ధర్మాచరణే శ్రేష్టం - సి.హెచ్.ప్రతాప్

Dharmacharane sreshtam

ధర్మార్ధ, కామ,మోక్షములను పురుషార్ధములని మన వేదాలు నిర్వచించాయి. అంటే ఏన్నో వేల జన్మల అనంతరం లభించే ఈ అపురూపమైన మానవ జన్మ ఎత్తిన ప్రతీవారు తప్పక సాధించవలసిన విషయములివి అని అర్ధం. ఈ పురుషార్ధముల వరుస క్రమాన్ని పరిశీలిస్తే ధర్మం ప్రధమ స్థానం లో వుంది.దీనిని బట్టి ధర్మాచరణ మరియు ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించవల్సిన ఆవశ్యకతను మన వేదాలు నొక్కి వక్కాణించాయి.

జీవితం అంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో, అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేయడం? ఆ పోరాటమేదో ధర్మం కోసం పోరాడు. అదే నిన్ను సదా కాపాడుతుంది. ”నువ్వు నమ్మినవాళ్ళు మోసం చేయవచ్చేనేమో కానీ నువ్వు నమ్మిన ధర్మం నిన్ను ఎన్నటికీ మోసం చేయదు” అన్నాడు గౌతమ బుద్ధుడు.

“ధర్మో రక్షతి రక్షితః అన్న వేదోక్తి ప్రకారం ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది కాబట్టి ధర్మరక్షణం స్వరక్షణమే అవుతుంది. ద్వేషంతో ద్వేషాన్ని శాంతించడం అనేది జరగనే జరగదు. ద్వేషాన్ని అనురాగం చేతనే శాంతింపజెయ్యాల్సి ఉంది. మన జీవితాలు నిత్యాలు కావు. శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. మనలోని ద్వేషాగ్నిని ప్రేమామృతం చేత తడిపి చల్లారుస్తూ ఉండాలి.
ఐహిక విషయ వాంచలు, భోగ భాగ్యాలే కాక మైధునముల విషయములను కూడా ధర్మయుతంగానే మనం సాధించుకోవాలి , అనుభవించాలి. మనం వేసే ప్రతీ అడుగు, ప్రతి ఆలోచనా కూడా ధర్మానుకూలంగానే వుండాలి. ఎంతటి మహా భక్తుడైనా వీటిని అధర్మయుతంగా సాధించాలని యత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు.

రాక్షసరాజైన హిరణ్య కశిపుడు దేవతలను లొంగదిసుకోవడానికి బ్రహ్మ దేవుని గూర్చి అతి కఠోరమైన తపస్సు చేసాడు. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని అడిగితే అజ్ఞానం, గర్వాహంకారములతో తల్లి కడుపులో నుండి పుట్టక,రాత్రి, పగలు కాక, మనిషి, జంతువు కాక నేలమీద, ఆకాశం లో కాక మరణించకుండునట్లు వరం పొందాడు. వరం పొందాక మరణమును జయించానన్న అహంకారంతో విర్రవీగి ఎన్నో వర్ణింప శక్యం కాని దుర్మార్గాలను చేసాడు. ఫలితంగా అతని పాపం పండే నాటికి శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్ధం నారసింహావతారమును ఎత్తి హిరణ్య కశిపుని సంహరించాడు. హిరణ్య కశిపుని ఘోర తపస్సు అధర్మ యుత కోరికలకు , నడవడికకు బలైపోయింది.
యతోధర్మస్తతో కృష్ణః, యతోకృష్ణస్తతోజయః’ అని మహాభారత వాక్యం అంటే ‘ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో, అక్కడ దైవం తనను తాను ఆవిష్కరింపజేసుకుంటాడు.’ అని పై వాక్యం అర్ధం.
మనల్ని ధర్మం ధరిస్తే, ధర్మాన్ని భగవంతుడు ధరిస్తాడు. ధర్మం అంటే ఆధారం అనే అర్థం కూడా ఉంది. రైలుబండికి పట్టాలు ఎలా ఆధారమో! బతుకుబండికి ధర్మం ఆధారం.

" స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేవ మార్గేణ "అనే శ్లోకం లో పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!అందరూ ధర్మ మార్గాన్నే అనుసరించుదురు కాక అని ప్రవచిస్తోంది వేదం. ధర్మం ఆచరించని జీవితం వ్యర్ధమే కాకుండా జీవితానికి వీసమెత్తు విలువ కూడా వుందదు. ధర్మాన్ని ఆచరిస్తే భగవంతుని అనుగ్రహానికి ప్రాప్తులం అవుతాం. ధర్మాచరణే ఈ బ్రతుకు అనే రైలుబండిని పట్టాలపై సక్రమంగా నడిపించి
అంతిమ లక్ష్యానికి సురక్షితంగా చేరుస్తుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి ధర్మబద్ధంగా జీవించడమే మానవుడి విధ్యుక్త ధర్మం కావాలి

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్