గంగమ్మ జాతర . - సృజన.

Gangamma Jathara

గంగమ్మ జాతర్లు.

ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, గంగానమ్మ, పోలేరమ్మ, మాచమ్మ, మరిదమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ మొదలైన ఎన్నో పేర్లతో ఈ జాతరలు జరుగుతూ వుంటాయి. ఇది తరతరాలుగా జరుగుతున్న జాతర్లు. ప్రజలు ఎంతో మనశ్శాంతిని పొందుతూ వుంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో వున్న అనేక జానపద కళారూపాల్లో ఇది కూడా ఒకటి.

అలా రాయలసీమలో కూడా ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కనిపించే దేవత గంగమ్మ అనీ, సాధారణంగా ప్రతీ గ్రామానికీ ఒక గంగమ్మ వుంటుందనీ, కొన్ని వూళ్ళకు ఇద్దరేసి గంగమ్మ లుంటారనీ, ఒకరు బ్రాహ్మణాది జాత్రర్లకూ, మరొకరు హరిజనులకు వుంటారనీ, అలాంటిది కాక ఒక్క, కాళహస్తిలో మాత్రం ఏడుగురు గంగమ్మ లున్నారనీ ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు శాఖ రీసెర్చి స్కాలర్ మాదిరెడ్డి అండమ్మ గారు తెలుగు పత్రికలో వివరించారు.

జాతర నిర్ణయం.

గంగమ్మ జాతర జరపాలంటే పెద్దలందరూ సమావేశమై ఒక తేదీని నిర్ణయించి ఆ విషయాన్ని చాటింపు ద్వారా గ్రామ ప్రజలకు తెలియ చేసి గంగమ్మలను స్థాపించే మూడు రోజులు ముందుగా అంటే డిసెంబరు నెల రెండవ ఆదివారం అర్థ రాత్రిని 12 గంటలకు చాటింపు వేస్తారు. ఇది జరిగిన తరువాత ఆ వూరి వారు ఎక్కడ వున్నా జాతర సమయానికి చేరుకుంటారు. కుమ్మరి వచ్చి మట్టితో ఒక్కో వీధికి ఒక్కొక్క గంగమ్మ చొప్పున ఏడు వీథులకూ ఏడు గంగమ్మలను తయారు చేసి, ముఖ్యంగా ఇది కాళహస్తి విషయం. ముత్యాలమ్మ గుడి వీధిలోనూ, పూసల వీధిలోనూ, సన్నిధి వీధిలోనూ, గుడి వీధి, గాంధీ వీధి, కొత్త పేట వీధి ఇలా గంగమ్మలతో పాటు ప్రతి గంగమ్మకూ ఇద్దరేసి ఉప గంగమ్మల చొప్పున 14 ఉప గంగమ్మలను కూడా అందంగా తయారు చేసి పసుపు కుంకాలతో పూలతో అలంకరించి, దాగెర అనే వెదురు గంపలో వేపాకు పెట్టి దాని పైన మూడు గంగల్ని పెడతారు.

అర్థరాత్రి గంగమ్మ.

అలంకారాలు ముగిసేటప్పటికి అర్థ రాత్రి అవుతుంది. గంగమిట్ట దగ్గరకు గంగలు చేరగానే పంబల వాడు గంగమ్మ కథను క్లుప్తంగా చెపుతాడు. ఆ తరువాత చిన్నకోడి మెడ విరిచి అగరం ఇస్తారు. ఏడుగురు గంగమ్మలకు, రజకులు (చాకలి వారు) ఏడు కుంభాలు పెడతారు. ఈ కుంభాలకు కావలసిన సరంజామానంతా ఇస్తారు. కుంభంపైన, ములగ ఆకు కూర, వంకాయ కూర, ఎండు చేపల పులుసు పెడతారు. ప్రతి కుంభం పైన పిండి దీపం వెలిగించి పొట్టేళ్ళను బలి ఇస్తారు. ఈ తతంగ మంతా పూర్తి అయిన తరువాత గ్రామంలో గంగమ్మలను దించు కోవడానికి ప్రతి వీధి లోనూ ఒక గుడిని నిర్మిస్తారు. ఆ గుడిని పందిరిగా వేసి, వేపాకులు వ్రేలాడ గట్టి గుడిని అలంక రిస్తారు. ఏడుగురు రజకులూ గంగమ్మలను ఎత్తు కుంటారు. మేళ తాళాలతో, ఆట, పాటలతో ముందుగా ముత్యాలమ్మ గుడి వద్దకు వస్తారు. పంబల వాడు కోడి మెడను విరిచి అగరం ఇస్తాడు. ఇలా గంగమ్మలు వచ్చే దారిలో ప్రతి చోటా రజకులు జంతు బలులతో రక్త తర్పణం చేస్తారు. ముత్యాలమ్మ గుడి వద్ద ఆ వీధి గంగమ్మ దిగగానే, ఏ వీధి గంగమ్మ ఆవీధికి వెళ్ళి పోతుంది. ప్రతి వీధి గంగమ్మ ఆ వీధిలోని వారు జంతువుల్ని బలి ఇస్తారు. ముత్యాలమ్మ గుడి వద్ద దిగిన గంగమ్మను శక్తి వంత మైన దానినిగా భావిస్తారు. అందుకే ఆమెను ముందుగా ప్రతిష్ఠిస్తారు.

నట్టింటి పోలేరమ్మ.

గ్రామంలో గంగమ్మలను స్థాపించిన తరువాత చిన్నలూ, పెద్దలూ చుట్టాలతో ఇల్లు నిండి పోతుంది. అందరూ క్రొత్త బట్టల్ని ధరించి అమిత వుత్సాహంతో వుంటారు. ప్రతి ఇంటిలోనూ నట్టింట పోలేరమ్మను ఎవరికి వారు ఒక గోడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ........మూడు విస్తళ్ళలో కుంభం కూడును పెట్టి పైన గంగమ్మల పెట్టిన మాదిరే కూరలను పెడతారు. పిండితో చేసిన ప్రమిదల్లో మూడు దీపాలు వెలిగించి మూడు విస్తళ్ళల్లో పెడతారు. గంగమ్మ కదిలే వరకూ ఈ దీపాలు ఆరి పోకుండా చూస్తారు. వారికున్న మ్రొక్కులన్నిటినీ తీర్చుకుంటారు. చీరెను పెట్టి కోరికలు కోరుకుంటారు.

అంతె కాక ఒక కుండలో అఖండలం వెలిగించి, నట్టింటి పోలేరమ్మ వద్ద పెడతారు. తరువాత ముత్తైదువలు దానిని ఎత్తుకు వెళ్ళి గంగమ్మ వద్ద మూడు ప్రదక్షిణాలు చేసి కుండను ఎత్తి పగల కొడతారు. పగిలిన రెండు మూడు పెంకుల్ని ఇంటికి తెచ్చుకుంటారు. పగిలిన పెంకులు ఇంట్లో వుంటే ఏ ఆపదా రాదని అలా చేస్తారు. గంగమ్మను కదిలించిన తరువాత ఇంటిలో గోడకు పెట్టిన పోలేరమ్మ బొట్టును తుడిచి వేస్తారు. వెంకట గిరిలో ఈ పోలేరమ్మ జాతరను వైభవంగా జరుపుతారు. వెంకటగిరి పోలేరమ్మను గోడకు పెట్టే బొట్లుతో కాకుండా నట్టింటిలో పీట వేసి పీట పైన బోనం కుండను గాని, దీపాన్ని గానీ పెట్టి దానిని దేవతగా పూజిస్తారు. అస్పృశ్యుడు, ప్రవేశార్హత లేని ఆసాది ఆరోజున నట్టింటి లోకి గంగమ్మ ప్రతీకగా భావించే త్రిశూలంతో ప్రవేశిస్తాడు. ఇంటి వారిని అదిరించి బెదిరించి కట్నాలు కానుకలు వసూలు చేసు కుంటాడు.

గణాచారులు.

గంగమ్మలు దిగినప్పటి నుంచీ గంగమ్మల వద్ద జరిగే హడావిడి ఇంతా అంతా అని చెప్పలేం. ప్రతి వారికీ గంగమ్మ ఆవహించి నట్లు గణాచారులై పోతారు. అట్టహాసంతో ఆవేశంతో వూగి పోతారు. ఈలలు, కేకలు, గణాచారుల గంతులు, ఆసాదుల డప్పు వాయిద్యాలు ఎవరికి తోచినట్లు వారు నృత్యాలు, కొందరు గంగను స్తుతించడం, కొందరు తిట్టటం., తొందరు ఆవేశంతో ఏడుస్తారు. కొండరు భూమిమీద సాష్టాంగ పడి పోతారు. పంబల వారిని ప్రశ్న లడుగుతారు. గంగమ్మ ముందు దుత్తల్ని పగుల గొడతారు. ఊరంతా ఈ కోలా హలంలో మునిగి పోతారు. ఈ సందడిలో ఎందరో మత్తుగా త్రాగి చిందులు, గంతులూ వేస్తూ అట్టహాసం చేస్తారు. గంగమ్మను కదిలించగానే జ్యోతిని ఎత్తుకుని ముత్యాలమ్మ గుడిని చేరిన రజకులు నిద్ర మత్తులో త్రాగిన మైకంలో, ఎర్రబడ్డ కళ్ళతో జ్యోతి ఎగదోస్తూ, అది ఆరి పోకుండా కాపాడుతూ వుంటారు. ఆయా వీధుల వారు ఒక్కొక్క గంగమ్మను రథంపై పెట్టుకుని బయలుదేరుతారు. ఆ రథాలను విద్యుద్దీపాలతో అలంకరించి, బాజా బజంత్రీలతో తప్పెట్ల వాయిద్యాలతో ఆటలతో పాటలతో ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకుంటారు. ఈ వుత్సవం ఒక పట్టాభి షేక మహోత్సవంలా వుంటుంది. రజకులు మాత్రం సాంప్రదాయపు కాగడాలతోనే వుంటారు.

ఎరుపెక్కిన ముత్యాలమ్మ.

దేదీప్య మానంగా ప్రజ్వరిల్లుతున్న ఏడు జ్యోతుల వెలుతురు పసుపు కుంకాలతో ఎరుపెక్కిన ముత్యాలమ్మ ముఖం ఎఱ్ఱగా మారిపోతుంది. భయాన్నీ భక్తినీ కలుగ జేస్తుంది. పూజారి ఆమెను ప్రసన్నం చేసు కోవడానికి ప్రయత్నం చేస్తాడు.

ప్రతి గ్రామానికి ఒక గంగమ్మ ...

ప్రతి గ్రామానికి ఒక గంగమ్మ వున్నట్టే కొన్ని కులాల వారికి కూడా ప్రత్యేకంగా ఒక గంగమ్మ వుంటుంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లా లోని కమ్మ కులస్తులైన వారు గొర్రెపాటి అనే ఇంటి పేరున్న వారికి ప్రత్యేకంగా ఒక గంగమ్మ ఉంది. దామలచెరువు గ్రామ సమీపాన వున్న మొరవపల్లిలో ధనుకొండగంగమ్మ అనే గంగమ్మ కొలువై ఉంది. ఇదే వీరి కుల దైవము. ప్రతిఏటా అత్యంగ వైభోవపేతంగా ఇక్కడ జాతర జరుగు తుంది. ఆ చుట్టు ప్రక్కల వున్న అన్ని గ్రామాలలోని గొర్రెపాటి వారు ఈ గంగమ్మకు పూజ చేస్తారు. పొంగళ్ళు పెట్టడము, జంతు బలులు మొదలైనవి విరివిగా జరుగుతాయి. ఈ గంగమ్మ చాల శక్తి గలదని వీరి నమ్మకము.

తిరుపతిలో గంగమ్మ.

తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు-కుంకుమలూ.. శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళ, తాళాలతో తీసుకొచ్చి, పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

బోయ కొండ గంగమ్మ.

బోయ కొండ గంగమ్మ చిత్తూరు జిల్లాలోని చౌడే పల్లి సమీపాన ఉన్న కొండపై వెలసిన దేవత. ఈ ఆలయం పురాతనమైనా, ఈ మధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. జంతు బలులు ఇక్కడి నిత్యకృత్యం. భక్తులు కుటుంబ, బంధు, మిత్ర సమేతంగా వచ్చి వేటను తెచ్చుకొని, ఇక్కడే కోసి వంట చేసుకొని, తిని, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని నిదానంగా ఇళ్లకు వెడతారు. ఇక్కడ భక్తులకు వంట చేసుకోడానికి పాత్రలు, గుడారాలు వంటివి అద్దెకు కూడా ఇస్తారు. ఇతర పూజా సామాగ్రి కూడా అందు బాటులో ఉంటుంది. ఇది కర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా ఉన్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు. సాధారణంగా గంగమ్మ జాతర ఏడాదికి ఒక్కసారే జరుపుకుంటారు. కాని ఇక్కడ ప్రతి రోజు గంగ జాతరే. ఇది ఇక్కడి ప్రత్యేకత.

బాటగంగమ్మ.

చిత్తూరు సమీపాన బాట గంగమ్మ గల చాల మహత్యము గల గంగమ్మగా ప్రసిద్ధి పొందినది. ఇక్కడ నిత్యము పొంగిళ్ళు పెట్టి పూజలు చేస్తుంటారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు.

గంగ పండగ.

ఆయా గ్రామాలలో వెలసిన గంగమ్మ వద్ద జాతరలు జరుపడమే గాక..... చిత్తూరు జిల్లాలో మేనెలలో గంగపండగ అని ఒక పండగ జరుపుతారు. ఆ రోజున ఊరి బయట ఒక వేపచెట్టు వద్ద తాత్కాలికంగా వేప కొమ్మలతో ఒక తాత్కాలికంగా ఒక పందిరిని నిర్మించి అందులో గంగమ్మను నిలిపి సాయంకాలపు వేళ వూరి వారందరు అక్కడ పొంగిళ్ళు పెట్టి కోళ్ళను కోసి, ఏటను బలిచ్చి తమ మొక్కులను తీర్చు కుంటారు. ఇది ప్రతి ఏడు ప్రతి పల్లెలోను జరిగే ఒక జాతర. ఆ రోజున కొన్ని పల్లెల్లో ఈ పండుగను బారీ ఎత్తున జరిపిస్తారు. ఈ గంగ పండగకు ఆ వూరి చాకలి ఇక్కడి పూజారి.

గంగమ్మ జాతర్లు నాడు ....నేడు.

కుంభం కూడుపెట్టిన తరువాత గంగమ్మలను రజకులు అనగా చాకలివారు ఎత్తుకుంటారు. ఆసాదివారు అను సరిస్తారు. వారు ముందుగా గంగ మిట్టవద్దకు వెళ్ళి, అక్కడనుంచే సువర్ణముఖినదీ తీరానికి వెళతారు. ఆసాది వాడు బూతుపదాలు పాడుతూ వెళతాడు. జనం కూడా అతనిని అనుసరిస్తారు. దీవెన పదాలు పాడిన తరువాత గంగలను స్వర్ణముఖిలో నిమజ్జనం చేస్తారు. ఇలా పూర్వ సంప్రదాయంతో తరతాలుగా వస్తున్న ఈ గంగ జాతర్లను జరుపుతూ ఆ వుత్సాహంలో ఎన్నో జానపద గేయాలను, జానపద నృత్యాలను, జానపద వాయిద్యాలను ప్రయోగించి వుత్యవాలను జరుపుకుంటున్నారు. కాలంమారిన దృష్ట్యా నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ గంగజాతర్లు కొంచెం తగ్గినా వెనుకబడ్డ గ్రామాలలోనూ, వెనుకబడ్డ జాతులలోను ఈ గంగజాతర్లను భక్తిభావంతో చేస్తూనే ఉన్నారు. మన జానపద విజ్ఞానానికి గుర్తులు గంగ జాతర్లు. చిత్తూరు జిల్లా కలికిరి లో జరిగే గంగమ్మ జాతర్లు కూడా చాలా ప్రసిద్ది.

సేకరణ :

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి