‘ట్టు’త్రయం సదాస్మరామి - హైమా శ్రీనివాస్

TTu trayam Sada Smarami

మన భారతీయ సంస్కృతీ సౌరభాలు మూడు 'ట్టు' లలో ఇమిడి ఉన్నాయి. అవే కట్టు, బొట్టు, జుట్టు. మన వస్త్ర ధారణ ప్రపంచంలోనే మనకో ప్రత్యేకతనూ, గుర్తింపునూ, గౌరవాన్నీ, సభ్యతనూ అందిస్తున్నది.

కట్టు - పూర్వం నుంచీ మహిళలు చిన్నవారైతే గౌను, పరికిణీ జాకెట్, కాస్తపెద్దవారైనాక పమిటపావడ (పావడకు పమిటఅతికి కుట్టి ఉంటుంది, ఇప్పటివారికది తెలీకపోవచ్చు), ఆతర్వాత పరికిణీ,పమిట (పరికిణీకట్టుకుని, ముందు కుచ్చెళ్ళు పెట్టుకుని పమిటవేరేగా ధరించేవారు) (దీన్నే హాఫ్ శారీ అంటారు). వివాహమయ్యాక చీర వస్త్రధారణగా వస్తున్నది. పురుషులకైతే  పిలల్లకు నిక్కరు, పెద్దయ్యే కొద్దీ అడ్డపంచ, ఆతర్వాత గోచీపోసికట్టే పంచకట్టు (ఆంగ్లేయులు వచ్చాకే మనకు ప్యాంట్స్ వచ్చాయి).

ఇహ బొట్టు - దగ్గరకొస్తే, పూర్వం ఆడమగ అనే విచక్షణ లేక నుదుట కుంకుమ ధారణ తప్పని సరిగా ఉండేది. చిన్నపిల్లలైన అమ్మాయిలకు తిలకం, లేదా బియ్యం, లేక సగ్గుబియ్యం తో ఇళ్ళలో తయారు చేసిన నల్లని 'చాదు' బొట్టు తప్పని సరి.  పురుషులు నుదుట ముందుగా గంధం ధరించి దానిపై ఎర్రని కుంకుమ బొట్టు ధరించేవారు. ఇది హిందూత్వానికి గుర్తుగా ఉండేది.

జుట్టు దగ్గరికొస్తే స్వాతంత్ర్యానికి పూర్వం (ఆంగ్లేయులు మనదేశం లో క్రాఫులను ప్రవేశపెట్టకముందువిషయం) పురుషులకు సైతం స్త్రీలవలె జుట్టు ఉండేది, వారూ తలకు కొబ్బరినూనె రాచి దువ్విముడి వేసుకునే వారు. పురుషులు - వేదం నేర్చేవారూ, నేర్పేవారూ కూడా (పురోహితులుసైతం) అర్ధ ముండనంతో ఉండేవారు, వెనుక జుట్టు ముడివేసుకునేవారు. క్రమ క్రమంగా క్రాఫులు వచ్చి పురుషులకు జుట్టుబాధ పోయింది. మొట్ట మొదట క్రాఫు పెట్టుకున్న సాంప్రదాయ కుటుంబీకుల పిల్లల్ని వెలివేసినంత పనిచేశారంటే ఎవ్వరూ నమ్మరు. ఇహ స్త్రీల విషయానికోస్తే, బాలికలకు చిన్నపిల్లలైతే  రోజూ కొబ్బరినూనె రాచి రెండు జడలు వేసి, అప్పట్లో ఊలు ఉండేది (రిబ్బన్లు సైత ఆతర్వాత వచ్చాయి) దాన్ని చివర అల్లి కట్టే వారు. మరునాటి వరకూ తల చెదిరేది కాదు. కాస్త పెద్దయ్యాక జడగంటలతో ఒక్కజడ. అది నడుం దిగి పొడవుగా ఉండేది నల్లత్రచులా... (అలా తలకు కొబ్బరినూనె నిత్యం పెట్టడం వల్ల అరవై యేళ్ళొచ్చినా జుట్టు నెరిసేదికాదు, నేడు బాలనెరుపని పదిహేనేళ్ళకే తెల్లజుట్టూ, రంగులూనూ!) పెళ్ళై పిల్లలు పుట్టాక అంటే నడివయస్సు దాటాక జుట్టుముడి వేసుకుని తలపిన్నులు గుచ్చేవారు, దానిపై  పూల దండ. జడపిన్నులు ధనికులు వెండివి, బంగారువి ధరించే వారు. జడలో (కొప్పులో) కొప్పు బిళ్ళ ఉండేది. అవి స్తోమతను బట్టి వెండివి, బంగారువి ఉండేవి. దానికి రాళ్ళుపొదిగి అందంగా, వెలుగు, ఎండ పడితే మెరుస్తుండేవి. ఆచూడామణినే సీతమ్మ తనను చూసినట్లు ‘గుర్తుగా ఏదైనా ఇవ్వమని’ అడిగిన హనుమకు, ఇచ్చి రామునికి పంపుతుంది. జుట్టు దువ్వాక వెనక చిన్న పాయతీసి ముడిబిళ్ళకు వెనక ఉన్న రింగులో గుచ్చి పట్టి జడ అల్లేవారు. రానురానూ తల ముడుల రూపు రేఖలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి. ఇదంతా పూర్వభారత కధ.

మరినేడో! ఆధునిక కట్టు కాస్త ఎబ్బెట్టే! చిన్నపిల్లల నుండీ ఆడ మగ అనే తేడా లేనే లేదు. సమానత్వం మరి! ఐతే తమాషా ఆడవారు ప్యాంట్స్ వేసుకుని మగవారిని అనుసరిస్తున్నా, ఎంచేతో మగవారు మాత్రం చీరలు, పంజాబీ లు వేసుకోడం లేదు. భవిష్యత్తులో చూడాలిమరి!  కాస్తంత చదువుకున్నాలేకున్నా నవనాగరీకపు గాలిసోకి పల్లెల్లో సైతం అంతా చుడీధర్ లూ, ప్యాంట్సూ, అవేవీ అవే ఉతకక్క ర్లేనివీ, రంగుపోయినా ఫరవాలేనివీ, విస్త్రీఅక్కర్లేనివీ, బులుగు రంగువి అవే అందరికీనీ. ఆధునీకం తోపాటు సమానత్వం!

ఇహ బొట్టుకు డిమాండ్ లేనేలేదు. పునిస్త్రీలు సైతం కనీ కనిపించనిబొట్టు. బొట్టు నుదుట ధరిస్తే పాచి పట్టిన పాతకాలపు అనాగరికులనుకుంటారని. పేరంటాలపుడు ఖర్మకాలి వస్తే ఎవరికి బొట్టివ్వాలో ఎవరికి ఇవ్వరాదో తెలీదు. ఇచ్చినా అలా తీసుకున్నట్లు వేలు పెడతారు కానీ నుదుట ధరించరు చిన్నపిల్లలకు సైతం తిలకం లేదు. బొట్టుబిళ్ళల బిజినెస్ బాగాపెరిగి, రకరకాల, ఆకారాలు, రంగులబిళ్ళల ప్యాకెట్స్ లభ్యమవుతుండగా, అవి ఇష్టమున్నపుడు కనీకనిపించని ప్రమాణంలో ఉన్నవి  ధరిస్తారు. అవి ఒక్క ఐదు నిముషాలుండి ఊడి ఎక్కడోపడిపోతై!

ఇహ ఆధునికత - జుట్టు అంతావిరపోతే! విదేశాల్లో అనేక కారణాలవల్ల వారి ఆచారవ్యవహారాలతోపాటుగా వారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారు జుట్టు విధానం ఉంటుంది. ఐనావారు భారతీయులను అనుకరించి జడవేసుకోడం చీరకట్టు కోడం బొట్టుపెట్టుకోడం నేర్చుకుంటున్నారు. మనం మాత్రం విదేశీ సంస్కృతిని అరువుతెచ్చుకుని మనకు కానిదాన్ని అనుసరిస్తున్నాం. దురదృష్టవశాత్తూ అనుకరణ మన స్వభావమైంది.

పూర్వం తలంటుపోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటుంటేనే పెద్దలు "ఏంటది దయ్యంలా జుట్టువిరబోసుకోడం?" అని కోపగించేవారు. నేడు జుట్టు జడ వేసుకున్నవారిని చిత్రంగా చూట్టం వల్ల, ఆచిత్రం తమకెందుకని అంతా విరబోసుకోడం మొదలెట్టారు. బ్యూటీపార్లర్స్ సొమ్ముచేసుకోడం మొదలెట్టాయి. వీధికో బ్యూటీ పార్లర్, అంటే జుట్టుకత్తిరించే ఆధునిక విధానమన్నమాట!. హైర్ కటింగ్ సేలూన్ కు మరో ఆధినికనామం, డబ్బు అందంగా గుంజే సెంటర్. వెనుక స్త్రీలకు జుట్టుమీద కత్తెర తగలడ మంటే వెంకటేశ్వరస్వామికో, మరెదైనా మొక్కుబడికోతప్ప ఇలా ఉండేది కాదు. పెళ్ళికి పిల్లను చూసేప్పుడు పెద్ద జడ ఉందా లేదా అని ప్రత్యేకంగా గమనించేవారు.

మగ వారికి  సైతం రకరకాల క్రాఫులు, హిప్పీలనీ, కౌబాయనీ ఇంకా అనేకానేక విధాల క్రాఫులొచ్చి, జేబుల్నీ క్రాఫ్ చేసేస్తున్నాయ్! భర్తలకు విదేశాల్లో ఉద్యోగాలనగానే ముందుగా మగువలు బ్యూటీపార్లర్స్ కెళ్ళిజుట్టు తెగ్గోయించుకుని మెడలమీద పడేలా ఉంచుకోడం (ఇందిరాగాంధిక్రాఫ్ స్టైల్ అనేవారు) మొదటి చర్యగా మార పోయింది! మనం ఏసమావేశంలో నైనా ఎవరెవరో ఇట్టే తెల్సుకోవచ్చు. విదేశాలవారు, విదేశాల్లో ఉండివచ్చిన వారు, విదేశాలకు వెళ్ళేవారూ, స్వదేశాలవారూ ఎవరెవరో సులువుగా వారి కట్టు బొట్టు జుట్టులను గమనిస్తే ఇట్టే తెల్సిపోతుంది. కనుక 'ట్టు' త్రయం సదాస్మరామి.

 

*******************************************

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు