అలలెత్తే అడుగులు - సిరాశ్రీ

Book Review - alalette adugulu

పుస్తకం: అలలెత్తే అడుగులు
రచన: డా సి. నారాయణ రెడ్డి
వెల: 150/-
లభించు చోటు: విశాలాంధ్ర


ఆయన ఆలోచనకు అలుపు లేదు, ఆయన కలానికి నిలుపు లేదు. ఆయన కలం ఒక హలం. ఆయనకు కాగితం ఒక పొలం. ఆయనకు అక్షరాలు విత్తనాలు. అవి పండించే భావాలు హరితవనాలు. ఆయన హృదయం పెనుసంద్రం. ఆయన మస్తిష్కం నిత్య కవితా ప్రసూతికేంద్రం. ఆయనంటే ఎందరికో ఇష్టం, ఎందుకో ఒక్క ముక్కలో చెప్పమంటే మాత్రం బహు కష్టం.

డా సి. నారాయణ రెడ్డి కలానికి, గళానికి పరిచయ వాక్యాలు ఎవరు వ్రాసినా అది సూర్యగోళాన్ని కొవ్వొత్తి పరిచయం చేసినట్టు ఉంటుంది. అంత ఉత్తుంగ శిఖరాగ్రంలో జ్ఞానపీఠంపై కూర్చున్న రాజకవిలాంటి కవిరాజు మరి. సూర్యుడు వెలుగివ్వని రోజు ఉండదు. సినారె కవిత రాయని రోజు ఉండదు. మనం భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఒక ఏడాది తిరగ్గానే కొత్త క్యాలండర్ వస్తుంది. అక్షరాలు భావాలతో కలిసి సినారె కలం చుట్టూ ఒక ఏడాది తిరగ్గానే కొత్త పుస్తకం ఒకటి మన ముందుకొస్తుంది. ఏడాదికొక బిడ్డను కనడం ఎంత కష్టమో ఏడాదికొక కవితా గుచ్చం తీసుకురావడం అంతకన్నా కష్టం. కానీ అలా తీసుకురాగలగడం సినారె జీవలక్షణం. 

ప్రతి సంవత్సరం మాదిరిగానే 2013 జూలై 29 న సినారె 83 వ జన్మదినం సందర్భంగా కొత్త కవితల సంకలనం వచ్చింది. దాని శీర్షిక "అలలెత్తే అడుగులు". మొత్తం 180 కవితలు. అన్నీ జ్ఞానగుళికలు. కాలక్షేపానికి మొదలుపెట్టి చదువుతుంటే అనిపిస్తుంది... కాలాన్ని నిక్షేపంగా తనలో ఇముడ్చుకున్న మహాముని సినారె అని.

"ఎంతగా మథిస్తే" కవితలో 'ఎంతగా వడబోస్తే జీవితం/ అంత చిక్కగా తయారవుతుంది/ ప్రగాఢతలోనే పదార్థం/ విలువ పెరుగుతుంది...' అంటారు. జీవితాన్ని ఎంతగా కాచి వడపోస్తేనో తప్ప ఇలా చెప్పడం సాధ్యం కాదు. అందునా జ్ఞానమనే సెగలో కాచిన అనుభవ సారాలు కదా!

"చూపులు పక్షులు" లో 'పక్షులది స్వచ్చంద విహారం/ చూపులది నిర్దిష్ట సంచారం/ లక్ష్యరహిత దృక్ ప్రసారాన్ని/ నేత్రాలు అంగీకరించవు/ అందుకే చూపులకుంటుంది/ సందర్భనియతి/ సమయ పరిమితి...' కాస్త ఆగి ఆలోచిస్తే తెలుస్తుంది. మనిషి చూపులకు క్రమశిక్షణ ఎంతవసరమో.

"స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహః" అనే గీతార్ధాన్ని చక్కని కథలాంటి కవిత "వెర్రి కోరికలు" లో ఆవిష్కరించారు. అది చదివి తీరాలి. వ్యాఖ్యానం అవసరం లేదు.

'చెంపలు నిమురుకుంటూ/ నెత్తి గోక్కుంటూ కూర్చుంటే/ సమస్యలకు/ పరిష్కారం దొరకదు/ మేధను విదిలిస్తే తప్ప...' అంటూ చైతన్యబోధ చేసారు "విదిలించినప్పుడే" లో.

"ఏవేవో ప్రశ్నలు" లో జీవిత సాఫల్యాన్ని 6 ముక్కల్లో చెప్పేసారు...'...జననం మొదలుకుని/ నిర్యాణం వరకు/ మనం ధరించిన పాత్రలను/ సమర్ధంగా పోషించినప్పుడే/ పుట్టుక పున్నమిలా విరబూస్తుంది...'. ఇంతకన్నా ఏం కావాలి? ఏం చెయ్యాలి?

'మబ్బు మనిషికి రూపాంతరం/ మనిషి మబ్బుకి పాఠాంతరం...' అన్నారు "మబ్బూ మనిషి" లో. అదేమిటో తెలియాలంటే ఆసక్తిగా ఉండే ఆ కవితను ఆసాంతం చదవండి.

"ఉద్యమ శీలం" లో ఇలా అంటారు: '..ఊపిరి తీసుకోకుండా/ ఉద్గమించేదే/ అసలైన ఉద్యమం/. ఒళ్లు కాగిపోతున్నా/ నిజాయితీ ఉన్న ఉద్యమం/ నీడలో విశ్రమించాలనుకోదు...'. ఉద్యమ స్ఫూర్తి అంటే అదే మరి. నేటి రాజకీయనాయకులు ప్రేరేపించే కొన్ని ఉద్యమాల్లో నిజాయితీ ఎంతుందో ఈ పంక్తులతో స్ఫురిస్తుంది.

"అలలెత్తే అడుగులు" కవితలో  '.. కూచున్నప్పుడు మొలకెత్తిన ఆలోచనలు/ నడుస్తున్నప్పుడు పురివిప్పిన అనుభవాలు/ విభిన్న దశల్లో కలిగినా/ అవి జీవ ప్రగతికి/ మార్గ దర్శకంగా నిలుస్తాయి...' అనే పంక్తులతో ముగుస్తుంది. ఆత్మానుగతంగా సాగినట్టున్న ఈ కవిత ఒక అనుభవశాలి చెప్పిన జ్ఞాని జీవన విశేషంగా దర్శనమిస్తుంది. అందుకే ఈ  శీర్షికతోనే పుస్తకానికి నామకరణం చేయడం ఔచితీభరితం.

ప్రకృతితో పెనవేసుకున్న మనిషితనాన్ని సినారె దర్శించినంత విస్తృతంగా, హృదయాల్ని స్పర్శించినంత గాఢంగా మరే ఇతర తెలుగు కవులు చేయలేదు. అందుకే ఈయన కర్తవ్య బోధన కూడా ప్రకృతి పాఠంగానే ఉంటుంది. "చలనశీలం" లో '...ఎండు మట్టిలో ఇంకిపోయే వరకు/ కెరటానిది/ చలనశీల చైతన్యమే/ ఈ చైతన్యం/ మనిషి జీవికకు మార్గదర్శకం...' అని ముగించారు.

"ఎండా నీడలు" మరో కథాత్మక కవిత. చదివి ఆనందించాలి.

"భావోన్మాదం" మరో వ్యక్తిత్వ వికాస పాఠం. అవశ్య పఠనీయం.

"వెనుదిరగని సంకల్పం" లో సినారె మార్కు వ్యక్తీకరణ చూడండి. '...ఎంత వేగంగా ఈదుతూ పోతే/ అంత త్వరగా/ తీరం మన చేతుల్లోకి వచ్చి వాలుతుంది...' సాధారణ కవులైతే... 'అంత త్వరగా తీరం చేరతాం' అనే అవకాశమే ఎక్కువ. తీరం చేతుల్లోకి రావడం అంటూంటే జిగీష మీసం మెలేసి తొడగొడుతున్నట్టు లేదూ...!

ఇలా చెప్పుకుపోతే 180 కవితలకూ లఘు వ్యాఖ్యలనుంచి, దీర్ఘ భాష్యాల వరకు వ్రాయొచ్చు. తోడుకున్న వాడికి తోడుకున్నంత అన్నట్టుగా ఉండే సుజ్ఞానమహార్ణవాలు ఈ "అలలెత్తే అడుగులు"లోని అక్షరనిక్షేపాలు.

జిజ్ఞాసువులకి, కవితారస పిపాసులకి ఈ గ్రంథం... మృదు మధుర మకరందం.

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం