దేవశిల్పి విశ్వకర్మ చేత సృజనచేయబడిన ధనస్సులు - కుందుర్తి నాగబ్రహ్మచార్యులు

Devashilpi viswakarma cheta srujinchabadina dhanussulu

పురాణములు పరిశీలించిన ఒకనాడు బ్రహ్మదేవుడు తన హంస వాహనంపై మేరుపర్వతం మీదుగా ప్రయాణిస్తున్నాడు. అప్పుడే సూర్యోదయమవుతోంది. సంధ్య వార్చే సమయం అగుటచే తన హంస వాహనం కిందకు దిగమని, చేతితో దాని రెక్కలు నిమిరాడు. ఆయన భావం అర్థం చేసుకున్న రాజహంస తగిన ప్రదేశం చూసుకుని మెల్లగా దిగింది.చక్కని సెలయేరు అల్లుకుపోయిన చెట్లు మీదుగా లతలు, చాలా సుందరంగా వుంది. విధాత తన హంస వాహనం దిగి కమండలం ఒడ్డున ఉంచి స్నానం కోసం సెలయేటిలో దిగాడు. సరిగ్గా ఆ సమయంలో ఆప్రాంతంలోనే తిరుగుతున్న 'కిమ్మీరుడు' అనే రాక్షసుడు నీటీ ఎండలో మెరుస్తున్న బంగారు దండ కమండలాన్ని కిమ్మరుడు చూచి. నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెనుకవైపు నుంచి వచ్చి దండ, కమండలాల్ని సంగ్రహించి పారిపోవుచున్నాడు. అది చూచిన రాజహంస అరవటం మొదలుపెట్టింది. సూర్యుడికి అర్ధ్యం. ఇస్తున్న బ్రహ్మకు ధ్యానభంగం అయింది. ఆయనకుపరుగెత్తుకుంటూ పోతున్న రాక్షసుడు కనిపించాడు. త్వరత్వరగా ఒడ్డుకు వచ్చి హంసను అధిరోహించి ఆ రాక్షసుని, తరమటం మొదలుపెట్టాడు. రాక్షసుడు బ్రహ్మకు ఏ మాత్రం దొరకకుండా పరిగెత్తటం మొదలుపెట్టాడు. ఈలోగా హంస వేగంగా వాడిని సమీపించి, తన పాదాల్తో ముందుకు తోసింది. ఆ తోపుకు రాక్షసుడు మాత్రమే క్రిందపడ్డాడు. వెంటనే బ్రహ్మ క్రిందికి దిగి, కిమ్మీరుడి జట్టు పట్టుకొని క్రిందపడేశాడు. క్రిందపడ్డవాడి ఛాతిపై తన కుడిచేతితో నోటి నుంచి రక్తం వచ్చేలా అదిమాడు. రాక్షసుని నోట్లో నుంచి రక్తం ధారగా కారింది. ప్రాణభయంతో రాక్షసుడు బ్రహ్మకు నమస్కరిస్తూ 'బ్రహ్మదేవా ! బుద్ధి చపలతతో నేను చేసిన మహా అపరాధాన్ని మన్నించండి. ఈ సృష్టిలో అన్ని ప్రాణులకు కర్తవైన, మీరు నాకు తండ్రితో సమానుడవు. ఏ తండ్రైన తన పిల్లలు చేసే తెలివిమాలిన పనులను క్షమిస్తాడు. దయచేసి నన్ను క్షమించండి' అని అనేక విధాల స్తోత్రం చేస్తూ బ్రహ్మ పాదాలకు నమస్కరిస్తాడు. దయాహృదయంగల బ్రహ్మదేవుడు వాడి ప్రార్ధనకు శాంతించి, శపించకుండా వదలిపెట్టాడు. బ్రహ్మ వాటిని భూమిలో త్రవ్వి దాచి పెట్టి దండ, కమండలాల్ని వదిలిపెట్టేసి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. బ్రతుకుజీవుడా అని రాక్షసుడు అక్కడ నుంచి పాతాళానికి పారిపోయాడు. అయితే బ్రహ్మ తన సృష్టి కార్యక్రమంలో పడి, దండ కమండలాలు మాటే మరిచిపోయాడు. దండ, కమండలం పాతినచోట ఒక వెదురు మొక్క దానిపక్కనే ఒక తీగ పెరగడం మొదలుపెట్టింది. రెండు మొక్కలు బంగారు రంగులో మెరిసిపోతూ పొడుగ్గా పెరగసాగాయి. అవి రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంటే, సూర్య సంచార సమయమున వాటిని సూర్య భగవానునికి ఆశ్చర్యమేసింది. దివ్య దృష్టితో చూశాడు. అవి బ్రహ్మ దండ, కమండలం అని తెలుసుకుని అటువంటి పవిత్ర వస్తువులు వృధా కారాదని, ఆవిషయం బ్రహ్మదేవునికి గుర్తుచేశాడు. బ్రహ్మ వెంటనే ఆస్థలం వద్దకు వచ్చి చూసి నిశితంగా ఆలోచించి విశ్వకర్మ సంతతియైన దేవశిల్పిని ఆహ్వానించి ఓ విశ్వకర్మదేవా ! ఈ లతా వృక్షాలు రెండు కూడా ఎంతో మహిమగల నా దండ, కమండలాలకు ప్రతి రూపాలు. వీటిని లోకకళ్యాణానికి ఉ పయోగపడేలా, నీకు తోచిన వస్తువుల్ని తయారుచెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ దేవశిల్పి విశ్వకర్మ మూడు ధనస్సులు మూడు అమ్ములపొదలు తయారుచేసాడు. లతను ధనస్సులకు నారగా అమరుస్తాడు. కొంచెం వెదురు ముక్క మిగిలితే ఒక మురళిని తయారుచేస్తాడు. అవి బ్రహ్మకు సమర్పిస్తాడు. వాటిలో ఆదేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన మొదటి ధనుస్సు 'పినాకము'. దానిని బ్రహ్మదేవుడు ఈశ్వరునికి కానుకగా అమ్ములపొదితో సహా అందించాడు. ఈశ్వరుడు దానిని ఆనందంగా స్వీకరించి బ్రహ్మను గాడాలింగనం చేసుకున్నాడు. ఆరోజు నుంచి పశుపతి ‘పినాకపాణి' అయ్యాడు. విశ్వకర్మ నిర్మించిన మరొక ధనస్సు 'కోదండం' అనే పేరుగలదానిని, ఇచ్చుటకు బ్రహ్మదేవుడు తదుపరి, దేవేంద్రుని తలచుకున్నాడు. దేవేంద్రుడు రాగానే ఇంద్రా! ఈ దివ్య ధనస్సు త్రేతాయుగంలో, రాక్షస సంహారంకోసం శ్రీమన్నారాయణుడు, భూలోకంలో రామచంద్రునిగా అవతరిస్తాడు. ఆ పురాణ పురుషునికి, ఈ కోదండం అందజెయ్యి అంటాడు. ఇంద్రుడు ఆ ధనుర్బాణాలు స్వీకరించి అంతర్ధానమవుతాడు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం. ఇంద్రుడు త్రేతాయుగంలో నారాయణుడు, రామావతారం దాల్చి సీతా, లక్ష్మణులతో వనవాసానికి వెళ్లినపుడు అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని దర్శించిన సమయంలో ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో వచ్చి కోదండాన్ని అమ్ముల పొదిని అందజేస్తాడు. దానిని స్వీకరించి శ్రీరాముడు కోదండపాణి అయ్యాడు. ఆ తదుపరి బ్రహ్మ అగ్నిదేవుని స్తోత్రిస్తాడు. అగ్నీ ఎదురుగా వచ్చి బ్రహ్మకు నమస్కరించాడు. అతనికి బ్రహ్మ గాండీవాన్ని అక్షయతూణీరాల అమ్ముల పొదిని, అందజేశాడు. ఓ అగ్ని దేవా ! ద్వాపరయుగంలో నరనారాయణులు, కృష్ణార్జునులుగా అవతరించి లోక కళ్యాణం కోసం దుష్టులను సంహరిస్తారు. అర్జునునికి ఈ గాండీవాన్ని అక్షయ తూణీరాన్ని అందచెయ్యి. నీకు శుభం కల్గుతుంది అని ఆశీర్వదించాడు. స్వాహాప్రియుడు సమ్మతించి వాటిని స్వీకరించి అంతర్థానమయ్యాడు. ఖాండవ దహన సమయంలో తనకు సహాయపడినందుకు, కృతజ్ఞతగా అగ్ని, గాండీవాన్ని, అక్షయతూణీరాన్ని అర్జునునకు కానుకగా అందజేశాడు. వాటిని స్వీకరించి అర్జునుడు గాండీవి అయ్యాడు. ఇక మురళి మాత్రం మిగిలింది. కృష్ణుడు బృందావనంలో, గోపబాలురతో ఆలమంద మేపుతున్నాడు. ఒక్కసారి బ్రహ్మ వినోదం అచ్చటకు వెళ్లి గోపబాలురులను, ఆలమందను కొండగుహలో దాచాడు. కృష్ణుడు. “ఇది బ్రహ్మమాయ” అని తెలుసుకొని ఏమీ తెలియనివాడిలా ఆలమందను, గోపబాలురను, ప్రతిసృష్టిచేసి మొత్తం తనతో తీసుకొనివెళ్ళాడు. బ్రహ్మ పదిహేనురోజులు కొండగుహలో ఆలమందలను, గోపబాలురను దాచాడు. అయినా కృష్ణుడు. లొంగలేదు. బ్రహ్మ కృష్ణుని శక్తి తెలుసుకొని అతని ముందు ప్రత్యక్షమై తన తప్పు క్షమించమని ప్రార్థించి కృతజ్ఞతగా తన వద్దనున్న దివ్య మురళిని శ్రీకృష్ణునికి కానుకగా అందజేస్తాడు. కృష్ణుడు ప్రీతితో దానిని స్వీకరించి మురళీకృష్ణుడు అయ్యాడు. ఇలా వారు ఆ వస్తువులు పేర్లు ద్వారా కీర్తిని పొందారు. రామాయణం నందు రఘుకుల వంశమునకు ఆదిపురుషుడైన రఘుమహారాజు యుద్ధములో అజేయుడగుటకై “నిఖర” పేరుగల రాక్షసుడిని సంహరించడానికి విశ్వకర్మను ప్రార్థించగ “శారజ్ఞ” (సారంగ) అను పేరుగల ధనుస్సును ప్రసాదించినాడు. తదనంతరము రఘు మహారాజు ఆ ధనస్సును అగస్త్యమునికి ఇచ్చెను. ఆగస్త్యుడు దానిని శ్రీరామచంద్రునికి బహూకరించెను. రామచంద్రునికి రెండవ దఫా లభించిన ఈ సారంగ ధనస్సుతోనే యుద్ధము చేసి రావణ, కుంభ కర్ణాదులను సంహరించెను. రావణ సంహరణానంతరము, విశ్వకర్మచే నిర్మింపబడిన దేవ పుష్పకవిమానం గ్రహించి దానిపై అయోధ్యకు, సపరివారముగ రాముడు విచ్చేసినట్లు గలదు. విశ్వకర్మ ఒక కళాపూర్వకమైన ధనస్సును సృష్టించి పరశు రామునికి కూడా యిచ్చెను. షట్చక్రవర్తులలో ఒకరైన కార్త వీర్యార్జునుని కుమారులు, వరశురాముని తండ్రి జమదగ్ని తలను ఖండించినందులకు ప్రతీకారంగా పరశురాముడు తన తె గండ్రగొడ్డలితోను, ధనస్సుతోను యుద్ధము చేసి, అప్పటి రాజులను సంహరించినట్లు గలదు.

మరిన్ని వ్యాసాలు