ఇమేజ్ బిల్డింగ్ అనేది వినే ఉంటారు చాలామంది. పెద్దపెద్ద రాజకీయనాయకులకీ , వివిధరంగాలలోనూ ఏదో కొద్దో గొప్ప పేరున్నవారికీ సంఘంలో వారికుండే ఇమేజ్ గురించి అంతగా శ్రమపడఖ్ఖర్లేదు. కారణం మీడియాని జేబులో పెట్టేసికుంటే చాలు, మిగిలినదంతా వాళ్ళే చూసుకుంటారు. అది ఓ పత్రిక అవొచ్చు, లేదా ఓ టీవీ చానెల్ అవొచ్చు. ఇక్కడ గొడవేమిటంటే కొద్దిగా డబ్బులు ఖర్చుపెట్టాల్సొస్తుంది. అప్పనంగా ఎవడూ పబ్లిసిటీ ఇవ్వడుగా మరి? డబ్బులకేముందిలెండి, రాజకీయనాయకులకి దానిగురించి అంత శ్రమ పడఖ్ఖర్లేదు. వారి కుటుంబంలో ఏ ఒక్కడు పెద్ద పదవిలో ఉన్నా సరిపోతుంది. మిగతాదంతా అల్లుకుంటూపోవచ్చు. ఎంత ఊరూ పేరూ లేనివాడైనా సరే. ఒక్కసారి మీడియా దృష్టిలో పడ్డాడంటే చాలు, వాళ్ళే వీడివెనకాతల పడతారు. ఉభయ తారకం కదా, వీడికిపేరూ వస్తుంది, ఆ టీవీ చానెల్ కి అదేదో TRP ట అదీ పెరుగుతుంది. చూడ్డానికి మనలాటి బడుధ్ధాయులకి కొదవ లేదు.
కానీ మనలాటి "ఆంఆద్మీ" లకి ఓ ఇమేజ్ బిల్డింగు అనే ప్రక్రియ కొద్ద్దిగా శ్రమతో కూడిన పని. మనంతటమనమే చేసుకోవాలి తప్ప వేరే మరొకడు అంతగా సహాయపడడు.పైగా మన అసలు ఇమేజ్ తెలిసినవారిద్వారా ఎప్పుడు బయటపడిపోతామో అనే భయమే. పైగా ఈ "తెలిసినవారు" మన ఇంట్లోనే, మన ప్రక్కనే ఉండే ఛాన్సుకూడా ఉంది. ఆ వ్యక్తి మన కొడుకవొచ్చు, భార్య అవొచ్చు. వారేదో మనకి వెన్నుపోటు పొడుస్తారనికాదు.స్వతసిధ్ధంగా వాళ్ళు మంచివారే,మన శ్రేయస్సుకోరుకునేవారిలో ఎప్పుడూ ముందరే ఉంటారు.కానీ కాలం కర్మం కలిసిరానప్పుడు, జరిగే విపరీతం అన్నమాట. యాధాలాపంగా ఉన్నమాట కాస్తా బయటపెట్టేస్తూంటారు. అది చాలదూ మన సొసైటీలో మన ఇమేజ్ పాడవడానికీ?
ఈ ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్ లో రాత్రనకా పగలనకా శ్రమపడేవారి గురించి ముందుగా మాట్టాడుకుందాం. ప్రభుత్వంలో పెద్ద పదవిలో ఉండేవాళ్ళనే తీసికోండి, ఎప్పుడు చూసినా మొహం ముటముటలాడిస్తూంటారు. నవ్వుతూ మాట్టాడితే, ఎక్కడ తన క్రింద పనిచేసేవారు నెత్తికెక్కేస్తారో అని భయం, లేదా ఓ జాగ్రత్త అనుకోండి. ఆఫీసులో " పులి" అని ఓ పేరు సంపాదించేస్తారు. సజావుగా శలవులు ఇవ్వడు. రికమెండేషన్లు తీసికుని ఎవ్వడూ రాడు.చాయ్ తనుత్రాగడూ, ఇంకోణ్ణి త్రాగనీయడూ. ఏం తెస్తే ఏం పాపమో అని ప్రతీవాడు ఎవరి పరిధిలో వాళ్ళుంటారు. ఇది ఒకలా చూస్తే పరవాలేదనుకోండి, కానీ ఆఫీసులో పనిచేసే ప్రతీవాడిదగ్గరనుండీ , అంతలా Strict officer అని పేరుసంపాదిస్తే చివరకి ఈయనకి ఒరిగేదేమిటిట? రేపెప్పుడో రిటైరయినప్పుడో, లేక ఏ బదిలీమీదో వెళ్ళేటప్పుడో, పార్టీ ఇద్దామనుకుంటే ఒఖ్ఖడూ చందా ఇవ్వడు. చివరకి ఆయనగారు సామాన్లు ట్రక్కులోకి ఎక్కించేటప్పుడు కూడా మొహం చాటేసికుంటారు. పేద్ద గొప్పగా Strict officer అని ఓ పేరు తెచ్చుకున్నాడుగా, అనుభవించనీ.. దీనికి సాయం ఆయన బదిలీ అయి వెళ్ళే ఆఫీసువాళ్ళకి కూడా ఉప్పందించేస్తారు .. ఫలానా ఆయన వస్తున్నాడే ఆయనో రాక్షసుడండి బాబూ. మాకు వదిలాడు, ఇంక మీ సంగతి చూస్తాడు.. అంటూ. ఎందుకొచ్చిన ఇమేజండి బాబూ.. పాపం తెలిసినవారంటూనేఉంటారు-- ఆయన బయటకు అలా కనిపిస్తాడేకానీ గుండె నవనీతం అండీ ... ఎవడిక్కావాలి ఆయన గుండె నవనీతం అయితేనేమిటి, పంచామృతమయితేనేమిటి, ఒఖ్ఖణ్ణి చూపించండి ఆయనద్వారా సహాయం పొందిన వాణ్ణి .. అందుకే Being good is not enough.. you should also appear to be good. అంటూంటారు.
ఈ కోవకే చెందినవారిలో రైల్వేలో పనిచేసే టీటీ లు. వీళ్ళొకళ్ళు ఛస్తే ఎవరినీ దగ్గరకు రానీయరు. ఎవడిని పలకరిస్తే ,వాళ్ళు చివరి క్షణాల్లో స్లీపరో బెర్తో కావాలంటారేమో. పైగా తెలిసున్నవారిదగ్గర మొహమ్మాటమొకటీ. రైల్వేలో పనిచేసే టీటీలందరూ అలాటివారనికాదూ, కనీసం నూటికి ఇరవైమందైనా ఉంటారు. అలాగే బ్యాంకుల్లో పెద్ద పెద్ద పదవిల్లో ఉండేవాళ్ళొకళ్ళు, ఎవరితోనూ అంతగా పరిచయాలు పెట్టుకోరు. ఏ ఫంక్షనుకైనా వెళ్ళినప్పుడు కూడా, తోటి బ్యాంకు అధికారులతోనే కానీ, మిగిలినవారిని చూసి ఓ నవ్వైనా నవ్వరు.ఎక్కడ నవ్వితే బ్యాంకునుండి లోనిప్పించమంటాడో అని భయం. కనీసం ష్యూరిటీ సంతకానికైనా ఇరికించేస్తాడేమో అని ఇంకో భయం. నేను ఆమధ్యన మా స్నేహితుడి కుమార్తె వివాహానికి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవం.
అంతగా హానికరం కాని, ఇమేజ్ బిల్డింగు ప్రక్రియకి వద్దాం. మనలో చాలామంది చేసేదే. ఇంట్లో పెళ్ళాం పిల్లలతో ఎలా ఉన్నా, బయటివాళ్ళ దృష్టిలో మాత్రం పెద్ద హీరో ల్లా కనబడాలి. వాళ్ళనుకోవాలన్నమాట-- అబ్బ ఈయనది ఎంత హెల్పింగు నేచరో, ఆవిడెంత అదృష్టవంతురాలో అని! రైల్వే ప్రయాణాల్లో చూస్తూఉంటాం, తను పిల్లా పాపలతో వెళ్తూంటాడు. ఎవరో చిన్న పిల్లతోనో పిల్లాడితోనో ప్రయాణం చేస్తూన్న ఒకావిడని చూసి, ఎక్కడలేని జాలీ పడిపోవడం. ఆవిడ అడగడం తరవాయి, సామాన్లన్నీ సద్దిపెట్టేయడం, ఇప్పుడంటే మంచినీళ్ళ బాటిళ్ళవాళ్ళు వస్తున్నారు కానీ, ఇదివరకటి రోజుల్లో ఎక్కడో స్టేషనులో బండి ఆగితే, ఏ మరచెంబుతోనో నీళ్ళు పట్టుకోవాల్సొచ్చేది. మన హీరో గారికి ఎక్కడలేని జాలీ పుట్టుకొచ్చేస్తుంది. పక్కనే ఉన్న భార్యకి ఎక్కడలేని ఆశ్చర్యమూ వచ్చేస్తుంది- ఇంట్లో ఒఖ్ఖపనీ చేయడూ, ప్రతీదానికీ బధ్ధకమే, అలాటివాడు బయటకొచ్చేటప్పటికి ఇన్నేసి పనులా వామ్మోయ్.. అనుకుంటుంది.
అలాగే బయటివాళ్ళందరికీ తనే చాలా తెలివైనవాడిగా కనిపించేటట్టు ఉచిత సలహాలు ఇవ్వడం. “ఫలానా చోటకి వెళ్ళడానికి ఊరికే బస్సంటూ కూర్చోకండి, హాయిగా ఓ ఆటో మాట్టాడుకోండి, కాదంటారూ ఓ కాల్ టాక్సీ వాడికి ఫోనుచేసేయండి, గుమ్మం ముందరకి వచ్చేస్తాడు”. ఇంత పెద్దమనిషీ తనదాకా వస్తేమాత్రం ఛస్తే రిక్షాకూడా ఎక్కడు. ఈదురోమంటూ సిటీ బస్సుకోసం చూడ్డమే. తనేకాదు, కుటుంబం మొత్తం అంతా బస్సులోనే. మరి తనకుటుంబం వాళ్ళకిమాత్రం అలాటి సౌకర్యాలు ఉండఖ్ఖర్లేదా అంటే, బయటివాళ్ళు వేరూ, మనం వేరూ "ఇప్పుడు కాకపోతే ఎప్పుడండీ శ్రమపడడం. జీవితంలో నేర్చుకునేదెప్పుడండీ.. అప్పనంగా దొరుకుతూంటే అన్నీ కావాలి, ఒక్క రూపాయ సంపాదించి చూడమనండి తెలుస్తుంది.. రిక్షా కావాలిట.. రిక్షా.."
ఈ ఇమేజ్ బిల్డింగు వ్యవహారంలో అనుకోకుండా, మన ప్రమేయమేమీ లేకుండగానే, మన పబ్లిక్ ఇమేజ్ కి భంగం వాటిల్లుతూ ఉంటుంది. ఏదో మనం ఓ సొసైటీలో ఉంటున్నామనుకోండి. సాధారణంగా చూస్తూంటాము, పసిపిల్లలకి ఇదివరకటిరోజుల్లోలాగ , ఏదో చందమామని చూపిస్తూ బువ్వ పెట్టడమా ఏమిటీ, తల్లులూ, పిల్లలూ కూడా తెలివిమీరారు. ఓ చేత్తో పసిబిడ్డని చంకలో పెట్టుకోవడమూ, ఇంకో చేత్తో ఓ గిన్నెలో ఆ పసిబిడ్డకి తినిపించేదో పెట్టుకోడం, అర్ధం పర్ధం లేని కాకమ్మకబుర్లు చెప్తూ ఏదో తినిపించడమూ, ఆ పిల్లో పిల్లాడో ఓ రెండు ముద్దలు తినేసి మళ్ళీ పేచీ పెట్టడం. ఆ సొసైటీ పార్కింగులోనే గానుగెద్దులా గుండ్రంగా తిరుగుతూండడం. ఇంతలో ఆ సొసైటీలో కొత్తగా అద్దెకొచ్చినవాడో, గృహప్రవేశం చేసినవాడో ఆఫీసునుండి వస్తాడు. ఈ పసిబిడ్డతో తిప్పలు పడుతున్న ఆ మహాతల్లికి అప్పుడే ఆఫీసునుండి వచ్చిన ఆ అభాగ్యప్రాణి కనిపిస్తాడు. ఇంక చూసుకోండి, చేతనైనంతవరకూ ఈయన ఇమేజ్ ని భ్రష్టు చేసేస్తుంది. " అదుగో బూచాడొచ్చాడంటుంది, లేకపోతే పోలీసొచ్చాడు నిన్ను పట్టుకుపోతాడంటుంది, కాదూ కూడదంటే డాక్టరుగారు ఇంజెక్షనిచ్చేస్తాడని భయపెడుతుంది. ఇంతంత అవసరమంటారా? నేనేం పాపం చేశాను తల్లీ మరీ నేనంత భయంకరంగా కనిపిస్తున్నానా? అని అడిగితే, " ఏం చేయమంటారు అంకుల్, సొసైటీలో అందరూ అయిపోయారు.. మీరే కొత్తగా వచ్చారూ , ఓ నాలుగురోజులు మీభయమైనా ఉంటుందేమో అనీ..".. సారీ అంకుల్.. ఏమీ అనుకోకండే.. ప్లీజ్.. చివరకు జరిగేదేమిటంటే ఆ పిల్ల మాత్రం ఈయన్ని చూసినప్పుడల్లా కెవ్వుమని ఏడవడం మిగులుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే సంఘంలో మనకి ఒక ఇమేజ్ తయారుచేసుకోవడమే కాదు, అలా చేసికున్న ఇమేజ్ ని కాపాడుకోవడంలో కూడా చాలా శ్రమ పడాల్సొస్తూంటుంది. ఎందుకొచ్చిన గొడవా అంటారా, హాయిగా ఎలా ఉండాలనుకుంటే అలాగే కంటిన్యూ అయిపోవడం. ఎప్పుడైనా ఒరిజినల్ ఒరిజనలే. దానికి ఎన్నెన్ని హంగులు చేస్తేమాత్రమేమిటీ, ఎప్పుడో ఒకప్పుడు వీధిన పడతాం....