ఓహో పావురమా - M chitti venkata subba Rao

Oho paavuramaa

అది నిజంగా భాగ్యనగరమే. ఆ రాజ్యానికి పట్టపురా ణి మీద ప్రేమతో అందంగా నిర్మించబడిన ఆ నగరం నాలుగు దిక్కులలో ఉన్న పల్లెలను కలుపుకుని సువిశాల నగరంగా మారి పరిశ్రమలకు కర్మాగారాలకు ఆశ్రయమిచ్చి కాలుష్యం మాట దేవుడెరుగు పొట్ట చేత పట్టుకుని పట్టా పుచ్చుకుని పట్నం చేరిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఆశ్రయమిచ్చి కడుపు నింపే ఆ నగరం నిజంగా అక్షయ పాత్ర . రోజురోజుకీ నగరం పెరిగిపోతోంది. ఎర్రబస్సు ఎక్కి పట్నం చేరే జనం చెప్పక్కర్లేదు.కనీస అవసరాలు నేను కల్పించలేను బాబోయ్ అన్నా సరే కర్మాగారం పక్కనైనా ఉంటాం అని బహుళ అంతస్తుల భవనాలు విల్లాలు డూప్లెక్స్ హౌస్లు కట్టుకుని కాలక్షేపం చేసే జనం ఎంతోమంది. మాకు గుండెల్లో ధైర్యం ఉంది. జేబులో డబ్బుంది. ఒంట్లో ఓపిక ఉంది. కూత వేటు దూరంలో కూతవేసే మెట్రో రైలు బండి ఉంది.ఇంటి దగ్గర నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్ కైనా వెళ్లి వస్తామని జనం దూర దూరంగావెళ్లిపోయి చెయ్యి చాస్తే ఆకాశం అందే బహుళ అంతస్తుల భవనంలో కాపురం చేస్తున్నారు. మీట నొక్కితే పైకి మోసుకుపోయే యంత్రం ఉంది మాకు ఏమి భయం అంటూ ఆ అంతస్తుల్లో కాపురం చేస్తున్నారు. కోటి రూపాయలైనా పరవాలేదు ఉండడానికి ఓ గూడు కావాలి మాకు అంటూ దొరికిన చోటల్లా అపార్ట్మెంట్ కొనుక్కుని ఇంటివాడైపోతున్నారు. అలా నగరం నాలుగు మూలలకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎవరికి వారే యమునా తీరే. ఏ గదిలో ఎవరున్నారో తెలీదు. ఉదయం లేస్తే అన్నీ తాళాలు వేసి ఉంటాయి. రాత్రి చీకటి పడిన తర్వాత తెరుచుకుంటాయి. కనపడితే అందరికీ మొహం మీద చిరునవ్వు కనిపిస్తుంది కానీ నోటి వెంట మాట రాదు. తెల్లారి లేస్తే పల్లెటూర్లో అందరినీ పలకరించడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది.అపార్ట్మెంట్లో అందరికీ వాచ్ మెన్ శ్రీమహావిష్ణువు లాంటివాడు. వాడికి ఉన్నవి రెండు చేతులే . చేసే పనులు లెక్కలేనన్ని. అన్ని సమాచారాలు వాచ్ మెన్ చేరవేస్తుంటాడు. అందరి జాతకాలు వాడి దగ్గరే. ఆ అంతస్తుల భవనంలో యంత్రాలు మొరాయిస్తే వాళ్ల కష్టాలు దేవుడికే ఎరుక. ఎక్కడున్న వాళ్ళు అక్కడే గప్ చిప్. అలాంటి పట్నానికి ఎర్ర బస్సు ఎక్కి దిగే జనంతో పాటు ఆకాశంలో ఎగురుతూ పైసా ఖర్చు లేకుండా పట్నం చేరుకుంటున్న శాంతికపోతాలు ఎక్కువైపోయాయి. మేము అపార్ట్మెంట్లో ఉండలేకపోతున్నాం బాబు తప్పటo లేదు మాకు అoటు జనం బాధపడుతున్న పచ్చటి అడవి తల్లి ఒడిలో దొరికిన పండు ఫలము తింటూ కనబడిన పుల్ల ముక్కలతో ఆ గూడు కట్టుకుని ఆ చెట్టు తల్లి మీద హాయిగా కాపురం చేసుకునే శాంతిక పోతాలు ఏం కొంపలు మునిగిపోయాయో పైసా ఖర్చు లేదని ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ ఈ భాగ్యనగరంలో బహుళ అంతస్తుల భవనాల మీద కాపురం పెట్టేస్తున్నాయి. మాట వచ్చిన మనిషిలాగే ఈ పక్షులకు కూడా అడవి తల్లి అంటే బోర్ కొట్టిందేమో పాపం. ఈ నగరంలో పక్షి ప్రేమికులు బస్తాల కొద్దీ చిరుధాన్యాలు కొనుక్కుని తమ డాబాల మీద విసిరి ఆ పావురాలని అందంగా ప్రేమిస్తుంటే అక్కడ అడవి తల్లి నిత్యం రొద చేసే పక్షులు లేక భయంకరంగా అరిచే పెద్ద పులులు సింహాలు లేక దీనంగా అర్త నాదం చేసే జింకలు లేక నిశ్శబ్దమైపోయింది. భయంకర జంతువులన్నీ గవర్నమెంట్ వారు అద్దాల గూడులో బంధించేసి రుసుము వసూలు చేసి చూపిస్తున్నారు. రెక్కలు ఉన్న పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయి కనబడినచోటల్లా నగరంలో కాపురం పెట్టేసి పక్షుల ప్రేమికులకి శాంతిని అపార్ట్మెంట్ వాసులకు అశాంతిని కలగజేస్తున్నాయి. ఎంత కట్టుదిట్టం చేసినా సందు దొరికితే చాలు లోపలికి దూసుకుంటూ వచ్చి గదిలో కాపురం పెట్టేస్తున్నాయి. ఏo అడవి తల్లి అన్నం పెట్టడం లేదా అని అడిగితే కన్నతల్లిని నేను ఎందుకు అన్నం పెట్టకుండా ఉంటాను అని అడవితల్లి సమాధానం చెబుతోంది. మరి ఎందుకు పట్టణం వచ్చేస్తున్నావని శాంతిక పోతాల్ని ప్రశ్నిస్తే అక్కడ అయితే మేము ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్లి పొట్ట పోషించుకోవాలి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు పిలిచి మరీ కడుపు నింపుతున్నారని ఆనందంగా సమాధానం చెబుతున్నాయి పావురాలు. నిజమే చాలా చోట్ల తమ మానసిక ఆనందం కొద్దీ నగరవాసులు రోజు ఈ పావురాలకు ఆహారం పెడుతున్నారు. ఇది కొంతమంది తమకు ఆనందం ఇస్తుందని మరి కొంతమంది ఇది పుణ్యకార్యమని చెబుతున్నారు. మరి బహుళ అంతస్తుల భవనంలో ఎందుకు కాపురం చేస్తున్నావ్ అని అడిగితే ఇక్కడ గూడు కట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. అక్కడ అడవి తల్లి ఒడిలో ఎప్పుడూ భయం భయంగా ఉండేవాళ్ళం. వేటగాళ్ల తుపాకీ దెబ్బలకు బలి కావాల్సి వస్తుందని అలాగే పెనుగాలులు వీచినప్పుడు గూడు పగిలిపోతుందని భయం భయంగా కాపురం చేసేవాళ్ళం. దానికి తోడు అడవి అంతా ఖాళీ చేసేస్తున్నారు. ఇంకెక్కడ ఉంటాo. మరి ఇక్కడ ఏ అయ్య అయినా దయ తలచిఇచ్చినాలుగు గింజలు వేయకపోతే ఆ అపార్ట్మెంట్లోని చెత్తబుట్టలోకి దూరితే మా కుటుంబాలన్నింటికీ సరిపడా ఆహారం దొరుకుతుంది నిత్యం. ఎందుకంటే నగరవాసులు తినేది తక్కువ పారవేసేది ఎక్కువ. మాకు రోజు రకరకాల రుచులు అలవాటు చేశారు ఈ నగర వాసులు. మా ప్రాణం ఇక్కడ హాయిగా ఉంది మీకు ఎలా ఉందో మాకు తెలియదు కానీ అంటూ పావురాలు ఆనందంగా చెబుతున్నాయి. పూర్వం ఎన్నో ప్రేమ సందేశాలు, శాంతి సందేశాలు, యుద్ధ సందేశాలు మోసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు మీకు ఆధునిక సౌకర్యాలు వచ్చి మర్చిపోయారు కానీ మీకు మాకు ఎన్నో తరాల నుంచి అవినాభావ సంబంధం ఉంది అని పావురాలు ఇప్పుడు మీకు మేము ఎందుకు నచ్చట్లేదు అని పావురాలు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఒకటే ఆ పాటలు చలనచిత్రంలో చూడడానికి బానే ఉంటాయి మా పూర్వీకులు శాంతి సందేశాలు పంపేటప్పుడు తెల్ల పావురాలు ఎగరేసేవారు చూడ్డానికి అదీ బానే ఉంది కానీ ఈమధ్య కొంతమంది ఇంటిలో పావురాలు కూత మంచిది కాదని మమ్మల్ని భయపెడుతున్నారు. ఏది నిజమో ఏది అబద్దమో మాకు తెలియదు. ఆ కూత వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మాకు నువ్వంటే ఎప్పుడు