విశాఖ ఉక్కు--ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళటమే కాకుండా విశాఖపట్టణానికి ఆ ఆధునిక కర్మాగారం రావటానికి కృషి చేసిన మహానుభావుడు శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు.ఈ మహనీయుడు 1895 లో విశాఖజిల్లాలోని లక్కవరం అనే గ్రామంలో జన్మించారు.మహాత్మాగాంధీ గారి పిలుపునందుకొని వీరు ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వం వారి చేత కారాగార శిక్షను అనుభవించారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 1937 లో శాసన సభ్యునిగా మొదటిసారి ఎన్నికయ్యారు.1951 దాకా మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా పనిచేసారు. విశాఖపట్టణం నుండి నాలుగవ లోక్ సభ ఎన్నికలలో పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికయ్యారు.వారి రాజకీయ గురువైన పీ.సి.వెంకటపతిరాజు గారి ప్రోత్సాహం వల్ల రాజకీయాలలో ప్రవేశించారు.అలాకాక పోయినట్లయితే, వీరు గొప్ప సాహితీ వేత్తయ్యేవారు.శ్రీశ్రీ,శ్రీరంగం నారాయణబాబు గారి లాగా మరొక సాహితీ సూర్యుడు విశాఖలో ఉదయించేవాడు. ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో వీరు మంత్రిగా కూడా పనిచేసారు.ఆంద్ర జాతిరత్నం అయిన ఈ మహనీయుడు,ఆదర్శవంతుడు,నిస్వార్ధ సేవకుడు,సద్గుణ సంపన్నుడు--వీటన్నిటినీ మించి సంస్కారవంతమైన దేశ భక్తుడు. ప్రకాశం గారికి ముఖ్య అనుచరుడు.మరొక నిస్వార్ధ సేవకుడైన శ్రీ వావిలాలగారికి సన్నిహితుడు.
చాలామందికి ఆయన రాజకీయనాయకుడనే తెలుసు,వారు సంస్కృత ,ఆంద్ర భాషలలో మంచి ప్రావీణ్యమున్న పండితులు.అనేక గ్రంధాలను వ్రాసారు. 'బ్రహ్మసూత్రాలకు' వ్యాఖ్యానం వ్రాసిన జ్ఞాని ఆయన."సిమిలీస్ అండ్ రొమాంటిక్ కంటెంట్ అఫ్ ఋగ్వేద"అనే వీరు వ్రాసిన గ్రంధం పలువురి పండితుల మన్ననలను పొందింది.వారు బహుభాషావేత్తే కాకుండా అనేక భాషలలోప్రవేశం,ప్రవీణం ఉన్నవారు కూడా! ఆయన ఒక నడిచే విజ్ఞాన సర్వస్వం.ఏ విషయాన్ని గురించి అయినా అనర్గళంగా చక్కని భాషలో,భావంతో చెప్పగల దిట్ట.పార్లమెంట్ మెంబర్ గా వీరు అనేక ప్రజా సమస్యలను చర్చించారు.మంచి ఛలోక్తులతో రసవత్తరంగా ఉండేవి వీరి ప్రసంగాలు.ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం వీరు ప్రకాశం గారితో కలసి పోరాటం చేసారు.
ప్రకాశం గారికి సన్నిహితులే కాదు, సలహాదారులు కూడా ఈయన. అయితే, కొన్ని విషయలాలో విబేధించేవారు కూడా! ఢిల్లీ ఆంద్ర సంఘం వారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని ఒకసారి ఘనంగా సత్కరించారు. ఆ సందర్భములో వారు ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు కూడా సన్మాన సభలో పాల్గొన్నారు. సభ ముగిసిన తదుపరి, విశ్వనాధ వారు "మనిద్దరినీ కలిపితే ముచ్చటైన ముక్తపదగ్రస్తాలంకారం అవుతుంది" అన్నారట ఛలోక్తిగా! (తెన్నేటి విశ్వనాధం-విశ్వనాధ సత్యనారాయణ.) వారికున్న నిజాయితీ, నిస్వార్ధ సేవాతత్పరత, ఈ నాటి ఏ రాజకీయుని జీవితంలో భూతద్దం వేసి వెతికినా ఆ సుగుణాలు కనపడవు. Gentleman అంటే సరైన అర్ధం చెప్పాలంటే ఆయనే గుర్తుకు వస్తారు. అటువంటి వారివల్ల రాజకీయాలకు మంచి విలువలు, గుర్తింపు వచ్చాయి. ఆయన ఏనాడు పదవులకోసం ప్రాకులాడలేదు.
జమీందారి విధానాలపై చట్టం, భూసంస్కరణల చట్టం ఇటువంటివి ఎన్నో ఈ మహనీయుని కృషి వల్లనే వెలుగు చూసాయి.వీరి కృషివల్లనే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, కృష్ణా బారేజి లాంటి ఆంధ్రులు గర్వించతగ్గ అనేక సంస్థలు ప్రారంభించపడ్డాయి. శ్రీ వావిలాల గారితో భుజం భుజం కలిపి నందికొండ ప్రాజెక్ట్ కోసం వీరు చేసిన కృషి మరువరానిది.స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి,తామ్రపత్రం మరియు 'పద్మ భూషణ్' బిరుదులను ఇవ్వపోతే, వాటిని తిరస్కరించారు. వారికున్న 8 ఎకరాల భూమిని సర్వోదయ ఉద్యమానికి విరాళంగా ఇచ్చిన వితరణశీలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆధ్యాత్మికత, సంస్కారం, సాహిత్యం, నిజాయితీ రాజకీయాలు మూర్తీభవించిన పూర్ణ పురుషుడు శ్రీ తెన్నేటి.
ఎన్నోరాజీలేని పోరాటాలు చేసిన ఈ యోధుడు 1979 లో మృత్యువుతో రాజీపడక తప్పలేదు. మన సంస్కృతిని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అందరి యోధులకు లాగానే చనిపోయిన తరువాత వీరికీ విశాఖపట్టణంలో పలు స్మారక చిహ్నాలు లాంటివి ఏర్పరచారు.కేంద్ర ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది. వీటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.
శ్రీ వావిలాల, శ్రీ తెన్నేటి, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గార్లవంటి జీవిత చరిత్రలను పిల్లలకు పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేసి, రాజకీయాలలో నైతికవిలువల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయాలి. తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా, ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి--మనకు ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిన ఈ 'ఉక్కుమనిషి'కి, తెలుగుతల్లి ముద్దుబిడ్డకు నా నీరాజనాలు!