హమ్మయ్య.... దక్షిణాయణం వెళ్లిపోయింది - వి. మూర్తి​

dakshinayana and uttarayana

సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని బట్టి, విభజించిన కాల మానం ప్రకారం ఆరు నెలలు దక్షిణాయణం, ఆరు నెలలు ఉత్తరాయణం. ఇంగ్లీషు కాలమానం ప్రకారం జనవరి 15 నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం. దీన్ని పుణ్యకాలం అంటారు. దీనికి చిన్న ఉదాహరణ భారతంలో వుంది. భీష్ముడు అర్జునుడి బాణాల తాకిడికి గురై కింద పడ్డాడు. ఇచ్చామరణం వరంగా పొందిన మహానుభావుడు. అంపశయ్యపై అలా కొంతకాలం వుండి అయినా ఉత్తరాయణంలో ప్రాణాలు విడవాలనుకున్నాడు కానీ, దక్షిణాయణం లో కాదు. అంతటి పుణ్యకాలం అంటారు ఉత్తరాయణాన్ని.

ఇక్కడ మరో విషయం కూడా వుంది. మార్గశిర, పుష్య మాసాలు యముడి కోరలు అని కూడా అంటారు. జూలైలో దక్షిణాయణ సంచారం మొదలయింది మొదలు టపా టపా మరణాలు సంభవించడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెల మొదటి పదిహేను రోజులు మరీనూ, పెద్ద పెద్ద తలకాయలు పరలోకయాత్ర కు పయనమైపోతుంటాయి. ఈ సారి ఎవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉదయ్ కిరణ్ , అంజలి, శ్రీహరి లాంటివారు మరణించారు. నిజంగా భయం కలిగించే రోజులు ఇవి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవయస్సు వున్నవారికి. ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఉత్తారయణ మరణం రాదని ప్రతీతి. అందుకే సంక్రాంతి దాటేస్తే, కనీసం ఆరు నెలలు ఆయుర్దాయం ఎక్స్ టెన్షన్ వచ్చేసినట్లే. బతుకు టెన్షన్ తప్పినట్లే.

నిజానికి వాతావరణం కూడా అలాగే సహకరిస్తుందేమో, దక్షిణాయణానికి. ఎముకలు కొరికే చలి. ఉబ్బసానికి దోహదం చేస్తుంది. శరీరాన్ని నీరసింపచేసి, శుష్కింపచేస్తుంది. రోగం ఇనుమడించడానకి ఎన్ని కావాలో అన్ని అవలక్షణాలు ఈ సీజన్లో వుంటాయి. బహుశా అందుకనేమో ఈ డిసెంబర్ నెల, జనవరి మొదటి పదిహేను రోజులు అంత భయపెట్టేస్తాయి.

మొత్తానికి ఇప్పటికి దక్షిణాయణం వెళ్లిపోయింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఇక సహజంగానే ఉష్ణదేశమైన మనదేశంలో ఎండలు క్రమ క్రమంగా విజృంభించడం ప్రారంభిస్తాయి. మహా శివరాత్రి, ఉగాది, శ్రీరామ నవమి లాంటి విశిష్ట తిధులు ఈ ఉత్తరాయణంలోనే వస్తాయి. విష్ణు కళ్యాణ మహోత్సవాలు ఇప్పుడే. ఒక్క ఉగాది మినహా మిగిలినవి అన్నీ భగవంతుడి ఉత్సవాలే. అందుకనేమో ఈ ఉత్తరాయణం అంతటి పుణ్యాయణం. మహా పుణ్యం చేసినవారే ఉత్తరాయణంలో మరణిస్తారని ప్రతీతి. ఉత్తరాయణంలో ఉరేసుకున్నా మరణం రాదని సామెత.

అంటే దక్షిణాయణంలో మరణించినవారంతా పాపులనీ, ఉత్తరాయణంలో పుణ్యాత్ములకే మరణం వస్తుందని అనుకోనక్కరలేదు. అసలు పాపం పుణ్యం ఏమిటన్నది ఆలోచించాలి. బతికి వుండగా, ఒకరికి మేలు చేయకున్నా, కీడు చేయకుండా వుండగలగడగడమే పెద్ద పుణ్యకార్యం. పుణ్యకార్యాలంటే పూజలు పురస్కారాలే కాదు. గుళ్లు గోపురాలు తిరగడం అంతకన్నా కాదు.  బాబా చరిత్రలో ఆయన అంటారు..'నేను పక్కన ఉన్నపుడు సరే, లేనప్పుడు నాకు అర్పించి, తినగలవా' అనే రీతిలో. ఇక్కడ భగవంతుడు ఎవరో కాదు. నరుడు.. నారాయణుడు ఒక్కరే. ఒకరికి పెట్టి తినడం అన్నది అలవాటు చేసుకోవాలి. ఇంటికి వచ్చిన వారిని సాదరంగా స్వాగతించగలగాలి. ఉపకారం చేసినవారిని విస్మరించకూడదు. విశ్వాసం అన్నది నరాల్లో ప్రవహించాలి. ఇవన్నీ పుణ్యకార్యాలే. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం లేనపుడు కూడా మనకు పరిచయం వున్న పదిమంది అయినా మనను గుర్తుంచుకోవాలి. అంతకంటే పుణ్యం ఏమీ వుండదు. అలాంటి వారికి ఏ ఆయణంలో మరణం వచ్చినా వచ్చిన నష్టమూ లేదు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి