వైద్య శాస్త్రానికి తొలి ఆచార్యులు ధన్వంతరి.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మథనంలో అమృత కలశం, కరక్కాయ, జలగ పట్టుకొని వచ్చిన మహావిష్ణువు అంశావతారం ధన్వంతరి.బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.శరీరానికి వివిధ దశలలో —బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ వచ్చే సమస్త వ్యాధులకు ఎనిమిది విభాగాలలో చికిత్స చెప్పిన వాడు ధన్వంతరి. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడు. అవి కాయ చికిత్స (Internal Medicine) కౌమారభృత్య లేదా బాల చికిత్స (Paediatrics) భూతవైద్యం లేదా గ్రహ చికిత్స (Psychiatry) శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Ophthalmology) శల్య తంత్రం (Surgery) విష తంత్ర (Toxicology) రసాయన తంత్ర (Geriatrics) వశీకరణ తంత్ర(The therapy for male sterility, impotency and the promotion of virility) పూర్వకాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు ధన్వన్తరి శబ్దానికి "ధనుః శల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు, పురాతన కాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలు లైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది
శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరం లోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వారీగా చెప్పవచ్చును. . భాగవతంలో నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమం లో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి).
భగవతములో ధన్వంతరి ప్రస్తావన వస్తుంది క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తర్వాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తర్వాత ధన్వంతరి అవతరించాడు. అని చెప్పబడింది.
"అప్పుడు సాగర గర్భం నుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబు కంఠాన్ని, పద్మారుణ లోచనాలు, విశాఖ వక్షః ప్రదేశాన్ని, స్నిగ్ధ కేశ జాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణి కుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృతకలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడు, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టారు.
ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకముగా ఉండటం అరుదు. వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లోని మ్యూజియం లో ధన్వంతరి విగ్రహం ఉంది. తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది.కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ్" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది.ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరు లో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది. కర్ణాటక లో బెంగళూరులోని యశ్వంతపుర లోని గాయత్రి దేవస్థానం లో ధన్వంతరి దేవాలయం ఉంది.ఆయుర్వేద వైద్యులు ప్రతియేటా "ధన త్రయోదశి" (దీపావళి కి రెండు రోజుల ముందు) నాడు భక్తితో ధన్వంతరిని పూజిస్తారు ధన్వంతరి మంత్రం : ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః