మా చార్ధామ్ యాత్ర -2
ఉత్తరకాశి లో విశ్వనాథ మందిరం చూడడానికి వెళ్లేం కోవెలకి దగాగరగా ఉన్న పార్కింగ్ కి ఓ యాభై అడుగుల దూరంలో ఉంటుంది విశ్వనాథ మందిరం. ఆరోజు ప్రొద్దుచ నుంచే బాగా వాన పడుతోంది. రైన్ కోట్లు పట్టుకున్నాం గాని అవి సూటుకేసులలో ఉన్నాయి, ఆ వానలో పైన కట్టిన సూటుకేసులు దింపలేక అలాగే తడుస్తూ కోవెల చేరుకున్నాం. చాలా మందిరాలలనే ఈ మందిరంకూడా పాలరాతి అరుగులతో మరికొన్ని ఉప మందిరాలతో విశాలంగా మారిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులను చూస్తూ విశ్వేశ్వరుని దర్శించుకున్నాం. ఇక్కడ శివలింగం కొద్దిగా దక్షిణం వైపుకి వంగినట్టుగా ఉంటుంది. ఈమందిరం రోజంతా తెరిచే ఉంటుంది. సాయంత్రం శీతాకాలంలో ఓగంట ముందుగా మూసేస్తారు. రోజూ సాయంత్రం హారతి చాలా బాగా జరుగుతుంది. 2009 లో ఇక్కడ ఓ మూడురోజులు ఉండిపోయేము, అప్పట్లో పచ్చిక మైదానంలో భగీరథి ఒడ్డున నడుస్తూ హారతి దర్శనం చేసుకున్నాం. స్థానికులు తప్పకుండా హారతికి వచ్చేవారు. ఇప్పటికీ హారతి సమయంలో చాలా రద్దీగా ఉంటుంది. శివకోవెలకి ఎదురుగా సుమారు 26 అడుగుల ఎత్తైన త్రిశూలం ఉంటుంది, దానిపైన నాగా లిపిలో ఏవో వ్రాసి ఉంటాయి, కోవెల ప్రాంగణంలో మార్కండేయ, సాక్షి గోపాల్ మందిరాలు, నవగ్రహ మందిరాలు, విశాలమైన మర్రి చెట్టు ఉంటాయి.
ఉత్తరకాశీ శివునికి ఇష్టమైన ప్రదేశం అని అంటారు, మార్కండేయుడు తన తపఃశక్తితో ఈశ్వరుడిని మెప్పించిన ప్రదేశం కాబట్టి పరమశివుడు మార్కండేయుని పూజలందుకోడానికి స్వయంగా కైలాశాన్ని వదలి వచ్చిన ప్రదేశం. మార్కండేయుని కోరికపై కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి వెలిసినట్టుగా చెప్తారు.
ఈ ప్రదేశాన్ని ఉత్తరకాశి అని ఎందుకు అంటున్నారంటే భవిష్యత్తులో కాశీ నగరం గంగానదిలో మునిగి పోతుందట, అప్పుడు ఈ క్షేత్రం కాశీ నగరంగా పిలువబడి ముక్కోటి దేవతలకు భూలోక ఆవాసంగా మారుతుందట.
మార్కండేయుడు అపమృత్యుదోషాన్ని పోగొట్టుకొన్న ప్రదేశం కాబట్టి ఇక్కడ విశ్వేశ్వరుని దర్శించుకున్నవారికి మృత్యుదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ఈ కోవెలలో అభిషేకం పూజ మొదలగునవి మీకు మీరే చేసుకోవచ్చు. మాతో పాటు కర్నాటక నుంచి వచ్చిన వేదపండితులు శ్రీనివాస మూర్తిగారి సహాయంతో రుద్రం నమకంచమకం సహితంగా శివుణ్ణి అర్చించుకొని బయటకి వచ్చేసరికి వర్షం తీవ్రరూపం దాల్చింది.
ఎదురుగా పార్వతీ దేవి మందిరానికి పరుగున చేరేం, అక్కడ పూజారి ద్వారా అమ్మవారికి పూజలు చేసుకొని మాకొచ్చిన శ్లోకాలు చదువుకున్నాం. అక్కడ కొన్ని వందలలో పెద్దపెద్ద తుమ్మెదలను చూసేం. అన్ని తుమ్మెదలున్నా ఎవరికీ అపకారం చెయ్యకపోడం విశేషం. తుమ్మెదలు అన్ని ఉండడానికి కారణం అడిగితే పూజారి అవి అమ్మవారి చెలికత్తెలని, అమ్మవారిని వదిలి ఉండలేక తుమ్మెదల రూపంలో ఇలా అమ్మవారి వెంటే ఉంటారని చెప్పేరు.
అమ్మవారి మందిరంలో ఏ విధమైన విగ్రహం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకు ముందు వచ్చినన్ని సార్లూ గమనించనేలేదు. అప్పుడు ఒక్క విశ్వనాథుని మందిరం, మర్రిచెట్టు, త్రిశూలాలు తప్ప ఏమీ లేవు, శివకోవెలలో త్రిశూలాలు ఉండడం సహజమే కదా! అనుకున్నాం. అయితే ఈ సారి తెలుసుకున్న సంగతేమిటంటే ఈ త్రిశూలమే అమ్మవారి రూపమట. విశ్వనాథ మందిరానికి ఎదురుగా ఉన్న26 అడుగుల త్రిశూలంకాదు, విశ్వనాథుని మందిరానికి ఎదురుగా ఉన్న మందిరంలో ఉన్న ఆరమీటర్ల ఎత్తు, సుమారు మీటరు వ్యాసం గల పెద్ద త్రిశూలం గురించి చెప్తున్నాను.
త్రిశూలం గురించి ఇంత వివరంగా చెప్పడానికి కారణం భక్తులు సందిగ్ధంలో పడకుండా ఉండాలని, ఇప్పుడు ఈ త్రిశూలం గురించి తెలుసుకుందాం.
పార్వతీదేవి వివిధ రూపాలలో రాక్షస సంహారం చేసిన తరువాత కైలాశానికి వెళుతూ ఈ రాబోయే యుగాలలో రాక్షసులకు హెచ్చరికగా ఈ త్రిశూలాన్ని విసిరివేయగా ఆ త్రిశూలం ఇక్కడ పడిందట.
ఈ త్రిశూలం గురించి మేము విని అనుభవించిన దానిని కూడా తెలియ జేస్తాను, అంతపెద్ద త్రిశూలాన్ని రెండుచేతులూ పెట్టి బలమంతా ఉపయోగించి కదిపినా ఎవరివల్లా కదలదు, కాని అమ్మనామస్మరణచేస్తూ ధ్యానంలో ఉండి ఒకవేలుతో త్రిశూలనికి ఆనించి ఉంచితే కొద్దిసేపటికి మన శరీరంలో ఓ ప్రకంపన బయలుదేరి ఆ ప్రకంపనలు పెరిగి త్రిశూలానికి ఉన్న చిరుగంటలు గలగలమని శబ్దం చేస్తాయి, ఆ ప్రకంపనలు మనం చూడొచ్చు, చాలా బాగా కనబడతాయి, అదీ కొందరకి మాత్రమే, చాలా మంది ఎంతసేపు వేలుని తాకించి ఉన్నా చిన్నపాటి ప్రకంపన కూడా రాలేదు, అదికూడా చూసేం. వేలుతాకించి అమ్మ నామస్మరణ చేసుకొనేటప్పుడు మనలోపల ఏదో స్పందన కలిగి తెలియని స్థితికి చేరడం అనుభవించేం. వర్షం వల్ల రద్దీలేకపోడం, పూజారి నిరోధించక పోవడంతో మేము చాలా సార్లు త్రిశూలాన్ని స్పర్శించుకొనే అవకాశం లభించింది.
దర్శనానంతరం ఇచ్చిన లడ్డు ప్రసాదం(ఇది కూడా ఈసారే ఉంది) తీసుకొని బయలుదేరేం.
భగీరథీ నది ఒడ్డున కోవెల ఉంటుంది అని మా తోటివారితో చెప్పడం వల్ల ఎక్కడ భగీరథి అంటే చూపించలేకపోయేను, అన్నీ ఇళ్లు, హోటల్స్ రావడం వల్ల.
ఆరోజుకి ఇంక ప్రయాణం విరమించాలని అనుకొని గంగోత్రి వెళ్లే దారిలో ఉన్న హోటల్స్ చూసుకుందాం అనుకున్నాం.
ఓ గంట ప్రయాణానంతరం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న నది కనిపించగానే అదే భగీరథి అనుకున్నాం, అది అశ్సీగంగని భగీరథికి ఉపనది అని, తిరిగి కాశీలో గంగతో కలుస్తుందని మా డ్రైవరు ద్వారా తెలుసుకున్నాం. అశ్సీనది నీరు భగీరథి నీటికన్నా చాలా తెల్లగా ఉన్నాయి.
అశ్సీనది ఒడ్డున రూము తీసుకున్నాం. మా రూములోంచి బయటకి వస్తే పరవళ్లు తొక్కుతున్న అశ్సీనదిని చూడొచ్చు.
మరునాడు ప్రొద్దుటే గంగోత్రి బయలుదేరేం.
2023 లో వచ్చినపుడు ఓ రోజు ఉత్తరకాశీలో ఉండి విశ్వనాథుని దర్శించుకొని, రెండోరోజు ‘హర్షిల్’ లో ఉందామని అనుకున్నాం.
ఈ హర్షిల్ లోయ చిన్నచిన్న గ్రామాలు కలిసి ఏర్పడ్డది, దీనిని ఛోటా ‘స్విట్జర్ లేండ్’ అని అంటారు. చాలా చక్కని చిన్న లోయ. చుట్టూరా మంచు పర్వతాలు, ఇళ్ల మధ్య నుంచి గలగలమని ప్రవహిస్తున్న సెలయేళ్లు, సూర్యకిరణాలు నేలను తాకకుండా అడ్డుకుంటున్న పైన్ చెట్లు, అక్కడకు చేరగానే మా ప్రయాణపు బడలిక పూర్తిగా మాయమైపోయింది, కాని బస దొరకడం చాలా కష్టమైంది, అక్కడ అన్నీ కర్రతో నిర్మించిన ఇళ్లే, హోటల్స్ అనే పేరే తప్ప వాటిల్లో లెక్కగా ఉండే గదులు, ఆరు ఏడు గదులు ఉన్నయంటే పెద్ద హోటలు కిందలెక్క. వీటిని హోటల్స్ అనే బదులు హోమ్ స్టే అనొచ్చేమో?, ఇక్కడి రూములు ముందుగానే బుక్ అయిపోయేయి, విదేశీయులతో నిండి ఉంది ఈ ప్రదేశం, అందుకే బస దొరకడం కష్టమైంది. అక్కడ రెండురోజులు గడుపుదామనుకున్నాం. రెండురోజులకు గాను మూడురూములకు భోజనంతో కలిపి ఇరవై వేలు ఇచ్చేం. సుమారుగా రోజుకి 3200₹. బసలో చేరేక ఫ్రెష్ అయి ‘ముఖ్బ’ మందిరానికి బయలుదేరేం. హర్షిల్ గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ముఖ్బ మందిరం. దారి చాలా సన్నగా కొండపైకి నిలువుగా చాలా ఎత్తున ఉంది ఈ మందిరం.
కోవెల చేరేలోపున మనం హర్షిల్ లోయకి ఆపేరెందుకు వచ్చిందో తెలుసుకుందాం.
‘ఓసారి భగీరథి నదికి, జలంధరి నదికి ఎవరు గొప్ప అనే వాదన వచ్చి ఇద్దరూ తమ తగువు తీర్చమని విష్ణుమూర్తిని అడిగేరుట, విష్ణుమూర్తి సమాధానం చెప్పలేక శిలగా మారిపోయేడట, భగీరథీ, జలంధరీ ప్రవహించే లోయలో హరిశిలగా ఉండిపోయేడు కాబట్టి ఈ ప్రదేశం ‘హరిశిల’ గా పిలువబడి కాలాంతరాన హర్షిల్ గా మారిపోయిందట’.
హర్షిల్ సుమారుగా 9000 అడుగుల ఎత్తున ఉన్నలోయ, ముఖ్బా దేవి కోవెల ఎత్తైన శిఖరాన ఉండటంతో అక్కడి నుంచి ప్రకృతిని చూస్తే రెండుకళ్ళు చాలలేదు.
గంగోత్రి మందిరంలో ఉండే గంగాదేవి శీతాకాలంలో ఈ మందిరంలో పూజలందుకుంటుంది. ఇదికూడా చినిన మందిరమే, మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి, పాలరాతి కట్టడంగా మారబోతోంది. పగలు సాయంత్రం పూజలు నిర్వహించడానికి పూజారి వస్తున్నట్లుగా తెలుస్తోంది మేం వెళ్లినప్పుడు ఎవ్వరూలేరు, ధూదీపాలు మాత్రం జరుగుతున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి, మరమ్మత్తులకుగాను తెచ్చిన పలకలు, సిమెంటు పడేసినట్లుగా ఉన్నాయి కాని పనివారులేరు, అక్కడనుంచి హర్షిల్ లోయ మొత్తం కనువిందు చేస్తూ కనిపించింది. చలి బాగా ఉండడంతో ఎక్కువసేపు అక్కడ ఉండకుండా మా బసకు వచ్చేసేం. మా బసకు దగ్గరగా ఉన్న సెలయేరు చాలా బాగుండడంతో అక్కడ గడపడానికి వెళ్లేం. అదే జలంధరి నది, కొండలమీంచి పడుతూ వస్తోంది, క్రిందకు ప్రవహించి భగీరథిలో కలుస్తోంది. జలంధరి పడుతున్నచోట ఉన్న బండలు వివిధ ఆకృతులను సంతరించుకొని ఉన్నాయి. నీటి తాకిడికి అవి శిలలింగం, తాబేలు, ఏనుగు, చేప, సింహము, అమ్మవారు ఇలా రకరకాల ఆకారాలు సంతరించుకొని ఉన్నాయి, అలాగని ఏదో పాతకోవెలలోని విగ్రహాలలా కాదు, సగం సగం ఏర్పడ్డ ఆకారాలు, ఆ ఆకారాలను, వాటిపైన పడుతున్న నీటిని చూస్తూ చాలాసేపు గడిపేం.
హర్షిల్ పట్టణం ఘరేవాల్ స్కౌట్స్, ఇండోటిబిటెన్ బోర్డర్ పోలీస్ వాళ్ల బేస్ క్యాంప్ కావడం వల్ల వారి వేన్స్, వారి గెస్ట్ హౌస్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి గెస్ట్ హౌస్ గేటుపైన మహాలక్ష్మీ మందిరం అని వ్రాసిన బోర్డు చూసి మందిరానికి వెళ్లేం. అప్పటికే రాత్రి ఎనిమిది అవడంతో మందిరం మూసివేసేరు. అక్కడి వారు హోటలుకి వెళ్లిపోమని బయట తిరగొద్దని చెప్పడంతో మేము వెనుతిరిగి వచ్చేం. అప్పటికే వేడివేడిగా వండిన పదార్ధాలని వడ్డించేడు మా హోమ్ స్టే వంటతను. చాలా రుచిగా ఉన్నాయి వంటకాలు, మా వంటతనుతో పిచ్చాపాటి మాట్లాడుతూ, చీకటి పడ్డ తరువాత బయట ఎందుకు తిరగకూడదు? అని అడిగేం. అడవి జంతువులు తిరుగుతాయి అన్నాడు, అంటే అని అడిగేం, దానికి అతను చిరుతలు,పులులు అన్నాడు. నిజమా? అంటే నిజమే, రోజూ వస్తాయి, మనం ఉన్నది అభయారణ్యం అని అన్నాడు.
మరునాడు మళ్లా పగలు ముఖ్బాదేవిని దర్శించుకొని, కాస్త ఆ వూరిలోనే అటూ ఇటూ తిరిగి, జలంధర ఒడ్డున గడిపేం.
మరునాడు ప్రొద్దుటే గంగోత్రికి బయలుదేరేం.
అంతకుముందు చాలా సార్లు స్నానాలు(పూజారి బకెట్ తో నీళ్లు తలపై నుంచి పోసేడు, మరోసారి లోటాతో, ఆ పైసారి నీళ్లు చిలకరించి) చెయ్యడంతో ఈ సారి తలపై నీళ్లు చల్లుకుందామనుకున్నాం.
గంగోత్రి చేరుకున్నాక చూస్తే భగీరథి మెల్లగా ప్రవహిస్తోంది, అప్పటి వేగం లేదు, భగీరధుడు తపస్సు చేసుకున్న శిల ఇప్పుడులేదు. వందల సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. చలి చాలా ఎక్కువగా ఉంది. తీర్థ తర్పణాలు విడిచి పెట్టాలని పురోహితుని మాట్లాడుకున్నాం. అతను భగీరథి నీటితో ప్రోక్షణ చేసి, మాతో తర్పణాలు ఇప్పించేడు. మందిరాలు కొత్తగా పాలరాతితో కట్టేరు. శివుణ్ణి, గంగాదేవిని చూసుకొని కొత్తగా కట్టిన ఘాట్లని, గోడలపై చిత్రించిన పురాణ పాత్రలని చూసుకొని తిరిగి బయలుదేరేం.
2024 లో వెళ్లినప్పుడు విపరీతమైన వానలు, ముఖ్బదేవి మందిరానికి పోలేదు, వర్షాలవల్ల రోడ్డు పాడవడం వల్ల, గంగోత్రికి వెళ్ళేటప్పుడు విపరీతమైన వాన, రైన్ కోట్లు వేసుకొని తడుస్తూ వెళ్లేం, అప్పుడు మళ్ళా భగారథి పరవళ్లు చూసేం, ఓహో ఏమి వేగం, కొత్తగా వేసిన ఘాట్లు, అరుగులు, గోడలు కొట్టుకుపోయేయి, మందిరాలు చూసుకొని తిరిగి వెనక్కి వచ్చేసేం.
వచ్చేవారం కేదార్నాథ్ గురించి చదువుదాం, అంతవరకు శలవు