంచికలో...)

భగవాన్ శ్రీ రమణ మహర్షి (మొదటి భాగం)
భగవాన్ శ్రీ రమణ మహర్షి (రెండవభాగం)


శ్రీ రమణార్పణమస్తు

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి