సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తుంటాడు .మొదటిది ఆత్మస్తుతి . రెండవది పరనింద . రెండూ తప్పులే . మనిషి తానెంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ తనను తాను పొగుడుకోకూడదు అంతుంది శాత్రం.ఇతరులను నిందించటమూ పెద్ద పాపమే. ఒక మనిషిని హత్య చేసిన దానికంటే ఇది ఎక్కువ పాపం.
" ఇన్ద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః " అని ఒక వాక్యం వేదంలో వుంది అంటే దేవతల అధిపతి ఆయన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే ప్రస్తుతించుకుంటే చాలా చులకన అవుతాడని చెప్తారు . అందువలన ఎట్టి పరిస్థితులలోను మానవుడు ఆత్మస్తుతి చేసుకోకూడదు అని పై వాక్యం ఒక్క భావం.
ఆత్మతృప్తి ఉన్నచోటును లక్ష్మీదేవి వదిలిపోదుట. పైగా ఆమె అనుగ్రహం పొందాలంటే కొన్ని అర్హతలు సంపాదించవలసి ఉంటుంది. ప్రియభాషణం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమాభిమానాలు, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ, మితభోజనం, మితనిద్ర, ఇవన్నీ ...గట్టి గట్టిగా అరచుకోవడం, అందరితో పోట్లాటలు పెట్టుకోవడం, ఇతరులను చులకనగా చూడడం, ఆత్మస్తుతి, పరనింద ఇవన్ని మన గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి చోట లక్ష్మి నివసించదు అని పెద్దలు చెపుతారు
సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు.ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం.తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఒకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు.
ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికి వెళ్ళే సమయంలో ఆ భక్తుడు బాబాను దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి " చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు ? జంతూనాం నరజన్మ దుర్లభం .కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది. దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దూషణలను చేస్తూ చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు ?" సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షంచమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. " చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు" మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వమైన దివ్య బోధను చేసారో చూడండి. అనుక్షణం అసూద్వేషాలతో రగిలిపోతూ, పరులలోనూ ఆ పరమాత్మే వున్నాడన్న వేదసత్యాన్ని విస్మరించి, ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్న మనకు ఈ సందేశం చిరస్మరణీయం, సదా అనుసరణీయం.