నటనాలయం - నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు! - టీవీయస్. శాస్త్రి

Natanaalayam - Akkineni Nageswarar Rao Garu

82 ఏండ్ల తెలుగు సినీ పరిశ్రమలో 65 ఏండ్లకు పైగా నటించి, జీవించినంత కాలమూ నటించాలనే తలంపు గల గొప్పనటుడు, మహామనిషి శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు. ఈయన విద్యాధికుడు కాదు, చెప్పుకోతగ్గ నిండైన విగ్రహం లేదు, గంభీరమైన కంఠస్వరం లేదు, విశాలమైన నేత్రాలు లేవు(నాగేశ్వరరావు గారివి లోతైన కళ్ళు) - వీటన్నిటినీ అధికమించి ఒక నటుడు, ముందు చెప్పినవన్నీ పుష్కలంగా ఉన్న NTR తో పోటీపడి నటించి, నటుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసుకొని,కేవలం నటనా ప్రాభవంతోనే తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడిని గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం!

ఈయన 20-09-1923 న, కృష్ణాజిల్లాలోని, గుడివాడకు సమీపంలో ఉన్న కుగ్రామమైన రామాపురంలో, అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ గార్లనే పుణ్యదంపతులకు జన్మించారు. (నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని గురించి భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన జన్మించింది 20-09-1924 అని, మరికొందరు 16/17-09-1922 అని చెబుతుంటారు). వారిది అతి బీదకుటుంబం. ప్రాధమిక విద్య కూడా పూర్తిచేయలేకపోయాడు శ్రీ నాగేశ్వరరావు గారు. పొలం పనులు చూసుకునే ఒక సామాన్యుడు, అసమాన్యుడిగా ఎదిగి దేశ, విదేశాలలో తన కీర్తి పతాకాన్ని ఎగురవేసి, అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పెక్కు విదేశాలను దర్శించి అక్కడి వారి మెప్పు కూడా పొందటమనేది ఒక అసాధారణమైన విషయం. చిన్నతనంనుండి ఇతనికి నటన మీద ఎక్కువ ఆసక్తి. వీరు అయిదుగురు అన్నదమ్ములు. తల్లి పున్నమ్మ గారు నాగేశ్వరరావు గారిని ఆడపిల్లగా ముస్తాబు చేసి మురిసిపోయేది. దానికి తగ్గట్లుగానే, మొదట్లో వీరు రంగస్థలం మీద స్త్రీ పాత్రలనే పోషించి పేరు తెచ్చుకున్నారు.

1941లో, 17 ఏండ్ల వయసులో 'ధర్మపత్ని' అనే సినిమా ద్వారా వీరి సినీరంగ ప్రవేశం జరిగింది. అందులో వారు ఒక చిన్న పాత్రను పోషించారు. నాటి ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ ఘంటసాల బలరామయ్య గారు ఇతనిని ఒకానొక సందర్భంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో చూడటం తటస్థించింది. శ్రీ బలరామయ్య గారికి నాగేశ్వరరావు గారి ప్రతిభ నచ్చింది. వెంటనే వారు తీయబోయే 'సీతారామజననం' అనే సినిమాలో కథానాయకుడి పాత్ర అయిన శ్రీ రాముని పాత్రకు నాగేశ్వరరావు గారిని నిర్ణయించారు. అలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, రంగస్థల నాటకాలను కూడా ప్రదర్శించేవారు. వారు ప్రదర్శించిన నాటకాలలో ఆశాజ్యోతి,సత్యాన్వేషణ, తెలుగు తల్లి మొదలైనవి ప్రఖ్యాతమైనవి. సినీ, నాటక రంగాలలో అఖండ విజయాన్నిసాధించారు. తర్వాతి కాలంలో సినిమాలలో ఎక్కువ అవకాశాలు రావటం వలన రంగస్థల నాటకాలకు స్వస్తి చెప్పక తప్పలేదు.

ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటూ, ఋజువర్తన, క్రమశిక్షణతో అగ్రస్థానానికి చేరుకోవటం కోసం ఆయన చేసిన కృషి, పట్టుదలను అన్ని రంగాలకూ చెందిన నేటితరం యువకులు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి. వివిధ సినిమాలలో విభిన్నమైన పాత్రలను పోషించారు. రెండు తరాలపాటు ఆంధ్రయువత అక్కినేనినే అనుసరించింది, అనుకరించింది. పాటలకు ఆయన వేసే స్టెప్స్ తర్వాతి తరంవారు అనుసరించక తప్పలేదు. ఆయన ప్రతి కదలిక, చూపు కూడా ఒక భావాన్ని ప్రస్ఫుటిస్తుంది. తమిళుల ఆరాధ్యుడైన శివాజీ గనేషన్ కు ఈయన అభిమాన నటుడు. నాగేశ్వరరావు గారు పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పాత్ర 'దేవదాసు'. అప్పట్లో ఆయనికి ఈ పాత్రను ఇవ్వటానికి చాలామంది తటపటాయించారు. శ్రీ పేకేటి శివరాం, డి.యల్. నారాయణ గార్ల పట్టుదలతో చివరికి ఆ పాత్ర నాగేశ్వరరావు గారికే దక్కింది. ఆ పాత్రలో,పతాక సన్నివేశాలను రక్తికట్టించటానికి ఆయన కొన్ని రోజులు భోజనం కూడా పూర్తిగా మానేసారట! ఆ పాత్రను ఆయన పోషించిన తీరుకు ఆంద్రదేశపు ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పట్టారు. దేవదాసు పాత్రకు నాగేశ్వరరావు గారు ప్రాణప్రతిష్ట చేసారు. మొదటిసారి విడుదుల అయిన చాలాకాలం తరువాత, మళ్ళీ విడుదలైన ఈ సినిమా అప్పుడు కూడా శతదినోత్సవం జరుపుకోవటం ఒక గొప్ప విశేషం!

ఎప్పుడు  ఆ సినిమా విడుదలైనా 50 రోజులకు తక్కువ కాకుండా ఆడుతుంది. అలా దేవదాసు ఆయన వలన అజరామరుడయ్యాడు! అప్పటి నుండి ఆయన తెలుగు ప్రేక్షకుల చేత 'ట్రాజెడీ కింగ్'అని పిలువబడ్డారు. నిజజీవితంలో నాస్తిక భావాలు గల ఈయన, ఆయన ప్రవృత్తికి పూర్తి భిన్నమైన 'విప్రనారాయణ' పాత్రను ఆయన పోషించిన తీరు అమోఘం. అక్కినేని నాస్తికుడు అనడంకంటే హేతువాది అని అనటం బాగుంటుందని కొందరంటారు. సాటి మనిషిని ఆపదలలో ఆదుకోవడమే దేవతారాధనగా ఆయన భావిస్తారు. ఆచార వ్యవహార పరుడైన ఒక శ్రీ వైష్ణవ భక్తుని మనకు విప్రనారాయణ పాత్రలో ఆయన చూపించారు. ఆయన కీర్తికిరీటంలో ఆ పాత్ర మరో కలికితురాయి. తర్వాత చాలాకాలం తర్వాత, బాపూరమణలు తీసిన 'బుద్ధిమంతుడు'సినిమాలో ఆయన ఒక ఆస్తికుడిగా,మరొక అభ్యుదయ భావాలుగల యువకుడిగా ద్విపాత్రాభినయనం చేసి, ఆ సినిమా అఖండ విజయం కావటానికి కారకులయ్యారు. బాపూరమణలకు ఈయన అత్యంత ఆత్మీయుడు. వారికి మొదటి రోజుల్లో కొన్ని సినిమాలు తీయటానికి ఈయన ఆర్ధిక సహాయం కూడా చేసారు. శ్రీ నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు 'కథానాయకుడి కథ' అనే పేరు మీద ఒక గ్రంధాన్ని కూడా వ్రాసారు. ఆయన పోషించిన మరో మరపురాని పాత్ర 'బాటసారి' సినిమాలోది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆ పాత్రల జాబితాకు అంతే  ఉండదు.

ప్రేమికుడిగా, భగ్నప్రేమికుడిగా పలు విజయవంతమైన చిత్రాలలో నటించి నాటి కుర్రవాళ్ళకు ఆరాధ్యుడయ్యాడు ఈ 'ఎవర్ గ్రీన్ హీరో'. అన్నపూర్ణా పిక్చర్స్ అన్న సంస్థను నెలకొల్పి పలు విజయవంతమైన చిత్రాలను శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో నిర్మించారు. డాక్టర్ చక్రవర్తి సినిమాను నిర్మిస్తున్న రోజుల్లో, గుండెజబ్బు చేయటం వలన, అమెరికా వెళ్లి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని మృత్యుంజయుడయి క్షేమగా తిరిగివచ్చారు. వయసు పైబడుతున్న కొద్దీ ఆయనలో హుషారు, నటనా ప్రాభవం పెరుగుతూ వచ్చాయి. వృద్ధాప్యం గురించి, అనారోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడటమే ఒక పెద్ద రోగమని ఆయన అంటుండేవారు.

ఆ తరువాత, దసరాబుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం లాంటి పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. జీవితాన్ని పూర్తిగా చదివారు. స్వయంకృషితో ఎంతో నేర్చుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడగలరు. He is a self-made Man! అక్కినేని ఆలోచనలు, నేను చూచిన అమెరికా అనే గ్రంధాలని వ్రాసారు. 'స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య' అనే అక్కినేని గారు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చినప్పుడల్లా, ఆయన అత్మజ్ఞానాన్ని ఎరిగిన ఒక మహాజ్ఞాని అనిపిస్తుంది. విద్యాధికుడు కాకపోవటం వలన, ఆయనకు విద్యమీద మక్కువ ఎక్కువ!

గుడివాడలో ఆయన పేరు మీద ANR కాలేజ్ ను స్థాపించారు.1957లోనే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భూరి విరాళమిచ్చారు . తెలుగు సినీపరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు తరలి రావటంలో ఈయన కృషి మరువరానిది. బంజారాహిల్స్ లోని బండరాళ్ళలో అన్నపూర్ణా స్టూడియోను అపురూపంగా తీర్చిదిద్దారు. ఆయన పోషించిన చివరి పాత్ర, బాపూరమణలు నిర్మించిన 'శ్రీరామరాజ్యం'లోని వాల్మీకి పాత్ర! తొలినాళ్ళలో శ్రీరాముని పాత్రను పోషించిన ఈయన, శ్రీ రాముని పాత్రను రమణీయంగా తీర్చిదిద్దిన వాల్మీకి పాత్రను ఎంతో మక్కువతో నటించారు. తెలుగు సినీచరిత్రను ఒక 1000 పేజీల గ్రంధంగా వ్రాస్తే, అందులో 750 పేజీలు నాగేశ్వరరావు, రామారావు గార్లకే కేటాయించాలని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు! తెలుగు వారికే కాదు, తమిళులకు కూడా ఆయన ఆరాధ్యదైవమే. ఆరోగ్యం విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండేవారు. మానసిక ప్రశాంతత, మితాహారం, సంతృప్తి - ఈ మూడు తన ఆరోగ్య రహస్యాలని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పేవారు.

జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఫాల్కే అవార్డు అందుకున్నశ్రీ  అక్కినేని, 2005లో కోటిరూపాయల మూలధనంతో తన పేరిట ఒక జాతీయ అవార్డును ప్రారంభించారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులతో పాటుగా, భారత ప్రభుత్వం అందించే అత్యున్నతమైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల్ని కూడా అక్కినేని అందుకున్నారు.

తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి బిరుదును, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి కాళిదాసు సమ్మాన్ అవార్డును కూడా పొందారు. ఆయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కొన్ని సినిమాలు - లైలామజ్ఞు(1949), దేవదాసు(1953), విప్రనారాయణ(1954), అనార్కలి(1955), తెనాలి రామకృష్ణ(1956), మహాకవి కాళిదాసు(1960), బాటసారి(1961), శ్రీకృష్ణార్జున యుద్ధం(1963), ప్రేమనగర్(1971), ప్రేమాభిషేకం (1981). ఆయన నటించిన ఆఖరి చిత్రం శ్రీరామరాజ్యం అని చెప్పవచ్చు. అది ఆయన 255 వ సినిమా. నటన అంటే ఏమిటో చాలామంది వారికి తోచిన విధంగా చెప్పారు. కానీ, అక్కినేని చెప్పినదే నాకు నచ్చింది. ఆయన ఏమి చెప్పారంటే, 'నటించటం అంటే నటిస్తున్నట్లుగా ప్రేక్షకుడికి అనిపించకుండా  నటించటం'! అంటే నటన సహజత్వానికి దగ్గరగా ఉండటమని అర్ధం.  చాలామంది ఫలానా నటుడు పాత్రలో జీవించాడని చెబుతుంటారు. అది పూర్తి అబద్ధం. పాత్రలో జీవించితే రచయిత చెప్పిన మాటలు నటుడు పలకలేడు, దర్శకుడు చెప్పినట్లు నటించలేడు. అందుకే, నాగేశ్వరరావు గారు చెప్పిన నిర్వచనం నాకు బాగా నచ్చింది.

ఈ మధ్యనే భార్యను కోల్పోయారు. ఎంతో ధైర్యం, గుండె నిబ్బరంగల మనిషి ఈయన. కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలసి ఈయన ప్రస్తుతం 'మనం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు, 90 ఏండ్ల వయసులో కాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. నిజానికి ఆ వ్యాధికి నివారణ లేని విషయం ఆయనకు కూడా తెలుసు. అయినా సరే, మనోధైర్యాన్ని వీడకుండా, Oct 19, 2013 న తన స్టూడియోలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటుచేసి, తనకు కాన్సర్ వ్యాధి సోకిందని, తనను ఎవరూ ఓదార్చి, సానుభూతులను తెలుపవద్దని ధైర్యంగా చెప్పారు. తాను కోరుకునేది అశేష ఆంద్ర ప్రేక్షకుల ఆశిస్సులని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో ఆయన 22-01-2014 న అశేష ఆంద్ర ప్రజలను అనంత దు:ఖ సాగరంలో ముంచి దేహయాత్ర ముగించారు. ఆయన మరణంతో తెలుగు సినిమా ప్రపంచంలో స్వర్ణయుగం అంతరించిందని చెప్పవచ్చు! తెలుగు సినిమా చరిత్రలో మరొక శకం ముగిసింది! ఈ మహానటుడికి, మహామనీషికి వందనం, అభివందనం, పాదాభివందనం! అశ్రునయనాలతో ఆయనకు కళాంజలిని సమర్పించుకుంటున్నాను!!

 

ఆ మహానటుడికి మరణంలేదు! ఆయన నిత్యం అభిమానుల హృదయాలయాల్లో ప్రేమాభిషేకాన్నిఅందుకుంటూ, చిరంజీవిగా ఉంటారు!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు