భారతదేశంలో వింధ్య పర్వతమునకు దక్షిణమున ఉన్న అరణ్యము. దండుని పురము మట్టిలో కలసిపోయి అక్కడ ఏర్పడిన అరణ్యము కాబట్టి దీనికి దండకారణ్యము అని పేరు వచ్చింది. ఇది ప్రస్తుతం తూర్పుకనుమలకు పడమరగా మధ్య ప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఈ అరణ్యం ఇంచుమించు 200 మైళ్ళు ఉత్తరదక్షిణాలుగా, 300 మైళ్ళు తూర్పుపడమరలుగా విస్తరించింది.[1]
దండకారణ్యం భారత పురాణాలలో ప్రముఖమైనది. రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసంలో 13 సంవత్సరాలు గడిపాడు.
పూర్వం ఇక్ష్వాకు మహారాజు భూమండలాన్ని ధర్మబుద్ధితో పరిపాలిస్తుండేవాడు, ఆయనకు కలిగిన కుమారులలో మంచి విద్యాబుద్ధులు, రూప, గుణశీలాలు కలిగిన ఒక కుమారుడు ఉండేవాడని అయితే ఇక్ష్వాకు భవిష్యత్లో తన కుమారుడికి ఒక మహానుభావుడి వల్ల దండన కలగవలసిన పరిస్థితి ఉందని గమనించి అందుకు తగినట్లుగా తన కుమారుడికి ‘దండుడు’ అని పేరుపెట్టినట్లు చెప్పాడు. అలాగే దండుడుకి వింధ్య, నీల పర్వతాల మధ్యభాగంలో ఉన్న అరణ్యప్రాంతాన్నంతటినీ రాజ్యంగా ఇచ్చాడని ఆ అందమైన అరణ్య ప్రాంతమే దండుడు పరిపాలించినందువల్ల దండకారణ్యంగా పేరువచ్చిందని పౌరాణిక కథనం.
ఆ అరణ్యంలోనే దండుడు నివసించటానికి అనువుగా ‘మధుమత్’ అనే పేరుగల ఎంతో సుందరమైన ఒక నగరాన్ని కూడా ఇక్ష్వాకువే నిర్మించాడు. కానీ కామప్రకోపంతో విచక్షణను మరచిపోవడం వల్ల దండుడు ఒక ఘోరతప్పిదం చేసి శుక్రాచార్యుడు శాపానికి గురై నశించిపోవాల్సి వచ్చింది.
దండుడు ఒకరోజున అరణ్యంలో సంచరిస్తూ శుక్రాచార్యుడి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. అసలే మొదటి నుంచి ఎంతో సౌందర్యవంతంగా ఉండే ఆ అరణ్యంలో అంతకు పదిరెట్లు ప్రకృతి సౌందర్యంతో శుక్రుని ఆశ్రమ ప్రాంతం వుంటుంది. ఆ ఆశ్రమ సౌందర్యాన్ని దూరం నుండే చూసి ఆకర్షితుడై ముందుకు నడుస్తున్న దండుడుకి మరింత ఆశ్చర్యం కలిగించేలా అత్యంత సౌందర్యవతి యైన ఓ అద్భుత అందాల కన్య దండుడి కంటపడింది. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై విపరీతమైన ఆకర్షణకు లోనై మన్మథతాపంతో ఆ రాజు విలవిలలాడాడు. ఆ స్థితి నుంచి తట్టుకోలేక ఆమెను సమీపంచి తన మనోవాంఛను వివరించాడు. అప్పుడామె తాను శుక్రాచార్యుడి కుమార్తెనని తన పేరు అరజ అని తాను శుక్రుడి కుమార్తె కనుక శుక్రుడు దండుడికి గురువు కనుక తాను దండుడికి సోదరితో సమానమని నచ్చచెప్పి దండుడి మనస్సును మరల్చాలని చూసింది. కానీ దండుడు ఆమె మాటలు వినే స్థితిలో లేడు. అప్పుడు అరజ ఒక వేళ తనను చేపట్టదలిస్తే తన తండ్రి అయిన శుక్రాచార్యుడి అనుమతి పొంది చేపట్టమని చెప్పింది. ఆ మాటలను కూడా వినే స్థితిలో లేని దండుడు కామాంధుడై ఆమెన బలవంతం చేశాడు. ఆ వెంటనే అతడు తిరిగి తన నగరానికి వెళ్ళిపోయాడు. అరజ మాత్రం తనకు జరిగిన అన్యాయానికి రోదిస్తూ ఆశ్రమం వెలుపలే ఉండిపోయింది. వేరే పనిమీద బయటకు వెళ్ళిన శుక్రాచార్యుడు తన శిష్యులతో సహా ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి అరజ దుఃఖిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పింది. శుక్రాచార్యుడు కోపోద్రిక్తుడై అన్యాయంగా ప్రవర్తించిన రాజు నశించిపోవాలని అతడి మీద దేవేంద్రుడు ధూళివర్షం కురిపించగలడని శపించి తన కుమార్తెను ఆశ్రమం వద్దే విడిచి తాను మాత్రం వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. శుక్రాచార్యుడి శాపం కారణంగా ఆకాశం నుంచి ధూళి ధారాపాతంగా కురిసింది. ఆ దూళి వర్షంలో దండుడు మరణించాడు.