108 - శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

108

గుడిలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరశతనామావళితో పూజిస్తాము. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలంటే 108 పూసలు ఉన్న మాలని వాడతాము. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో కనిపిస్తూనే ఉంటుంది. క్షీరసాగరమథనంలో సైతం 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు కలిసి చిలికిచిన సాగరంలోంచి అమృతం వెలికి వచ్చింది. మనిషిలో మంచీ, చెడు లక్షణాలు రెండూ ఉంటాయనీ... వాటిలో మంచిది పైచేయి అయినప్పుడు అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతామనీ ఈ ఉదంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావిచవచ్చునేమో! కేవలం క్షీరసాగరమథనమే కాదు- వైష్ణవ దివ్యదేశాలు, శ్రీ కృష్ణుని ముఖ్య గోపికలు... ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా 108 ప్రసక్తి వస్తూనే ఉంటుంది.

 

పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా, వందల ఏళ్ల క్రితమే మన ఖగోళశాస్త్రం పరిపక్వతకు వచ్చిందన్నది ఓ నమ్మకం. దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితమే వెలువడిన సూర్యసిద్ధాంతంలో, ఎక్కడో సుదూరాన ఉన్న శనిగ్రహపు చుట్టుకొలతను సైతం అంచనా వేయగలిగారు. అంతేకాదు! సూర్యుడి కిరణాలు, భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పగలిగారు. ఇంతటి సూక్ష్మమైన లెక్కలు కట్టగలిగిన వీరికి ఈ విశ్వసృష్టిలో 108కి ఉన్న ప్రాధాన్యత ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఉదాహరణకు- సూర్యుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికీ, సూర్యునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. అలాగే చంద్రుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికీ, చంద్రునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. ఇక సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడు. ఈ గణాంకాలన్నీ ఖచ్చితంగా కిలోమీటర్లు, మీటర్లతో సహా సరిపోలవు కానీ... 108కి అతి చేరువలో మాత్రం ఉంటాయి.

 

మన పెద్దలు స్థూల ప్రపంచంలో ఉన్న ఈ సంఖ్యను మానవ ధార్మిక, లౌకిక జీవితానికి ఆపాదించారేమో అన్న సందేహం కలుగక మానదు. అందుకు ఉదాహరణగా మన జాతకచక్రాలనే తీసుకోవచ్చు. పిల్లవాడు పుట్టిన సమయం ఆధారంగా అతను ఫలానా నక్షత్రంలోని ఫలానా పాదం అని అంచనా వేస్తాము. అలా 27 నక్షత్రాను నాలుగేసి పాదాలతో హెచ్చిస్తే 108 పాదాలు వస్తాయి. అంటే పుట్టినవారందరూ కూడా 108 వర్గాలలో ఏదో ఒక కోవకి చెందాల్సిందే అన్నమాట. ఈ రకంగా 108ని మన జీవితానికి అడుగడుగునా అన్వయించపేచేందుకు పెద్దలు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆఖరికి ఆ జీవితంలోని తత్వం అర్థం చేసుకునేందుకు రాసిన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108.

మన పూర్వీకులు మనిషిని ఈ విశ్వంలోని ఒక భాగంగానే గమనించారు. ప్రపంచం మనిషినీ, మనిషి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని నమ్మారు. అందుకు అనుగుణంగానే జీవనశైలిని రూపొందించుకున్నారు. దానికి ఈ 108 సంఖ్య గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ విశ్వానికీ 108 అన్న సంఖ్యకూ ఎక్కడో లంకె ఉన్నదన్న విషయాన్ని మన పెద్దలు నమ్మబట్టే దానికి అనుగుణంగా ధార్మిక సూత్రాలను ఏర్పరుచుకొన్నారు.

మరిన్ని వ్యాసాలు