నరజన్మ ఎత్తిన ప్రతీ ప్రాణి తప్పకుండా నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయన్న నా నమ్మకాన్ని మీతో ఈ మాధ్యమం ద్వారా పంచుకుంటున్నాను.
ఉదయం త్వరగా లేవడం నేర్చుకోవాలి - లేకపోతే పొద్దెక్కినా ఇంకా పక్క దిగలేదా అని చీవాట్లు (కొండొకచో వయసునిబట్టి దెబ్బలు) తినవలసివస్తుంది. అలా లేచిన తరువాత, కాలకృత్యాలు స్నానం త్వరగా కానిచ్చుకోవడం నేర్చుకోవాలి - లేకపోతే ‘వీడు/ఈమె బాత్రూం లోపలికి పొతే బయటపడేసరికి గంటలు గంటలు బాబూ’ అన్న దెప్పిపొడుపులు వినవలసివస్తుంది. అంతేకాదు, ఆ కారణంపై నిన్ను వెనక్కి నెట్టి తక్కినవారు వారి కార్యక్రమాలు కానిచ్చుకొనే సమస్య కూడా లేకపోలేదు. ఫలహారం/భోజనం వీలైనంత త్వరగా కానిచ్చుకోవడం నేర్చుకోవాలి - లేకపోతే ‘తిండికి పోతరాజులాగా కంచం దగ్గరనుంచి ఎప్పటికి లేవడు/లేవదు’ అన్న మాట పడవలసి వస్తుంది. బడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లినా సమయానికి వెళ్లడం నేర్చుకోవాలి - లేకపోతే తగిన శిక్షపడే సమస్య లేకపోలేదు. అదేవిధంగా, కార్యాలయానికి వెళ్ళేటప్పుడు కూడా సమయానికి వెళ్లడం నేర్చుకోవాలి - లేకపోతే తగిన శిక్షపడే సమస్య లేకపోలేదు. మనకంటే మనపిల్లలు మరో తరం తరువాతివారు కనుక, వారితో వ్యవహరించేటప్పుడు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం అలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి - లేకపోతే వారికంటే మనకు తెలిసేది తక్కువ అని చిన్నబుచ్చుకోవలసిన సమస్య లేకపోలేదు. డబ్బు సంపాదించడమే కాక తనకి అంటూ భవిషత్తు కోసం కొంత దాచుకొనే, మిగిలినది ఖర్చు చేయడం నేర్చుకోవాలి - లేకపోతే భవిష్యత్తులో ఆర్ధికావసరాలకు ఇతరులమీద ఆధారపడవలసిరావొచ్చు. పిల్లలని ప్రేమించాలి వారి భవిష్యత్తుకి తగిన ఏర్పాట్లు చేయాలి. కానీ, అందుకు పిల్లల దగ్గరనుంచి ప్రతిఫలం ఆశించకుండా ఉండడం నేర్చుకోవాలి - లేకపోతే నిరాశ చెందే సమస్య లేకపోలేదు.
-2-
వ్యాయామం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు నేర్చుకోవాలి. అంతే కాదు, మీ భాగస్వామికి కూడా నేర్పాలి - లేకపోతే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం అందుకు సంబంధించిన ఈతి బాధలు ఎదుర్కొనే సమస్య లేకపోలేదు. ప్రతీది నాకే తెలుసు నేను చెప్పేదే అందరూ వినాలి అనే మనస్తత్వంకి దూరంగా ఉండడం నేర్చుకోవాలి - లేకపోతే వారికంటే మనకు తెలిసినది తక్కువ అని రుజువు అయే సమస్య లేకపోలేదు. తినేటప్పుడు కడుపులో కొంచెం ఖాళీ ఉంచుకుంటూ తినడం నేర్చుకోవాలి - లేకపోతే అనారోగ్య సమస్యలతో పాటూ భవిష్యత్తులో ఆ మాత్రం కూడా తినడానికి దొరకని రోజులు వస్తే ఆ సమస్య మరీ బాధిస్తుంది. తినడం అయిపోయిన తరువాత ఆకులో తింటే ఆ ఆకుని తీసివేసే / కంచంలో తింటే ఆ కంచం తీసి తోమడానికి ఆవల వేసే అలవాటు నేర్చుకోవాలి - లేకపోతే కొంత వయసు వచ్చిన తరువాత ఆ విషయంలో మాటలు పడే సమస్య లేకపోలేదు. (వీలయితే, తిన్న కంచాన్ని కడిగే అలవాటు చేసుకోవడం ఉత్తమం). అనారోగ్య సమస్యలతో వైద్యుడు దగ్గరకి వెళ్ళేటప్పుడు ఆయనకి చెప్పవలసినవి ఆయనతో చర్చించి తెలుసుకోవలసినవి ఒక కాగితం మీద వ్రాసుకొని వెళ్లడం నేర్చుకోవాలి - లేకపోతే మనకి కావలసిన ఆరోగ్యం త్వరగా సమకూరేందుకు అడ్డంకులు వచ్చే సమస్య లేకపోలేదు. అంగడికి వెళ్ళేటప్పుడు కొని తేవలసినవి ఒక కాగితం మీద వ్రాసుకొని వెళ్లడం నేర్చుకోవాలి - లేకపోతే ఒకటికి రెండుసార్లు తిరగవలసి వచ్చే సమస్య లేకపోలేదు. రెండు చక్రాలు బండి మీద ప్రయాణం చేసేటప్పుడు శిరస్త్రాణం తప్పకుండా ధరించి వెళ్లడం నేర్చుకోవాలి - లేకపోతే ప్రమాదం పొంచి ఉండే సమస్య లేకపోలేదు. అంతేకాదు, అలా వెళ్ళడానికి ప్రభుత్వం వారు విధించిన నియమాలు దగ్గర ఉంచుకోవాల్సిన పత్రాలు తప్పకుండా ఉంచుకొని వెళ్లడం నేర్చుకోవాలి - లేకపోతే ఎప్పుడేనా ఎదురుచూడని ప్రమాదం కలగడంతో పాటూ శిక్షపడే సమస్య లేకపోలేదు. అన్నిటికంటే అతిముఖ్యమైనది -- వంట చేయడం (కనీసం అన్నం వండుకోవడం) తప్పకుండా నేర్చుకోవాలి - లేకపోతే ఆకలితో పడుకోవలసివచ్చే సమస్య లేక పోలేదు.
*****