మన పురాణాల్లో ఎందరో ప్రముఖులు దేవతలు సైతం శని ప్రభావానికి లోనయినట్లు చెపుతున్నాయి శని ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు లోనయినట్లు మనము విన్నాము సాక్షాత్తు పరమశివుడే శని ప్రభావానికి లోనయినట్లు తెలుస్తుంది కాబట్టి శని ప్రభావానికి లోను కానీ వారు అంటూ ఎవరు ఉండరనేది జగమెరిగిన సత్యం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ప్రతి వారి జాతకంలో శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది జన్మ రాశిలో శని ప్రవేశిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి అని నమ్ముతారు.ఆ కాలాన్ని “ఏలిన నాటిశని” అంటారు. ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరి. జాతక రీత్యా శని దుష్ట గ్రహం గా పేర్కొంటారు. కానీ పురాణాల కథనం ప్రకారం శని తన ప్రభావాన్ని విఘ్నాలకు అధిపతి అయినా విఘ్నేశ్వరుడి పైన, హనుమంతుని పైన చూపలేదని తెలుస్తుంది హనుమంతుని భక్తులపై మాత్రం శనీశ్వరుని ప్రభావం ఉండదు. హనుమంతుడు అంటే శనీశ్వరుడు దూరంగా ఉంటాడు. రావణుని చెరలో బందీగా ఉన్న శనీశ్వరుడికి ఆంజనేయుడు విముక్తి కలిగించాడు. దానికి కృతజ్ఞతగా హనుమ భక్తులకు ఎలాంటి కీడు తలపెట్టనని అప్పుడు ప్రమాణం చేశారు. అని కొన్ని పురాణాల్లో చెపుతారు
ప్రస్తుతం హనుమంతుని పై శని ప్రభావం పడకపోవటానికి వివరించే కథనాలను తెలుసుకుందాము. మనకు వాల్మీకి రామాయణం కాకుండా అనువాద రామాయణాలు వివిధ భాషలలో అనేకం ఉన్నాయి వీటిలోని కధనాలు భిన్నంగా ఉంటాయి వీటిలో కొంత కవి కల్పనలు కూడా ఉండవచ్చు లంకలో ఉన్న సీతను తీసుకు రావడానికి వానర సైన్యం సముద్రంపై వారధి నిర్మిస్తున్నప్పుడు శనీశ్వరుడు అక్కడికి చేరుకుంటారు వానర వీరులందరూ పెద్ద పెద్ద రాతి బండలను మోసుకొచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై జరుగుతున్నా పనిని పర్యవేక్షిస్తున్నారు అప్పుడు శనీశ్వరుడు శ్రీరాముని చెంతకు చేరి "రామ నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది తమ అనుమతి కావలి" అని అడిగాడు దానికి శ్రీరాముడు ,"నన్నెందుకు అనుమతి అడగడం, నీ విధి నీవు నిర్వర్తించు" అని అంటారు
అప్పుడు శనీశ్వరుడు హనుమంతుని దగ్గరకు వెళ్లి ,"నీ జాతక రీత్యా నేను నీ దగ్గర ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను"అంటే హనుమంతుడు,"ప్రస్తుతం నేను రామకార్యం లో నిమగ్నమై ఉన్నాను కాబట్టి ఇప్పుడు అంత కాలము కుదరదు " అని అంటాడు శనీశ్వరుడు కనీసం ఏడున్నర మాసాలైనా ఉంటాను అంటే దానికి కూడా హనుమంతుడు ఒప్పుకోలేదు.శనీశ్వరుడు ఏడున్నర వారాలు అని కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు హనుమంతుడు రామనామము ఆపకుండా జపిస్తూ చివరకు ఒక్క ఏడు క్షణాల కాలము తనను పట్టుకో వలసినదిగా కోరాడు.
శనీశ్వరుడు శరీరములో ఏ భాగము ద్వారా ప్రవేశించాలి అని హనుమంతుని అడిగి కాళ్ళ ద్వారా ప్రవేశిస్తానని అంటాడు హనుమంతుడు ,"వద్దు రాళ్లు తేవటానికి నడవాలన్న పరుగెత్తాలన్న కాళ్ళు అవసరం అంటే అయితే చేతులు అని శనీశ్వరుడు అంటే వద్దు రాళ్లను మోసేది చేతులతోనే కదా వద్దు అని అంటాడు సరే అయితే నీ భుజాలపైన ఎక్కుతాను అని శనీశ్వరుడు అంటే వద్దు ఆ భుజాలపైన రామలక్ష్మణులను ఎక్కించుకుంటాను అంటే మరి నీ హృదయములో ప్రవేశించినా? అని అడిగితె నా హృదయములో నిరంతరము సీతారాముల నివాసం ఉంటారు అన్యులకు అక్కడ చోటు లేదు అని అంటాడు అప్పుడు శనీశ్వరుడు అయితే నీ శిరస్సు ఖాళీగా ఉన్నది కాబట్టి అక్కడ ఉంటాను అని శిరస్సు పైకి ఎక్కి శనీశ్వరుడు కూర్చుంటాడు హనుమంతుడు ఒక పెద్ద బండ రాళ్లను తల పైకి ఎత్తుకుని సముద్రంలో పడవేస్తుంటాడు ఆ బండ రాళ్ళ బరువుకు శనీశ్వరుడు కళ్ళు తేలేసాడు మరో పెద్ద బండరాయిని ఎత్తుకోగానే శనీశ్వరునికి ఊపిరి ఆడక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయియుని సముద్రములో పడవేయగానే శనీశ్వరుడు హనుమంతుని తలపై నుంచి క్రిందకు దూకాడు "హనుమా నీ వల్ల నాకు కూడా శ్రీరాముని సేవించుకొనే అవకాశము వచ్చింది. నీవు సకల శక్తులకు అతీతుడవు రామభక్తుడివి అయిన నీ ముందు నా శక్తి చాలదు నీ మీద నా ప్రభావం ఏమి పనిచేయదు నన్ను వదిలి పెట్టు మహానుభావా "అంటూ చేతులెత్తి నమస్కరించి నిష్క్రమించాడు ఈ సందర్భంగానే హనుమంతుని ముందా కుప్పిగంతులు అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది. నిశ్చల మనస్సుతో నిర్మలమైన భక్తితో శ్రీ రాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొన లేడు. ఏలినాటి శని సమయంలో కూడా ఎలాంటి హాని ఉండదని పండితులు చెబుతారు
మరొక కథనం మేఘనాధుడు జన్మించేటప్పుడు తన సూచనలను శని పాటించక పోవడం తో మేఘనాధుని అమరత్వం సిద్ధించలేదు ఆగ్రహించిన రావణాసురుడు శని ని గొలుసులతో బంధించి లంకలో ఓ మూల పడేసాడు సీతను వెతకడానికి హనుమంతుడు లంకకు వచ్చి సీతకు రాముల వారి అంగుళీకము గుర్తుగా చూపించి తిరిగి వెళ్ళేటప్పుడు రాక్షసులు హనుమంతుని తోక కు నిప్పు అంటిస్తే ఆ నిప్పుతో హనుమంతుడు లంకా దహనం మొదలుపెడతాడు ఆ సందర్భంగా బందీగా ఉన్న శనీశ్వరుని చూసి ఎవరు నీవు అని ప్రశ్నిస్తే శనీశ్వరుడు తన వృత్తాంతాన్ని చెప్పి తనను బంధ విముక్తుడిని చేయమని అర్థిస్తాడు అప్పుడు హనుమంతుడు శనీశ్వరుని తన శక్తి తో దూరంగా విసిరేశాడు శని అక్కడ నుంచి రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మంటలు వ్యాపింపజేశారు. అయితే ఆ మంటలకు శని కూడా నల్లగా మారిపోవడం బంగారు లంక మొత్తం బూడిదగా మారింది. హనుమంతుడు లంక నుంచి విసిరితే శనీశ్వరుడు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో వచ్చి పడ్డాడు. దీన్ని ప్రస్తుతం శనీశ్వర ప్రాంతంగా పిలుస్తున్నారు. ఆ సమయంలో చిన్న అగ్నిపర్వత విస్ఫోటనం అక్కడ సంభవించింది.