విశ్వకర్మ - శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి

Viswakarma

విశ్వకర్మ అనే పేరు వినగానే "దేవశిల్పి" అనే మాట గుర్తొస్తుంది అందరికీ. ఎందుకంటే, పురాణాలలోని ఈ విశ్వకర్మ ప్రజాపతియే దేవతలకు శిల్పాచార్యుడిగా మరియు సమస్త కళలకు అధినేతగా, దేవతా సంబంధ సాహిత్యంలో సమాజంలో మిక్కిలి ప్రాచుర్యం పొందాడు కాబట్టి. అష్టవసువులలో ఎనిమిదవవాడైన ప్రభాసుడు, మరియు మహర్షి అంగీరసుడి కూతురైన యోగసిద్ధ (బృహస్పతి చెల్లెలు) దంపతుల కుమారుడు అయిన విశ్వకర్మ ప్రజాపతి మహాశిల్పాచార్యుడై దేవతలకు.. సత్య, వైకుంఠ, అమరావతి, అలకాపురి, స్వర్గ నరకాది సకల దేవ లోకాలు, సుదర్శన, త్రిశూల, పరశు, వజ్రాయుధాది మహా శక్తివంతమైన ఆయుధాలు, మరియు ద్వారక, లంకాది నగరాలు సృష్టించి ఇచ్చేవాడుగా పురాణాలలో మరియు మహాభారతాది ఇతిహాసాలలో ఈయన మనకు దర్శనమిస్తాడు.

కానీ, సనాతన వైదిక ధర్మమును పాటించు హైందవులకు, పౌరాణిక విశ్వకర్మతో బాటు, వైదిక విశ్వకర్మ గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనావుంది. ఎందుకటే భరతఖండం వేదభూమి. మరి వేదాన్ని తెలుసుకోకపోతే ఎలా..? వైదిక విశ్వకర్మ గురించి కొంచెం తెలుసుకుందాం రండి..!

త్రిమూర్తులు అనే అంశం మనకు కేవలం పురాణాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది పురాణాల్లో చాలా ప్రధానమైనది. పురాణాలప్రకారం చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త కాగా, విష్ణువు పోషకుడు మరియు శివుడు లయకారుడిగా ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు. కానీ వేదాలలో అసలు త్రిమూర్తులు అనే అంశమే వుండదు.

వేదాలలో మాత్రం సకల దేవమానవ జీవనిర్జీవ స్థావర జంగమ సహిత సమస్త విశ్వసృష్టికర్త, పోషకుడు, పాలకుడు, లయకారుడు సమస్తమూ విశ్వకర్మయే. ఈయన నిరాకారుడు, విశ్వమంతా నేత్రములు, ముఖములు, హస్తములు, పాదములు కలిగి సమస్త విశ్వములో వ్యాపించి సమస్త విశ్వాన్ని మనస్సంకల్పంచేత సృష్టించి, ఆఖరున సర్వమునూ తనలోనే లీనం చేసుకొను లయకారుడనీ, మోక్షమును ప్రసాదించు ఒకే ఒక దేవుడు అనీ, సర్వజనకుడనీ, విశ్వసృష్టిని ఒక యజ్ఞంవలె చేయుననీ, సమస్త వాక్కులకు అధిపతియైన వాచస్పతి అనీ, సమస్త శుభప్రదాత అనీ, నేత్రములు మొదలగు దశేంద్రియాది సమస్త ప్రాణ సముదాయానికి తండ్రియనీ, ఆయనే మనకు జనకుడు, పాలకుడు, పోషకుడు అనీ, సమస్త దేవతల నామ రూపములను ధరించిన ఒకే ఒక్క దేవుడనీ, ఆయన నాభి గర్భమునందే సమస్త లోకములు మరియు దేవతలూ జన్మించి, తన నాభినే ఆశ్రయించి ఉంటారనీ, ప్రపంచంలోనే అత్యంత పురాతన సాషిత్యమైన ఋగ్వేదం (10-81,82) తెలియజేస్తుంది.

ఈయనే ధాత, విధాత అనీ, అంతేకాకుండా పరమోత్కృష్టమైన దృష్టికలిగినవాడని చెప్తుంది. అనగా ఏ జీవిలోనుండి ఆ జీవియే పుట్టడం, ఏ విత్తులోనుండి ఆ చెట్టే మొలకెత్తడం ఇదంతా విశ్వకర్మ సృష్టియే అని వేదములు చెప్తున్నాయి. విశ్వకర్మ సృష్టికి విరుద్ధంగా జరుగక పోవడమే ఆయన మహోన్నతదృష్టికి నిదర్శనం, అది ఆయన శాసనం. విశ్వకర్మయే ఇంద్రుడనీ, సూర్యుని ఆకాశంలో ప్రతిష్టించి ప్రకాశింపజేసినాడనీ ఋగ్వేదమే (8-98-2) చెప్తుంది.

విశ్వకర్మ ప్రజాపతియే ఆదివరాహ రూపుడై నీటియందున్న భూమిని తన దంష్ట్రలతో చీల్చి పైకి తీసుకువచ్చి నివాసయోగ్యం గావించి, ఆ తర్వాత 33 కోట్ల దేవతలను అనగా 33మంది దేవతల సమూహాన్ని (అనగా.. అష్ట వసువులు: ధర, ధృవ, సోమ, అహస్, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస + ఏకాదశ రుద్రులు: అజ, ఏకపాద, అహిర్భుధ్న్య, త్వష్ట, రుద్ర, హర, శంభు, త్రయంబక, అపరాజిత, ఈశాన, త్రిభువన + ద్వాదశ ఆదిత్యులు: ధాత, మిత్ర, వరుణ, అర్యమ, శుక్ర, అంశ, భగ, వివస్వంత, పుమ్ష, సవిత, త్వష్ట, విష్ణు + అగ్ని + ఇంద్ర వెరసి 33మందిని) సృష్టించెను అని కృష్ణ యజుర్వేదం (7-1-5) చెప్తుంది.

విశ్వకర్మయే సముద్రములకు, నదీనదములకు జలరాశులకు అధిపతి అనీ, సమస్త దిక్కులనుండి రక్షించే విశ్వాధిపతి అని కృష్ణయజుర్వేదం (4-2-17; 5-5-5) తెలియజేస్తుంది.

నిరాకార విశ్వకర్మ పరమాత్మయే ప్రప్రథమంగా సాకార రూపమున త్వష్టవిశ్వకర్మ గా అవతరించి ఈ సమస్త సృష్టినీ గావించెనని, ఆయనే విరాట్పురుషుడనీ, ఆయనను తెలుసుకునేవారు ఇక్కడే, ఈజన్మలోనే ముక్తినిపొందుతారనీ, మోక్షానికి ఇంతకంటే వేరే మార్గమేలేదనీ శుక్ల యజుర్వేదం (పురుష సూక్తం 31-19) రెండుసార్లు చెప్పడం విశేషం.

ఈ సందర్భంగా ఒక విశేషం తెలుసుకోవాలి. వేదవాఙ్మయంలో విశ్వోత్పత్తి సూక్తాలైన నాసదీయ, హిరణ్యగర్భ, విశ్వకర్మ, పురుష సూక్తాలు వేదరాశికే తలమానికమైనవి. విశ్వసృష్టికి పూర్వస్థితిని నాసదీయ సూక్తం వివరిస్తే, విశ్వసృష్టి, లయముల గురించి విశ్వకర్మ సూక్తం, మరియు విశ్వసృష్టిక్రమాన్ని పురుష సూక్తం చక్కగా వివరిస్తాయి. ఈ సూక్తాలలో విశ్వసృష్టికర్తయైన విశ్వకర్మ మరియు త్వష్ట దేవతలపేర్లు తప్ప, మరి ఏ ఇతరదేవతల పేర్లు ఎక్కడ కూడా కనబడకపోవడం గమనించాల్సిన విషయం.

నీటిలో మునిగిపోయిన భూమిని బైటకుతీసుకువచ్చి నివాసయోగ్యంగావించినది విశ్వకర్మపరమాత్మయే అని అథర్వణ వేదం (12-1-60) కూడా చెప్తుంది. మనుష్యులను యజ్ఞకర్తలనుగా చేయునది, యజ్ఞ సంబంధ పాపవిముక్తులనుగా చేయునది, యజ్ఞములను విస్తృతముచేసి, మనలను రక్షించునది మహా విద్వాంసుడైన విశ్వకర్మయే అని అథర్వవేదం (2-35) చెప్తుంది. విశ్వకర్మ పరమేశ్వరుని స్వర్గ ప్రదాత అనీ, ఐశ్వర్యప్రదాత అనీ (సామవేదం: 16-4-1) ప్రస్తుతించింది.

దంపతులని నిర్ణయించునది.. అనగా పురుషుడికి భార్యను, స్త్రీకి భర్తను నిర్ణయం చేసి వారి వివాహం జరిపించేది విశ్వకర్మ పరమాత్మయేనని ఋగ్వేదం (10-10-5), అథర్వవేదం (6-78-3), కృష్ణయజుర్వేదీయ ఏకాగ్నికాండ (1-8-8) స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా త్వష్టావిశ్వకర్మ పరమాత్మ అనుగ్రహం వలననే స్త్రీలు సంతానవతులు అవుతారనీ, సంతాన అనుగ్రహ కారకుడు ఆయనేననీ, అత్యంత ముఖ్యంగా.. వీర్యప్రదాత అని ఋగ్వేదము (3-4-9), స్త్రీనిచేరే రేతస్సు మొత్తం సంతానంగా పుట్టకుండా కొంత రేతస్సును మాత్రమే సంతానంగా పుట్టించి అనుగ్రహించే దైవం త్వష్టావిశ్వకర్మ పరమాత్మయేనని కృష్ణ యజుర్వేదం (1-2-5; 1-5-9) స్పష్టంగా తెలియజేస్తాయి. కార్యశూరుడు, దేవతలచే కోరబడువాడు అగు వీరపుత్రుని ప్రసాదించేవాడు (ఋగ్వేదం: 2-3-9; 3-4-9; 7-34-20,21,22; శుక్ల యజుర్వేదం:29-9; కృష్ణ యజుర్వేదం 5-1-11-3) త్వష్టావిశ్వకర్మయే అని తెలియజేస్తున్నాయి.

వ్యాధిగ్రస్త శరీరములను, అవయవములను నయం చేయువాడు, వైద్యుడు, శతశరత్తుల దీర్ఘాయువును ప్రసాదించి వంశాన్ని వృద్ధిచేయువాడు, పశుసమృద్ధిగావించువాడు త్వష్టావిశ్వకర్మయే అని అథర్వవేదం (2-26-1; 2-29-2; 6-53-3), శుక్ల యజుర్వేదం (28-9) ధృవీకరిస్తున్నాయి. విశ్వరూపమును ధరించువాడు (ఋగ్వేదం: 1-13-10) అనీ, ఈ త్వష్టావిశ్వకర్మకు అల్లుడు వాయుదేవుడనీ (ఋగ్వేదం: 8-26-21,22) వేదాలు చెప్తున్నాయి. ఈయనే సమస్త దేవతలకు తండ్రి అని ఋగ్వేదం (10-64-10) తెలియజేస్తుంది.

ప్రళయకాలమున సమస్త జీవులను చిన్నాభిన్నము చేసి తనలో లయము చేసుకొనునది త్వష్టావిశ్వకర్మ పరమేశ్వరుడేనని శుక్లయజుర్వేదం (2-24) స్పష్టంచేస్తుంది. సమస్త భువనములకు దేవుడని (ఋగ్వేదం: 2-31-4), బృహస్పతికి (ఋగ్వేదం:2-23-17), అగ్నికి (ఋగ్వేదం: 1-95-2; 2-1-5; కృష్ణయజుర్వేదం: 4-2-10-9), తండ్రి అనీ, సవితయై సమస్తాన్ని ప్రేరేపించువాడు అనీ ఋగ్వేదం (3-55-19) తెలియజేస్తుంది.

వర్షప్రదాత మరియు వృక్షాలకు ఔషధాలకు అధిపతి అని ఋగ్వేదం (1-142-10), కృష్ణయజుర్వేదం (4-6-8) తెలియజేస్తున్నాయి. మన అందరికీ తండ్రి అనీ, ఆహార ప్రదాత అనీ తెలియజేస్తుంది శుక్ల యజుర్వేదం (34-58). ఆయనే ప్రథముడు, సమస్త భోగ ప్రదాత ఐన ఇంద్రుడు, విశ్వాన్ని చక్కగా సృష్టించిన విశ్వసృష్టికర్త అని కృష్ణయజుర్వేదం (6-4-10-3) తెలియజేస్తుంది.
విశ్వకర్మ ప్రజాపతి సమస్త ప్రాణులను సృష్టించి యజ్ఞ స్వరూపుడై, ఇంద్రస్వరూపుడై, సంవత్సర స్వరూపుడై, ప్రళయకాలంలో సర్వమునూ తనయందే లయం చేసికొనునని ఐతరేయ బ్రాహ్మణం (4-22-3) చెప్పుచున్నది. ఆ విశ్వకర్మ పరమాత్మ సమస్త జీవుల హృదయాలలో చక్కగా ప్రాణరూపమున నివసిస్తుంటాడు. ఇది తెలుసుకున్నవారు అమరత్వమును పొందుతారు (శ్వేతాశ్వతరోపనిషత్: 4-17) అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అనగా మనలోని ప్రాణము, ఆత్మ, పరమాత్మ విశ్వకర్మయే..!

విశ్వకర్మోపనిషత్తు కూడా.. చతుర్దశభువనాది సమస్త లోకములను, వసు రుద్రాదిత్యాది సమస్త దేవతలను, సర్వ భూతములను, సకల ఋషులను, సమస్త ఛందస్సులను, సృష్టించివృద్ధిచేయు ఓంకార రూప పరమపురుషుడు, నిత్యుడు, శాశ్వతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్యాది సర్వదేవతల నామములను ధరించినవాడు, ప్రాణస్వరూపుడు, స్వయంప్రకాశకుడు, భూమ్యంతరిక్ష స్వరూపుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, దిక్కులు, దిగంతములు, అంతర్బాహ్యతత్త్వములు ప్రజాపతియైన విశ్వకర్మ పరమాత్మయే అని చెప్తుంది. విశ్వకర్మ పరమాత్మ గురించి ఇంకా.. పరిశుద్ధుడు, ఏ కళంకములు లేనివాడు, ఏ వికల్పములు లేనివాడు, ఏ దోషములు లేనివాడు, సర్వమూ తానే అయి, తాను తప్ప ఇతరములు లేనివాడు, ప్రత్యగానంద పరబ్రహ్మ, ఆధారభూతుడు, ఒకేఒక్కడు విశ్వకర్మపరమాత్మయే అని చెప్తుంది. “ఓంనమోవిశ్వకర్మణే” అనే అష్టాక్షరీ మహా మంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఇహములో ఆయురారోగ్యములు గోసంపద రాజయోగము కలిగి సర్వపాపములనుండి విముక్తిపొంది, విశ్వకర్మ పరమాత్మ సాయుజ్యమును పొందెదరని ఈ ఉపనిషత్తు తెలియజేచున్నది. పరమపదమనగా విశ్వకర్మ పరమాత్మ పదమే..!

స్వయంభువు, విశ్వవ్యాపకుడు, దేవాధిదేవుడు, ఆదిదేవుడు, సమస్త దేవతలకు తండ్రి, సమస్త విశ్వసృష్టికర్త, సమస్త దేవ గణాధిపతి, సకల దేవతల నామ రూపములను ధరించినవాడు, సకల దేవతాగ్రజుడు సవితయై సమస్తమును ప్రేరేపించువాడు, ఆహార ప్రదాత, పోషకుడు, పాలకుడు, లయకారుడు, ఆయురారోగ్య ప్రదాత, వంశాభివృద్ధిప్రదాత, వివాహయోగ కారకుడు, దంపతులను నిర్ణయించేవాడు, సంతాన కారకుడు, యజ్ఞప్రదాత, వైద్యుడు, సమస్త వాక్కులకు అధిపతి, సముద్రాది సర్వ జలాధిపతి, వర్షకారకుడు, సర్వ శుభములను ప్రసాదించువాడు, సకల కష్టములను నివారించువాడు, సకల పాప వినాశకుడు… ఇంకా చెప్పాలంటే, “విశ్వకర్మ” అనగా “సర్వస్యకర్తా” అని నిరుక్తం (అధ్యాయం.10 ఖండం.26 ) ఒక్క మాటలో తేల్చి చెప్పింది.

అజ్ఞానమనే మంచు ప్రజల బుద్ధిని కప్పివేసిన కారణంగా.., సర్వవ్యాపకుడు, అనంతుడు, స్వయంభువు అయిన విశ్వకర్మ పరమాత్మను తెలుసుకోలేక పోతున్నారు అని ఋగ్వేదమే (10-82-7) ఘంటపథంగా చెప్పడం చాలా ఆలోచింపజేస్తుంది. వేదం ఎల్లప్పుడూ సత్యమే చెప్తుందను నమ్మకాన్ని మరొకసారి ఋజువు చేస్తుంది.

మరిన్ని వ్యాసాలు