ఒకప్పుడు నవల అంటే పెద్ద క్రేజ్. కొత్త నవల ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసేవారు పాఠకులు. ఇప్పుడూ నవలల్ని చదివేవారున్నారు. తెలుగు నవలా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు సూర్యదేవర రామ్మోహన్‌రావు. 100కి పైగా నవలలు రాసిన సూర్యదేవర రామ్మోహన్‌రావు, ఇంగ్లీషులోనూ ఓ నవల రాశారు.
‘ది ఎనిమీ ఆఫ్ మేన్ కైండ్’ పేరుతో సూర్యదేవర రామ్మోహన్‌రావు ఇంగ్లీషులో రాసిన నవల ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలలో విడుదలైంది ఇటీవలే. అమెరికాలో ముద్రితమైందీ నవల. ఇది ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ విషయం. సూర్యదేవర రామ్మోహనరావు సాధించిన ఈ ఘనతను గుర్తించిన బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ సంస్థ ‘సృజనపుత్ర’ పురస్కారంతో గౌరవించింది.
తెలుగులో సూర్యదేవర రాసిన తొలి నవల ‘మోడల్’ కాగా, 2013లో ‘నా ప్రేయసిని పట్టుకుంటే కోటి’ అనే నవల రాశారు. మధ్యలో 99 నవలలు వున్నాయి. వీటిల్లో కొన్ని కన్నడ, తమిళ భాషల్లోకి అనువదింపబడ్డాయి కూడా.
2009లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ పాట్ క్విన్ చేతులమీదుగా ‘లిటరరీ ఎక్సలెన్స్ అవార్డు’ను సూర్యదేవర రామ్మోహన్‌రావు పొందారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు రచయిత ఈయనే. సూర్యదేవర రామ్మోహన్‌రావు మన ‘గో తెలుగు’ కుటుంబ సభ్యులు కావడం మాకు గర్వకారణం.