ఏ ఇద్దరు కలుసుకున్న వారి మధ్యలో ఉన్న మౌనాన్ని పోగొట్టడానికి, దగ్గర చేయడానికి కబుర్లు ఒక ఆధారం. కబురు అంటే సమాచారం, సందేశం, వర్తమానం ,ఇలా చాలా రకాల అర్ధాలు ఉన్నాయి. ఎలా ఉన్నారు అంతా కులాసా యేనా అంటూ ప్రారంభమైన పలకరింపు అలా కబుర్లుకు దారితీస్తుంది. పక్కింటివాళ్ళతో గోడకి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ,రోడ్డుమీద ఎదురుపడితే, బజార్లో కనబడితే ,పార్కులు ,రచ్చబండలు ,పల్లెటూర్లో బావులు, చెరువులు,మున్సిపాలిటీ కుళాయిలు ఇప్పుడైతే ఫేస్బుక్లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రాములు ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడానికి స్థావరాలు. కొంతమంది చెవిలో చెప్తారు . కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దెబ్బలు ఆడుకున్నట్టు ఉంటుంది. మైక్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఇద్దరు మనుషులు కలుసుకుంటే తెలుసున్న సమాచారం చేర వేయకుండా ఉండలేరు. బాధలు చెప్పుకోకుండా ఉండలేరు కొంతమంది గొప్పలు చెప్పుకోకుండా ఉండలేరు. ఎదుటివారి పరిస్థితి గురించి అర్థం చేసుకోరు. అలా చెప్పుకుంటూ పోతుంటారు. ఒకే రకమైన అభిరుచి ఉన్న వాళ్ళని ఆ రంగానికి సంబంధించిన వార్త దగ్గర చేస్తుంది. స్నేహం పెంచుతుంది. సాధారణంగా యువత అంతా క్రికెట్ గురించి సినిమాలు గురించి కబుర్లతో కాలక్షేపం చేస్తారు ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఆ సంస్థ సమాచారం చేరవేయడానికి ఉత్సాహపడతారు. కాలక్షేపం కోసం చెప్పుకునే కబుర్లులో బంధువుల మీద చాడీలు రాజకీయాలు సినిమాలు క్రికెట్ ఈమధ్య కొత్తగా ఫేస్బుక్ వాట్సప్ కబుర్లు యూట్యూబ్ ఛానల్స్ పిల్లల గురించి వయసు మళ్ళిన వారి గురించి రోగాలు రొచ్చులు కుటుంబ బాధ్యతలు పిల్లల చదువులుఒకటేమిటి సమస్తo ఆ ప్రవాహంలో దొర్లిపోతూనే ఉంటాయి. వయసును బట్టి ఆ ఆ సమాచారం టాపిక్ మారిపోతూ ఉంటుంది. కబుర్లు చెప్పడం కూడా ఒక కళ. ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య. చెప్పవలసిన కబురుని తన చేతికి మట్టి అంటుకోకుండా ఇతరుల చేత ఆ కబురు చేరవలసిన చోటికి చేరేలా చేయడం కూడా ఒక కళ. ఇందులో మధ్యలో దూరిన వాళ్ళు బలైపోతుంటారు. సమాచారం మంచిదైతే పరవాలేదు కొన్ని కబుర్లు కొంపలు కూల్చేస్తాయి. అనుబంధాన్ని తెంపేస్తాయి. ఒక సమాచారం యదాతధంగా చివరి వరకు చేరితే పరవాలేదు. మధ్యలో దానికి కొమ్మలు చిలవలు పలవలు చేర్చి ఎదుటి వాళ్ళ అభిమానం సంపాదించడo కొంతమందికి హాబీ. జరిగినది ఒకటి చేరే సమాచారం మరొకటి. మానవ నైజం ఎవరని నిజా నిజాలు గురించి నిలదీయరు. మనసులో కక్షలు పెట్టుకుని బాధలు పడుతుంటారు. సమాచారానికి ఇంత పవర్ ఉంది. పెదవి దాటిన కబురు పృద్వి అంతా దావానంలా వ్యాపిస్తుంది. పూర్వకాలంలో రాజులు భటుల ద్వారా పావురాలు ద్వారా సమాచారం పంపించేవారు. కాలక్రమేణా తపాలా వ్యవస్థ అందుబాటులోకి వచ్చి ఆ ఊరి మనసుని పొరుగారి కబురిని కార్డు ముక్క ద్వారా తెలియజేసేది. మార్కోని పుణ్యమా అని రేడియో సమయం ప్రకారం వార్తలు అందజేసేది. ఇక అమలక్కలు చెవిన పడ్డ వార్త గడపగడపకు చేరిపోతుంది. ప్రింట్ మీడియా పుణ్యమా అని చాలా కాలం పాటు వార్త ప్రయాణించడానికి ఆధారం దొరికింది చెట్టు నీడలో రచ్చబండ దగ్గర చెప్పుకున్న కబుర్లు చల్లగా గాలితో పాటు ప్రయాణించి ఊరంతా చక్కర్లు కొట్టేస్తాయి. సమయం ప్రకారం మనకు దృశ్యశ్రవణ యంత్రంవచ్చి ప్రతి నిమిషం వార్త చేర వేస్తోంది. వార్తలు చెప్పేవారిని ఆ వార్తకు కారణమైన వారిని వారి హావభావాలను లైవ్లో చూపిస్తోంది. సాంకేతికత ఇంకా పెరిగి ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఒకటేమిటి అన్ని కబుర్లు చెప్పేస్తున్నాయి. కళ్ళు మాట దేవుడెరుగు కాలం గడపడానికి బోలెడన్ని వార్తలు. ఎవరైనా మాట్లాడిన మాటకి పూర్వకాలంలో ఆధారం ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో వాయిస్ రికార్డింగ్ వచ్చి చాలా సమస్యలు తగ్గిస్తున్నాయి. అది మంచి మాటైనా చెడుమాటైనా ఒక ఆధారం వాయిస్ రికార్డింగ్. టెక్నాలజీఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్లను దాచి ఉంచే స్థాయికి చాలా సమస్యలను తగ్గిస్తోంది. లేకపోతే గాల్లో మాట్లాడిన మాటకి ఎక్కడ ఆధారం ఉండట్లేదు. ఏ సమాచారం అయినా ఉన్నది ఉన్నట్టుగా చేరితే ప్రపంచంలో సమస్యలు ఉండవు.