ఇష్టమే. ఇప్పుడు చంటి పిల్లలు విసర్జించే మలం కూడా మేము ముట్టుకోవడం లేదు. మాకు అధు నాతన సౌకర్యాలు వచ్చేసేయ్. డైపర్లొచ్చి మమ్మల్ని కాపాడాయి. అలాంటిది నువ్వు విసర్జించే మల o ఎవరు బాగు చేస్తారు మా ఇంట్లో. పైగా నీ రెక్కలు చూడడానికి బాగానే ఉంటాయి కానీ వాటి నుండి జారిపడే ఈకలు ఇల్లంతా ఎగురుతుంటే ఏ మగాడు ఊరుకుంటాడు చెప్పు అంటూ ఆడవాళ్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దానికి తోడు ఇల్లంతా వాసన. భరించలేకపోతున్నాము. మేము ఫ్యాక్టరీల వాసనే భరిస్తామా. వాహన కాలుష్యమే పీలుస్తామా మళ్లీ కొత్త బాధ ఒకటి ఎలా బతకమంటావు చెప్పని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు. అంతేకాదు ఊపిరితిత్తులు వ్యాధులు కూడా ఈ ఎగిరే పావురాల మూలాన వస్తున్నాయని పేపర్లో చదువుతున్నాము. నగర జీవనం చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇలాంటి కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడితే ఎలా బతకమంటావు నగరంలో. నీ పొట్ట కొట్టలేం. నిన్ను వలవేసి పట్టించలేం. మాకు పాప పుణ్యాలు అంటే నమ్మకం ఉంది. మరి ఎలాగా. ఒకపక్క శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి పావురాలతో జాగ్రత్త అంటూ పేపర్లలో సందేశాలు ఇస్తున్నారు. మరి వాటిని చూసినప్పుడల్లా మాకు వణుకు పుడుతోంది. నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు. ముద్దొస్తావ్. మా చంటి పిల్లలు అన్నం తినమని మారం చేస్తే నిన్ను చూపించి నాలుగు ముద్దులు పెట్టుకుంటూ రోజు కాలక్షేపం చేస్తున్నాం ఆకాశంలో నువ్వు ఎగురుతుంటే ఎంత బాగుంటావో. పిల్లలకు సెలవులు కదా అని నాలుగు రోజులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళితే తిరిగి వచ్చి తలుపు తీస్తే అబ్బా భయంకరంగా ఉంది . ముక్కులు బద్దలైపోయే వాసన. అడవిలో ఉన్నట్టు అనిపించింది. ఏమో మా బాధలు దేవుడికే ఎరుక. ఆ మధ్య ఎప్పుడో పేపర్లో చదివినట్టు గుర్తు ఈ భాగ్యనగరంలో ఆరు లక్షల పావురాలు ఉన్నాయని వాటి సంఖ్య పదిలక్షలకు పెరిగే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అందించిన సమాచారం. మరి ఈ సర్వే ఏ రకంగా చేశారో మనకు తెలియదు. వాటి మూలంగా ప్రమాదం లేకపోతే అవి ఎక్కడ ఉంటే మనకేం బాధ. అపార్ట్మెంట్ లోపలకొచ్చి ఇంటిలో కాపురం పెడితే మనకి సమస్య కానీ బయట కాపురం చేస్తే మనకి ఏ గొడవ లేదు. చిన్నప్పుడు పంచతంత్రం కథల్లో పావురం వేటగాడు గురించి చదువుకున్న కథలు ఐకమత్యం యొక్క విలువ తెలియచేస్తా యి.మరొక ముఖ్య విషయం ఎక్కడో చదువుకున్న గుర్తు జంట పావురాల్లో ఏదైనా పావురం చనిపోతే రెండో పావురం మళ్లీ ఏ పావురంతోను జత కట్టదుట. చనిపోయే వరకు అలాగే ఉండిపోతుందిట. ఏది ఏమైనా పావురమా నువ్వు అలా ఆకాశంలో అందంగా ఎగిరితేనే బాగుంటావ్. నీకు అందమైన రెక్కలు ఉన్నాయి. ఎక్కడికి కావలిస్తే అక్కడికే వెళ్లిపోవు. పెద్ద పులులకి సింహాలకి అభయారణ్యాలు ఉన్నట్లే పావురాలకి కూడా ప్రభుత్వం గూడు కల్పించి అపార్ట్మెంట్ వాసుల నగరవాసుల భయాన్ని తొలగిస్తారని ఆశిద్దాం. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి