జీవ నది - మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

Jeeva Nadi

నేను ఒక జీవనదిని. నేను మీకు తెలియని దాన్ని కాదు. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద పుట్టాను. జలజల పరిగెడుతూ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలోని ప్రజలను పంటపొలాలను పలకరించి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద నా తల్లి ఒడిలో చేరుతున్నా ను. నేను ధవళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి సప్త ఋషుల పేర్లు పెట్టుకున్నాను. నాకు చాలా పౌరాణిక చరిత్ర ఉంది. పూర్వకాలంలో గౌతమ మహర్షి గోహత్య పాతక నివృత్తి కోసం శివుని మెప్పించి గంగను భూమి మీదకు తీసుకు వస్తారు. ఆ గంగయే గోదావరి నది. గౌతమీ నది అని కూడా పిలుస్తారు. మీ ఇంటిలో జరిగే ప్రతి శుభ అశుభ కార్యక్రమాలు నేను లేకుండా ఏదీ జరగదు. పచ్చగా ఉండే మీ పంట పొలాలను నిత్యం నేను పలకరిస్తూనే ఉంటాను.. జలజలా పారుతూ అంతర్వేదిలో కలిసిపోతున్న నాకు అడ్డుకట్టవేసి జలాలను పంటపొలాలకు మళ్ళించడం ఆంగ్లేయుడు అయిన కాటన్ దొర గారి పుణ్యం. నామీద నిర్మించిన రైల్వే వారధి మీద నిత్యం ఎన్నో వందల రైలు బళ్ళు రోజు పరిగెడుతూ ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి. నా వారధి మీద నుంచి నడిచే రైలు బండిలో నుంచి పిల్లలు పెద్దలు రైలు కిటికీలోంచి చిల్లర పైసలు నా మీదకు విసురుతారు. అలా తరతరాలుగా ఈ ప్రహసనం సాగుతూనే ఉంది. వారు కిటికీలోంచి పెట్టే దండాలు కి నేను మౌనంగా ఆశీర్వదిస్తాను. నాలో పొంగిపొర్లుతున్న జలాలను చూసి పిల్లలు ఆనందంగా కేరింతలు కొడతారు. పెద్దలు గోదావరి ఎండి పోయిందనో నిండు గా ఉందనో కామెంట్ విసురుతారు. నాకు రాత్రి పగలు విశ్రాంతి ఉండదు. ఎందుకంటే నా మీద నిర్మించిన వారధి మీద రైలు బండ్లు రాత్రి పగలు తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాయి. రోజు నాలో పడిన కాసులు ఏరుకోడానికి చిన్న పిల్లలు పోటీలు పడి నాలో ములుగుతుంటారు. ముక్కు మూసుకుని అయస్కాంతం చేత పట్టుకుని ఆ కాసులు ఏరుకోడానికి ప్రాణాలు తెగించి నీటిలో వెతుకుతుంటారు. అప్పుడు నాకు చాలా జాలిగా ఉంటుంది. అయినా ఏమి చెయ్యను. లెక్క పెట్టలేనంత మంది ప్రజలు నిత్యం నదిలో స్నానం చేసి పునీతులు అవుతున్నారు. ఎన్నో లక్షల విగత శరీరాలు దూర దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చి అగ్ని సంస్కారం చే బూడిద గా మారి నాలో కలిసిపోతున్నారు. తెలిసీ తెలియక ఎన్నో వ్యర్థ పదార్థాలు నాలో విసిరేస్తుంటారు. అయినప్పటికీ నేను మలినం అంటని జీవనదిని. ఎన్నో వేలమంది పేద బ్రాహ్మణులు నా నది ఒడ్డున దానాలు స్వీకరిస్తూ జీవితం ఆనందంగా గడుపుతున్నారు. రోజు ఎంతో మంది నాటు పడవలతో వేట సాగించి జీవిత గడుపుతున్నారు. నేను ఇంచుమించుగా ప్రతి చలనచిత్రం లోనూ కనిపిస్తూనే ఉంటాను. నా పేరు మీద ఒక చలనచిత్రం కూడా తీశారు. కానీ అది నా కథ కాదు. నా సోదరి కృష్ణమ్మ నది ఒడ్డున పెరిగిన ఒక కవి రాసిన చలన చిత్రం లోని పాట నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది. ఎన్నో వేలమంది భక్తులు నదిలో స్నానం చేసి నా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో దైవ దర్శనం చేసుకుని పునీతులు అవుతున్నారు. నేను ఎన్నో వేలమంది ప్రజలను కాకుండా ఆ దేవాలయంలో ఉండే దేవతామూర్తులను కూడా నా నదీజలాల తోటి నిత్యం శుద్ధి చేస్తున్నాను. నేను నిత్యం త్రయంబకేశ్వరుడు కి అభిషేకం చేసి సరస్వతి మాతతో తలస్నానం చేయించి మంథని , కాళేశ్వరం ,ధర్మపురి లోని శివయ్యలకు అభిషేకం చేసి భద్రాచలంలోని రామయ్య పాదాలను కడిగి రాజమహేంద్రవరం లోని దేవుళ్లను పలకరించి కోటిపల్లి ముక్తేశ్వరం లోని ముక్కంటిని పులకరింప చేసి అప్పనపల్లి బాలాజీని ఆనందింపజేసి అంతర్వేది లోని లక్ష్మీ నరసింహ స్వామిని నా నదీ జలాలతో చల్లబరుస్తాను. నేను ఎంత పుణ్యాత్మురాలుని. అందుకే నా నదీజలాల్లో స్నానం చేసే మీరు కూడా పుణ్యాత్ములే. ప్రతి 12 సంవత్సరాలకు నదులన్నీ నాలో కలుస్తుంటాయి. దానిని పుష్కరం అంటారు. ఆ టైంలో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కిందటిసారి పుష్కరాలకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. అన్నిటి కన్నా విలువైనది ప్రాణం. దాన్ని కాపాడుకోవాల్సిన ది మనం. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన నన్నయ్య గారు నా ఒడిలో పెరిగిన ముద్దుబిడ్డ. సంఘ సంస్కరణ కోసం సర్వస్వం ధారపోసిన కందుకూరి నా బిడ్డే. ఇంకా నామీద ఎన్నో కథలు రాసిన కవులు గాయకులు సినీ నిర్మాతలు నా నది ఒడ్డున ఆడుకున్న వారే. నేను ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ వర్షరుతువులో మిమ్మల్ని మీ పంటపొలాలను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో విగత శరీరాలు నాలో కలిసిపోతున్నాయి. నేనేం ఏమి చేయలేకపోతున్నాను. నేను కావాలని చేసింది కాదు. ప్రకృతి ప్రకోపం. దైవ నిర్ణయం. ఆ ఒక్కటి తప్ప నేను చేసేవి అన్నీ మంచి పనులే. నిత్య ఎంత మంది ప్రజలు సాయంత్రం వేళలో నా నది ఒడ్డున సేద తీరి మానసిక ఆనందం పొందుతున్నారు. నిత్యం నా నది మీదుగా స్టీమర్ లో భద్రాచలం వెళ్తూ గోదావరి అందాలను పాపికొండలు అందాలను తిలకిస్తూ ఆనందం పొందుతున్నారు. ఇది నా కథ కమామీషు. ఒక చలనచిత్ర దర్శకుడు నేను లేకుండా ఏ చలనచిత్రం నిర్మించడు. ప్రఖ్యాత సినీ రంగ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే నేను పుట్టిన చోట పుట్టాడు. నా గురించి ఇప్పటికే చాలా చెప్పాను. ఇక ఉంటాను.

మరిన్ని వ్యాసాలు