అమ్మమ్మల ఇళ్లల్లో పిల్లల కేరింతలూ, పెద్దల కేకరింతలూ మాయమయి పోయాయి! - వేరు పడ్డ కాపురాలు, వేర్లు తెగిన పెద్దవాఱు! అందఱికీ ఒక బేసిన్లో అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే నా వంతు ఎప్పుడూ అనుకుంటూ ఆత్రంగా ఎదురు చూసే రోజులు పోయాయి! - టివిలూ చరవాణీలూ వచ్చి, "అసలేమి" తింటున్నామో, ఆ పదార్థాన్ని ఆస్వాదిస్తూ తినే ఆలోచనే లేదు.
రాక రాక పుట్టింటికి వచ్చిన ఆడపడుచును, "నేనడిగిన పూర్ణాలు చేయకుండా, నీ కోడలు తనకి ఇష్టం అయిన బొబ్బట్లు చేస్తోంది, చూడమ్మా" అని కూతురు అంటుంటే, "నీ చేతితో తయారు చేసిన నువ్వుల అరిసెలు తినాలనుంది, నీ కోసం ఎదురు చూస్తున్నాను, రా వదినా", అని సరదా పడే మరదలూ! - ఎవఱికేమి కావాలో "list" తయారు చేస్తున్నా, మనం కష్టపడక్కఱ లేకుండా, స్విగ్గీ, జొమాటోలకు చెప్తే వాఱే చేసి పెడతారు", అని పిలిచిన వాఱూ వచ్చిన వాఱూ అనుకోవటం పరిపాటి అయి పోయింది!
ఇది సమస్యా అంటే, అవుఁను, బయట తిళ్ళు మంచివి కావు, "కలసి ఉంటే కలదు సుఖమూ", ఆడుఁతు పాడుఁతు పని చేస్తుంటే అలుపూ సోలుపే ఉండదూ అనుకుంటూ తరచి చూసుకోవలసిన సమయం! మఱి పరిష్కారం లేదా!? ఎందుకు లేదూ??
ఇవి పాటిద్దాం:
1. మొట్టమొదట ఒకఱింటికి ఒకఱము వెళ్లటము మొదలు పెడదాము. అందఱమూ తలో చేయీ వస్తే ఆరోగ్యకరమైన వంటలతో పాటూ, రుచికరమైన పదార్థాలూ తయార్, వేచి చూసే అనారోగ్యాలూ పరార్!
2. అబ్బా! పిల్లలను పట్టూకోవటం ఎంత కష్టమో తెలుసా! అనుకోకండీ! వాఱికీ పనులు చెప్పండి! తరిగిన కూరల పొట్టూ, కడిగిన పప్పూ, బియ్యం, కూరల నీళ్ళూ, పాతబడ్డ మందులూ, కాఫీ, టీ డికాక్షన్లూ మొక్కల్లో పోయింౘటమూ, చెప్పాలే కానీ ఎన్ని పనులు!
3. ఇలాగ చేయింౘటం వలన పిల్లలకు పనులతో పాటూ ఇలాంటి చిట్కాలూ తెలుస్తాయి, వాఱిని "హ్యాండిల్" చేయటమూ సులువవుఁతుంది.
4. అన్నట్టూ మగవాఱినీ పనులలో దూరమనండి! మనకీ శ్రమ తరిగీ, వాఱికీ బాధ్యత తెలియటమే కాదు, ఎప్పుడైనా వాఱి ఇళ్లల్లో అవసరాలు వస్తే పిల్లలూ మగవాఱూ కూడా అవస్థ లేకుండా అందుకోగలుగుతారు!
5. ఈ విధంగా పండుఁగలూ పబ్బాలప్పుడు చేయటం వల్ల, పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు అలవడటమే కాకుండా, ఒకఱికి ఒకఱు తోడవుఁతారు! అలాగే, చిన్న కుటుంబాలే కదా, పైగా ఎక్కువ రకాలు వండాలీ అంటే, ఒక్కఱి వలననే ఏమి అవుఁతుందీ, అంటూ పండుఁగలప్పుడు తక్కువ రకాల వంటలూ, పిండి వంటలూ వండుకోవటంతో లఘువుగా ముగిసే బదులూ, ఇలా అందఱూ కలిస్తే ఆహ్లాదమూ, అన్ని రుచులూ సుళువుగా అందుతాయి! పిల్లలకీ కలసి చేసుకోవటమూ, పంచుకోవటమూ తెలుస్తాయి.
6. ఇప్పుడు ముఖ్యమైన విషయాలు.
i. దయచేసి టి.విలు వాడకండి
ii. చరవాణులతో పాటూ, వైఫైలు కూడా ఆఫ్ చేయండి.
iii. పిల్లలకు పద్యాలు, పురాణాలూ నేర్పండి. పోటీలు పెట్టండి! వాఱిని మన జీవన స్రవంతి లో కలపండి.