మాతృభాషల్లో చదువులు - మద్దూరి నరసింహమూర్తి

Matrubasha lo caduvulu

భూప్రపంచంలో ఉండే 84లక్షల జీవరాసులలో కొన్నింటికి భగవానుడు మాట ఇవ్వకపోయినా గొంతుక ఇచ్చేడు. అవి ఆ సానుకూలతతో కేకలు, అరుపులు, కూతలు ఇతరత్రా విధంగా తోటి జీవరాసులతో ఆనందంలోనూ, విచారంలోనూ, ప్రమాదంలోనూ, అవసరంలోనూ చక్కగా సంభాషించుకుంటాయి.

ఆ ప్రక్రియలో ఆ జీవరాసులు వేరొక జీవరాశిని అనుకరించే ప్రయత్నం పొరపాటున కూడా చేయవు. ఉదాహరణకి, కుక్క మొరుగుతుంది కానీ మరొకటి చేయదు. ఆవు అంబా అనే అంటుంది కానీ మరొక జంతువులా అరవదు. నక్క ఊళవేస్తుంది కానీ మరొకలా అరిచే ప్రయత్నం చేయదు. ఇలా చెప్పుకుపోతే ఎంతో ఉంది.

అనగా - వాటి మాతృభాషలోనే ఊసులాడుకుంటాయి.

వాటి పెద్దలు మాతృభాషలో చెప్పినవే అవి వల్లే వేసుకొని బ్రతుకు సుగమం చేసుకుంటున్నాయి.

 

అదేమీ దురదృష్టమో, సమస్య అంతా మనుష్యజాతిలోనే.

మనుష్యుడు అన్న వాడు మాత్రమే మాతృభాషతో బాటూ (కుదురుతే, మాతృభాషని మరచిపోయే ప్రయత్నం చేసి/ నటించి) తనంతట తానుగా మరొక భాషని అనుకరించే/నేర్చుకొనే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఇతరుల బలవంతంతో అటువంటి ప్రయత్నం చేస్తాడు.

 

ఏ మనిషికయినా పుట్టుకతో భాష రాదు. తమ తల్లిదండ్రులూ, కుటుంబమూ, సమాజము ద్వారా పిల్లలు భాష నేర్చుకు౦టారు. అలా నేర్చుకొని మాట్లాడేదే మాతృభాష.

తల్లిదండ్రులలో ఎవరైనా నిరక్షరాస్యులయినా, వారు అక్షరాలు రాయటం రానివారు అయిఉంటారు కానీ – అక్షరాలు పలకటం, మాటలాడటం రానివారు కారు. అందుకే, నిరక్షరాస్యులైన తల్లితండ్రులు కూడా పిల్లలకి మాతృభాష నేర్పే గురువులే.

ఆ సౌలభ్యంతో బడికి వెళ్ళటానికి మునుపే - పిల్లలకు తమదయిన మాతృభాషలో అక్షరాలు, పదాలు, వాక్యాలు నోటికి వచ్చేసి వుంటాయి.

తల్లితండ్రుల సహకారంతో, తమ చుట్టూ ఉండే సామాజికుల సహజ సహకారంతో -- తెలియక పొరపాటుగా పలికే మాటలను సరిదిద్దే వాతావరణ౦ పిల్లలకి ఆయాచితంగా సమకూరి ఉంటుంది.

 

మాతృభాషలోని ఉచ్చారణ లోపాలను, వ్యాకరణ దోషాలను -- పిల్లలు తమంతట తామే (అందుకోసం కష్టపడుతున్నట్టనుకోక) సరిదిద్దుకుంటూ వుంటారు.

ఆ విధంగా -- అత్యంత సహజంగా మాతృభాషా వాతావరణంలో పిల్లలు పెరుగుతారు.

-2-

 

పిల్లలు బడిలో చదివేది నేర్చుకునేది వాటిని జ్ఞాపకం ఉంచుకొనేందుకు సులభతరంగా ఉండేది -- ఆ చదువులు మాతృభాషలో ఉంటేనే అన్నది నిర్వివాదాంశం, సర్వజనులూ అంగీకరించే/అంగీకరించవలసిన నగ్నసత్యం.

 

 

అలా కాకుండా పరాయిభాషలో విద్యాబోధన సాగితే ------

ఇంటి వద్ద, వీధిలో, ఇతర సామాజిక కార్యకలాపాలలొ పరాయి భాషా దోషాలను సరిదిద్దే వారు కానీ, పరిజ్ఞానాన్ని మెరుగు పరిచే వారు కానీ ఉండే అవకాశం లేక -- పరభాషలోని పదాలతో బాటూ కర్త, కర్మ, క్రియా వాచకాల వాడకానికి కూడా పిల్లలు నిత్యం తడుములాడుకుంటూ వుండాల్సి వస్తుంది. దాని ఫలితంగా, బట్టీ పట్టే చదువుకు తప్పనిసరిగా అలవాటు పడిన పిల్లల మనోవికాసం కుంటుపడుతుంది.

 

ఇక్కడ అందరూ గమనించవలసిన ముఖ్యమైన విషయం - విన్నది సులువుగా అర్ధం చేసుకొని, పిల్లలు తమ జ్ఞాపకాలలో నిక్షిప్తం చేసుకొనేటట్టుగా పరదేశభాషా మాధ్యమంలో బోధించ గలిగే సామర్ధ్యం ఉన్న గురువులు/ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు?

 

విద్యాబోధన మాతృభాషలోనా / పరాయిభాషలోనా అన్న సమస్యని రెండు భాగాలుగా విభజించి పరిశీలించాలి.

మొదటిది పల్లెల్లో పిల్లల చదువులు, రెండవది పట్టణాల్లో పిల్లల చదువులు.

 

పల్లెల్లో పిల్లల చదువులు :

 

చాలామట్టుకు పల్లెటూర్లతో నిండిన మన దేశంలో బడికి వెళ్లి చదువుకొనే పిల్లలెంతమంది?

ఆ పిల్లల తల్లితండ్రులెంతమంది చదువుకున్నవారున్నారు?

బడిలో చదువుకున్న పాఠం పిల్లలు ఇంట్లో వల్లె వేస్తుంటే విన్న తల్లితండ్రులు అందులో తప్పొప్పులు తెలుసుకొని పిల్లలని సరిఅయిన దారిలో పెట్టాలని తప్పకుండా ప్రయత్నిస్తారు. కానీ, ఆ చదివే పాఠం తల్లితండ్రులకు తెలిసిన భాష - అదే మాతృభాష - కాక వేరే విదేశీ భాషలో ఉంటే - పిల్లలు చదివేది తప్పో ఒప్పో తెలియని తల్లితండ్రులు ఆ పిల్లలని ఎలా సరిదిద్దుతారు ?

 

పిల్లలు కాస్త పెద్దవారై, వారి చదువులో తప్పొప్పులు వారంతట వారు తెలుసుకొనే వయసు వచ్చేసరికి సుమారుగా వారి ఉన్నత పాఠశాల చదువులు ముగుస్తాయి.

అందుకే, ఉన్నత పాఠశాల చదువులు ముగిసేవరకూ వారి చదువులు విధిగా మాతృభాషలోనే కొనసాగించడం అనివార్యం ఆరోగ్యకరం అన్న ముఖ్యమైన విషయం ప్రభుత్వం, పాలకులు, అధికారులు గ్రహిస్తేనే - నేటి పిల్లలు రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దబడతారు.

-3-

 

పరాయి భాషద్వారా ఎంత జ్ఞానం పొందినా అది మాతృభాషలోనికి తర్జుమా అయిన తదుపరి మాత్రమే పరాయి భాషలో వెలుపలికొస్తుంది. అందువలన, పరాయిభాషా జ్ఞానం బాగా అభివృద్ధి చెందాలంటే - ముందుగా మాతృభాషా జ్ఞానం పుష్కలంగా ఉండాలి.

 

మాతృభాషలో ఎంత ఎక్కువ జ్ఞాన సంపదను నిలువ చేసుకోగలిగితే, అంత బాగా పరాయి భాష మీద పట్టుని సాధిoచటం సులభతరమౌతుంది.

లేకుంటే, మాతృభాషా రాక, పరాయిభాషా రాక, రెంటికీ చెడిన రేవడి బ్రతుకు అవుతుంది.

 

పట్టణాల్లో పిల్లల చదువులు :

పట్టణాల్లో సుమారుగా చదువులు ఆంగ్ల మాధ్యమంలోనే జరుగుతున్నాయి. ఆంగ్లభాషా మాధ్యమంలో విద్యాబోధన సాగించే బడుల్లోనే పిల్లల్ని చేర్పించడానికి తల్లితండ్రులు కూడా మొగ్గు చూపుతున్నారు.

 

నేటిరోజులలో చాలా కుటుంబాలలో దంపతులిద్దరూ ఉద్యోగస్తులుగానే ఉంటున్నారు. అందువలన, తల్లి తండ్రులిద్దరికీ పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టే సమయం కానీ అవకాశం కానీ లేక పిల్లల చదువులు చాలామట్టుకు వానాకాలం చదువుల్లానే ఉంటున్నాయి. దాంతో, తల్లి తండ్రులు పిల్లలని కోపగించుకోవడం జరుగుతోంది. తత్ఫలితంగా పిల్లలలో నిరాశా న్యూనతా భావాలు పెరిగే అవకాశాలు ఎక్కువ.

కొండొకచో అటువంటి పరిస్థితులు పిల్లల ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి అని అప్పుడప్పుడు వార్తలు వినవస్తున్నాయి.

 

ఇంతటి జటిలమైన ఈ సమస్యకి సమాధానం ఏమిటంటే : -

ఉన్నత పాఠశాల విద్య పూర్తైనవరకూ పిల్లలకి విద్యాబోధన మాతృభాషలో మాత్రమే జరగాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం దేశమంతా ఒకే రీతిలో సాగాలి. ఆ నిర్ణయం తీసుకోవడమేకాక, అది పరిపూర్ణంగా పాటించబడేట్టుగా తగిన పర్యవేక్షణతో కూడిన చర్యలు ఉండాలి. పరాయి భాషలు కూడా నేర్పాలి; కానీ విద్యాబోధన మాతృభాషలోనే సాగాలి. ముఖ్యంగా విద్యని వ్యాపారంగా మార్చి సాగించే ప్రయత్నాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. బడి అంటే అది ప్రభుత్వ బడి మాత్రమే అయిఉండాలి. అంతేకానీ, ప్రభుత్వ బడులు ప్రైవేట్ బడులు అని వేరుగా ఉండకూడదు. అనగా, ప్రభుత్వ హయాంలోనే విద్యా బోధన జరగాలి.

-4-

 

అన్ని దానాల్లోకి విద్యాదానం ముఖ్యమైనది ఉత్తమమైనది అంటారు. కానీ, ఏ దానమైన అపాత్రదానం కాకూడదు.

మాతృభాష మాధ్యమంలోనే చదువు అబ్బని విద్యార్థికి, విదేశీభాష మాధ్యమంలో చదువు చెప్పడం - అపాత్రదానం వంటిదే.

విద్యని అమ్ముకోవడం కొనుక్కోవడం లేకుండా, ప్రభుత్వ పాలన కొనసాగిస్తే మన దేశంలో విద్యాధికులు కోకొల్లలుగా తయారవుతారు; నిరక్షరాస్యత సమూలంగా నాశనం అవుతుంది.

 

'రాత్రి బడి' అనే విధానం కూడా - మాతృభాషలో - విజయవంతంగా సాగించగలిగితే, కాస్తా కూస్తో నిరక్షరాస్యులుగా మిగిలిన వారు కూడా అక్షరాస్యులుగా మారే అవకాశాలు మెండు.

 

పరాయిభాషలో విద్యాబోధన అనేది ఆలోచించే అధికారులు గుర్తుంచుకోవలసిన విషయం -- 'ఇంట గెలిచి రచ్చ గెలువు' అన్న సామెత.

 

మాతృభాషలో విద్యాభ్యాసం సాగించి మాతృభాష మెండుగా అభ్యసించిన మానవుడు మాత్రమే పరభాషలో కూడా పట్టు/ విజయం సాధించి విదేశాలలో మాతృదేశానికి ఎనలేని కీర్తి తేగలడు.

 

*****

 

 

 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు