మానవతా విలువలు . - Aduri.HYmavathi.

Maanavataa viluvalu

మానవతా విలువలుఅంటే మానవునకు ఉండవలసిన విలువలు. మానవుడు అంటే ఒకతల కళ్ళు,నోరు,ముక్కు, కాళ్ళూ చేతులూ ఉండటంకాదు.ఇదికేవలం ఆకారం మాత్రమే.

మానవతావిలువలు లేని మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు. మానవత్వము యొక్క ప్రధాన్యత, ప్రత్యేకత ఇట్టి విలువలపైన ఆధారపడి ఉంటుంది. మానవత్వమును పోషించుకుని దైవత్వమును గుర్తించుటకే మానవజన్మ ఏర్పడినది. ఎక్కడ నుండీ వచ్చామో అక్కడికి తిరిగి సుఖంగా వెళ్ళేమార్గాన్ని ఈ మానవతా విలువలు చూపుతాయి. మానవు జన్మ సార్థకత చేసి గుర్తింపు నిస్తాయి. మానవజన్మకు విముక్తికలిగిస్తాయి

సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే ఈ ఐదు విలువలనూ పంచ ప్రాణములనవచ్చును. ప్రాణము లేనిదే మనుగడ లేదు కదా! ఈ విలువలు కూడా అట్టివే.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమను పంచప్రాణములు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను మానవతా విలువలతో సమానము.

సత్యమును పలికితే ప్రమాదము కలుగుతుందనీ, దానిని ఎదుర్కోడం కష్టమనీ, ఆకష్ట నిష్టూరాలకన్నా ఏదో చెప్పేస్తే సరిపోతుందని మానవులు భావించటాన ఇలా సత్యాన్ని వదిలేసి ఏదో మాట్లాడు తున్నారు.

మానవులు నేడు ఇందువల్లనే సత్యమునకు దూరమైనారు. ధర్మమన గానేమో తెలియని స్థితిలో ఉన్నారు. ధర్మ మనగా ధరించేది. చొక్కా వేసుకున్నట్లు ధర్మాన్ని ఒంటపట్టించుకుని ఆచరించాలి.

ధర్మమాచరించేవారిని ‘అతడు ధర్మమూర్తి అండీ !’అంటారు.పైకి కనిపించేదికాదు ఆచరణద్వారా వ్యక్తమయ్యేది ధర్మం.

నిజానికి ఎట్టి అవాంతరపరిస్థితులలోను ఈ విలువలను విడువ కూడదు.

ప్రపంచంలో ప్రతి వస్తువు,ప్రతి పదార్ధము, వాటి విలువలను అవి కలిగి ఉంటాయి. సృష్టిలో విలువలేనిది ఏదీ లేదు.చిన్న గడ్డిపోచ సైతం విలువకలిగి ఉంది. అవి పశువులకు మేతగాఉండి, వాటిని తిన్న పశువులు కమ్మని పాలనిస్తున్నాయి.అలా గడ్డిపోలు సైతం ఉపకరిస్తున్నాయి.గడ్డిపోచనే మంత్రీకరించి బ్రహ్మాస్త్రం చేశారు రామచంద్రుడు, ఇంకాచాలామంది ఋషులు..

కాని దురదృష్టవశాత్తు ఆధునిక మానవుడు విలువలను కోల్పోయి జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాడు. నిజానికి పక్షి మరణించినా దాని మాంసానికి విలువ ఉంది. కుందేలు మాంసానికి, మేకమాంసానికీ, కూడా విలువ ఉంది. చివరకు అతి క్రూరమైన పులి చర్మానికీ విలువ ఉంది. దాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. .

కాని మానవుడు మహాచక్రవర్తియైనా సరే, గొప్ప దేశ నాయకుడైనాసరే , గొప్పధనికుడైనాసరే మరణానంతరం విలువ ఉండదు. త్వరత్వరగా ఆభౌతిక కాయనికి చివరి సంస్కారాలు, కాల్చేయటమో, పూడ్చేయట మో చేయను అతని కుటుంబ సభ్యులు తయారవుతారు, మాకు ఇంత సంపాదించి పెట్టారు కదా!అని వారు చింతించరు.మా రాజ్యాన్ని ఇంత కాలం పరిపాలించాడుకదా, మమ్మల్ని ఇంతకాలం రక్షించాడుకదా అని ఆకాయాన్ని ఇంట్లోనే ఉంచుకోరు. ఇరుగుపొరుగువారూ అందుకు సహకరించరు,అంగీకరించరు.

కనుక మానవజీవితం బుద్భుదప్రాయం అని తెల్సుకుని విలువలను పాటిస్తూ జీవితాన్ని నిలుపుకోవాలి. విలువైన జీవితాన్ని గడపాలి.

మానవతా విలువలను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ , అహింస అంటూ కేవలం వల్లె వేసినంతమాత్రాన చాలదు. ఉపన్యాసాలిచ్చినంత మాత్రాన చాలదు. గ్రంథాలు చదివినంత మాత్రాన ప్రయోజనం లేదు. వీటిని ఆచరించాలి.

మంచుగడ్డకు చల్లదనం, అగ్నికి దహించే గుణం, గాలికి అంతా వీచేగుణం సహజమైనట్లుగా , మానవునికి ఈ మానవతా విలువలు సహజంగా ఉండాలి. కేవలం ప్రసంగాలకు పరిమితమైతే విలువల 'విలువ'కూడా శూన్యమైపోతుంది.

ఇండియా మ్యాపుచూస్తే దేశమంతా చూసినట్లవుతుందా?ఆకలయ్యే వానికి ఎంతో రుచికరమైన పదార్థాలు చూపితే ఆకలి తీరుతుందా? దాహమేసేవానికి చాలా రుచికరమైన ద్రవాలు చూపితే దాహంతీరు తుందా? వెయ్యి చెప్పడంకంటే ఒక్కటిచేస్తే చాలు.ఒక్కటి నేర్చు కుంటే మిగిలినవన్నీ లభిస్తాయి.

వృక్షాలు, పశుపక్ష్యాదులు వాటి ధర్మాన్ని అవి అనుసరిస్తున్నాయి. మరి మానవుడు తన మానవధర్మాన్ని తాను అనుసరించాలి కదా! అవే మానవతా విలువలు. వాటినే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస లంటారు. కాని మానవునికి ఒక్క ప్రేమ ఉంటే చాలు, అన్ని విలువలు వాటికవే వెంట వస్తాయి.

ప్రేమే ప్రధానం, ప్రేమే దైవం, ప్రేమే ప్రాణం. “లవ్ ఈజ్ గాడ్ , గాడ్ ఈజ్ లవ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమ సంకుచితమైనదిగా ఉండకూడదు. విశాలమైనదిగా ఉండాలి.

లవ్ ఈజ్ సెల్ఫ్‌లెస్ నెస్, సెల్ఫ్ ఈస్ లవ్ లెస్నెస్ .ఆస్తి కుడైనా, నాస్తి కుడైనా, ఆస్తి కనాస్తి కుడైనా, నాసిక ఆస్థికుడైనా ప్రేమ లేనివాడు లేడు. ప్రేమతోనే భగవంతుని బంధింపవచ్చు.

ఇక్కడ ప్రేమ అనగానే ఈ నవీన కాలపు మానవులకు సినిమాప్రేమ, యువతీ యువకులమధ్య పిచ్చిప్రేమ గుర్తుకు రావడం సహజం. ఐతే ఆ ప్రేమ ఈ ప్రేమకాదు.ఇది నిస్వార్థమైన ప్రేమ .

బుడత ఉడుత రాముని ప్రేమను ఎలాపొందింది? రాముడు దీనిలో దేనిని చూసి ఈ చిన్ని ఉడుతను మెచ్చుకున్నాడు? గుహుని పాండిత్య మెంత? శబరి ఐశ్వర్యమెంత? గోపికల విద్యార్హతలేమి?వారిదంతా భగవంతుని పట్ల నిరంతర, నిస్వార్థ, ప్రతిఫలం ఆసించని ప్రేమ.

ఈ ప్రేమ ముందు భుజబలం, ధనబలం, జనబలం, జ్ఞానబలం మొదలైనవేమీ సాటికావు. భగవంతుడు చూసేది ఒక్క ప్రేమనే.

Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love.

ప్రేమతో పలికే ప్రతి పలుకూ సత్యంగా ఉంటుంది.

Love+word=Truth అనవచ్చు. అనగా, ప్రేమతో కూడిన ప్రతి పలుకు సత్యంగా రూపొందుతుంది. అట్లే ప్రేమతో చేసే కార్యమే ధర్మము. నేటి అనాచార, అధర్మ , అక్రమాలకు కారణం ప్రేమ లేకపోవడమే.మానబ్వుని హృదయం స్వార్థపూరితంకావడమే. ప్రేమ ఉన్నప్పుడే కర్మలు ధర్మబద్ధమై యుంటాయి.

అదే Love+Action=Dharma .

ఈ ప్రేమ ఉన్నప్పుడు మనకు నిరంతరం మనశ్శాంతి, ప్రశాంతి లభిస్తాయి. ఆ శాంతి మన ముఖములో స్పష్టంగా కనబడుతుంది. శాంతి పలికేది కాదు. చేసేది కాదు, అది అనుభవించేది. అనగా Love+Experience=Peace. అంటే ఎట్టి విమర్శలూ నిన్ను బాధించవు. నిందా స్తుతులకు క్రుంగవు, పొంగవు. ప్రేమను కలిగియున్నప్పుడు నీ మనోవాక్కాయకర్మలచేత ఎవ్వరినీ బాధించవు. ఇదే సరియైన Understanding(అవగాహన). కనుక Love+ Understanding=Non Violence. చూపులతోగాని, పలుకులతోగాని, ఆలోచనలతోగాని, క్రియలతోగాని ఎవ్వరినీ ఏరకంగాను బాధింప కుండా ఉండటమే అహింస. కావలసిన అవగాహన ఇదే. ఇది ప్రేమ వల్ల నే వస్తుంది . ప్రేమతో అన్ని సాధించవచ్చు. అన్ని విలువలనూ పొందవచ్చు.

కనుక మానవతావిలువలను మనస్సుకు తెచ్చుకుని వాటిని పా టిం చను ప్ర ప్రయత్నించి అసలైన, నిజమైన మానవులంగా జీవించను ప్రయత్నిద్దామా?

***

 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు