విశాఖలో ఘనంగా జరిగిన కార్టూన్ వాచ్ వారి కార్టూన్ ఫెస్టివల్ 2023 - సదాశివుని లక్ష్మణరావు (లాల్ )

Cartoon Watch - Cartoon Festival

విశాఖపట్నంలో ఘనంగా జరిగిన కార్టూన్ ఫెస్టివల్ 2023 **** 25-3-2023 శనివారంనాడు సాయంత్రం 5గం నుండి 9-30గం వరకు ఛత్తీస్ ఘడ్ కు చెందిన కార్టూన్ వాచ్ (ఏకైక జాతీయ కార్టూన్ మాసపత్రిక ) ఛీఫ్ ఎడిటర్ శ్రీ త్రయంబక్ శర్మగారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని మేఘాలయా హొటల్ లో జయప్రదంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి గారు , ఛత్తీస్ ఘడ్ టూరిజం బోర్డు యం డి శ్రీ అనిల్ కుమార్ సాహుగారు మరియు ఆంధ్రాయూనివర్శిటీ డిపార్టుమెంట్ ఆఫ్ జర్నలిజం ఛైర్మన్ శ్రీ డి వి ఆర్ మూర్తిగారు హాజరయారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కార్టూనిస్టులు శ్రీ బాలి గారిని, శ్రీ హరి వెంకట్ గారిని మరియు విజయవాడకుచెందిన శ్రీ టీ వీ గారిని జీవితసాఫల్య పురస్కారములతో సత్కరించారు. తదుపరి విశాఖపట్నం స్పెషల్ సంచికగా కార్టూన్ వాచ్ మార్చి 2023 సంచికను ఆవిష్కరించారు. అతిథి శ్రీ డి వి ఆర్ మూర్తిగారు మాటాడుతూ ఇంతవరకు కార్టూనింగుపై రీసెర్చిచేసి డాక్టరేట్ పొందినవారు ఒకరుకూడా దేశంలో లేరని అలాగే ఇంతవరకు కార్టూనింగులో డిప్లొమా కోర్సును దేశంలోని ఏ యూనివర్సిటీ ప్రవేశపెట్టలేదని ఆ దిశగా ఆలోచించి వాటిని ప్రారంభించడానికి ముందుకురావాలని కోరారు. తదుపరి నార్త్ కోస్టలాంధ్ర కార్టూనిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో శ్రీ త్రయంబక్ శర్మగారిని మెమెంటోని అందజేసి దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. శ్రీ బాలిగారు తన పెయింటింగును శర్మగారికి బహుమతిగా ఇచ్చారు. శ్రీ ఆరిశెట్టిసుధాకర్ దంపతులు శ్రీ శర్మగారిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి 21 మంది కార్టూనిస్టులు హాజరయిన వారిలో ఉన్నారు. వారు సర్వశ్రీ బాలి, టీవీ , హరివెంకట్ , బాచి, నాగిశెట్టి , గౌతమ్ , లాల్ , రామశర్మ, టి ఆర్ బాబు, జగన్నాధ్ , బి యస్ రాజు, దంతులూరి వర్మ, ఆరిశెట్టి సుధాకర్ , యం యం మురళి, ప్రేమ్ , శంబంగి, కొడాలి సీతారామారావ్ , వందనశ్రీనివాస్ , నల్లపాటి సురేంద్ర, కశ్యప్ మరియు ఓంకార్ లు హాజరయారు. తదనంతరం వేదికవద్ద ఏర్పాటుచేసిన విందునారగించారు. కార్యక్రమానికి హాజరయి జయప్రదం చేసినందుకు శ్రీ త్రయంబక్ శర్మగారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్టూన్ వాచ్ పత్రికకు మన ఇరు రాష్ట్రాలలోనున్న కార్టూనిస్టులూ తమ కార్టూన్లను పంపించాలని కోరారు. ఇటువంటి కార్టూన్ ఫెస్టివల్ 2023 ను విశాఖపట్నంలో ఏర్పాటుచేసినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేశారు.

లాల్ (సదాశివుని లక్ష్మణరావు) విశాఖపట్నం

మరిన్ని వ్యాసాలు