ఏమిటోనండి.. - భమిడిపాటి ఫణిబాబు

Feeling Bore....

ఈ రోజుల్లో ఎక్కడ విన్నా ప్రతీవాడూ  సునాయాసంగా వాడే పదం " బోరు". అదేం చిత్రమో కానీ, మాటలు అప్పుడప్పుడే వస్తూన్న పసిపాప దగ్గరనుంచీ , జీవిత చరమాంకంలోకి వచ్చిన వారి దాకా ఇదో ఫాషనైపోయింది. అసలు "బోరు" అంటే అర్ధం చెప్పమనండి, తెల్ల మొహం వేస్తారు ! ఏదో అందరూ చులాగ్గా వాడేస్తున్నారుకదా అని మనమూ వాడేయడం. ఒప్పుకుంటాం, ఒకే పరిస్థితినీ, ఒకే వాతావరణాన్నీ ఇరవైనాలుగ్గంటలూ భరించడమంటే మరి మాటలంటారా? కానీ వేలం వెర్రిలా, ప్రతీదానికీ "బోరు కొట్టేస్తోందీ" అంటే మాత్రం ఓ లెంపకాయ వేయబుధ్ధేస్తుంది. ఏమంటారు?

కొంతమందిని చూస్తూంటాం, అదేమిటోనండీ "ఈవేళ మరీ బోరుగా ఉందీ" అంటాడు. పోనీ ఏం బోరుకొడుతోందీ అని అడిగితే చెప్పలేడు.మరి బోరు ఎందుకూ, తిన్న తిండి అరక్కా? ఇదివరకటి రోజుల్లో  చదువులు పూర్తయినతరువాత, ఏ ఉద్యోగం దొరికితే దాంట్లోనే సంవత్సరాలు పనిచేసి, పదవీ విరమణ చేసేవారు. వాళ్ళకి మాత్రం ఏదో ఒక పరిస్థితిలో బోరు కొట్టకుండా ఉండుంటుందంటారా? తప్పకుండా కొట్టే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతల మూలంగా ఇలాటి luxuries మీదకు దృష్టి పోయేది కాదు. నేను సరీగ్గానే చెప్పేను-luxuries- అని. ఎందుకంటే ఇలాటివి కడుపునిండుగా ఉండే వాళ్ళకి మాత్రమే వచ్చే "జాడ్యాలు". పైన చెప్పినట్టుగా తిన్నదరక్క వచ్చే సుకరాలు. ఏ  నిరుద్యోగినో కదిపి చూడండి, " ఏమయ్యా ఉద్యోగాలకి తిరిగి.. తిరిగి.. బోరు కొట్టడంలేదా..?" అని. అతనికి ఛస్తే బోరు కొట్టదు, ఎందుకంటే ఏదో ఓ ఉద్యోగం దొరికి, నాలుగు రాళ్ళు సంపాదిస్తే, తనూ, తనమీద ఆధారపడ్డవాళ్ళూ , రెండుపూటలా కనీసం తిండైనా తింటారు. మనింటికి వచ్చే పనిమనుషులూ, రోడ్లూ అవీ తుడిచే వారూ, పాలు పోసేవాళ్ళూ ఇలాటివారందరికీ "బోరు" అనేదుండదు.  సరదాకి వాళ్ళకి ఓ రోజు " బోరు" కొట్టిందనుకోండి, మన ఇళ్ళల్లో పొయ్యిలో పిల్లి లేవదు ( పాత సామెత ప్రకారం). వీళ్లల్లో ఏ ఒక్కరు రాకపోయినా మనందరమూ అంటే " బోరు ప్రభావితులు" తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే !

ఆర్ధిక స్థోమత బాగా ఉండి, ఓ డిగ్రీ సంపాదించి కొత్తగా ఏ ఐటీ రంగంలోనో ఉద్యోగం దొరికి, మొట్టమొదటి జీతమే తన తండ్రి ఉద్యోగం చేసినంతకాలమూ సంపాదించలేనంత దొరికిందనుకోండి, ఏదో ఓ ఏడాదో ఏణ్ణర్ధమో చేయగానే మొదలెడతాడు-- ఏమిటోనండీ "బోరు" కొట్టేస్తోందీ అని. ఎందుకు నాయనా అని అడిగి చూడండి ఏవేవో ఇంగ్లీషులో చెప్పేస్తాడు , job profile బాగో లేదంటాడు, మరీ నిలేస్తే అసలు ఆ job లో growత్తే లేదుపొమ్మంటాడు. ఈయనగారి దృష్టిలో growth అంటే ఏమిటో?  ఇంకో కంపెనీ వాడు, ఓ నాలుగు రాళ్ళు ఎక్కువిస్తున్నాడు, అదీ విషయం. అదేదో చెప్పేస్తే గొడవే ఉండదుగా, చెప్పడానికి నామోషీ, వాటికి ఏవేవో కారణాలు చెప్పడం.  ఒకటి రెండు కంపెనీలతో ఊరుకుంటాడా, ఎవడెక్కువిస్తే వాడిదగ్గర చేరిపోవడం.జీవితంలో ఎప్పటికి స్థిరపడేటట్టూ?ప్రతీ ఏడూ ఇలా ఉద్యోగాలు మార్చుకుంటూ పోతే, ఇంట్లోవాళ్ళకి బీపీ పెరిగిపోతూంటుంది. పోనీ అంతలా నచ్చకపోతే తనే స్వంతంగా ఓ కంపెనీ ప్రారంభించొచ్చుగా, అబ్బే వాటిలో " బోరు కొట్టడం" లాటి privileges ఉండవు మరి. అంటే ఎవడో పెట్టుబడి పెట్టిన సంస్థల్లో మనం చెప్పా పెట్టకుండా ఉద్యోగాలు వదిలేయొచ్చు కానీ అదే మనదాకా వస్తే ... ఉదాహరణకి మనింటికి వచ్చే పనిమనిషి చెప్పా పెట్టకుండా రావడం మానేసిందనుకోండి, ఊరికే గింజుకుంటాం. మనం మాత్రం ఏడాదికో జంపు చేసేయొచ్చు!

కొంతమందికి ప్రతీరోజూ ఒకేరకమైన తిండి తినడం "బోరు". పోనీ ఈవేళ బయటకి వెళ్దామేమిటీ అనడం. దానికి ఓ వేళా పాళా అనేదుండదు. ఇంటావిడేమంటుందీ, సరే ఒక్కరోజు తప్పినా తప్పినట్టే అనుకుంటుంది. పిల్లల మాటంటారా, ఛాన్సుదొరికితే చాలనుకుంటారు. కొంపలో అందరూ ఏకగ్రీవంగా ఒప్పేసుకున్న తరువాత  ఇంకేముందీ, హాయిగా ఏ హొటల్ కో వెళ్ళడం, డబ్బులకేమీ లోటులేదాయె, అయినా డబ్బులెవరిక్కావాలి, ఓ నాలుగైదు క్రెడిట్ కార్డులుంటే సరిపోదూ?

కొంతమందుంటారు, వాళ్ళకి ఏడాదంతా ఓకే కారులో  వెళ్ళడం "బోరు". కొత్త మోడల్ ఏదివస్తే దాన్ని కొనడం, ఫలానా కారు ఇంటావిడకోసమంటాడు, ఇంకోటి పిల్లలకోసమంటాడు. చేతినిండా డబ్బులాయె. కార్ల కంపెనీలు కూడా బ్రతకొద్దూ? వచ్చిన గొడవ ఏమిటంటే వీళ్ళని చూసి ప్రతీవాడికీ తమ దగ్గరున్న వస్తువులమీద " బోరు" ప్రారంభం అయిపోతుంది. "పులిని చూసి నక్క వాతెట్టుకున్నట్టు" ఏ మధ్యతరగతివాడికో ఇలాటి "బోరు" వ్యాధి వస్తే కష్టం కదండీ? ఈ బోరు" అనేది ఒక "అంటువ్యాధి" లాటిదంటే ఒప్పుకుంటారు కదూ?

ఇంట్లో ఉన్నవారిది ఇంకోరకమైన "బోరు"-- ప్రతీ రోజూ అవే

కర్టెన్లు చూసి చూసి బోరుకొట్టేస్తోందిట ! ఒకానొకప్పుడు ఇంట్లో ఏ పాత చీరో కిటికీలకీ, ద్వారాలకీ కట్టుకున్న ఇంట్లోంచి వచ్చిన మనిషే. కానీ పరిస్థితుల ప్రాబల్యం వలన ఇప్పుడు "బోరు " కొట్టింపబడే eligibility సంపాదించింది మరి. టీవీల్లో అన్నేసి రోజులు ధారావాహికంగా ప్రసారం అయ్యే ఆ దిక్కుమాలిన సీరియళ్ళు ఎందుకు " బోరు " కొట్టవో మాత్రం నాకర్ధం అవదు ! ఎవరింటికైనా వెళ్ళడమైనా మానుకుంటారుకానీ, ఆ జీడిపాకం సీరియళ్ళు మాత్రం మిస్సవకూడదు !

కొంతమందికి ఒకే మోడల్ సెల్ ఫోను వాడడం నామోషీ. ఇరవైనాలుగ్గంటలూ సెల్ ఫోనుమీదే ఆధారపడాల్సిన వారు, పోనీ ఏవేవో కొత్త సౌకర్యాలు వచ్చి మారుస్తున్నారూ అంటే అర్ధం ఉంది, స్కూళ్ళకీ కాలేజీలకీ వెళ్ళే పిల్లలకి మార్చడం అవసరమంటారా? చెప్పేనుగా జరుగుబాటు. ఫ్రెండ్సందరి దగ్గరా లేటెస్టు మోడల్స్ ఉన్నాయీ, నాదగ్గరే లేదు డాడీ అని అడగ్గానే ఆ డాడీగారి మనసూ కరిగిపోతుంది, " అయ్యో అలాగా అమ్మా.." అని అక్కడికక్కడే online మీద తెప్పించేయడం. ఇంటినిండా సెల్ ఫోన్లే, ఓ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లా తయారయిపోతుంది. కూతురు విషయం అలాగుంటే ఇంక కొడుక్కి పాత బైక్కంటే "బోరు" కొట్టిన కారణంగా  ఇంకోటి.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ "బోరే".

అమ్మలు   మనల్ని తొమ్మిది నెలలూ భరించడం "బోరనుకుంటే"  మనకి ఇలాటి privileges దొరికేవంటారా?

అందువలన చెప్పొచ్చేదేమిటంటే " బోరు" కొట్టడం సహజమే. కానీ దానిక్కూడా ఓ సమయమూ సందర్భమూ కూడా ఉండాలి. ప్రతీదీ బోరే అయితే అసలు ఏకాగ్రత అనేది ఎప్పుడు వచ్చేటట్టూ? మనం బ్రతికేదా ఓ డెభై, ఎనభై ఏళ్ళు  కనీసం బ్రతికిన్నన్నాళ్ళూ , వేలంవెర్రిలా ప్రతీదీ బోరు అనేయడం, ఏదో ఘనకార్యం కాదు.  అలోచించి మరీ "బోరు" అనడం తగ్గించుకోమనేదే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు