వివేకానంద స్వామి ఉపదేశాలు
లోకం మనకేమీ రుణపడి వుండలేదనీ, మనమే లోకానికి రుణపడి వున్నామనీ జ్ఞాపక ముంచుకో. పుచ్చుకునేవాడు ధన్యుడు కాడు. ఇచ్చేవాడే ధన్యుడు.
దానాన్ని మించిన ధర్మం లేదు. నీవు పస్తుండవలసి వచ్చినా సరే, నీవద్ద పిడికెడు అన్నం మిగిలివుంటే దానిని దానం చెయ్యి. ఆ క్షణంలోనే నీవు పరిపూర్ణుడువు కాగలవు.
నీవు ఇవ్వగల సమస్తాన్నీ ఇచ్చివెయ్యి. కానీ ఎప్పుడూ ప్రతిఫలాన్ని ఆపేక్షించకు. ఇలాచేస్తే అది మళ్ళీ వెయ్యి రెట్లు అధికమై తిరిగి నీకే వస్తుంది.
నిస్వార్ధతయే ఫలప్రదమైనది అయితే దాని నభ్యసించడానికి అవసరమైన ఓర్పు మనుష్యులలో లేదు.
ధనవంతులు సజీవులనడం కంటే మృతజీవులనడం తగి వున్నది. వారు అంతా నిర్వహిస్తారని మీరు విశ్వసించకండి. ద్రోహ చింతన లేని సామాన్య ప్రజలే కార్యాచరణకు తగినవారు.
విధేయతను అలవరచుకొనండి. కాని మీనమ్మకాలకు భిన్నంగా నడవకండి.
విధేయత - కార్యదీక్షత - సంసిద్ధతవుంటే మీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు.
ఆలోచన లేకుండా తొందరపడి ఏ పనీ చేయరాదు. పట్టుదల - ఓర్పు - చిత్తశుద్ధి కార్యసాధనకు ఆధారాలు. ఈ మూడింటి కన్నా ప్రేమ గొప్పది.
ఏ జాతి చరిత్రను పరిశీలించినా ఆత్మవిశ్వాసం గల వారికే విజయం లభిస్తుందని చెప్పవచ్చు.
చిన్నచిన్న విషయాలలోని మహత్వాన్నే భగవద్గీత బోధిస్తుంది.
ఏ విషయాన్ని అయినా విచారించే యత్నం జరగకుండా ప్రతి దానినీ పరిహాసం చేసే జాడ్యం మన రక్త నాళాలలో ప్రవేశిస్తోంది. దానికి స్వప్తి చెప్పి శ్రద్ధను అలవాటు చేసుకోండి.
నీవు దరిద్రుడవనీ - నీకు స్నేహితులు లేరనీ భావించవద్దు. మానవులు ధనాన్ని సంపాదిస్తారా? ధనం మానవులను సంపాదిస్తుందా? మనుష్యుని పరిశ్రమ వల్లనూ - కార్య దీక్ష వల్లనూ యీ ప్రపంచమంతా కల్పించబడలేదా?
పవిత్రతను సాధించే మహా సమరంలో అవసరమైతే ప్రాణాన్ని త్యాగం చేయండి. మరణానికి స్వాగతం చెప్పండి. అంతేగాని అధైర్యపడకండి.
మతకలహాలూ - మతాలను గురించిన వివాదాలూ పారమార్ధికం లేకపోవడాన్ని నిరూపిస్తాయి. కనుక అటువంటి వెన్నడూ పెట్టుకోవద్దు. ఈ మతకలహాలన్నీ పైనున్న పొట్టను గురించేగానీ, లోపలనున్న బియ్యాన్ని గురించికావు.
నిస్వార్ధత - శౌచమూ - సత్యమూ కలవానిని అణగద్రొక్క గల శక్తి ఎవరికీ లేదు. విశ్వమంతా ఎదురై నిలిచినా యీగుణాలు గలవాడు గెలిచి తీరగలడు.
ఐరోపా దేశీయులతో వ్యవహరించేటప్పుడు మనం గమనించవలసినది ఆత్మగౌరవం. వ్యక్తులను బట్టి మనం వ్యవహరించకపోవడం వల్లనే వారు మనల్ని లోకువ చేస్తారు. భగవంతుడొక్కడే దాత.
దేశోన్నతి - వంశాభివృద్ధి - ఇవే హైందవ వివాహానికి ఆదర్శాలు.
శాకాహారం - మాంసాహారం గురించి స్వామీజీ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు.
నా గురుదేవుడు రామకృష్ణ పరమహంస శాకాహారి, కాని కాళికాదేవికి నివేదించబడిన మాంసం ఆయనకు పెడితే కళ్ళ కద్దుకుని తినేవారు. జీవహింస నిస్సందేహముగా పాపమే. కాని రసాయన శాస్త్రాభివృద్ధి మూలంగా మానవ శరీరానికి సరిపడేటంత శాకాహారం సంస్కరించబడే వరకూ మాంసాహారం కన్నా గత్యంతరం లేదు. మరణ దండన శాసనంతో అశోక చక్రవర్తి, ప్రజల్ని భయపెట్టి లక్షల కొద్దీ జంతువుల ప్రాణాలు కాపాడాడన్నమాట నిజమే కానీ, వెయ్యి సంవత్సరాల బానిసత్వం అంతకన్నా ఘోరం కాదా? కొన్ని జంతువుల ప్రాణాలు తీయడం - లేక భార్యా బిడ్డల ప్రాణాలను రక్షించుకొనలేక పోవడమూ - వీటిలో ఏది ఎక్కువ పాపకరమైనది. కాయకష్టం వలన జీవనోపాధిని ఆర్జించుకోని అగ్రకులస్తుల మాంసాహారాన్ని తినకుందురు గాక! కానీ రాత్రిం పగళ్ళు కష్టించి పనిచేసి తిండిని సంపాదించుకొనవలసిన వారిని బలవంతంగా శాకాహారులను చేయడం మన స్వాతంత్ర్య నాశనానికి గల ముఖ్య కారణాలలో ఒకటి.
ఏజాతి అయినా సంపూర్ణమయిన సంయమనమూ, బ్రహ్మచర్య వ్రతా దర్శనమునూ చేరడానికి ముందుగా వివాహం పవిత్రమైన సంస్కారమనీ, దాని నియమాలు అతిక్రమించరానివనీ గుర్తించి మాతృత్వంపై గౌరవభావాన్ని పెంపొందించుకోవాలని నా అభిప్రాయం.
(... వచ్చేవారం మరిన్ని ఉపదేశాలు)