శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography

వివేకానంద స్వామి ఉపదేశాలు
రోమన్, క్యాతలిక్ లూ - హిందువులూ వివాహాన్ని యిలా పరిగణించడం వల్లనే ప్రతిభాశాలులైన స్త్రీ, పురుషుల్ని అందచేయగలిగారు. అరబ్బులకు వివాహం యిష్టానుసారంగా రద్దు చేసుకొనదగిన ఒడంబడిక లేదా బలప్రయోగం ద్వారా పొందదగిన హక్కు, దీనిలో పవిత్రమైన కన్యాజీవితాశయం గాని, బ్రహ్మచర్య జీవితాశయం గాని వికాసాన్ని పొందినట్లు తోచదు. ఆధునిక బౌద్ధమతం వివాహ పరిణామ దశను పొందని జాతుల వశమై సన్యాసాన్ని పరిహారం పాలుచేసింది కనుక పరస్పర ప్రేమ విషయం అలా వుంచి జపాన్ లో వివాహ పవిత్రాశయం అమలు జరిగితేనే గాని మహనీయులైన సన్యాసులూ - సన్యాసినులూ ఎలా బయలుదేరగలరో నాకు బోధపడటం లేదు. శక్తిమంతులైన వైష్టిక బ్రహ్మచారులూ - బ్రహ్మచారిణులూ వెలువడాలంటే పాతివ్రత్యం - ఏకపత్నీవ్రతం అనే నియమాలు ప్రజానీకానికి అత్యవసరం.

ఇతరులు తమను నడపడం వల్ల కొందరు చాలా బాగా పనిచేయగలరు. ప్రతీవ్యక్తీ నాయకుడు కాలేడు. జన్మసిద్ధంగా కొంతమంది నాయకులవుతారు. ఎలాగైనా పసిబిడ్డవలె నడిపేవాడే నాయకుడు. ప్రతివ్యక్తి పసిబిడ్డ వలె నడిపేవాడే నాయకుడు. ప్రతివ్యక్తి మీద ఆధారపడినట్లు పైకి కనిపించినా పసిబిడ్డ ఇంటికంతకూ రాజు. నామటుకు నాకిదే రహస్యమని తోస్తుంది. అనేకులలో సానుభూతి వుంటుంది కానీ ప్రకటించగలవారు కొద్దిమంది మాత్రమే. ఇతరుల పట్ల తన ప్రేమానురాగాలనూ, సానుభూతినీ ప్రకటించే శక్తియే తన ఆశయాలను జయావహంగా వ్యాప్తిచేయడానికి సమర్ధుడ్ని చేయగలదు.

8 సంవత్సరాల కన్యను ముప్పది సంవత్సరాల ముదుసలికిచ్చి పెళ్ళిచేసి తల్లిదండ్రులు ముచ్చటపడతారు. దీనినెవరైనా ప్రతిఘటిస్తే తమ మతం సర్వనాశనమైపోతున్నదని గగ్గోలు పెడతారు. యౌవనమయినా రాకమునుపే తమ పిల్లలు తల్లులు కావాలని ఆశపడుతూ యిందుకు శాస్త్రాలను ఆధారంగా చూపే మనవారి మతాన్ని ఏమనాలి?
ఇంతకూ నా అభిప్రాయ మేమంటే పూర్వకాలంలో అనేక మంచి విషయాలతో బాటు చెడ్డ విషయాలు కూడా వున్నాయి. మనం మంచి వాటిని మాత్రమే గ్రహించి ఆదరించాలి. మన భారతావని పూర్వం కన్నా మహత్తరమైనదిగా వెలుగొందాలి. శ్రీరామకృష్ణుడుదయించిన నాటినుండీ సత్యయుగ మారంభమైనది. ఈ నిశ్చయంతో కృషి చెయ్యడమే మీకర్తవ్యం.

బహుజన శ్రేయస్సు కోసం ఒక్కడు తన సుఖాన్ని త్యజించడం మహోత్తర ధర్మం కాదా? నిశ్చయంగా అవును. కాని బలాత్కరించడం ద్వారా ప్రేమను పుట్టించడం సాధ్యమా? బిచ్చగాని వైరాగ్యంలో ఘనత ఏమున్నది? నపుంసకుని బ్రహ్మచర్య వ్రత నిష్టలో సుగుణమేమున్నది? అలాగే త్యాగబుద్ధి కొంచమైనా లేని సమాజమంటే ఏమిటో తెలియని వాని స్వార్ధత్యాగం అంటే అర్ధమేమిటి? వితంతువును సహగమనం చేయమని బలవంత పెట్టడంలో ఏమి పతిభక్తి వున్నది?

వెర్రి నమ్మకాలను బోధించి ప్రజల్ని సత్కార్యాలు చేయమని ముందుకు త్రోయడమెందుకు? వారిని స్వతంత్రుల్ని చేయాలి. సమాజం నిమిత్తం సర్వ సుఖాలను నీవు త్యజించగల్గిననాడు బుద్ధుడవై వెలుగొందగలవు.

నేను సన్యాసిని కనుక సేవకుడననుకుంటాను గాని అధిపతిననుకోను. ప్రజలు నన్ను ప్రేమించినా సంతోషమే, ప్రేమించక పోయినా సంతోషమే.

నాకు ఎవరైనా సహాయపడితే అదివాని అనుగ్రహం మాత్రమే గాని నాహక్కు కాదు. కాబట్టి శాశ్వతంగా వారికి కృతజ్ఞుడనై వుంటాను.

నేను బిచ్చగాడను. నా మిత్రులంతా పేదలు. పేదవారినే నేను ప్రేమిస్తాను. పేదరికాన్నే ఆహ్వానిస్తాను. ఒక్కొక్కప్పుడు భోజనం లేకుండా పస్తుండవలసి వచ్చినందుకు కూడా నాకు ఆనందంగా వుంటుంది.

వివేకానందుని జీవిత విశేషాలను ముగించే ముందు ఆయనకూ, మహాత్మాగాంధీకీ గల సన్నిహిత సంబంధాన్ని గురించి ఒక్కమాట తెలియచేయటం అత్యవసరం. బాపూజీ తన మహాత్తర జీవితంలో ప్రజాసముద్ధరణ కోసమై అవలంభించిన సూత్రాలు, ఆచరించిన పథకాలు చాలా వరకు వివేకానందుని ఆశయాలను అనుసరించబడినవేనని చెప్పకతప్పదు. ఈ విషయాన్ని మహాత్ముడే సృష్టపరచాడు కూడా. అయితే యెందువల్లనో ఈ నగ్నసత్యం మరుగునపడిపోయింది. క్రమంగా నైనా ప్రజలు దీనిని గమనించితీరుతారు.

                                                                                                      

(... వచ్చేవారం మరిన్ని ఉపదేశాలు)

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి