పాట - M chitti venkata subba Rao

Paata

పాట మనసును పరవశింపజేసేది పాట.

మనసుకు ఆనందాన్ని ఇచ్చేది పాట. అందమైన పదాలన్నీ రాగబద్ధంగా తాళబద్ధంగా అమర్చడమే పాట. ఒక మొక్కకు విరబూసిన పువ్వులన్నింటినీ దారంలో అందంగా గుచ్చితే ఒక పూలమాలవుతుంది . అలాగే భాషలోని అందమైన పదాలు సన్నివేశానికి తగినట్లుగా వరుసగా అమర్చడమే పాట. అన్నిపూలు దారంతోటే గుచ్చుతారు. కానీ కొన్ని మాలలు మాత్రమే దేవుడి మెడలో చేరుతాయి. అలాగే కొన్ని మాలలు వధూవరులకు అలంకరణగా మారుతాయి.

కవి అన్ని పాటలని ప్రసవ వేదన అనుభవించి వ్రాస్తాడు. ఏ పాట ఎవరికీ నచ్చుతుందో ఎవరికి తెలుసు. అమ్మ పాడిన జోల పాటతో బిడ్డ హాయిగా నిద్రపోతుంది ఆ బిడ్డకి రాగం తెలియదు తాళం తెలియదు. కానీ జోల పాట మార్కులన్నీ కొట్టేసింది .పల్లె జనం పాడుకునే పాటల్లో రాగం తాళం కనపడవు. కానీ ఆ పాట వారి అలసట తీరుస్తుంది. ఆనందంగా పనిచేయిస్తుంది. మనకు కూడా గుండెకు హాయినిస్తుంది. ఒక సన్నివేశానికి తగినట్లుగా వచ్చిన భావావేశమే పాట. అది భక్తి పాట కావచ్చు, విషాద గీతం కావచ్చు, ప్రేమ పాట కావచ్చు దేశభక్తి గీతం కావచ్చు భజన పాట కావచ్చు. భగవంతుడే పాటకు మురిసిపోయి అన్నమయ్య త్యాగయ్య రామదాసు లాంటి మహానుభావులను తనలోనే ఐక్యం చేసుకున్న చరిత్రలు అన్ని మనకు తెలుసు. చెట్టుకింద కాపురం ఉంటూ తనకు నచ్చిన భాషలోని పాటలను ఆనందంగా వింటూ జీవితం వెళ్ళబుచ్చే అనేక వందల కుటుంబాలను రోడ్డు పక్కన మనం రోజు చూస్తూనే ఉంటాం.

మనసుని మురిపించి ,మరిపించేది పాట. మరో లోకానికి తీసుకుపోయేదే కూడా పాట. ఏ కళకైనా అంత శక్తి ఉంది. కళలన్నీ భగవత్ స్వరూపాలే. ఒక భవనం నిర్మించాలంటే ముందుగా పునాది వేయాలి. అలాగే పాటకి పునాది పల్లవి. పాటకి తొలిమెట్టు అని చెప్పొచ్చు .

పల్లవికి అనుగుణంగా చరణం ఉంటుంది. పాటకి ముఖ్యం పల్లవి మరియు చరణం. చరణం ఒక మేడమెట్టు లాంటిది. పాటని ముందుకు తీసుకు పోతుంది. పల్లవి చరణం సమానంగా పోటీపడి నడిపిస్తేనే అందమైన పాట అవుతుంది. పాట ఎప్పుడు పుట్టింది అంటే ఎవరు చెప్పలేం. పురాణాలలో నారదుడు తంబుర మీటుతూ హరినామ స్మరణ చేస్తూ లోకాలన్నీ తిరుగుతుండేవాడని చదువుకున్నా ము. అలాగే త్యాగయ్య అన్నమయ్య రామదాసు సప్తస్వర బద్ధంగా భగవంతుని కీర్తిస్తూ భగవంతుని చేరుకున్నారని చదువుకున్నాము. వారు చూపించిన సంగీతపు బాటలోనే మన పాటలన్నీ పయనిస్తున్నాయి అలాగే మన పూర్వీకులు పాడుకునే భజన పాటలు కూడా భక్తి పారవశ్యంలో ముంచేస్తాయి.

ఈనాటి కూడా పల్లెటూర్లో కొన్ని దేవాలయాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అలాగే నగర సంకీర్తన కూడా ఆ కోపకు చెందినదే. ఆ పాటలో నీతి ఉంటుంది. అభం శుభం తెలియని ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు అణు కువుగా ప్రవర్తించమని పెళ్లి కూతురికి జాగ్రత్తలు చెప్పే పాట. అదే అప్పగింతల పాట. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరితో మెలగవలసిన పద్ధతులు బయట వారితో నడుచుకోవాల్సిన తీరు తెన్నులు అందంగా చెప్పాయి ఆ పాటలు. పాట అంటే మంచి చెడులు చెప్పడమే కాదు మనసుకు అలసట తీరుస్తుంది. పనిలో ఒత్తిడి తగ్గిస్తుంది. అలా పంట చేలో కలుపుతీస్తూ వరి కోతల కోస్తూ పాడుకునే పాటలు. అక్షర జ్ఞానం లేకపోయినా పాట అందరిని మురిపిస్తుంది.

నండూరి వారి చేత ఎంకినాయుడు బావ పాత్రలు సృష్టించి వారిద్దరి దాంపత్య బంధం లోని ఊసులు విరహవేదనలు పాటల రూపంలో ప్రజల మనసులు దోచుకున్నాయి. పండుగలలో ముఖ్య పాత్ర వహించేది కూడా పాటే. సంక్రాంతి పండుగకు గొబ్బి పాటలు తెలుగు వారి లోగిళ్ళలో మార్మోగుతుంటాయి. పరాయి రాష్ట్రంలో బతుకమ్మ పండక్కి పాటే ప్రధానం. పాటతో పాటు చేసే నృత్యం కనువిందు చేస్తుంది. సాంప్రదాయ బద్ధంగా చేసుకునే ఈ ఉత్సవం విదేశాలకు కూడా పాట తీసుకుపోయింది. జోల పాట పాడితే నిద్రపోని ఏ పసిబిడ్డ ఉండడు. అమ్మ గొంతు లోని పాట వినగానే టక్కున ఏడుపాపేస్తాడు. లాలి పాట, జోల పాట జ్ఞానం తెలిసిన మనకే ఎంతో హాయిని ఇస్తాయి . అందులో ప్రాచుర్యం పొందినది జో అచ్యుతానంద జోజో ముకుంద అనే జోల పాట చరణంలో ముల్లోకముల నేలు ముమూర్తులారా అడ్డాలలో నేడు బిడ్డలైనా రా అంటూ ఆ పసిబిడ్డని భగవత్ స్వరూపంగా తలుస్తుంది తల్లి. మరొక లాలి పాట చందమామ రావే జాబిల్లి రావే వెండి గిన్నెలోన వేడి పాలు తేవే అనే పాట ప్రజాదరణ పొందింది. పాట పసిపిల్లలను నిద్రపుచ్చుతుంది. ముద్ద తినని మారాం చేస్తున్న పసిబిడ్డను మరిపిస్తుంది.

పాట పెళ్లిలో కూడా సందడి చేస్తుంది. వియ్యాల వారి పాటలుతో మగ పెళ్లి వారికి మర్యాదలు చేస్తుంది. ఆధునిక కాలంలో ఆ పాటలన్నీ మరుగున పడిపోయి విదేశీ సంస్కృతిని అలవర్చుకుంది. పెళ్లి పాటల్లో ఉండే సున్నితమైన హాస్యం వియ్యాల వారిని ఆనందింప చేసేది. ఆధునిక కాలంలో ప్రజాధరణ పొందినవి సినిమా పాటలు. సినిమాలో సన్నివేశానికి తగినట్లుగా పాట సృష్టించబడుతుంది. దానికి అనుగుణంగా హీరో హీరోయిన్లు చేసే నృత్యం సంగీత దర్శకుడు ఇచ్చే వాయిద్య సహకారం మరింత అందం తెస్తుంది. ఒకటా రెండా వందల కొలది సినిమా పాటలు ప్రేక్షకుల అభిమానాన్ని పొంది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి.

తెలుగు పాట ఇంత ప్రజాదరణ పొందడానికి వెనుక రచయిత అవిరళ కృషి కనపడు తోంది. పాట కూడా మారే కాలంతో పాటు కొత్త పుంతలు తొక్కుతోంది. మనసు బాగోలేనప్పుడు మందులా పనిచేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు తోడు ఇస్తుంది. మండే గుండెని చల్లబరుస్తుంది. కవులకు ఆదరణ ఇస్తుంది. ఈ జగతి ఉన్నంతకాలం పాట ఉంటుంది. పాటకి ఆదరాభిమానాలు కూడా ఉంటాయి. ఈ లోకంలో ఉన్న పాటల సృష్టికర్తలు అందరికీ సురలోకంలో ఉన్న ఆ మహానుభావులకి సహస్ర వందనాలు.

మరిన్ని వ్యాసాలు