ఒకప్పుడు విశ్వశాంతి కోసం విరివిగా యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. తద్వారా మానవాళి దైవాన్ని ప్రసన్నం చేసుకునేవారు. ఆనాటి సమాజంలో ఆందోళనలు, అలజడులు బహు తక్కువగా వుండేవి. జగత్తు అంతా ప్రసన్నంగా వుండేది. ఎందుకంటే మన జగత్తుకు సర్వాన్ని అనుగ్రహించినవాడు ఆ సర్వెశ్వరుడు. ఆయన మనకు అనుగ్రహించిన దానిలో కొంతైనా తిరిగి ఆయనకు అర్పించడం మన కనీస కర్తవ్యం. పైగా మానవులు వ్యష్టి భావనను త్యాగం చేసి సమిష్టి తత్వాన్ని అభివృద్ధి పరచుకునేవారు(వ్యష్ఠి అనేది వస్తువుల యొక్క వ్యక్తిత్వాన్ని మరియు వేరును సూచిస్తుంది మరియు సమష్టి సమగ్ర సంపూర్ణతను సూచిస్తుంది).సమాజం కోసం కొంతైనా త్యాగం చేయడం ప్రతీ మానవుడు తమ కనీస కర్తవ్యంగా భావించేవారు.. సర్వే జన: సుఖినోభవంతు అన్న భావనను త్రికరణశుద్ధిగా ఆచరించేవారు. సమాజరూపంలో వున్న సర్వేశ్వరుడిని ఆరాధించేవారు. ఎందుకంటే అన్ని వేదాలు కూడా సమాజం లేదా దేశం ముందు , ఆ తర్వాతే తవ కుటుంబం అని స్పష్టంగా ప్రాధాన్యతను చెప్పాయి. సువిశాల అనంత జ్ఞాన తత్వం చూస్తూ, జీవిత అంతరాంతలాళ్ళోకి ప్రవేశించి తద్వారా స్వ హితం, లోక హితం కాంక్షించడం మానవుల కనీస ధర్మం అని మనం గుర్తెరగాలి.
శ్లో:
త్యజేదేకం కలుస్యార్థే, గ్రామ స్వార్ధే కులం త్యజేత్
గ్రామం జనపదస్యార్దే, ఆత్మార్దే ఫృధీం త్యజేత్ ||
కుటుంబం కోసం వ్యక్తి తన స్వంత పనిని, గ్రామం కోసం కటుంబం, దేశం కోసం గ్రామం ఆత్మ ప్రాప్తి కోసం భూమిని త్యాగం చేయాలి. వ్యక్తి ఇతరులపట్ల తనకుండే కర్తవ్యాన్ని పూర్తి చేయాలనే భావన కల్గిన కుటుంబాలే సమాజంలో సుఖపడతాయి. హక్కుల కోసం పోరాడే కుటుంబాలు దుఃఖాన్నే పొందుతాయి అని పై శ్లోకం భావన .
మహాభారతంలో వ్య్ష్టి-సమిష్టి భావనలపై ఒక మంచి ఉదాహరణ వుంది.
కురుక్షేత్ర యుద్ధం ముగిసాక యుద్ధంలో గెలిచిన ధర్మరాజు ఏ నాడు సంతోషంగా లేడు.. జీవితకాలం అంతా పశ్చాత్తాపంలో మ్రగ్గిపోయాడు.. తన జీవితాంతం అహంకారాన్ని ప్రదర్శించిన దుర్యోధనుడు సపరివారంగా నశించి పోయాడు.
నేను నాది అనే వ్యష్టి భావనలో పుత్ర వాత్సల్యంతో, రాజ్య కాంక్షతో కొట్టుమిట్టాడిన ధృతరాష్ట్రుడు 100 మంది కుమారులను కన్నా… తలకొరివి పెట్టేందుకు దిక్కులేక పాండవుల పంచన వారి దయా ధర్మంపై బ్రతికాడు.
అవకాశం ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేని భీష్ముడు… అంపశయ్యపై జీవితాన్ని ముగించాడు
దేని కోసం దేనిని విడిచి పెట్టాలో తెలియడమే విజ్ఞత అందుకే వ్యష్టి భావనను త్యజించి సమిష్టి భావనను అలవరచుకోవాలి.
విశ్వశాంతి సమాజ శాంతిపై, సమాజ శాంతి వ్యక్తిగత శాంతిపై ఆధారపడి వుందని శాశ్త్రం చెబుతోంది. వ్యక్తిగత శాంతి సమిష్టి భావనపైనే ఆధార పడి వుందన్నది నిర్వివాదాంశం. సమష్టీ సాధనలో ఇతరుల ఆధ్యాత్మిక పురోగతి జరగాలనే ఆలోచనతో, మనం విశాలతను అలవర్చుకుంటాము మరియు మనల్ని, మన ఆశయాలను, ఆకాంక్షలను తాత్కాలికంగైనా మనం మరచిపోతాము. 'గురువు యొక్క ఏ కార్యాన్ని నిర్వహించలేనప్పటికీ అది భగవంతుడు మరియు గురువు యొక్క దయతో మాత్రమే సజావుగా జరుగుతోందని' ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాము మరియు ఇది సాధకుని అహంకారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మనస్సు సాత్వికతను, పవిత్రతను పొందుతుంది. మనసమష్టి భావము వలన, సాధకుడు భగవంతుని యొక్క అమూల్యమైన సద్గుణాలను కలిగి ఉంటాడు అంటే విశాలత, ఇతరుల పట్ల ప్రేమ మరియు ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకొని ఆధ్యాత్మిక పురోగతి కోసం ఆరాటపడతారు. ఈ విధంగా, సాధకుని అనేక జన్మల సాధన ఈ జన్మలోనే పూర్తవుతుంది.